23, అక్టోబర్ 2026, శుక్రవారం

సమస్య - 5629

24-10-2026 (శనివారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“నాటి పల్లెల్ గనము నంగనాచు లేల”

(లేదా...)

“నాటి పల్లెలు నేడు గానము నంగనాచులె యేలఁగన్”

(మొన్న రాజమండ్రిలో పాలపర్తి వారి అష్టావధానంలో కవిశ్రీ సత్తిబాబు గారి సమస్య)

10 కామెంట్‌లు:

  1. న్యాయమును దప్పి పాలించు నాయకులను
    నాటి పల్లెల్ గనము ; నంగనాచు లేల
    నేటి పురములందు జనులు నెగ్గ లేక
    యుండె నానేతలు సలుపు యుపధినుండి

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    రైతు సంక్షేమమునె నాడు రాజుతలచ
    పాడిపంట సుభిక్షమై పరిఢవిల్లె
    ఫలము లేక యెంచన్ బ్రజ పట్టణముల
    నాటి పల్లెల్ గనము నంగనాచు లేల!

    మత్తకోకల
    నీట ముంచినయట్టి దుర్జన నేతలన్ గని వేదనన్
    మాటిమాటికి నొచ్చి కృంగుచు మారురూపులు దాల్చగన్
    బాటసారుల కైన కష్టము పల్లెసీమల గల్గఁగన్
    నాటి పల్లెలు నేడు గానము నంగనాచులె యేలఁగన్!

    రిప్లయితొలగించండి

  3. ప్రకృతి సంపద కవియేను పట్టు గొమ్మ
    లంచు దలచిన నేమిరా యాధు నికము
    పేర కృత్రిమత్వ మదియె పెరుగ నేడు
    నాటి పల్లెల్ గనము నంగనాచు లేల.


    మేటిగానభివృద్ధి యంచును మిక్కుటమ్మగు మార్పులే
    ధాటిగానట చేరుచుండగ తత్త్వ నాశము జెందుచున్
    జేటు గూర్చెడి యాంత్రి కత్వము చేరుచున్ నట గాంచగా
    నాటి పల్లెలు నేడు గానము నంగనాచులె యేలఁగన్.

    రిప్లయితొలగించండి
  4. తేటగీతి:
    ప్రగతి మందగించగ నేడు పల్లెలందు
    పట్నవాసఁపు మోజుతో పల్లె ప్రజలు
    బ్రతుకుతెరువుకు బస్తీల బాటపట్ట
    నాటి పల్లెల్ గనము నంగనాచు లేల

    మత్తకోకిల:
    ఏటికే యెదురీది రైతులు యేమిలబ్దిని గాంచకన్
    కూటి కోసము కష్టమైనను కూలి సేయగ సిద్ధమై
    బాటపట్టిరి పట్టణాలకు పల్లెలే విడనాడుచున్
    నాటి పల్లెలు నేడు గానము నంగనాచులె యేలఁగన్

    రిప్లయితొలగించండి
  5. సాటి వారల కొనఁగూడు సాయమన్న
    మాట నిలిపిన పల్లెలే మాయమయ్యె
    నాటి పల్లెల్ గనము నంగనాచు లేల
    వాటి రూపురేఖలు మారె వన్నె తఱిగె

    సాటివారికి సాయమే మనసార చేసిన పల్లెలో
    రాటుదేలెను రాజకీయపు రాక్షసత్వపు భావనల్
    చేటుతెచ్చెను పల్లెలందున చెప్పలేని వికారముల్
    నాటి పల్లెలు నేడు గానము నంగనాచులె యేలఁగన్

    రిప్లయితొలగించండి
  6. పల్లెలు పూర్వ వైభవము కోల్పోవడానికి కారణాలు

    తే॥ వైద్య సదుపాయముఁ గనక విద్యఁ బడయు
    విధముఁ గనక లాభముఁ గను వృత్తి గాక
    రైతు సంతుకు నచ్చక రైతులగుట
    నాటి పల్లెల్ గనము నంగనాచులేల

    తే॥ నాఁటి పల్లెల్ గనము నంగనాచు లేల
    నిజము కాదయ్య తప్పిది నేఁడు కాల
    మహిమ విరియఁ గష్టముఁ బడు మనుజులేరి?
    సుఖముఁ గోరి సేద్యముఁ జేయు ముఖముఁ గనరె

    మత్త॥ నాఁటి పల్లెలు నేఁడు గానము నంగనాచులె యేలఁగన్
    మేటి తప్పిదమిట్లు పల్కఁగ మెచ్చి నాగరికమ్మునున్
    మోటటంచును బ్రాఁత పద్ధతిఁ బొంద సౌఖ్యము మారిరే!
    పాటుమానిసులేరి కాలము పాడు చేసెనొ పల్లెలన్?

    ముఖము ప్రయత్నము పాటుమానిసి పాటుపడు మనిషి మోటు మూర్ఖము

    రిప్లయితొలగించండి
  7. పట్టణమ్ము లయ్యెను నేఁడు పల్లె లెల్లఁ
    జెప్పినది సేయ రెవ్వరు సెప్పి నట్లు
    సత్తెకాలపు నరు లున్నఁ జాలు మనకు
    నాఁటి పల్లెల్ గనము నంగనాచు లేల


    కోట లున్నను బాక లున్నను గూడి యుండిరు మిత్రులై
    మాట యిచ్చినఁ దప్ప రెన్నఁడు మానసమ్ములు వెన్నలే
    తోటి వారికి నెల్ల రప్పుడు తోడుగాఁ జరియించిరే
    నాఁటి పల్లెలు నేఁడు గానము నంగనాచులె యేలఁగన్

    రిప్లయితొలగించండి
  8. ధాటిగా పనిచేసి నేత లుదాత్తమౌ పరిపాలనన్
    బాటచూపిరి పూర్వకాల మభాగ్యులన్ గని ప్రీతితో
    నోటులిచ్చుచు యోట్లుపొంది వినూత్నరీతిని నేలగా
    నాటి పల్లెలు నేడు గానము నంగ నాచులె యేలగన్

    రిప్లయితొలగించండి