10, మే 2012, గురువారం

సమస్యాపూరణం - 700 (ఏడు వంద లనిన)

కవిమిత్రులారా,

సమస్యా పూరణల సంఖ్య ఏడు వందలకు చేరింది. 
దీనికి మీ అందరి భాగస్వామ్యం, స్నేహం, సౌహార్దాలే ముఖ్య కారణం. 
అందరికీ ఆనందంగా, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 
మీ సహకారం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను.

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

ఏడు వంద లనిన నెక్కు వగున?


9, మే 2012, బుధవారం

పద్య రచన - 17


కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యా(లను)న్ని వ్రాయండి.

రవీంద్రుని గీతాంజలి - 7

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

7

MY song has put off her adornments.
She has no pride of dress and decoration.
Ornaments would mar our union ;
they would come between thee and me;
their jingling would drown thy whispers.

My poet's vanity dies in shame before thy sight.
O master poet, I have sat down at thy feet.
Only let me make my life simple and straight,
like a flute of reed for thee to fill with music.

చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము...

క్రిందికిం దింపివైచె నా గీత మిద్ది
తన యలంకారములను మొత్తముగ స్వామి!
వలువలం గయిసేయు గర్వమ్ము గూడ
సడలిపోయినదోయి నీ సముఖమందు ||

తొడవు లివి నీకు నాకును నడుమఁ జేరి
నిండు కలయిక కడ్డము నిలుచు నోయి!
గలగలని మ్రోగు వాని పేరులివులోన
మరుగుపడు నోయి నీ మృదు మధురవాణి ||

సిగ్గునన్ మ్రగ్గునోయి నీ దృష్టిముందు
నా కవిత్వగర్వంబు మహాకవీంద్ర!
శరణు సొచ్చితి నీ దివ్యచరణములను ||

నీవె కావింపు మోయి నా జీవనమ్ము
సరళ సరళముగాగ నీ మురళి పోల్కి!
అమ్మురళిలోని యెల్ల రంధ్రమ్ములందు
నీదు గీతస్వరమ్ములు నింపుమోయి! ||

గర్భ కవిత్వములో మెలకువలు - 4

ఈ పాఠములో కంద పద్యమును ఎన్ని రకముల పద్యముల గర్భములలో వ్రాయవచ్చునో చూచెదము:

కంద గర్భిత శార్దూలము:

(రామా! ధారుణి నాయక) ప్రముఖ ! సుత్రామార్చితా! లోకనా
థా! (మా మానసమందిరాల మనుమా తండ్రీ!) మముం బ్రోవుమా
(నీ మంత్రంబె జపింతును) ల్లమున నే నీ పూజ గావింతు న
య్యా! (మా మేలొనగూర్చు దేవమణి వీవంచున్) కృపాంబోనిధీ!
 
(4 పాదములలో కుండలములలోగల పాదములు కంద పద్యమునకు సరిపోవును కదా). 

కంద గర్భిత సీసము:

కైలాసవాస! శంకర! బాల శశిధర!
    సురవినుత వరద సుజనపా(ల)
శూలాయుధా! మునిస్తుత శీల! దలతును
    త్రిపురహర! జితరతిపతి నిన్ (ను) 

సీసము 2 పాదాలలో కందపద్యమును వ్రాసేము కదా.  (ఆఖరి లఘువు తీసివేస్తే కందము అవుతోంది కదా).  ఇలాగ సీసపద్యములో 2 కందములు క్రిందన గీతలో 1 కందపద్యము మొత్తము 3 కందపద్యములను వ్రాయవచ్చును. 

కంద గర్భిత చంపకమాల/ఉత్పలమాలల గురించి ఇంతకు ముందే చెప్పుకొన్నాము.

మరికొన్ని విషయములను 5వ పాథములో చెప్పుకొనెదము.  స్వస్తి!
 
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

సమస్యాపూరణం - 699 (కోయవాఁడు గొట్టె)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

కోయవాఁడు గొట్టెఁ గుపితుఁ డగుచు.

ఈ సమస్యను సూచించిన
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి
ధన్యవాదాలు.

‘కినిగె’లో కళ్యాణరాఘవము

కవిమిత్రులారా,
‘శంకరాభరణం’ బ్లాగులో ప్రకటింపబడి మీకు రసానుభూతిని కల్గించిన మా గురువు గారు శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల లఘుకావ్యం ‘కళ్యాణ రాఘవము’ ఇప్పుడు ‘కినిగె’ Online ebooks store లో లభ్యమౌతున్నది. ఆసక్తి గలవారు ఆ వెబ్‌సైట్‌నుండి కొనుగోలు చేయవచ్చు.

http://kinige.com/kbook.php?id=784

8, మే 2012, మంగళవారం

రవీంద్రుని గీతాంజలి - 6

రవీంద్రుని గీతాంజలి

తెనుఁగు సేత

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు


6

PLUCK this little flower and take it,
delay not! I fear lest it droop and
drop into the dust.

It may not find a place in thy garland, 

but honour it with a touch of pain 
from thy hand and pluck it. 
I fear lest the day end before I am aware, 
and the time of offering go by.

Though its colour be not deep and
its smell be faint, use this flower in
thy service and pluck it while there
is time. 


చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల అనువాదము...

కొద్ది పువ్వు సుమా! దీనిఁ గోసికొనుము,
జాగు చేయకు మోయి! నా స్వామి! యింక ||

రాలి పడి యిది చప్పున ధూళిలోనఁ
గలిసిపోదు గదా! యని జళుకు నాకు ||

నీదు మాలికలోన దీని కొకచోటు
చిక్కునో? లేదొ? కాని నీ చేయి వేసి
తాకిడిన దీని మన్నింప ధన్యమౌను,
కోయుమా! కోయు మిక జాగు చేయకోయి ||

పగటి సమయ మి దెక్కడ ముగియు నొక్కొ?
చిమ్మచీఁకటి యెక్కడఁ గ్రమ్ము నొక్కొ?
నా తెలివి లేమిలోనె యీనాడు నీదు
పూజనఁపు వేళయుం దాటి పోవు నొక్కొ? ||

వాడిపోయిన యీ రంగు చూడఁ బోకు,
మింకిపోయిన యీతావి వంక గనకు
మయ్య! యిందున్న యేదొ కాసంత వన్నె
సమయ మౌదాక నీసేవ సలుప నిమ్ము,
కోయుమా! కోయు, మిఁక జాగుచేయ కోయి! || 

గర్భ కవిత్వములో మెలకువలు - 3

          2వ భాగములో చంపకమాల పద్యములో మధ్యాక్కర, తేటగీతి, ద్రుతవిలంబితము మరియు కంద పద్యములను వ్రాయవచ్చునని చెప్పుకొనినాము.  అదే విధముగా ఉత్పలమాలలో కూడా ఈ 4విధములైన పద్యములను వ్రాయవచ్చును.

          తేటగీతి, ఆటవెలది మరియు కందములను ఒక దానిలో నొకటి వ్రాయవచ్చును.  దీనికి ప్రత్యేకముగా ఏ మెలకువయూ నక్కరలేదు.  భావమును అనుకొనిన తరువాత ఏ పద్యములో ఏ పద్యమును వ్రాద్దా మనుకొనినా ఆ 2 పద్యములను వేరు వేరుగా అక్షరము అక్షరము చూచుకొనుచూ 2 పద్యములను ఒకే మారు వ్రాస్తే చాలును.  2 పద్యములకు సరిపోయేటట్లుగా సమానమైన పదముల కూర్పు ఉండాలి.  

మత్తేభ గర్భిత సీసము:

ముందుగా ఒక మత్తేభ పాదమును వ్రాయండి.  

ఉదా: మ: నుత చారిత్రు పవిత్ర భావయుతు నిన్నున్ గొల్తు నారాయణున్

ఆ పాదమునకు ముందుగా ఒక లఘువును చేర్చాలి;  అలాగే చివరలో కొన్ని అక్షరములు చేర్చాలి.  చూడండి:
 
సీ. వినుత చారిత్రు పవిత్ర భావ యుతుని
          న్నున్ గొల్తు నారాయణున్ సతతము 

మరి కొన్ని విశేషములను 4వ భాగములో తెలుసుకొందాము.

పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

సమస్యాపూరణం - 698 (అయ్యవారినిఁ గని నవ్వె)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

అయ్యవారినిఁ గని నవ్వె యాచకుండు.

ఈ సమస్యను పంపిన
పోచిరాజు సుబ్బారావు గారికి
ధన్యవాదాలు.

7, మే 2012, సోమవారం