24, డిసెంబర్ 2012, సోమవారం

పద్య రచన - 200

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

15 వ్యాఖ్యలు:

గోలి హనుమచ్ఛాస్త్రి చెప్పారు...

బెండ కాయ జూడ కండ బాగున్నది
తొడిమ ద్రుంచ బూన తునుగొ? లేదొ?
లేత గున్న నవియె 'లేడీసు ఫింగర్లు'
బాగ ముదుర పెద్ద ''బ్యాచిలర్లు'

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శాస్త్రి గారూ ! " బ్రహ్మ చారి , లెడీస్ ఫింగరు " అసలైన పదాలు కొట్టే సారు . [ బాగుంది మీ పద్యం

Pandita Nemani చెప్పారు...

వంగ వండవచ్చు వంద విధాలుగ
బెండకాయ వేయి విధములట్లు
చూడ శుచియు రుచియు సొంపులు నింపులు
బెండకాయ సాటి యుండు నొక్కొ?

గోలి హనుమచ్ఛాస్త్రి చెప్పారు...

రాజేశ్వరి అక్కయ్య గారూ ! ధన్యవాదములు. నిజమే..బెండకాయ తో అనుబంధమున్న ఆ రెండు పదాలూ కలప గలిగినందులకు నాకూ సంతోషంగా నున్నది.

కంది శంకరయ్య చెప్పారు...


భిండ, భిండీతక మ్మని పేర్లు సంస్కృ
తమున బెండకాయకును; వాతమ్ముఁ బెంచు
బలము గల్గించు; వేపుడు, పులుసు లెవ్వి
యైన రుచికరమ్ముగ నుండు ననుట నిజము!

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

తమ్ముడూ ! బెండ కాయ గింజలు అదే పచ్చివి తింటే తెలివి తేటలు పెరుగు తాయంటారు .అదికుడా రాస్తె బాగుండేది

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

శాస్త్రి గారూ నిజమే అసలైన పదాలు ఒకోసారి ఎవరైన రాసేస్తే మళ్ళీ వెతుక్కోవాలి . ముందుగా వ్రాసి నందుకు చాలా సంతోషం గా ఉంది. ధన్య వాదములు

కంది శంకరయ్య చెప్పారు...

అక్కయ్యా,
ఆ విషయాన్నే మీరు పద్యంలో చెప్తే ఒక పనైపోతుంది కాదా!

Pandita Nemani చెప్పారు...

శ్రీమతి నేదునూరి రాజేశ్వరి గారి సూచనకు పద్యరూపము:

బెండకాయలోన నుండు మంచి గుణమ్ము
వినుడు శ్రద్ధ తోడ ననుదినమ్ము
బెండ గింజల తిన పెరుగు జ్ఞాపక శక్తి
పూనుకొనుడు నేడె పుణ్యమతులు

సహదేవుడు చెప్పారు...


బెండను దిన నారోగ్యము
నుండగ జేయును, తరిగిన నొర్వగ లేకన్
దండిగ జిగటై కరముల
నిండు నసంకల్పితముగ నేరపు శిక్షై!

లక్ష్మీదేవి చెప్పారు...

బెండను పేరు గల్గినది బెక్కుర మక్కువ పొందు కూర, దా
నెండిన వంటలోననిక హెచ్చుగ వాడక పాఱవైతు, రే
కండలు బెంచువానికిని కాయపళమ్ముగ వండి యిచ్చుచో,
దండిగ బుద్ధి హెచ్చునని తప్పక వండెడు కూరనియ్యదే.

nagaraju raveender చెప్పారు...

బెండకాయ ముదిరినను వండరాదు
బ్రహ్మచారి ముదిరినను పనికిరాడు
బెండకాయ రుచిగనుండు వేపి తినిన
బెండకూరయె తప్పక నుండవలెను

తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ చెప్పారు...

రండు రండనుచు నీరెండను రాము పిలువ
చౌక బేర మనుచు సందు జేరి
బండ బారిన బొండు బెండను వండ లేము,
వలదు వలదని రట వనిత లంత.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

అందరు అన్ని రకములుగా బెండ విశిష్టను వర్ణించారు.గురువులు శ్రీ పండితుల వారు అంత మంచి పద్యం వ్రాసాక ఇక నెనేం రాసినా దండగే .అందరికీ ధన్య వాదములు

కంది శంకరయ్య చెప్పారు...

బెండకాయలపై నిండైన ఉత్సాహంతో చక్కని పద్యాలు చెప్పిన కవిమిత్రులు...
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
పండిత నేమాని వారికి,
సహదేవుడు గారికి,
లక్ష్మీదేవి గారికి,
నాగరాజు రవీందర్ గారికి,
తోపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారికి
అభినందనలు, ధన్యవాదములు.
*
రాజేశ్వరి అక్కయ్య గారూ,
పద్యం వ్రాయకున్నా నేమాని వారికే స్ఫూర్తినిచ్చారు. సంతోషం. ధన్యవాదాలు.