21, జూన్ 2014, శనివారం

నిర్వచన భారత గర్భ రామాయణము - 6

రామాయణము-
సీ.      అట్లు సుతేష్టిఁ జే(య మునికరుణచేఁ బ
రముని యుధిష్ఠిరు) రమ్యతేజు
నారాయణునిఁ బద్మనయను ఘనశ్యాము
(సత్సుధర్మగుణము శాంతరసము)
నొప్పు కనికరంబు (నుట్టిపడు మహాత్ము
నురు శుభాకారుఁ గుం)భరిపు ధైర్య
లక్షణు, రాము, సల్లలితుఁ గౌసల్య ధృ
(తిఁ గనె ముదము నంద జగము లన్ని)
ఆ.      పవలు చైత్రశుద్ధనవమిఁ గర్కటలగ్న
మునను భానువారమునఁ బునర్వ
సునను గగనమధ్యమునను సూర్యుం డుండ
నుద్భవించె రాముఁ డుర్విమీద. (౨౧)

భారతము-
ఆ.      యముని కరుణచేఁ బరముని యుధిష్ఠిరు
సత్సుధర్మగుణము శాంతరసము
నుట్టిపడు మహాత్ము నురుశుభాకారుఁ గుం
తి గనె ముదము నంద జగములన్ని. (౨౧)


టీక- యుధిష్ఠిరు = (రా) యుద్ధమునందు స్థిరమగువానిని, (భా) ధర్మరాజును; కుంభిరిపు = సింహముయొక్క.

1 కామెంట్‌:

  1. గురువుగారికి వందనములు.

    ఈ గర్భకవిత్వము చాలా విచిత్రముగాను మరియు కఠినముగాను కూడా తోస్తున్నది. ఒక పెద్ద సవాలు. అతికొద్దిమందిలో మాత్రమే కనిపించే సామర్థ్యము అని అనుకుంటాను.

    ఈ గర్భకవిత్వము వ్రాయడానికి పద్ధతులు లాంటివి ఏమైన ఉన్నాయా ? లేక కేవలము సాధన మాత్రమేనా ? " చిట్కాలు " ఏమైన ఉంటే తెలియజేయమని ప్రార్థన.

    నమస్కారములు.

    రిప్లయితొలగించండి