1, జూన్ 2015, సోమవారం

సమస్యా పూరణము - 1690 (తప్పు లొప్పు లన్నఁ దప్పు ముప్పు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
తప్పు లొప్పు లన్నఁ దప్పు ముప్పు!
(‘తెలుగుకవిత్వము-సమస్యాపూరణము’ సమూహంనుండి సూలూరి శివసుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలతో)

31 కామెంట్‌లు:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

తప్పు జేయు చుండి తగులము లేకున్న
తప్పు లొప్పు లన్నఁ దప్పు ముప్పు
నిజము తెలియ నిప్పు నెప్పడి కైనను
కాల్చి చంపు నంట కాటి వరకు

యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
sailaja చెప్పారు...

ముప్పు తప్పదిలను ముమ్మాటికి జనులు
తప్పు లొప్పు లన్న , దప్పు ముప్పు
కప్పి యుంచ కున్న తప్పుల నెప్పుడు
ముప్పు దప్పు గాదె ముందుముందు !!!

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

.ఆ.వె: మొండి వారి తోడ మూర్ఖుల తోడనూ
ముచ్చటింప ఫలిత ముండదు గద
వారి తోడ శుష్క వాదమాడక వారి
తప్పు లొప్పు లన్న దప్పు ముప్పు

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

.ఆ.వె: మొండి వారి తోడ మూర్ఖుల తోడనూ
ముచ్చటింప ఫలిత ముండదు గద
వారి తోడ శుష్క వాదమాడక వారి
తప్పు లొప్పు లన్న దప్పు ముప్పు

గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...

తప్పు చేయువారు తండోప తండంబు
తప్పు లెన్ను వారి తప్పు లెంత్రు
తప్పు లని తెలిసిన దప్పించు కొనుటకై
తప్పు లొప్పు లన్నఁ దప్పు ముప్పు!

కంది శంకరయ్య చెప్పారు...

రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘నిప్పు+ఎప్పటికి’ అన్నప్పుడు సంధి నిత్యం, నుగాగమం రాదు. ‘నిజము దెలియ నిప్పె యెప్పటికైనను’ అనండి.
*****
అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘తప్పు+అనుట’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘తప్పనుటయు’ అనండి.
*****
శైలజ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘తోడను’ అనండి.
*****
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీ రన్నమాట నిజం. “పూరణమ్ము జేసె పోనిమ్ము లెమ్మని" కొందరి పద్యాల్లో కొన్ని తప్పులను చూసీచూడనట్టు వదిలేస్తూ ఉంటాను. ప్రతి పద్యాన్నీ శల్యపరీక్ష చేసి విశ్లేషించే ఓపిక ఎలాగూ నాకు లేదు. ఒకవేళ చేసినా ఇన్ని తప్పులతో పద్యాలు వ్రాయడం ఎందుకు అనుకొని కొందరు బ్లాగునుండి తప్పుకొనే ముప్పు ఉంది. అందుకే ‘తప్పు లొప్పు లన్నఁ దప్పు ముప్పు’!
*****
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తి చెప్పారు...

తప్పు లెప్పుడైన తప్పదు సేయక
తప్పులెపుడుసేయు తప్పు, ముప్పు
తప్పు తప్పనుటను తప్పు కాదు
తప్పు లొప్పు లన్న, తప్పు, ముప్పు

యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తి చెప్పారు...

గురువుగారు
సవరించానండీ, కృతజ్ఞతలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

ఆరడీలఁ బెట్టు యత్తగారింటిలో
కొత్త కోడలమ్మ చిత్తగించి
యక్కడున్నవారలలవోకగాఁ జేయు
తప్పు లొప్పు లన్నఁ దప్పు ముప్పు!

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...

తప్పు చేసినట్టి తన యజమానినిఁ
"దప్పుచేసితి"వని తఱచి యనఁగ;
దండనమ్ము నీకు తప్పదు! కావునఁ
దప్పు లొప్పు లన్నఁ దప్పు ముప్పు!

కంది శంకరయ్య చెప్పారు...

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

అజ్ఞాత చెప్పారు...

తప్పు పనులు చేసి తప్పించుకొనువారు
గొప్ప బలుకు నదియె గొప్ప యనుచు
శివుని ముందు వారి చిత్తమొప్పనపుడు
తప్పు లొప్పు లన్నఁ దప్పు ముప్పు

కంది శంకరయ్య చెప్పారు...

కవిశ్రీ సత్తిబాబు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

A.Satyanarayana Reddy చెప్పారు...

నీతికై దుష్టులనుగూర్చి నిజముఁజెప్ప
తిప్పలబడుటెవరికైనఁదప్పదవని
నిజముఁదాచిపెట్టిసతము నియతివీడి
తప్పులొప్పులన్నఁదప్పుముప్పు

Dr Murthy Prayaga చెప్పారు...

మంచి జెప్ప జూడ మన్నించరు జనులు
తాము జేయు నట్టి తప్పు గనరు
పెద్ద చిన్న యనక పెట్రేగి పోదురు
తప్పు లొప్పు లన్నఁ దప్పు ముప్పు.

తప్పు జూచు వారు తప్పని జెప్పరు
తప్పు జేయు వారు తప్పు గనరు
తప్పు తెలియక యువత తమ నడత తప్పు
తప్పు నెరుక పరచు తప్పు గాదు.

Unknown చెప్పారు...

నిప్పువంటి మనిషి నేతగ తగినవా
డంచు"రాష్ట్రపతిగ"నెంచుకొనగ
"తప్పు గాదె"యతడు "తప్పు జేసె ననగ"
"తప్పులొప్పులన్న,తప్పు ముప్పు"

Unknown చెప్పారు...

పెద్దవాళ్ళ తిట్లు పేరంటమున షోకు
ఉద్దరించ లేని యుహలగును|
సర్దుబాటు లందు సహనంబుగా బల్కు
తప్పులొప్పు లన్న దప్పు ముప్పు.
2.కట్న మడుగ బోగ?కాదనిదేల్పినా
లంచమెంచబూన వంచననిన
ఎదుటి వాడిచేష్ట పదునగు బాణమౌ
తప్పు లొప్పు లన్న దప్పు ముప్పు
3.భార్య భర్త లందు బంధము లొకటైన?
కార్య దూరు లైన?కలత లొచ్చు
అట్టివారి పట్టు నణచెడి మార్గము
తప్పులొప్పులన్న దప్పుముప్పు

కంది శంకరయ్య చెప్పారు...

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
పి.యస్.ఆర్. మూర్తి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మూడవపూరణలో ‘కలతలొచ్చు’ అన్నారు. ఒచ్చు అన్న పదం లేదు. ‘కలత లగును’ అనండి.

బొడ్డు శంకర్ చెప్పారు...

తప్పుచేయు పెద్ద దండించు వాడైన
తప్పులెన్న వలదు ముప్పు కలుగు
తప్పుచేయు నట్టి తమ యధికారితో
తప్పులొప్పులన్న తప్పుముప్పు!

బొడ్డు శంకర్ చెప్పారు...

తప్పుచేయు పెద్ద దండించు వాడైన
తప్పులెన్న వలదు ముప్పు కలుగు
తప్పుచేయు నట్టి తమ యధికారితో
తప్పులొప్పులన్న తప్పుముప్పు!

బొడ్డు శంకర్ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కంది శంకరయ్య చెప్పారు...

బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

Unknown చెప్పారు...

అన్నపురెడ్డివారి పూరణ తేటగీతి లోఉన్నట్లున్నది.కాని సమస్య ఆటవెలది గదా!

తప్పు పలికి నంత తప్పదు ముప్పదే
యొప్పు పలికినంత నొరులు మెచ్చు
యెరుకలేని చోట నేదెట్లు పలికినన్
తప్పులొప్పులన్న దప్పు ముప్పు

తొలగె పైట యనిన దూరుదు రెంతయో
చెప్పకున్న వాని చెనకుదురుగ
ముప్పు తప్పదెందు ముదమునచ్చో వీడ
తప్పులొప్పులన్న దప్పు ముప్పు

ప్రశ్న నడిగినంత బదులును చెప్పగా
తప్పులొప్పులన్న దప్పుముప్పు
నాన్చియొప్పదైన నసిగిన తిట్టరే!
తప్పటంచునంద్రు ధరణి జనులు

నాదు జాతి కిదియ నాచారమని నంత
తప్పులొప్పులన్న తప్పుముప్పు
చేయు పనిని తాను చెందగా సంశయం
బదియ తప్పుననరె యవనిలోన

Unknown చెప్పారు...

తప్పుయెన్నడైన తప్పెయగునుగాని
తప్పుపెద్దదగును యొప్పనంగ
తప్పలేనివారు ధరణిలేరది యెట్లు
తప్పులొప్పులన్న దప్పుముప్పు?

krkr చెప్పారు...

ముప్పు తప్ప దెపుడు మూర్ఖుని రంజింప
తప్పు లెత్తి జూపి తనరు నపుడు ,
తప్పు గప్పి బుచ్చి తగు రీతి మెప్పించి
తప్పు లొప్పు లన్న ( దప్పు ముప్పు
కొరుప్రోలు రాధా కృష్ణ రావు

A.Satyanarayana Reddy చెప్పారు...

నీతినియమములకు నిలబడువారలు
తిప్పలబడుచుంద్రు తప్పకుండ
నిజముఁదాచిపెట్టి నియతిని విడనాడి
తప్పులొప్పులన్నఁదప్పుముప్పు

కంది శంకరయ్య చెప్పారు...

మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటిపూరణలో ‘పలికినంత నొరులు మెత్తు| రెరుకలేనిచోట...’ అనండి.
అన్నపరెడ్డి వారి పూరణలోని దోషాన్ని నేను గమనించలేదు. తెలియజేసినందుకు ధన్యవాదాలు. వారుకూడా మీ సూచనను గమనించి ఆటవెలదిలో పూరణ నందించారు.
*****
రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘తప్పు+ఎన్నడైన’ అన్నప్పుడు సంధి నిత్యం, యడాగమం రాదు. ‘తప్పు చూడ సతము తప్పె యగును గాని’ అందామా?
*****
కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
తప్పు తెలిసికొని ఆటవెలదిలో పూరణ నందించినందుకు ధన్యవాదాలు. పూరణ బాగున్నది. అభినందనలు.

"అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ చెప్పారు...

ఖలులతోడ గొంతు కలిపెడు వేళను,
బలయుతులను చేరి చెలగువేళ,
కోపమూనినట్టి కులకాంత నూరార్చ-
తప్పులొప్పులన్నఁదప్పుముప్పు

కంది శంకరయ్య చెప్పారు...

‘అష్టావధాని’ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.