15, జూన్ 2015, సోమవారం

సమస్యా పూరణము - 1704 (అక్షరములు నేర్చి బిక్షమెత్తె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
అక్షరములు నేర్చి బిక్షమెత్తె.
ఈ సమస్యను పంపిన రెండుచింతల రామకృష్ణ మూర్తి గారికి ధన్యవాదాలు.

50 కామెంట్‌లు:

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

సిరుల నోల లాడు శ్రీనాధ కవియన్న
చెన్ను దనము నందు మిన్న గాను
విధిని దాట లేక వెతల పాలబడెను
అక్ష రములు నేర్చి బిచ్చ మెత్తె
---------------------
సకల లోక ములకు సర్వేశ్వరుం డైన
శంక రుండు గాదె శనికి దడిసె
దైవ లీల తెలిసి తనకు తానుగలొంగి
అక్షర ములు నేర్చి బిచ్చ మెత్తె

కంది శంకరయ్య చెప్పారు...

రాజేశ్వరి అక్కయ్యా,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

Unknown చెప్పారు...

నేటి బడిపిల్లల పరిస్థితి;

బడికి పోయినంత భారంబు భుజమెక్కె
వ్రాయలేక యతని చేయి వాచె
చెప్పునంతయు పెడచెవి నిటు పెట్టగా
నక్షరములునేర్చి బిక్షమెత్తె

కంది శంకరయ్య చెప్పారు...

రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

డా. గన్నవరపు నరసింహమూర్తి చెప్పారు...

అక్కయ్య గారి పద్యా లద్భుతము ! గురువు గారికి వందనములు !

విద్య లన్ని నేర్చి , విరివిగా సిరులుండి
వటువు రూపమెత్తి వామనుండు
వడిగ బలిని జేరి వరద హస్తముఁ జాపె
నక్షరములు నేర్చి బిక్షమెత్తె !!

కంది శంకరయ్య చెప్పారు...

గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మీ పూరణ ప్రశంసనీయంగా ఉంది. అభినందనలు.

Unknown చెప్పారు...


దేవ హితము గోరి దెవుడు శ్రీహరి
వామనుడుగ బుట్టి బలిని బ్రోవ
మూడడుగులమేర పుడికిలింతను పొంద
అక్షరములు నేర్చి భిక్షమెత్తె

Unknown చెప్పారు...


పాఠశాలలొనిపదవ తరగతి ప్యాసు
వృత్తి విద్య నేర్వ వీలు పడక
అక్షరములు నేర్చి భిక్షమెత్తెను గాని
అక్కరకును రాదు అచటి చదువు

కంది శంకరయ్య చెప్పారు...

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
రెండవపూరణ మొదటిపాదంలో గణదోషం. సవరించండి.
*****
నాగరాజు రవీందర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

షిర్డి పురమునన్ మసీదున కొలువుండు
భక్త జనుల పాలి బలిమి సాయి!
శ్రద్ధయున్ సబూరి సాగించ మేలనె
డక్షరములు నేర్చి భిక్ష మెత్తె!

కంది శంకరయ్య చెప్పారు...

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

చంద్రమౌళి సూర్యనారాయణ చెప్పారు...

కొలువు కొరకు తాను కొండంత యాశతో
దేశమంత తిరిగి తిరిగి విసిగె
జేబులోన నింత చిల్లరైననులేక
అక్షరములు నేర్చి బిక్షమెత్తె

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

ఆ.వె:చదువు సంధ్య నేర్చి చక్కగ మనలేక
యున్న కొలువు వీడి యూరు విడిచి
కొత్త చోట చేర కూడు గుడ్డకఱువై
అక్షరములు నేర్చి బిక్ష మెత్తె.

Unknown చెప్పారు...

భార్య పోరు కొంత కార్యభారము చింత
సంతుచదువు ఖర్చు సాగుచుండ?
బాకి చేయలేక బాధ్యత విడలేక
అక్షరములు నేర్చి బిక్షమెత్తె.

కంది శంకరయ్య చెప్పారు...

చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

Rama Murthy Duvvuri చెప్పారు...

శివుని లీల లెన్న జిత్రంబుగాదోచు
కాలకూటవిషము కంఠ మలర
నౌర!ఢక్కతోడ న,ఇ,ఉణ్ లు పలికించి
అక్షరములు నేర్చి భిక్షమెత్తె.

కంది శంకరయ్య చెప్పారు...

రామమూర్తి గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
చక్కని పూరణ నందించారు. అభినందనలు.
(మీరూ, మద్దెర్ల రామమూర్తి గారూ ఒక్కరే కాదు కదా!)

Unknown చెప్పారు...

శిక్షణాలయాలు సిరిసంపదల యాశ
పక్షమైన? విద్య పరిగిలాగ
కక్షలందు బెరుగ?కలిమి బలిమి దగ్గ
అక్షరములు నేర్చి?బిక్షమెత్తె
2.సంతు పంతమందు చింతల గంతల
వంతు?వింత|కొంత సుంత బెరుగ?
ఉన్న ఆస్తు లన్ని ఊడిన పక్షాన?
అక్షరములు నేర్చి బిక్షమెత్తె|

కంది శంకరయ్య చెప్పారు...

కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

అజ్ఞాత చెప్పారు...

ఎంత చదువు చదివి యెంతయున్నతిగన్న
పదవి కొరకు విద్య పరచ వలెను
చేయి జాచి పదవి చేపట్టినప్పుడే
అక్షరములు నేర్చి బిక్షమెత్తె

కంది శంకరయ్య చెప్పారు...

కవిశ్రీ సత్తిబాబు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తి చెప్పారు...

పంచవత్సరంపు పసిబాలుడొక్కడు
యుపనయన శుభద మహోత్సవంబు
గలుగ, వీనులందు గాయత్రి మంత్రంపు
టక్షరములు నేర్చి భిక్షమెత్తె

Unknown చెప్పారు...


సవరించినపూరణ
పాఠశాలలోన పదియవ తరగతి
ప్యాసు,గాని సాగుబాటు కొరకు
పనుల నిర్వహించు ప్రౌఢిమ నేర్వక
అక్షరమ్ము నేర్చి భిక్ష మెత్తె

కంది శంకరయ్య చెప్పారు...

అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
వాహ్! ఈనాటి పూరణలలో మీది నిస్సందేహంగా ఉత్తమమైనది. అభినందనలు.
*****
కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తి చెప్పారు...

గురువు గారికి
శతాధిక కృతజ్ఞతలు

A.Satyanarayana Reddy చెప్పారు...

పదవి పొంద నెంచి పల్లెపల్లె దిరిగి
కూలివారియిండ్ల కూడుఁగుడిచి
బడుగువారియోట్లఁ బడయబడా నేత
అక్షరములు నేర్చి బిక్షమెత్తె

డా. విష్ణు నందన్ చెప్పారు...

మూర్తి వై యస్ యె యెన్ గారూ , శ్రీ శంకరయ్యగారు చెప్పినట్లుగా మీ పూరణ చదువగానే మనసుకు హత్తుకునేలా ఉంది, అభినందనలు. మొదటి పాదానికి ఈ సవరణ చేయండి - నిర్దోషంగా ఉంటుంది -
' పంచ వత్సరముల పసి బాలుఁడొకఁడు దా
నుపనయన .... '

యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తి చెప్పారు...

విష్ణునందన్ గారూ
ధన్యోస్మి. కృతజ్ఞతలు. మీసూచనలతో
సవరించినతరువాత

పంచవత్సరముల పసిబాలుడొకడు దా
నుపనయన శుభద మహోత్సవంబు
గలుగ, వీనులందు గాయత్రి మంత్రంపు
టక్షరములు నేర్చి భిక్షమెత్తె

subbarao చెప్పారు...

సాటి కవుల యందు మేటియ య్యెధరను
అక్షరములు నేర్చి ,భిక్ష మెత్తె
చివర దశ యందు శ్రీ నాధ కవివరు
డుతను, దిండి లేని కతన నపుడు

కంది శంకరయ్య చెప్పారు...

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
డా. విష్ణునందన్ గారూ,
ధన్యవాదాలు.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
కాని అవసానదశలో శ్రీనాథుడు కష్టాలనుభవించాడు కాని బిచ్చమెత్తుకున్నట్లు ఎక్కడా లేదే!

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

శ్రీ అశ్వర్థనారాయణమూర్తి గారికి అభినందనలు.

Unknown చెప్పారు...

బ్రహ్మచారి తాను బహునేమముల తోడ
గురులశిక్షణంది గొప్పగాను
విద్యనేర్చు కొనును,బిక్షమెత్తుకొనుచు
అక్షరములు నేర్చి బిక్షమెత్తె

అక్షరుండు శివుడు నంతయు తానై
ఢక్కమోతలందు డంబుగాను
అక్షరాలనిచ్చె నన్నిశాస్త్రాలకు
నక్షరములు నేర్చి బిక్షమెత్తె

వామనుండు తానువటుడునై యేతెంచి
బలిని దానమడిగె,వానినడ్డు
శుక్రు,గ్రుడ్డిజేసి చొక్కమౌ వాడునై
అక్షరములు నేర్చి బిక్షమెత్తె

అక్షరాలునేర్వ కుక్షికి కాదుగా
తిమిరముడుగు దాన తేజమబ్బు
మర్మమెరుగకుండ మానవుండును తాను
నక్షరములు నేర్చి భిక్షమెత్తె

అక్షరంబు నేర్వ నజ్ఞాన మంతమౌ
కుక్షి కొరకు నేర్చు శిక్ష వేరు
సకల మిదియు తెలిసి సన్యాసియే తాను
నక్షరములు నేర్చిబిక్షమెత్తె

యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తి చెప్పారు...

సహదేవుడు గారూ
మీ అభినందనలకు కృతజ్ఞతలు

sailaja చెప్పారు...

అక్షరములు నేర్చి బిక్షమెత్తెననుట
కల్ల యగును గాని గలదె నిజము
అక్షరములె మనకు లక్షల విలువౌను
బిక్ష మెత్తనేల విశ్వ మందు? !!!

విద్య లెన్నొ దెలియు విద్వాంసు డైనను
కావరమున రగిలె రావణుండు
సాధు వేష మందు సాధ్విని గొనిపోవ
నక్షరములు నేర్చి బిక్షమెత్తె !!!

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...

అతఁడు పేద; పనియు నతనికి నెవ్వరు
నీయ రైరి! బ్రదుకు నెట్ట నతఁడు
రామ నామ సుధల రమ్యమౌ గేయంపు
టక్షరములు నేర్చి, భిక్షమెత్తె!!

బొడ్డు శంకర్ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
బొడ్డు శంకర్ చెప్పారు...

కొలువులేక మరియు కుడువ కూడునులేక
చదువుకు తగినట్టి పదవిలేక
వృత్తివిద్యలేక వేదమంత్రములలో
నక్షరములు నేర్చి బిక్షమెత్తె!

కంది శంకరయ్య చెప్పారు...

మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటిపూరణలో ‘బహునేమములు’ అని దుష్టసమాసం వేశారు. ‘బహునియమములతో’ అనండి.
రెండవపూరణ మొదటి పాదంలో ‘తానై’ అన్నచోట గణదోషం. ‘తానెయై’ అనండి (బహుశా టైపాటు కావచ్చు).
****
శైలజ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
*****
గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

Unknown చెప్పారు...

శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

వేద విద్య ,కడగి విజ్ఞాన విద్యను
గ్రహగతులను మార్చి మహిని గాచు
పండితుండు నేడు పట్టెడన్నమునకై
అక్షరములు నేర్చి బిక్షమెత్తె.

కంది శంకరయ్య చెప్పారు...

భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

నమస్కారములు
గురువులకు ,శ్రీ గన్నవరపు సోదరులకు ,ధన్య వాదములు

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

అశ్వత్థ నారాయణ మూర్తి గారూ...బహు చక్కని పూరణ చేశారు...అభినందనలు..
నేనూ మీబాటలోనే...నా బాణీలో...


తండ్రి చెవిని జెప్ప తన్మయమ్మున జదువ
చుట్టములును తనకు చుట్టు నిలువ
వటువు మంత్రమందు బరగుచుండెడి గొప్ప
అక్షరములు నేర్చి బిక్షమెత్తె.

యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తి చెప్పారు...

శ్రీ హనుమచ్ఛాస్త్రి గారికి
కృతజ్ఞతా పూర్వక నమస్సులు

Sumalatha Majeti చెప్పారు...

మూర్తి గారు, మీ పద్యం చాలా బాగున్నది.

త్యాగరాజుల వారిది "భక్తి బిచ్చమియ్యవే" అని ఒక కీర్తన వున్నది. దానినుద్దేశించి....

భావుకమగు సత్వ భక్తి బిచ్చమడుగ
తంబుర శృతి చేసి తనువు మరచి
మనసు రంజిలగను మహనీయ మధుర బీ
జాక్షరములు నేర్చి బిక్షమెత్తె

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

నా రెండవ పూరణము:

(బ్రహ్మచర్య దీక్షఁ బూని, గురువుఁ జేరి, శ్రద్ధతో పరావిద్యకు సంబంధించిన సన్మంత్రాక్షరాలను నేర్చి, భిక్షాటనకు వెడలిన శిష్యుని విషయము)

బ్రహ్మచారియై పరావిద్యలను నేర్చ
గురువుఁ జేరి శ్రద్ధ కొనలు సాఁగ
మహితమైన యట్టి మాన్య సన్మంత్రంపు
టక్షరముల నేర్చి, భిక్ష మెత్తె!

Sumalatha Majeti చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Sumalatha Majeti చెప్పారు...

భావుకమగు సత్వ భక్తి బిచ్చమడుగ
తంబుర శృతి చేసి తనువు మరచి
మనసు రంజిలగను మహనీయ మధుర స్వ
రాక్షరములు నేర్చి (కూర్చి) బిక్షమెత్తె

యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తి చెప్పారు...

సుమలత గారూ
అభినందించినందుకు కృతజ్ఞతలు

కంది శంకరయ్య చెప్పారు...

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
మాజేటి సుమలత గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*****
గుండు మధుసూదన్ గారూ,
మీ రెండవ పూరణకూడ బాగున్నది. అభినందనలు.

Prasad Atreya చెప్పారు...

'భిక్ష మెత్తె' టైపు పొరపాటు