13, సెప్టెంబర్ 2017, బుధవారం

ఒకరి ఆత్మకథలో నా ప్రస్తావన!


మా మేనబావ మిట్టపల్లి సారయ్య ఆత్మకథ ‘స్మృతికణాలు”లో అక్కడక్కడ నా ప్రస్తావన ఉంది. అందులో ఒకటి...
కంది శంకరయ్య
..........................
నేను ఆరో తరగతిలో ఉండగా ఒక సంఘటన జరిగింది.
ఎవరో ఒక పండితుడు, అష్టావధాని మా బడికి వచ్చాడు. అతడు మా ఉపాధ్యాయులు ఇచ్చిన సమస్యలను పూరించాడు. చివరగా నేనొక సమస్యను ఇచ్చాను.
“రాధా! యిటు రమ్మటంచు రాముడు పిలిచెన్”
ఇది కందపద్యం నాలుగో పాదం. దీన్ని ఆ ఆశుకవి పూరించలేకపోయాడు. చివరికి నన్నే అడిగాడు.
నేను రామాయణ సందర్భాన్ని చెప్పాను. “రాముడు వనవాసానికి వెళ్తున్నపుడు దారిలో విరాధుడు అనే రాక్షసుడు సీతను అపహరించి పారిపోతూ వుంటాడు” అని.
కవిగారికి ఆ సందర్భం స్ఫురించలేదు. చివరికి నేనే చెప్పాను “విరాధా! యిటు రమ్మటంచు రాముడు పిలిచెన్” అని పూరిస్తే చక్కగా సరిపోతుందని.
మా తెలుగు పండితులు లక్ష్మీనరసింహాచార్యుల వారు సంతోషించారు. కవిగారు అవమానం పొందారు.
ఆరో తరగతిలో నాకు ఛందోజ్ఞానం ఎలా కలిగిందని మీరు అడగవచ్చు.
మా పెదమామ కంది వీరస్వామి కొడుకు కంది శంకరయ్యతో నాకు బంధుత్వం కన్నా స్నేహం ఎక్కువ. నేను ఆరో తరగతిలో వుండగానే అతను హెచ్.ఎస్.సి. పరీక్ష రాసి ఉన్నాడు.  అతనికి చిన్నప్పటినుంచి సాహిత్య పరిజ్ఞానం ఉంది. అప్పటికే తెలుగు ప్రాచీన కావ్యాలను తెగ చదివేవాడు. చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల శిష్యుడు. ఆచార్యుల వారు మట్టెవాడ హైస్కూలులో తెలుగు పండితులు. వారు అప్పటికే కళ్యాణ రాఘవము, గీతాంజలి వంటి కావ్యాలు వ్రాశారు. ఒక ఎండాకాలం సెలవుల్లో ఆచార్యులు తమ స్వగ్రామం జఫర్‍గఢ్ వెళ్ళారు. మా శంకరయ్యకు ఛందస్సు నేర్చుకోవాలని కోరిక. సెలవుల్లో కాలినడకన జఫర్‍గఢ్ వెళ్ళి గురువుగారి దగ్గర వారం రోజులుండి ఛందస్సు నేర్చుకొని వచ్చాడు. వచ్చీ రావటం మా యింటికే వచ్చి నాకూ కొంచెం నేర్పాడు. వీలు చిక్కినప్పుడల్లా లఘువులు, గురువులు, గణాలు, యతి ప్రాసలు, పద్యలక్షణాలు వివరంగా చెప్పేవాడు. పనిలో పనిగా వేటూరి ప్రభాకర శాస్త్రి గారి చాటుపద్య మణిమంజరి కూడా ఇచ్చి తెలుగులో సమస్యలను ఇచ్చే పద్ధతిని కూడా చెప్పాడు. ఆ సందర్భంలోనే నేను పైన ఇచ్చిన సమస్యను, దానికి తన పూరణను చెప్పాడు.
ఆ ప్రభావంతోనే నేను అవధాని గారికి సమస్య నిచ్చి అవమానం మిగిల్చాను.

అప్పటినుండి నన్ను అధ్యాపకులు, తోటి విద్యార్థులు ప్రత్యేక దృష్టితో చూడడం మొదలుపెట్టారు.

19 కామెంట్‌లు:

  1. పూవు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లు ఆ పరిమళాన్నిపంచడం నిజంగా గురువుగారూ గొప్ప అనుభూతి కలిగించారు.

    రిప్లయితొలగించండి
  2. అప్పటి నుంచి మిట్టపల్లి సారయ్య గారు సమస్యలనిస్తూనే ఉన్నారనుకుంటాను. వారు పద్యములనుకూడా వ్రాస్తారా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సారయ్య పద్యాలను వ్రాయడు. కథలు, నవలలు వ్రాశాడు (ప్రింట్ కాలేదు. ప్రస్తుతం అవి ప్లేస్టోరులో లభ్యం). మన బ్లాగులో సమస్య లిచ్చేది ఆయన తమ్ముడు సాంబయ్య.

      తొలగించండి
  3. రిప్లయిలు
    1. సరిగ్గా అప్పుడు నేనారవ తరగతిలో ఉన్నాను.నా వీధి మిత్రుడు సుబ్రహ్మణ్యం అనే అతను ఫిఫ్త్ ఫాం (పదవ తరగతి) చదువుతూండే వాడు.(ఇటీవలే స్వర్గస్థుడయ్యాడు).పద్యాలల్లుతూ ఉండేవాడు. అతని దగ్గర నేర్చుకుని అప్పుడు (1966)ఒక సమస్యను తయారు చేసుకుని నేనే పూరించాను.
      అది:
      "బీరును గని త్రాగుబోతు భీతింజెందెన్."
      పూరణ:
      కం. కోరిన అప్పుల నిచ్చుచు
      దారుణ రీతి ని వసూలు దాటిగ జేయన్
      దారిన వచ్చుచు నున్న క
      బీరును గని త్రాగుబోతు భీతింజెందెన్.
      (చిన్ననాటి నుండి ఇంటికి తెప్పించే వార పత్రికలు,చందమామ,బాలమిత్ర తెగ చదివే వాడిని)

      తొలగించండి

  4. జయహో !


    శ్రీ మిట్టపల్లి సాంబ
    య్యా! మాన్యుడ ! కైపదముల యాకము గానన్
    కైమోడ్పులివిగొనుడు ! మా
    లామణులవలెన్ సమస్య లన్గట్టిరిటన్ !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబీ గారు:

      సాంబయ్య గారు, సారయ్య గారు వేరే వారనుకొంటా. మిట్టపల్లి ఇంటిపేరుతో చాలా మంది రచయితలున్నారని గూగులమ్మ చెబుతోంది. సురేందర్, రాజేశ్వర్ మున్నగు వారు.

      తొలగించండి
    2. జీపీ యెస్సు వారికి!


      ఆహా ! మిట్టపెల్లి సాంబయ్య వారు వేరు , మిట్టపల్లి సారయ్య గారు వేరున్నా !

      కళ్ళ నే మార్చవలె ; అంతకు మించి ఏమి చేయుదు నంతే !

      నెనర్లు.

      శ్రీ మిట్టపల్లి సార
      య్యా! మాన్యుడ ! కైపదముల యాకము గానన్
      కైమోడ్పులివిగొనుడు ! మా
      లామణులవలెన్ సమస్య లన్గట్టిరిటన్ !


      జిలేబి

      తొలగించండి
    3. జిలేబీ గారూ,
      వారిద్దరూ మా మేనత్త కొడుకులు, అన్నదమ్ములు. పెద్దవాడు సారయ్య పద్యాలు వ్రాయడు కాని కథలు, నవలలు వ్రాశాడు (ప్రింట్ కాలేదు. అవి ప్లేస్టోరులో లభ్యం). చిన్నవాడు సాంబయ్య. అతనికి మా చెల్లాయిని ఇచ్చాం. ఈయనా పద్యాలు వ్రాయడు కాని మన బ్లాగులో అప్పుడప్పుడు సమస్యలు ఇస్తూ ఉంటాడు.

      తొలగించండి

    4. కంది వారికి

      సాంబయ్య గారికి

      సారయ్య గారికి

      నమోనమః !

      జిలేబి

      తొలగించండి
  5. మాస్టరుగారి స్ఫూర్తి అప్పటినుండే ఉంది ... బాగు బాగు.

    రిప్లయితొలగించండి
  6. పైన పేర్కొన్న సమస్యకు నా పూరణ... (51 సంవత్సరాల క్రితం నేను మొట్టమొదట చేసిన సమస్యాపూరణ)

    భూధవుని సతిని సీతను
    సాధించిన రక్కసుండు సంతోషముతో
    బాధింపగ కోపమున "వి
    రాధా! యిటు ర"మ్మటంచు రాముడు పిలిచెన్.

    రిప్లయితొలగించండి
  7. చిన్నతనమున నుండియే చిన్నచిన్న
    పద్యములవ్రాసి యిప్పుడు ప్రముఖ కవిగ
    పేరు గాంచిన కవివర! ప్రీతి తోడ
    వందనంబులు నాయవి యందు కొనుడు

    రిప్లయితొలగించండి