4, అక్టోబర్ 2026, ఆదివారం

సమస్య - 5610

5-10-2026 (సోమవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“రణమును మరువఁ గలుగవు గౌరవకీర్తుల్”

(లేదా...)

“రణము విస్మరించు నెడఁ గల్గవు కీర్తియు గౌరవమ్ములున్”

(న.చ. సాహిత్ శతావధానంలో మాచవోలు శ్రీధరరావు గారి సమస్య)

7 కామెంట్‌లు:


  1. ధరలోన నాస్తి కత్వము
    పెరుగుచు ధర్మమ్ము పట్ల విముఖత పెరిగెన్
    మరణించిన వారికి సం
    స్కరణమును మరువఁ గలుగవు గౌరవకీర్తుల్.


    ధరణిని నాస్తికత్వమది ధర్మము వీడు మటంచు చెప్పగా
    నరుడది యాలకించుచు సనాతన ధర్మము నాచరించుటే
    భరమని యెంచి పుత్రునిగ బాధ్యత యంచు దలంచ కుండ సం
    స్కరణము విస్మరించు నెడఁ గల్గవు కీర్తియు గౌరవమ్ములున్.

    రిప్లయితొలగించండి
  2. (సమస్యా పాదము కందపద్యంలో)

    (శ్రీకృష్ణరాయబారం ముందు ధర్మరాజుతో శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు)

    కం.
    దయవలదు ధర్మజా! హిత,
    నియమ *“రణము* *విస్మరించు నెడఁ గల్గవు కీ*
    *ర్తియు గౌరవమ్ములున్* ”*నే
    రయమున హస్తినకుబోయి రావలెనిపుడున్

    రిప్లయితొలగించండి
  3. అరయగ నెన్నిక లందున
    పురజనులకొసగిన మేలు పూన్చుట లో నా
    చరితము నందలి తప్పుకు
    కరణమును మరువఁ గలుగవు గౌరవకీర్తుల్

    రిప్లయితొలగించండి
  4. ధరణిని మానవుల్ సతము ధర్మపథంబును వీడకుండగన్
    పరువును బెంచు కృత్యముల బాయక సల్పిన కీర్తిచంద్రికల్
    వరముగ విస్తరించు భువి వారిని మెచ్చెదరెల్లరట్టి స్వీ
    కరణము విస్మరించు నెడఁ గల్గవు కీర్తియు గౌరవమ్ములున్

    రిప్లయితొలగించండి
  5. కందం
    గురికలిగిన కవివరులున్
    బరిపరి విధముల వధాన పథికులు నైనన్
    మెరయ సమస్యకనఁ బరి
    ష్కరణమును మరువఁ గలుగవు గౌరవకీర్తుల్

    రిప్లయితొలగించండి

  6. పరిభూతమ్మది యేలర
    యరయగ పద్య రచన కిట యతి ప్రాసలె కా
    దుర యాయువు పట్టగు వ్యా
    కరణమును మరువఁ గలుగవు గౌరవకీర్తుల్.


    పరిణతి నందినిట్టి పలు పండితు లెల్లరి కావ్యముల్ సదా
    ధరణిని నిల్చి కీర్తినిడె తథ్యమదేలన నోయి మిత్రమా
    యరయగ కావ్యసృష్టి కిట నాయువు పట్టని చెప్పు నట్టి వ్యా
    కరణము విస్మరించు నెడఁ గల్గవు కీర్తియు గౌరవమ్ములున్.

    రిప్లయితొలగించండి
  7. విశ్వామిత్రుడు దశరథుని వద్దకు వచ్చి యాగ రక్షణకై
    రామ లక్ష్మణులను తనతో పంపమని కోరిన సందర్భములో...

    సరియగు పాలన నీదని
    విరివిగ సామ్రాజ్యమంత విశ్వాసముతో
    నిరతంబున్నను నృపతికి
    కరణమును మరువఁ గలుగవు గౌరవకీర్తుల్

    సరియగు పాలనమ్మునిడి సర్వులకున్ హితమైన కార్యముల్
    నిరతము సల్పు వాడవని నిక్కముగా జనులంత నమ్మినన్
    గురుతర బాధ్యతల్ నెరపి కోరిన మేలొనగూర్చుటే ప్రియం
    కరణము విస్మరించు నెడఁ గల్గవు కీర్తియు గౌరవమ్ములున్

    [ కరణము = కర్మువు; ప్రియంకరణము = ప్రియమైన కార్యము ]

    రిప్లయితొలగించండి