పద్మావతీ శ్రీనివాసము (ద్విపద కావ్యము)
రచన : పోచిరాజు కామేశ్వర
రావు
తృతీయాశ్వాసము (61- 88)
విస్మయమ్ము మదినిఁ బెల్లుబు కఁ గని
సస్మిత వదన విశాలాక్షు లైరి 61
కరిరాజు గడుఁ బ్రీతి కరివరదు గని
కరమెత్తి తలవంచి కదలె వెనుకకు 62
హయము పైనుండి మృగాన్వేష ణార్థి
యయి రమణుల జేరి యడిగె నీరీతి 63
మృగమొక్క టగుపడి దృటిఁ బారి పోయె
మగువ లార కనిన మాకు జూపు డనె 64
అనవుడు మేమెట్టి యడవి మృగమును
గనలేదు నీదు రాకకు కత మేమి 65
వధియింప జనదిట వర్తించు మృగము
ల ధరణీంద్ర తనయ రక్షిత వనము 66
వేగమ చను వింధ్య విపినము వీడి
జాగు సేయ కనుచు సఖులెల్ల పలుక 67
వారి పల్కులు విని వారువమ్ము దిగి
వారి జాక్షులు మీరెవరు లలితాంగి 68
కనకపద్మ నిభ వాల్గంటి తానెవరు
విని యేగువాడ స్వవేశ్మము చెపుడు 69
ఆమాట విని ధరణ్యాత్మ జానుమతి
ధీమతి పద్మావతి యను వయస్య 70
ఆకాశ రాజప్రియ తనయ శూర!
మాకు నాయకురాలు క్ష్మాజ సచ్చరిత
71
నామంబు పద్మిని నారీలలామ
వామాక్షి సుందర వదన శుభాంగి 72
నీ నామ మెయ్యది నీకుల మేది
సూనృతమ్ముగఁ జెప్పు సుందరాకార! 73
ఎవ్వరి వాడ వీవెట నుందు వంచు
నవ్వనిత యడిగె నాశ్చర్య ముగను 74
తానంత మందస్మిత వదనాంబుజుడు
మానినుల కనియె మాపూర్వ జనులు 75
రవి వరాన్వయ సువిరాజితుల మని
భువన సమ్మోహ నంబుగఁ బల్కు చుండ్రు 76
నామమ్ము లెంచ ననంతము లవని
నామస్మరణ పాప నాశ కారకము 77
బుధులు ప్రేమగ వర్ణమునఁ గృష్ణు డందు
రు ధర నామమ్మున రుచిరాంగు లార 78
ఎవ్వని చక్రము నీక్షించి నంత
నెవ్వని శంఖపు టిద్ధధ్వని విన 79
భూసు రాదిత్య రిపుల కనిశమ్ము
త్రాస సంతప్త హృదయ కంప మగునొ 80
ఎవ్వని విల్లున కెవ్విధి సమము
నవ్వవొ యమృతాశు లెట్టి విల్లులును 81
అవ్వానిగ నెరుగు డబల లార నను
నివ్వేంక టాచల హిత వాసి నిపుడు 82
మృగమును వేటాడ మిత్రుల తోడ
నగము నుండిట వచ్చిన నతివఁ గంటి 83
తరలాక్షిఁ గన నాకు తగులమ్ము కలిగె
వర మీయ మన్నచో భామయే మనును 84
అనవిని సఖులెల్ల నాగ్రహమ్ము నను
చను శీఘ్రమమ్మున చపలత వీడి 85
శూరుడ మారాజు చూసిన నిన్ను
ఘోర రోషమ్మునఁ గొలుసులఁ గట్టు 86
తర్జితుండయి యిట్లు తరుణుల చేత
కర్జము వీడి వేగ నరిగె గిరికి 87
అలమేలు మంగ చిత్తాంచిత చోర
నలినదళాక్ష వనజభవ వినుత
88
ఇది విబుధజన వినత కౌశిక సగోత్రోద్భవ పోచిరాజాన్వయ సత్యసుందరీపేర్రాజదంపతీ
సుత
వేంకట రామ లక్ష్మీ సతీ సేవిత కామేశ్వర రావు నామధేయ ప్రణీతంబైన
పద్మావతీ శ్రీనివాసమున తృతీయాశ్వాసము
కధాాగమనముబాాగుంంది
రిప్లయితొలగించండిధన్యవాదములన్నయ్య
రిప్లయితొలగించండి