బమ్మెర పోతన్న
రచన : కంది శంకరయ్య
మ. పలుకుల్ జాజులఁ జల్లు చందమున, భావస్ఫూర్తి దైవార
ము
ద్దులు గుల్కంగ, రసంబు చిప్పిలఁగ, నెంతో మెత్తనౌ శైలి రం
జిల, సౌందర్యము మీఱఁ, గమ్రకవితాశ్రీవైభవారూఢి భా
సిలఁగా భాగవతమ్ము వ్రాసిన కవిశ్రేష్ఠుండవే పోతనా!
సీ. ఏ మహామహుఁడు సంస్కృత భాగవతమును
తేనె లొల్కఁగఁ దేట తెలుఁగు జేసె
నే ఘనుండు పొలమ్ము నిట దున్ని రాజస
త్కృతిఁ గాలఁ దన్ని జీవించి మించె
యే సద్గుణార్ణవుం డిట భారతీదేవి
కన్నీరు తుడిచి సత్కవిగ నెగడె
నే కోవిదవతంసుఁ డిందిరారమణ స
ద్భక్తి మాధురిలోనఁ బరవశించె
తే. నే కవీంద్రుని పేరు నూహించినంత
జనహృదయసీమ కావ్యశోభను గ్రహించి
రసపరిప్లుతమై భక్తి రక్తిఁ గనునొ
యట్టి బమ్మెర పోతన కంజలింతు.
మ. వరవాచావిభవంబు శోభిలఁగ, భాస్వచ్ఛైలి యేపార, దై
వ రహస్యమ్ముల భక్తలోకమనముల్ భాసిల్లఁగాఁ జెప్పి, భా
వ రసారూఢి సెలంగ, మేలగు ననుప్రాసాద్యలంకారశో
భ రహింపంగఁ దెలుంగు భాగవతమున్ వ్రాయన్ వలం తీవె పో.
క. నరపాలుర కంకితమిడి
సిరులు గొను తలంపు లేక శ్రీరామునకున్
వరకృతి నర్పించిన బ
మ్మెర పోతన నీకు సేతు మిదె వందనముల్.
చ. మృదుమధురోక్తులన్ గలిగి మేలొనరింపఁగఁ జాలునట్టి నీ
సదమల సత్కవిత్వమున సంతస మందుచుఁ దెల్గువారు నీ
సదనము బమ్మెరాహ్వయ ప్రశస్త పురమ్మును మెచ్చినారు, నే
డిదె ముదమార నిన్ను నుతియింపఁగఁ జేరితిమయ్య పోతనా!
---oOo---
(కవి సమ్మేళనంలో నేను చదివిన పద్యాలు)
అద్భుతము
రిప్లయితొలగించండిసత్యనారాయణ గారూ,
తొలగించండిధన్యవాదాలు.
చక్కని పద్యాలు గురువు గారూ
రిప్లయితొలగించండిశర్మ గారూ,
తొలగించండిధన్యవాదాలు.
ఆణి ముత్యాలు
రిప్లయితొలగించండిఅక్కయ్య గారూ,
తొలగించండిధన్యవాదాలు.
రిప్లయితొలగించండికంది వారు
నమో నమః ! మీ పుట్టిన రోజు బమ్మెర పోతన వారి కమ్మని పద్యములతో సాగిపోవడ మన్నది శ్రేష్టమయిన పుట్టిన రోజు కానుక మీకు
శుభాకాంక్షలు!
* శ్రీరామునకున్ ?
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిధన్యవాదాలు.
టైపాటును సవరించాను.
వరపద్యకవితాంజలి.
రిప్లయితొలగించండిమిస్సన్న గారూ,
తొలగించండిధన్యవాదాలు.
పోతనగూర్చి చక్కని పద్యములను వ్రాసిన గురువర్యులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండిఅన్నపరెడ్డి వారూ,
తొలగించండిధన్యవాదాలు.
మిత్రులందఱకు నమస్సులు!
రిప్లయితొలగించండి[నిన్నటి కవిసమ్మేళనంలో శ్రీ కంది శంకరయ్య గారితో పాటుగా నేనును పఠించిన పద్యములు]
సహజకవి బమ్మెర పోతన
కం.
శ్రీరామాజ్ఞప్తకథా
భార! భవహరాప్త కృత్య! భాగవతాఖ్యో
ద్ధారాంచిత శబ్దాలం
కార యుత పురాణకర్త! కవి పోతన్నా! 1
సీ.
కాకతీయుల యోరుగల్లున విలసిల్లు బమ్మెర గ్రామానఁ బ్రభవమంది;
పిన్ననాఁటనె రంగ వీక్షిత భాగవతమును వ్రాసెదనని తల్లికి నని;
జనని యాశీర్వచ స్సత్త్వమ్ముచే వెల్గి, సహజకవిత్వ విశారదుఁడయి;
భాగవతముఁ దెల్గువారల కిడఁగాను తెనిఁగింప సమకట్టి, తేజమెసఁగ,
గీ.
హరికథా మహత్త్వవిశిష్ట చరితములను భక్తిభావసమంచితాసక్తి మెఱయ,
ద్వాదశస్కంధయుక్త సత్ప్రకర వర సమేతను లిఖించె బమ్మెర పోతసుకవి! 2
ఉ.
కాటుక కంటి నీరు చనుకట్టు పయింబడ నేడ్చునట్టి యా
హాటకగర్భురాణికిని "నాఁకఁటికిం గొనిపోయి యల్ల క
ర్ణాట కిరాట కీచకుల కమ్మ" నటంచుఁ ద్రిశుద్ధిగన్ వెసన్
మాట యొసంగినాఁడవయ మాన్యుఁడ! బమ్మెర పోత సత్కవీ! 3
మ.
భళిరా సత్కవి పోతరా డ్విదిత శబ్దవ్యాప్త సమ్మోహకా!
గళితాఘాద్రి మహాంధ్రభాగవత నిర్ఘాతా! ప్రసిద్ధాంశ స
న్మిళితానేక సమస్త పుణ్య సుకథా నిశ్శ్రేయస ప్రాప! ని
ర్దళితోత్కృష్టతరానయప్రకర! సర్వామోద సంధాయకా! 4
చం.
నవవిధ భక్తి మార్గముల నవ్యవిధమ్మున వ్రాసినావు భా
గవత పురాణమున్ విమల కమ్రసుశబ్దయుతార్థ పద్య సం
రవముల శింజినుల్ మొరయ రమ్యతరాంచిత ముక్తి యుక్తమై
శివకర సత్య సుందర వశీకరణమ్ముగ భక్తపోతనా! 5
స్వస్తి
మధురకవిమిత్రమా తమరు సార్థక బిరుదాంచితులు.
తొలగించండిమధురకవిమిత్రమా తమరు సార్థక బిరుదాంచితులు.
తొలగించండికవీశ్వరులు మధుసూదన్ గారు నమస్కారములు. ప్రబంధయుగపద్య సన్నిభమ్ములు మీ పద్య కుసుమమ్ములు. చక్కటి మీ శైలి మనోహరమై భాసిల్లుచున్నది. మీకు నా హృదయపూర్వకాభినందనలు.
తొలగించండిసుకవి మిత్రమా మిస్సన్నా...నమస్సులు...ధన్యవాదములు!
తొలగించండిసుకవి మిత్రులు కామేశ్వర రావు గారికి నమస్సులు...ధన్యవాదములు!
తొలగించండిమధుసూదన్ గారూ,
తొలగించండిమీ పద్యాలు ఆణిముత్యాలు!
ధన్యవాదాలు శంకరయ్యగారూ!
తొలగించండిచక్కని పద్యనీరాజనం.గురుదేవులకు అభినందనలు.
రిప్లయితొలగించండిసహదేవుడు గారూ,
తొలగించండిధన్యవాదాలు.
మధురమైన పద్యాలు మధురకవీ!
రిప్లయితొలగించండిధన్యవాదాలు శర్మగారూ!
తొలగించండినిన్న బమ్మెర గ్రామంలో జరిగిన పోతన జన్మదిన వేడుకలలో శ్రీ కంది శంకరయ్యగారికి కూడా సభలో అందఱి సమక్షమున జన్మదిన వేడుకలు వైభవముగా జరిపినారు...
రిప్లయితొలగించండిశ్రీ కంది శంకరయ్య గారికి అరవై ఎనిమిదవ జన్మదిన శుభాకాంక్షలతో...
చం.
సకల గుణాన్వితోన్నతుఁడు, చారు సుకీర్తిత ధన్య జీవుఁడున్,
వికసిత బుద్ధివైభవుఁడు, విజ్ఞుఁడు, శాంతుఁడు, జ్ఞానమూర్తి, స
త్ప్రకటిత పండితోత్తముఁడు, ప్రజ్ఞ విరాజిలు కావ్యకర్తలం
దొకరుఁడు కంది శంకర బుధోత్తమ, జన్మదినోత్సవాంజలుల్!
కం.
హృద్యములగు పద్యమ్ముల
నాద్యంత సువేద్యముగ నిరాటంకముగన్
శ్రీద్యుతి చెన్నలరారన్
సద్యః ప్రభలొలుక రచన సాగించితయా!
ఆ.వె.
ఎంత కాంతిమంత! మెంత వింతగు పుంత!
సుంతయేని విసువు వంత నిడదు!
ఇంత భావదీప్తి నెంతు నుతింతును
సాంతముగను జదివి సంతసింతు!
సీ.
బాల్యమ్మునుండియు బాగుగా విద్యలో
రాణించి యెదిగిన రత్న మీవు;
శ్రమియించియును విద్య సక్రమమ్ముగ నేర్చి,
విజ్ఞాన ఖనియైన విజ్ఞుఁ డీవు;
బోధకవృత్తి సుభూషణమ్మని యెంచి,
తలఁదాల్చి వెలిఁగిన ధన్యుఁ డీవు;
విద్యార్థులందఱన్ బిడ్డలుగా నెంచి,
దయను బ్రేమను జూపు తండ్రి వీవు;
వృత్తిధర్మముఁ దక్క వేఱొక్క ధర్మమ్ము
ముందుగాఁ దలఁపని మునివి నీవు;
వారు వీరను భేదభావ మెఱుంగక
హితముఁ గల్గించు స్నేహితుఁడ వీవు;
కోప మింతయు లేక కోమలమ్మగు వాక్కు
చిఱునవ్వు తళుకొత్తు శ్రేష్ఠుఁ డీవు;
శంకరాభరణాఖ్య సాహితీ శీర్షికన్
రస రమ్యముగఁ దీర్చు ప్రాజ్ఞుఁ డీవు;
గీ.
మంచి వీవు! సుగుణ గణ మణివి నీవు!
బంధుఁ డీవు! సుధీజన బంధ మీవు!
స్నేహ మీవు! సంపూర్ణ సౌశీల్య మీవు!
కవుల కందఱ కాదర్శ కవివి నీవు!!
తే.గీ.
పర ధనమును మృత్పిండమ్ము పగిది నెంచి,
పర సతీ మణులను దల్లి వలెఁ దలంచి,
యెపుడు శాంత్యహింసాక్షమాకృపలు, దాన
ధర్మసద్గుణశౌచసత్యములు గలిగి,
యొజ్జబంతివై మెలఁగిన యొజ్జవైన
నీకుఁ బరమాత్ముఁ డెంతయు నీవి తోడ
నాయురారోగ్యభోగభాగ్యైహికమ్ము
లీప్సితార్థమ్ము లనిశమ్ము నిచ్చుఁ గాక!
***శుభం భూయాత్***
గుండు మధుసూదన్ గారూ,
తొలగించండిపద్యరత్నాల కానుక నందజేసి నన్ను ధన్యుణ్ణి చేశారు. ధన్యవాదాలు!
అద్భుతంగా వున్నాయండి పద్యాలు.
రిప్లయితొలగించండిఉమాదేవి గారూ,
తొలగించండిధన్యవాదాలు.
రిప్లయితొలగించండిమధుసూధన వారు !
నమో నమః !
మధుసూధనకవి రాయా !
సుధయొప్పెను పోతన కవి సుమధుర పదముల్ !
కుదిరెను చక్కగ మీ పద
మధురిమ నతని సరిజోదు మన్నన నిచ్చెన్ !
జిలేబి
ధన్యవాదాలండీ జిలేబీ గారూ!
తొలగించండిచక్కని పద్యములు వ్రాసిన మాస్టరుగారికి, మధుసూదన్ గారికి అభినందనలు.
రిప్లయితొలగించండిఈ తీరున పద్యమ్ముల
పోతనపై వ్రాసినట్టి పుణ్యాత్ములకున్
ప్రీతిగ వందనమిడెదను
మాతా శ్రీవాణి దయలు మరిమరి యందన్.
సుకవి మిత్రులు శ్రీ గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదములు!
తొలగించండిహనుమచ్ఛాస్త్రి గారూ,
తొలగించండిధన్యవాదాలు.
సుకవులు గోలివారూ...జిలేబీ గారూ...
రిప్లయితొలగించండిమీ యాదరపూర్వకమగు
శ్రేయాంచిత పద్యము ననుఁ బ్రీతునిఁ జేసెన్!
మీ యాప్యాయత కే నే
మీయను? పద్యమ్ముఁ దప్ప! యివె ధన్యోక్తుల్!
చాలా మనోరంజకమైన పద్యాలు. మహాకవి పోతనను మధురమైన పద్యాలతో స్తుతింప జేసిన గురువర్యులు శంకరయ్య గారికి, సత్కవులు మధుసూధన్ గారికి ధన్యవాదములు.
రిప్లయితొలగించండిధన్యవాదాలండీ శ్రీధర రావు గారూ!
తొలగించండిశ్రీధర రావు గారూ,
తొలగించండిధన్యవాదాలు.
పోతనామాత్యుని వర్ణిస్తూ ఆణిముత్యముల వంటి పద్యకుసుమాలతో వందనములర్పించిన మీరు ధన్యజీవులే. ఆమహానుభావుని పరమ భాగవతోత్తముని జన్మదినమున పుట్టిన మీరెంత పుణ్యాత్ములో. మీకు శతసహస్ర వందనములు. మీ రచనా విశేషములను తిలకించగలుగుట నా యదృష్టము. ఆయురారోగ్యములతో మీరు వర్థిల్లాలని కోరుకుంటూ భవదీయుడు
రిప్లయితొలగించండికామేశ్వర రావు
కామేశ్వర రావు గారూ,
తొలగించండిధన్యవాదాలు.
సుకవులు గోలివారూ...జిలేబీ గారూ...
రిప్లయితొలగించండిమీ యాదరపూర్వకమగు
శ్రేయాంచిత పద్యము ననుఁ బ్రీతునిఁ జేసెన్!
మీ యాప్యాయత కే నే
మీయను? పద్యమ్ముఁ దప్ప! యివె ధన్యోక్తుల్!
బమ్మెర పోతనామాత్యుని గురించి వ్రాసిన కవివరేణ్యులైన శ్రీ కంది శంకరయ్యగారి పద్యరత్నములు, శ్రీ గుండు మధుసూదన్ గారి పద్యరత్నములు చక్కని పదసంపదతో రసభరితంగా ఉన్నాయి. ఇర్వురకు అభివాదములు.
తొలగించండిపోతన గారిని గూర్చి నా పద్యములు రెండు.
శా. శ్రీమంతంబగు కల్పవృక్ష నిభమై, చిద్భావసందీప్తమై
క్షేమం బెల్ల జనాళికిచ్చుచు బృహత్ శ్రేయంబులందించుచున్
భూమిన్ వెల్గెడు భవ్యకావ్యరచనన్ పుణ్యాత్ముడైనట్టి యా
ధీమంతుండగు పోతనార్యు దలతున్ దివ్యాంగు నిప్పట్టునన్.
సీ. రాముడా జ్ఞాపించ రమణీయమై యొప్పు
కావ్యంబు రచియించు ఘనుడు తాను,
రాజాంకితము చేయ నోజన్మదాయిని!
విశ్వసింపు మటన్న విజ్ఞవరుడు,
పొలము దున్నిన రాదె యలఘుసౌఖ్యంబంచు
సంతసంబున బల్కు సజ్జనుండు,
నన్నయాదులు తాము మున్నంటకుండుట
తన భాగ్యమని యెంచు ధన్యజీవి,
పలికించు వాడుండ పలుకకుండుట యేల
పలికెద నేనంచు పలుకువాడు,
భాగవతాఖ్యంబె భవహర మంత్రమౌ
నని తెల్పియున్నట్టి యనఘు డతడు
సహజ పండితు డంచు సాహిత్యలోకాన
యశమంది యున్నట్టి యసదృశుండు
అనితర సాధ్యమై అద్భుతంబగు రీతి
పద్యంబులల్లిన పండితుండు
తే.గీ. ఆంధ్ర పాఠక జనముల కనుదినంబు
వందనీయుడు తానౌచు వరలుచున్న
పరమ భాగవతోత్తము పదయుగళికి
ప్రణతు లర్పించు చున్నాడ భక్తితోడ.
(హ.వేం.స.నా.మూర్తి)
మూర్తి గారూ,
తొలగించండిధన్యవాదాలు.
మీ పద్యాలు మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.
ధన్యవాదములు మూర్తి గారూ! మీ పద్యములు పోతన హృదయావిష్కరణముం గావించుచున్నవి.
తొలగించండిసుధపంచిన హరి గాధను
రిప్లయితొలగించండిమధురమ్ముగ పోతనకవి స్మరణము జేయ
న్నధరమ్ముల వాని బొగడు
మధుసూదను, శంకరార్యు మాన్యత మెత్తున్
సహదేవుడు గారూ,
తొలగించండిధన్యవాదాలు.
There is not much time left for players to prepare for NBA 2K22 MT! Get it fast!
రిప్లయితొలగించండిAttached link: https://www.gamems.com/nba-2k22-mt