20, జులై 2016, బుధవారం

పద్మావతీ శ్రీనివాసము - 6

పద్మావతీ శ్రీనివాసము (ద్విపదకావ్యము)
రచన : పోచిరాజు కామేశ్వర రావు

ద్వితీయాశ్వాసము (21-40)

రోషానలమున నరుణమయ్యె ముఖము
ద్వేషాగ్ని రగిలెను దేహంబు రమకు               21

ఘోరావమానంబు కోపిష్టి సాధు
వీ రీతి జేసిన నెట్లోర్తు నేను                          22

పల్కి యివ్విధమునఁ బ్రాణేశు తోడ
కల్కి కోపోద్రిక్త గద్గదంబుగను                       23

శోకోపహత చిత్త శోషిత గాత్ర
వైకుంఠమును వీడి వనజాక్షి వెడలె                24

శశి విహీన ఘన నిశా నభో నిభము
భృశ తిమిరావృత విష్ణు లోకమ్ము                  25

నిస్తామరస పద్మ నికరంబు వోలె
నిస్తారక శశాంకు నిలయంబు వోలె                 26

ద్యుతి విహీన దిననాధు పగిది నిపుడు
గత వైభవాస్పద ఖర వికుంఠమ్ము                 27

ధవళాబ్ధి నందన దందహ్య మాన
వివశాత్మశీతాద్రి వేదన నేగె                          28

మౌన వ్రతము వూని మాధవి శైల
కాననమ్ముల నుండె ఘన తపో నిరతి             29

శ్రీరిక్త నిలయంబు శ్రీహరి నంత
దారుణంబై శోక తప్తుని జేసె                         30

వాసవాది దివిజవ్రాతము కరము
ధ్యాస లుడిగి యచేతన మయ్యె నంత              31

శ్రీ విహీనార్తు నాశ్రిత పోషు పరమ
పావను నచ్యుతు భక్త మందారు                     32

నిష్కళ వదనుని నిస్సత్వ గాత్రు
నిష్కళంక చరిత్రు నిరవద్యుఁ గాంచి                  33

వైకుంఠ పట్టణ వాసు లెల్లరును
వ్యాకులితాత్ములు నతి ఖిన్నులైరి                   34

క్రీడాద్రి వీడిన క్షీరాబ్ధి తనయ
వ్రీడావతిఁ దలచి పీతాంబరుండు                     35

కరుణార్ద్ర మానస కమలాయతాక్షి
పరమోద్ధతాగ్రహ పరితప్త యయ్యె                   36

నను వీడి తా నేగె నళినాక్షి కినుక
మనమునఁ జింతించె మాధవు డంత               37

ధవళానుగత యైన తర్ణంబు వోలె
కువలయాక్షినిఁ గన గోవిందు డేగె                   38

చనిచని గాంచె విశాల శైలమ్ము
ఘన గుహా నిర్దర కందరావృతము                  39

వేంకటాచల మన విఖ్యాత మవని

సంకట హరణమ్ము సన్నుత స్థలము              40

4 కామెంట్‌లు:

  1. చక్కని ద్వపద నందిస్తున్న కామేశ్వర రావు గారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  2. బిట్టు కోపాన విడిచియు విష్ణు పదము
    మాత యైన ర మాదేవి పతిని వీడి
    చేరె వెంకటా చలమను శిఖర మునకు
    వెదుక గనబడె నచ్చట విష్ణు నకును

    రిప్లయితొలగించండి