20, మే 2024, సోమవారం

సమస్య - 4770

21-5-2024 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

*“శంకరుడా మకరిజంపి జర్తువు బ్రోచెన్”*

(లేదా...)

*“హరుడే ప్రోవగ కుంజరమ్మునట తా నాలాస్యమున్ జంపెనే”*


కంది శంకరయ్య వద్ద 5/20/2024 09:00:00 PM

13 కామెంట్‌లు:


  1. అంకిలి బాపగ రారా
    పంకజ నాభా! యనుచును ప్రార్థింపగ తా
    శంకింపక నా భక్తవ
    శంకరుడా మకరిజంపి జర్తువు బ్రోచెన్.


    పొరలో జిక్కితి నీశ్వరేశ్వర! చతుర్వ్యూహా! సుషేణుండ! స
    త్వరమున్ రమ్మని వేడుచుంటి నను కాపాడంగ రమ్మంచు నా
    కరి శోకించుచు పిల్చినంతటనె యేకాంగుండు లక్ష్మీ మనో
    హరుడే ప్రోవగ కుంజరమ్మునట తా నాలాస్యమున్ జంపెనే.

    రిప్లయితొలగించండి
  2. సంకటమున మాతంగము
    జంకగ ధైర్యము బలిమియు శరణము వేడన్
    పంకజ నేత్రుడు భక్తవ
    శంకరుడా మకరిజంపి జర్తువు బ్రోచెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పరిపుష్టంబుగ నున్న మీనరముతో ప్రాఘాతమున్ బడ్డదై
      కరి దుర్జాతము నందుచిక్కి హరినే కాపాడ ప్రార్థింపగా
      కరుణా పూరిత మానసుండు వెదలెన్ గాళింగమున్ జేర శ్రీ
      హరుడే ప్రోవగ కుంజరమ్మునట తా నాలాస్యమున్ జంపెనే

      తొలగించండి
  3. మంకుతనంబును జుపకు
    సంకటమున నున్న కరిని సంర క్షించన్
    సంకొచించకు , భక్తవ
    శంకరుడా మకరిజంపి జర్తువు బ్రోచెన్

    రిప్లయితొలగించండి
  4. పంకజనాభునిఁ గరి తా
    నంకిలిఁబాపుటకు వేడె నార్తిగ నంతన్
    సంకోచించక భక్తవ
    శంకరుడా మకరిజంపి జర్తువు బ్రోచెన్

    రిప్లయితొలగించండి
  5. కం॥ శంక వలదు వరములొసఁగు
    శంకరుఁ, డామకరిఁ జంపి జర్తువుఁ బ్రోచెన్
    సంకటముఁ బాప హరియే
    బొంకమఁడగఁ గరటి వేడఁ బురుషోత్తమునిన్

    మ॥ కోరఁగ భక్తిని మోదమంది వరముల్ గుప్పించు శీఘ్రమ్ముగన్
    హరుఁడే, ప్రోవఁగఁ గుంజరమ్మునట తా నాలాస్యమున్ జంపెన్
    హరియే బింకము వీడి ప్రార్థనను సాహాయ్యమ్ము కాంక్షించుచున్
    వరదా కావవే యంచుఁ జేయఁ గరి సంభావించి దైత్యారినిన్

    రిప్లయితొలగించండి
  6. కరుణాసాగర కామితార్థఫలదా కైవల్యదాయీ హరీ
    వరదా వేడెద వేగరమ్ము మకరిన్ పాలార్చి నన్బ్రోవగన్
    సరసిన్ జిక్కితి నీవె దిక్కనుచు రక్షన్ గోరఁగా శ్రీమనో
    హరుడే ప్రోవగ కుంజరమ్మునట తా నాలాస్యమున్ జంపెనే

    రిప్లయితొలగించండి
  7. వంకల్ సెప్పక తా నా
    వంకకు వేగంబ చేరి పన్నుగ శ్రీ వ
    త్సాంకుఁడు సంతత భక్త వ
    శంకరుఁ డా మకరిఁ జంపి జర్తువుఁ బ్రోచెన్


    సిరికిం జెప్పక శంఖచక్ర యుగముం జేదోయి సంధింపకే
    కరి రాజేంద్రుఁడు గావు కావు నను రక్షా దక్ష యంచార్వఁగా
    హరి యాక్రందన మాలకించి వెసఁ బద్మాక్షుండు లక్ష్మీ మనో
    హరుఁడే ప్రోవఁగఁ గుంజరమ్ము నట తా నాలాస్యమున్ జంపెనే

    రిప్లయితొలగించండి
  8. కం:బింకము లే దిప్పుడు,నా
    సంకటమున్ దీర్ప హరియె శరణనగా పా
    దాంకిత జన శత్రు వినా
    శంకరుడా మకరిజంపి జర్తువు బ్రోచెన్”*

    రిప్లయితొలగించండి
  9. మ:"పరిరక్షించెడి దెవ్వరంచు బిలువన్ భక్తిన్ గజ మ్మార్తితో
    హరియే రక్షణ జేసెగా మకరసంహారమ్ము గావించి శ్రీ
    హరి యే దైవ" మటంచు వైష్ణవు డనెన్, హాస్యమ్ము తో నిట్లనెన్
    "హరుడే ప్రోవగ కుంజరమ్మునట తా నాలాస్యమున్ జంపెనే?"
    (శివుడంటే గిట్టని ఒక వైష్ణవుడు "నన్ను రక్షించే దెవరు"అని బాధపడుతున్న గజేంద్రుణ్ని విష్ణువు కాపాడాడు కానీ శివుడు కాపాడాడా? అని వేళాకోళంచేసాడు.నిజం గా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్లూ ఉన్నారు.)

    రిప్లయితొలగించండి
  10. కందం
    ఇంకెను రక్తమదంతయు
    సంకటమునఁ జిక్కితినని శౌరిని వేడన్
    పంకజనాభుడు భక్తవ
    శంకరుడా మకరిజంపి జర్తువు బ్రోచెన్

    మత్తేభవిక్రీడితము
    శరణమ్మంచును నీటఁ జిక్కి మకరిన్ సాధించ లేనంచు శ్రీ
    కరునిన్ గావఁగ రమ్మటంచు గొలువన్ కారుణ్యముప్పొంగగన్
    కరమందాయుధమేదియున్ గొనక రక్షన్జేయ లక్ష్మీమనో
    హరుడే ప్రోవగ కుంజరమ్మునట తా నాలాస్యమున్ జంపెనే

    రిప్లయితొలగించండి
  11. పంకజ నాభుని వే డగ
    సంకట మును బాప నెంచి సత్వర ముగ దా
    నంకితు డై వచ్చి భక్త వ
    శంక రు డా మకరి చంపి జర్తువు బ్రోచెన్

    రిప్లయితొలగించండి