31, జులై 2024, బుధవారం

సమస్య - 4838

1-8-2024 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“దైత్యసేవకై తరలెను దైవగణము”

(లేదా...)

“దైత్యుని సేవ చేయుటకు దైవగణమ్ములు సాగె నొక్కటై”

(శ్రీకాకుళంలో బులుసు అపర్ణ గారి ద్విశతావధాన సమస్య)

11 కామెంట్‌లు:

  1. 1. హిరణ్యకశిపునితో ప్రహ్లాదుని గురువులు:

    తేటగీతి
    హరిని మఱువక ప్రహ్లాదుఁడనుసరింప
    నడవులందున శిక్షింపనానతిడితె!
    తక్షణమె శౌరి ప్రేరణ రక్షఁజేయ
    దైత్య! సేవకై తరలెను దైవగణము

    2.

    ఉత్పలమాల
    నిత్యము శ్రీహరిన్ విడువ నేరవు, చూపుమటంచు భక్తిరా
    హిత్యముమీరినంత సుతునెంచియు మోదగఁ గంబమందునన్
    నిత్యుడునారసింహునిగ నీమము దప్పక నిల్చి కూల్చినన్
    దైత్యుని, సేవ చేయుటకు దైవగణమ్ములు సాగె నొక్కటై!


    రిప్లయితొలగించండి
  2. నిత్యముగానిరాజ్యమునునేరుపతోబలిదానమిచ్చెగా
    సత్యముబ్రహ్మచారిగనిసంబరమందుచుసద్గుణాత్ముడై
    జాత్యమునైనక్రూరతనుసంయమిగాగనుపారద్రోలి, యా
    దైత్యునిసేవజేయుటకుదైవగణమ్ములుసాగెనొక్కటై

    రిప్లయితొలగించండి
  3. మూర్ఖులనదగు వారలె మునిగియుండు
    దైత్యసేవకై ; తరలెను దైవగణము
    తమనె నెపుడు దలచు వారి తలపులోని
    కామనములన్నిటి సలుపు కాన్పుతోడ

    రిప్లయితొలగించండి
  4. దానవు డిరణ్యకశ్యపు దనదు పుత్రు
    చండమార్కుల నియమించె జంపుటకును
    చంప యత్నించగా వారు సత్వగుణపు
    దైత్య సేవకై తరలెను దైవగణము

    రిప్లయితొలగించండి
  5. రాక్షసాధిపుబిడ్డడై రక్షకుండు
    విష్ణు వంచును పలికెగావిమలమతిని
    అట్టిప్రహ్లాదుమ్రొక్కంగనాసపడుచు
    దైత్యుసేవకైతరలెనుదైవగణము

    రిప్లయితొలగించండి
  6. దైత్యు డైనట్టి ప్రహ్లాదు దైవ భక్తి
    తెలిసి దర్శింప వెడలె ను దివిని విడిచి
    దైత్యు సేవకై తరలెను దైవ గణము
    గాంచి తరియింప గా నెంచి కాంక్ష తోడ

    రిప్లయితొలగించండి
  7. తే.గీ.॥
    పరమశివుని పూజించి తా వరములొంది
    దివిజగణములు వణకఁగ దితిసుతుండు
    యుద్ధమొనరింప స్వర్గమ్ము దద్దఱిల్ల
    దైత్యసేవకై తరలెను దైవగణము

    ఉత్పలమాల:
    నిత్యము చంద్రశేఖరుని నిష్ఠగ ఘోరతపంబు సల్పి యా
    దైత్యుఁడు ఫాలనేత్రుకడ దండిగ పొంది వరమ్ములెన్నియో
    యత్యయముం బొనర్చికడుఅంకిలి వెట్టఁగ భీతచిత్తులై
    దైత్యుని సేవ చేయుటకు దైవగణమ్ములు సాగె నొక్కటై

    రిప్లయితొలగించండి
  8. సర్వ లోకైక నాథుని స్మరణమందు
    మునిగి తేలు ప్రహ్లాదుని తునుమనెంచ
    రాక్షసేంద్రుని పుత్రుని రక్షణమున
    దైత్యసేవకై తరలెను దైవగణము

    సత్యము శ్రీహరే యనుచు సర్వము తానని భక్తితోడుతన్
    నిత్యము నంతరంగమున నిల్పగ హ్లాదుడు విష్ణునామమున్
    దైత్య విభుండు కోపమున దండన సేయగ వాని రక్షకై
    దైత్యుని సేవ చేయుటకు దైవగణమ్ములు సాగె నొక్కటై

    రిప్లయితొలగించండి
  9. తే.గీ: నహుషు డింద్రపదము బొంద నహము లెల్ల
    విడచి,శక్తి యుడిగి కడు వేదన గొని
    విష్ణు దయ తక్క లేదని వేరు దారి
    దైత్యసేవకై తరలెను దైవగణము”

    రిప్లయితొలగించండి
  10. ఉ:దైత్యుడు రావణుండు వరదర్పము తో జెలరేగ సాజమౌ
    జాత్యభిమానమున్ విడచి,స్వర్గపు గర్వము వీడి, దిక్పతుల్
    భృత్యువిధిన్ వహించి కడు భీతి జరించగ,కాల చిత్రమై
    దైత్యుని సేవ చేయుటకు దైవగణమ్ములు సాగె నొక్కటై

    రిప్లయితొలగించండి

  11. రావణునియంత మొనరించి రాము డపుడు
    లంకకు విభీషనుండను రాజు గాను
    పట్ట మున్ గట్టు నట్టి యా పాళమందు
    దైత్యసేవకై తరలెను దైవగణము.


    సత్యవిరోధియై మునుల సజ్జన సత్పురు షాలి హింస స
    త్కృత్యము గా దలంచు పొలదిండిని యంతము జేయనెంచి యా
    దిత్యుడు ధర్మరక్షకుడు దీప్తపు రూపము నెత్తి చీల్చగా
    దైత్యుని, సేవ చేయుటకు దైవగణమ్ములు సాగె నొక్కటై.

    రిప్లయితొలగించండి