18, సెప్టెంబర్ 2024, బుధవారం

సమస్య - 4886

19-9-2024 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ప్రక్షుభితమొనరింత్రు సభను సుకవులు”

(లేదా...)

“ప్రక్షుభిత మ్మొనర్తురు సభాస్థలి నెల్ల కవీంద్రు లుద్ధతిన్”

15 కామెంట్‌లు:

  1. సాహితీస్పర్ధ నెరపుచు సభలలోన
    చర్చతారాపథముజేరు సమయమందు
    యిచ్చవచ్చిన రీతిగ రెచ్చిపోయి
    ప్రక్షుభితమొనరింత్రు సభను సుకవులు

    రిప్లయితొలగించండి
  2. పురమునందలి పిల్లలు పూనిరచట
    సదము దానిలోపల కొనసాగుచున్న
    వింత పోకడల దమ కవితల తోడ
    ప్రక్షుభితమొనరింత్రు సభను సుకవులు

    రిప్లయితొలగించండి
  3. అక్షరమక్షరమ్మునొక యల్లికగా గదియించి సత్కవుల్
    లక్షణమైన కావ్యముల వ్రాయగనా కవితావతంసులున్
    శిక్షితులౌ విమర్శకులు జేయు పరస్పర చర్చలందునన్
    ప్రక్షుభితమ్మొనర్తురు సభాస్థలి నెల్ల కవీంద్రు లుద్ధతిన్

    రిప్లయితొలగించండి
  4. తే॥ వీక్షకులకర్థమును గాని వివిధ పద్య
    ధారలనవధానమునను దమదు పాట
    వమ్ముఁ జాటఁగఁ జొప్పించి పలుక నెడలఁ
    బ్రక్షుభితమొనరింత్రు సభను సుకవులు

    ఉ॥ వీక్షకు లెందునూ కనని విద్యలఁ జూపఁగఁ బద్యరీతులన్
    శిక్షణనొంది పద్యములఁ జిక్కగ గూర్చఁగ నవ్యమాలలన్
    దక్షణ మర్థమున్ గనకఁ దల్లడ మొందఁగఁ బ్రేక్షకాళియున్
    బ్రక్షుభితమ్మొనర్తురు సభాస్థలి నెల్ల కవీంద్రు లుద్ధతిన్

    శ్రీ ఆర్ గణేశ్ గారి కన్నడ శతావధానములో నిజమైన శ్రద్ధలేక పోతే ఇలాగే అనిపిస్తుందండి. తెలుగులో లాగ సమస్యలు పిదప దత్తపదులు ఇలా లేవండి. ఒకటో రెండో సమస్యలు పిదప అలాగే దత్త పదులు అలాగే చిత్రపద్యములు ఆశువులు (పూర్తిచేస్తారు). మొదటి ఆవృత్తము తరువాత రెండవ ఆవృత్తములో మరొక పాదమే పూరిస్తారు. ఇలానడుస్తుంది. చివరలో ధారణ ఇంకా వినలేదండి. పైగా పాత (హళె) కన్నడ, అచ్చ కన్నడ నడుస్తున్న (నడె) కన్నడ. శ్రీ గణేశ్ గారి ప్రతిభను వర్ణించలేనండి. ఇక్కడ అందరూ విఖ్యాత కవులని తెలిపినానండి. అంతే

    రిప్లయితొలగించండి
  5. అక్షరమ్ములఁ గుదిగూర్చి హాయిగూర్తు
    రక్షయక్షాంతియుక్తులై వీక్షకులకు
    ప్రేక్షకాదరణమ్మున రెచ్చిపోయి
    ప్రక్షుభితమొనరింత్రు సభను సుకవులు

    అక్షితమైన ప్రజ్ఞ దరహాసము నిండిన మోము చూపుచున్
    వీక్షకులైన వారికి నివేదన సల్పెడు పద్యధారతో
    దక్షతతోచెలంగి కడు తన్మయులై జనులెల్ల కాంచగా
    ప్రక్షుభితమ్మొనర్తురు సభాస్థలి నెల్ల కవీంద్రు లుద్ధతిన్

    రిప్లయితొలగించండి

  6. మధుర భాషణములతోడ మనసు దోచి
    పారవశ్యుల జేసెడి పండితు లట
    లింపుగ ప్రవచింతురు మరి యెవ్విధమున
    ప్రక్షుభితమొనరింత్రు సభను సుకవులు?


    అక్షరమైనరాని తమరాసభ గూర్చి వచింప న్యాయమే
    దక్షతగల్గువారల సుధారస తుల్య సుభాషితమ్ములన్
    శిక్షకు లాలకింపగను చేరెద రన్నది సత్యమెవ్విధిన్
    ప్రక్షుభిత మ్మొనర్తురు సభాస్థలి నెల్ల కవీంద్రు లుద్ధతిన్?

    రిప్లయితొలగించండి
  7. కవితలెన్నియొ చదువుచు కవులుచాల
    మైమరచెవిధమున పాడ మానవాళి
    కంతడెందమునందము నెంతొచేయ
    ప్రక్షుభితమొనరింత్రు సభనుసుకవులు

    రిప్లయితొలగించండి
  8. కలఁచి వైతురు సభ్యులు గ్రామ సభను
    రచ్చ లొనరింత్రు నేతలు రాష్ట్ర సభను
    గాఁకఁ గలిగింత్రు మంత్రులు లోకసభను
    బ్రక్షుభిత మొనరింత్రు సభను సుకవులు


    అక్షయ రీతి వ్యాకరణ మత్యధికమ్ముగ నైపుణమ్మునన్
    లక్షణ లక్ష్య యుక్తముగ రౌద్ర తరమ్ముగఁ జాటి చెప్పుచున్
    సక్షమ మేక ధాటిగను జారుతరమ్ముగ వాదులాడుచుం
    బ్రక్షుభిత మ్మొనర్తురు సభాస్థలి నెల్ల కవీంద్రు లుద్ధతిన్

    రిప్లయితొలగించండి
  9. తే.గీ:నాల్ గలంకారముల్ ,నవ్వు కల్గు నట్టి
    నాల్గు మాటల తో గాక నవయుచున్న
    వర్గముల మేలుకై విప్లవమును గోరి
    ప్రక్షుభితమొనరింత్రు సభను సుకవులు”

    రిప్లయితొలగించండి
  10. ఉ:శిక్షగ నీ సమీక్షలను జెప్పెడి గౌరవ మేదొ దక్కెగా!
    అక్షర సంఖ్య యెక్కువయి యర్థము శూన్యముగా వచించుచున్
    నా క్షమకే పరీక్ష నిడి, నాణ్యత లేక ద్విరుక్తు లెక్కువై
    ప్రక్షుభిత మ్మొనర్తురు సభాస్థలి నెల్ల కవీంద్రు లుద్ధతిన్”
    (కొన్ని కవిసమ్మేళనాలు సమీక్షకులకి శిక్ష గా తయా రౌతాయి.అర్థం పర్థం లేక పేజీల కొద్దీ రాస్తారు.అది చాలక అక్కడ నాణ్యత లేక పోయినా ఒక్కొక్క వాక్యాన్ని రెండు రెండు సార్లు చదువుతుంటారు.)

    రిప్లయితొలగించండి
  11. చెప్ప వలసిన విషయాన్ని చెప్ప కుండ
    నన్య ముల తోడ శ్రోతల నడల గొట్టి
    ప్ర క్షు భి త మొన రింత్రు సభను సుకవులు
    కొందరనుచిత వ్యాఖ్య లన్ గొప్పజేసి

    రిప్లయితొలగించండి
  12. తేటగీతి
    చట్టసభలందు సభ్యులు స్వార్థమెగసి
    కౌరవ సభఁ జేసి చెలఁగు కతనమెలికి
    మార్పునెంచి వ్యంగోక్తుల సల్పి వేది
    ప్రక్షుభితమొనరింత్రు సభను సుకవులు


    ఉత్పలమాల
    దక్షులటంచు చట్టసభ ధన్యము సేతురటంచు నెన్నగన్
    కక్షల దీర్చు వేదికగఁ గ్రమ్మి యసభ్యము లాడు వై నమున్
    సాక్షిగ, సత్ప్రవర్తనము సాంతము నిల్ప ఛలోక్తులల్లుచున్
    ప్రక్షుభితమ్మొనర్తురు సభాస్థలి నెల్ల కవీంద్రులుద్ధతిన్

    రిప్లయితొలగించండి
  13. శాస్త్ర విఙ్ఙాన మునచర్చ జరుగు చుండ
    యెవరి యభిప్రాయ ములువారు వివరణముగఁ
    జెప్పు సమయాన నోర్వక సిగ్గు లేక
    ప్రక్షుభితమొనరింత్రు సభను సుకవులు”

    రిప్లయితొలగించండి
  14. అక్షర ఙ్ఙానమున్గనక యార్యులు కొందఱు లేకిబుద్ధితోఁ
    గక్షను బెంచుకొంచునట కాకుల
    మాదిరి గోలజేయుచున్
    లక్షణమైనయా సభను రాక్షసకొంపగ మార జేయుచున్
    ప్రక్షుభిత మ్మొనర్తురు సభాస్థలి నెల్ల కవీంద్రు లుద్ధతిన్

    రిప్లయితొలగించండి
  15. డా బల్లూరి ఉమాదేవి

    మంచి కవనము లల్లుచు మదిని దోచి
    మన్ననలనందుచున్నట్టి మాన్యులెటుల
    *ప్రక్షుభితమొనరింత్రు సభను సుకవులు?*
    నిట్టి మాటలాడుట వల్ల నేమి ఫలము

    దక్షత లేని వారలిట దండిగ చేరుచు గొప్పచెప్పుచున్
    లక్షణహీనమౌచునపలక్షణ రీతిగ నాలపించుచున్
    వీక్షణచేయువారలకువేదనకూర్చెడిరీతికొందరున్
    *ప్రక్షుభితమ్మొనర్తురుసభాస్థలినెల్లకవీంద్రులద్ధతిన్*

    రిప్లయితొలగించండి