6, సెప్టెంబర్ 2026, ఆదివారం

సమస్య - 5582

7-9-2026 (సోమవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ప్రత్తిచేనులో వికసించెఁ బద్మమొకటి”

(లేదా...)

“ప్రత్తిచేనున విచ్చుకొన్నది పద్మ మొక్కటి వింతగన్”

(పట్వర్ధన్ గారి శతావధానంలో తక్కళ్ళపల్లి స్వాతి గారి సమస్య)

15 కామెంట్‌లు:

  1. తెల్ల బంగారమనెదరు తెలుగు నాట ,
    దాని రంగు రంగుల పూలు దర్శనమిడె
    ప్రత్తిచేనులో ; వికసించెఁ బద్మమొకటి
    చేరువన గల కొండిక చెరువు నందు

    రిప్లయితొలగించండి
  2. విరివిగా గడ్డి పూవులు వింతగాను
    పత్తిచేనులో వికసించె; పద్మమొకటి
    ప్రక్కకొలనులో వింతగా ప్రజలుచూడ
    ముచ్చటగ వికసించెను ముదముజెంద



    రిప్లయితొలగించండి
  3. తేటగీతి
    ప్రత్తి పూవులు విచ్చఁగ రైతు మురిసి
    కూళి వారలతోఁ గోసి గొప్ప రాశి
    నట్టనడుమన వేయగ నల్గురనిరి
    ప్రత్తిచేనులో వికసించెఁ బద్మమొకటి!

    మత్తకోకిల
    గుత్తులట్లుగఁ పూలు విచ్చఁగ కూలి వారల బిల్చియున్
    మొత్తమున్ దగ కోసి రాశిగ పోసినంతట మధ్యనున్
    నెత్తిమీదను నింప వెన్నెల నిండు జాబిలి, పల్కిరే
    ప్రత్తిచేనున విచ్చుకొన్నది పద్మ మొక్కటి వింతగన్!

    రిప్లయితొలగించండి
  4. ప్రత్తి సేకరణ కొరకు బయలుదేరి
    క్రొత్త జంటలు చేరిరి ప్రత్తి చేను
    భామ మోము గాంచిన కవి వక్కణించె
    ప్రత్తిచేనులో వికసించెఁ బద్మమొకటి

    క్రొత్తజంటలు ప్రత్తి తీయగ కోరి వచ్చిన చేనులో
    మత్తుకన్నుల చిన్నదొక్కటి మందహాసము సేయగా
    నత్తరిన్ వచియించె సత్కవి హాయిగా కడు తీయగా
    ప్రత్తిచేనున విచ్చుకొన్నది పద్మ మొక్కటి వింతగన్

    రిప్లయితొలగించండి

  5. మిసిమి వర్ణమున్ మెరిసిడి మేను గలిగి
    చేత గొడవలి ధరియించి చెలమరులతొ
    కదలి వచ్చు మర్దలి గాంచి కాంతు డనియె
    ప్రత్తిచేనులో వికసించెఁ బద్మమొకటి.


    చిత్తగింపుము రామచంద్రుడ చెప్పు చుంటిని సంగతిన్
    మత్త కాశిని బంది సేసిన మానుషాదుని రాజ్యమం
    దుత్తముండు విభీషణుండట యోగ్యుడాతడె కాంచగన్
    ప్రత్తిచేనున విచ్చుకొన్నది పద్మ మొక్కటి వింతగన్.

    రిప్లయితొలగించండి
  6. చిత్తమందున నెగ్గునెంచక సీత రూపము బూనినన్
    మిత్తినింగొని వత్తురాయిటు మీరు లంకకు సోదరా
    మత్తు వీడుడటంచు బల్కిన మాన్యుఁ డాతఁడు తమ్ముడే
    ప్రత్తిచేనున విచ్చుకొన్నది పద్మ మొక్కటి వింతగన్

    రిప్లయితొలగించండి
  7. నిన్న నగుపించి మురిపించి నీరజాక్షి
    వలపు గానము వినిపించె తలపులందు
    మరులు కురిపించె మనసెంతొ పరవశించె
    ప్రత్తిచేనులో వికసించెఁ బద్మమొకటి

    రిప్లయితొలగించండి
  8. -

    క్రోవి బట్టి పోరు సలిపి క్రుద్దులైన
    అన్న లీనాడు ప్రభుత ప్రయత్న మనగ
    జనుల మేలుగోరిరదె ప్రసన్నమైన
    ప్రత్తిచేనులో వికసించెఁ బద్మమొకటి


    రిప్లయితొలగించండి
  9. காதலிக்க நேர மில்லை :)

    క్రొత్తతావిని చేర్చుకొన్నది కోర్కె కూర్మిని‌ గోముగా
    ముత్తెమై మెరిసేను చిన్నది ముద్దులిచ్చెను మత్తుగా
    మెత్తమెత్తని మేనియెల్ల రమించి నాట్యము సేయగా
    ప్రత్తిచేనున విచ్చుకొన్నది పద్మ మొక్కటి వింతగా



    రిప్లయితొలగించండి
  10. తే.గీ:ప్రత్తి పండునట్టి నిజామ బాదు లోన
    ప్రత్తి బోర్డును సాధించి భాజపా కు
    జెందు నరవిందు పదవిని బొందె! జూడ
    ప్రత్తిచేనులో వికసించెఁ బద్మమొకటి”
    (నిజామాబాదు పత్తి పంటకు ప్రసిద్ధి.కాటన్ బోర్డ్ ఒకటి ఏర్పరచే ప్రయత్నం లో ధర్మపురి అరవింద్ అనే బి జె పి యం.పి.ముఖ్యపాత్ర పోషించాడు. పార్టీ కమలం.అతని పేరు కమలం. కనుక పై పోలిక ఒప్పుతుంది. )

    రిప్లయితొలగించండి
  11. మ.కో:ప్రత్తిపాడను జూడ జక్కని పల్లె కేగితి,నాదు మే
    నత్త యూరని, యత్త బిడ్డకు నంబుజ మ్మని పేరు ,గ
    మ్మత్తు గా కను విప్పి జూచును, మాటలాడును ప్రేమ తో
    ప్రత్తిచేనున విచ్చుకొన్నది పద్మ మొక్కటి వింతగన్”
    (పట్టి పాడు అనే ఊరు ఉంది. ఇతని మేనత్త కూతురి పేరు అంబుజం కనుక పద్మం. ఆమె చక్కగా క ళ్లింత పెద్దవి చేసి ప్రేమగా మాట్లాడుతుంది. )




    రిప్లయితొలగించండి