6, జనవరి 2021, బుధవారం

సమస్య - 3596

7-1-2021 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ధనము వలదటంచుఁ జనునె తన్వి”

(లేదా…)

“ధనమును వీడి పోగలదె తన్వి ముదంబున భర్త యింటికిన్”

72 కామెంట్‌లు:


  1. "శ్రీ రాముని దయ చేతను..."

    సరదా పూరణ:

    కొనగను తల్లి తండ్రులట కొండొక లాటరి చీటిలన్ భళా
    తనివిని తీరగా గెలువ దండిగ దండిగ కోట్ల రూప్యముల్
    మనమును నొవ్వు మాటలను మంచిగ సైచక పుట్టినింటిదౌ
    ధనమును వీడి పోగలదె తన్వి ముదంబున భర్త యింటికిన్?

    రిప్లయితొలగించండి

  2. ఆటవిడుపు సరదా పూరణ:
    (జిలేబి గారికి అంకితం)

    చనుచును వంగదేశమున చక్కగ నాడుచు నాటకమ్ములన్
    దినమును రాత్రి చేకొనుచు దీటుగ కోటుల ప్రాతిభావ్యముల్
    తినుటకు గడ్డి నీయకయె తిట్టెడు భర్తకు సేవజేయుటన్
    ధనమును వీడి పోగలదె తన్వి ముదంబున భర్త యింటికిన్?

    రిప్లయితొలగించండి
  3. మన మలరంగ శైశవపు మాధురులం జవిగొన్న యిల్లు, న
    చ్చిన చెలులందఱన్ గలిసి చెల్వపుఁ గ్రీడల నాడు చోటు, ము
    ద్దును మురిపెంబుఁ జూపి తనతో నడయాడిన బంధువర్గ బం
    ధనమును వీడి పోగలదె తన్వి ముదంబున భర్త యింటికిన్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విధియె వెక్కిరింప వెలయాలుగా మారి
      బ్రతుకు నీడ్చుచుండె భాగ్యహీన;
      సుఖము నంది పిదప సోకుల విటుడిచ్చు
      ధనము వలదటంచుఁ జనునె తన్వి.

      తొలగించండి
    2. మనోహరమైన, సహజమైనపూరణ, నమస్కారమండి

      తొలగించండి
  4. ఆటవెలది
    సీత, ద్రౌపదులనె సిరులంచుఁ జేకొన
    రామ మూర్తి పాండురాజ సుతులు!
    నాస్తి దెచ్చు నట్టి యాలుల మగలెంచ
    ధనము వలదటంచుఁ జనునె తన్వి!!

    చంపకమాల
    తునుకలుఁ జేసి వింటిని వధూటిని సీతనుఁ బట్టె రాముఁడున్
    దునుముచు మత్స్యయంత్రమును ద్రోవది నందెనుఁ గ్రీడి నాడటన్
    బెనగువడంగ సంపదలుఁ బెండ్లముఁ దెచ్చిన మెచ్చు భర్తలై
    ధనమును వీడి పోగలదె తన్వి ముదంబున భర్త యింటికిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      "పాండురాజ తనయు । లాస్తి..." అనండి.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ :

      ఆటవెలది
      సీత, ద్రౌపదులనె సిరులంచుఁ జేకొన
      రామ మూర్తి పాండురాజ తనయు
      లాస్తి దెచ్చు నట్టి యాలుల మగలెంచ
      ధనము వలదటంచుఁ జనునె తన్వి?

      తొలగించండి
  5. భర్త పాద సేవె కర్తవ్యమనుచును

    కాన బాట పట్టె జానకమ్మ

    కలిన పతియె పోవ కారాగృహికి , గద్దె,

    ధనము వలదటంచుఁ జనునె తన్వి ?

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  6. కన *కుంటి* మో *మెల్ల* మన *మూగ* సొబ *గూని* మరుని వనంబని మానవతిని
    విన *కుంటి* జప *మెల్ల* బెండ్లికై మెరు *గూని* శిర *మూగ* తపియించు జిగురుబోడి
    నాదను *కుంటి* వనజనేత్ర మన *మెల్ల* జగ *మూగ* సి *గ్గూని* సకియవేచ
    తిన *కుంటి* దిన *మెల్ల* తెలిగంటి రం *గూని* మన *మూగ* ప్రమద గోరి
    అంద *మెల్ల* ను జోడించె నంచ రవుతు
    గూచి నెరుగ *కుంటి* ని నడ్ము *గూని* నెదుర
    పలువు రుండగ *మూగ* బింబాధర చెలి
    వన్నె చిన్నెల సోయగ మెన్న దరమె?

    రిప్లయితొలగించండి
  7. మనమున నత్తమామలకు మానిని వందన మాచరించు కి
    మ్మనదని పుట్టినింట స్నుష మాటలు కోటలు దాట దూరినన్
    తనుభవ చిన్ననాటి మమతన్ స్మృతి దప్పునె కూర్మి రక్త బం
    *“ధనమును వీడి పోగలదె తన్వి ముదంబున భర్త యింటికిన్”*

    రిప్లయితొలగించండి
  8. ప్రేమతోడ గెలువ ప్రియతమురాలని
    వెంటబడుచు నొకడు వేడుచుండె
    సరసుడైన నేమి సరదాలు దీరక
    ధనము వలదటంచుఁ జనునె తన్వి!!

    రిప్లయితొలగించండి
  9. మనసుగెలువగలుగుమగనినిఁబోందిన
    మనువుకంటెవేరునగయెలేదు
    కరవుగాగనదియుకాంతకు, మానధనమువలదటంచుఁజనునెతన్వి

    రిప్లయితొలగించండి
  10. వలసి నంత నేర్పు వర్ధిల్ల వలె నన్న
    ప్రతి దినంబు చేయ వలయు నమ్మ
    ననుచు పల్కు మాట నతివ నమ్మ క యె సా
    ధనము వలదటంచు జనునె తన్వి?

    రిప్లయితొలగించండి
  11. మనసుగెలువగలుగుమగనినిపోందిన
    మగువకంటెవేరునగయెలేదు
    కరవుగాగకలయుకాంతకునభిమాన
    ధనమువలదటంచుఁజనునెతన్వి

    రిప్లయితొలగించండి
  12. మోజుతోడ కొన్న మోటారు సైకిలు
    నడుప నేర్చెనామె యొడుపుగాను
    పిన్ని రమ్మటంచు పిలిచిన నేమి యిం
    ధనము వలదటంచుఁ జనునె తన్వి

    రిప్లయితొలగించండి
  13. వనమున రావణాసుసుడు బంధిగ నుంచిన రామయత్ని నా
    హనుమయె గాంచి రాఘవుని యాలియటంచునెఱంగి నంతనే
    కనుగవ చెమ్మగిల్లగను గాలిసుతుండు తలంచె నిట్లు బం
    ధనమును వీడి పోగలదె తన్వి ముదంబున భర్త యింటికిన్

    రిప్లయితొలగించండి
  14. అనయము రాగబంధములు
    హత్తుకొనన్ దనపుట్టినింటిలో
    కనుగవలందు గాచి, తన
    కై ముదమార వివాహబంధమున్
    పెనగొనజేసినన్, హృదిని
    ప్రేమ సుధా కలితార్థ చిత్తపున్
    ధనమును వీడి పోగలదె?
    తన్వి ముదంబున భర్త యింటికిన్!

    (స్త్రీ జీవితంలో వివాహానంతరం అనివార్య
    సన్నివేశం)

    రిప్లయితొలగించండి
  15. ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ నా ప్రయత్నము :

    చం:

    వినిమయ మెంచి క్షేత్రమును వేనకు వేలగు డబ్బు చేర్చగన్
    కనివిని యెర్గ నంత కరకట్టలు త్రెంచెడి శోక సంద్రమున్
    గొణుగుచు నుంకరించుచును గుప్పిట నొందె సమాన భాగమున్
    ధనమును వీడి పోగలదె తన్వి ముదంబున భర్త యింటికిన్

    గొణుగుచున్ +హుంకరించుచును =గొణుగుచునుంకరించుచును అని రాశాను

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  16. అనయము కంటిరెప్పవలె నార్తిని గాచెడు దల్లిదండ్రులన్
    చనవున గిల్లికజ్జముల సందడిజేసెడు నక్కజెల్లెలన్
    మనమున భావవల్లరుల మంచిగ బంచెడి స్నేహబృం
    ద బం
    ధనమును వీడిపోగలదె తన్వి ముదంబున భర్తయింటికిన్
    కనుగొని కన్నుసైగలను కాంక్షలదీర్చెడి నాథుడైనచో!

    పోగలదని భావన!🙏
    !

    రిప్లయితొలగించండి
  17. L సమస్య :
    ధనమును వీడి పోగలదె
    తన్వి ముదంబున భర్త యింటికిన్

    ( పెండ్లైన పిమ్మట అప్పగింతల సమయంలో అమ్మాయి అంతరంగం )

    చంపకమాల
    ....................

    జననము నుండి ముద్దులను
    జల్లుచు జూచెను కన్నతల్లియే ;
    తన మతి యేది కోరినను
    దత్క్షణ మిచ్చెను కన్నతండ్రియే ;
    అనయము నండదండగను
    అన్నయ యుండెనె ; నేడు ప్రేమపుం
    ధనమును వీడి పోగలదె ?
    తన్వి ముదంబున భర్త యింటికిన్ .

    రిప్లయితొలగించండి


  18. డబ్బెవరికి చేదండీ :) మా అయ్యరు గారిస్తానంటే వద్దనటానుకి మేమెవరమండోయ్ :)


    నిజమిది యేను! పెనిమిటి వె
    దజల్లగా వలదు నాకు ధనము వలదటం
    చుఁ జనునె తన్వియు? పసిడికొ
    న జెచ్చెరన్ పరుగు దీయు నానందముగా !



    జిలేబి

    రిప్లయితొలగించండి
  19. తనువును పెట్టు బాధలను తాలిమితోడను సైచితిన్, తునా
    తునుకలు జేసె మానసముఁ, తోడెవరే నిల నూరడింప? వీ
    ధిని పడినట్టి జీవితము దేనికి? వ్యర్థమె యన్న యాత్మ శో
    ధనమును వీడి పోగలదె తన్వి ముదంబున భర్త యింటికిన్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      "తోడెవరే యిల..." అనండి.

      తొలగించండి
  20. తాను ప్రేమించిన యువ పేదయనిదెలియ
    కాపురమునకు వెడలెడి కాలమందు
    దల్లిదండ్రులు బాధ్యత దాల్చి యిచ్చు
    ధనము వలదటంచుఁ జనునె తన్వి యపుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'యువ' అన్నది నామవాచకంగా తీసుకుంటే అది సంవత్సరం పేరు. యువకుడు అన్న అర్థం రాదు. "తాను ప్రేమించినతడు/ ప్రేమించిన పతి..." అనండి.

      తొలగించండి

  21. ఓ తండ్రి తనయతో


    అనవరతమ్ము జీవనమహారణ మింక జిలేబి మెట్టినిం
    టనె! బతుకింక పెన్మిటి కటాంజనమందున సాగిపోవు! స్త్రీ
    ధన మును వీడి పోగలదె తన్వి ముదంబున భర్త యింటికిన్?
    మునుపటి సాంప్రదాయము! సమున్నతమైనది చొప్పుతప్పకన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  22. రిప్లయిలు
    1. ధనమును వీడువారెవరు ధాత్రి నదే ధృఢబంధనమ్ముగాఁ
      దనరి పవిత్రమౌ పసుపు త్రాడుకు దార్ఢ్యము నేడు నయ్యదే
      యనితరసర్వకార్యకరణైకము జీవనయానవాహనేం
      ధనమును వీడి పోగలదె తన్వి ముదంబున భర్త యింటికిన్?

      కంజర్ల రామాచార్య‌

      తొలగించండి
    2. అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

      తొలగించండి
  23. మనమున చిన్న నాటి సఖి మాటలునాటలు చెట్ల కొమ్మనూ

    గిన పరువంపులూయలలు గీత సునీతలు రేఖ మాధవీ

    వనజలు, తల్లి, తండ్రులను ప్రాయమురాగను బంధ మాధురీ

    ధనమును వీడి పోగలదె తన్వి ముదంబున భర్త యింటికిన్”

    ...భారతీనాథ్ చెన్నంశెట్టి...

    రిప్లయితొలగించండి
  24. తనయలు పుట్టినింటికి సుధా కలశంబులు కూర్మినర్మిలిన్
    మనమును గౌరవంబు యశ మందము చందము భోగ భాగ్యమున్
    ధనమును ధాన్యమౌ శుభము దౌరు సదాగతి పుట్టినింటిబం
    *“ధనమును వీడి పోగలదె తన్వి ముదంబున భర్త యింటికిన్”*

    రిప్లయితొలగించండి
  25. కాపురమ్మునందు కమనీయభావమ్ము
    పనులు చక్క జేసి పదిలబరచి
    అంతతానె వెలుగ అనురాగ బంధాల
    ధనము వలదటంచుఁ జనునె తన్వి

    రిప్లయితొలగించండి
  26. జన్మమొసగి బుద్ధి, చదువులు చెప్పించి
    పెద్దనైన దన్ను పెండ్లి జేసి
    పంప, కన్నవారి పట్ల నాప్రేమ బం
    ధనము వలదటంచుఁ జనునె తన్వి?

    రిప్లయితొలగించండి
  27. ఇటీవలి అనేక పరువుహత్యల నేపథ్యంలో

    మనమునందు నిండ మనసైన చెలికాడు
    తల్లిదండ్రి యశము దలచ లేదు
    గట్టిపట్టు బట్టి ఘనమైన పుట్టింటి
    ధనము వలదటంచు జనునె తన్వి !

    రిప్లయితొలగించండి
  28. మానధనము మిన్న మానినులకు ధరఁ
    బస్తు లున్న దాని వదలఁ గలరె
    ధన విహీన యైనఁ దన దగు నభిమాన
    ధనము వలదటంచుఁ జనునె తన్వి


    ఘనముగఁ బెండ్లి కాఁగ జన కాయము మెచ్చగ వైభవమ్ముగం
    జనుతరి వచ్చి నంతటనె సంచలితాత్మ సరోరుహాక్షి తా
    మనమునఁ జింత నుంచక కుమారిక స్వీయజ నామి తానుబం
    ధనమును వీడి పోగలదె తన్వి ముదంబున భర్త యింటికిన్

    రిప్లయితొలగించండి
  29. పుణ్యఫలమువలన బ్రోగుకాబడినట్టి
    ధనమువలదటంచు జనునెతన్వి
    మంచిపనులవలన సంచితమయగును
    బుణ్యమనెడు నొకయ పూర్వశక్తి

    రిప్లయితొలగించండి
  30. అనయము తల్లిదండ్రి యిడినట్టి ప్రియత్వము మానసమ్మునన్
    ఘనముగ నిల్చియుండగను కమ్మని యూహలలోన నెప్పుడున్
    వినయముతోవసించుచును పెన్మిటి యింటను, కన్నవారి బం
    ధనమును వీడి పోగలదె తన్వి ముదంబున భర్త యింటికిన్

    రిప్లయితొలగించండి
  31. ఆడపిల్లయనగ నాడపిల్లగునెప్డు
    పుట్టినిల్లువీడి పోవుగాదె
    కన్నులందుబెట్టి కాపాడినట్టి బం
    ధనము వలదటంచుఁ జనునె తన్వి

    రిప్లయితొలగించండి
  32. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  33. వినయముగల్గుచుండియును బ్రేమనునిచ్చెడు బంధువర్గబం
    ధనమునువీడిపోగలదెతన్విముదంబునభర్తయింటికిన్
    మనమునబాధయుండిననుమాన్యతనొందినదైనదౌటచే
    మనగనుభర్తతోడనిక మానినియేగెనుమోదమబ్బగన్

    రిప్లయితొలగించండి
  34. శ్రీమాత్రేనమః/శ్రీగురుభ్యోనమః

    (అక్కకూతురు...తమ్మునికొడుకు...ఇండ్లు
    ఎదురెదురే...మేనత్త..మేనమామ.
    ఏరకంగానూ...ఏసంపదా..ఎటూపోదు.)

    మనువుకు పూర్వమందున
    సమానము పుట్టినింటనే శ్రీమాత్రేనమః

    ధనమును సర్వసంపదలు దా
    మనువాడెడు మేనమామయౌ

    గన నెదురిండ్లె రెండగుట కాపురమేగున దొక్కటౌ నెటుల్!?

    ధనమును వీడి పోగలదె!తన్వి!
    ముదంబున భర్త యింటికిన్.

    మీ ఆచార్య లక్ష్మణ పెద్దింటి యానాం.

    రిప్లయితొలగించండి
  35. ఘనుని ప్రయోజకున్ వెదకి కన్యకు పొంతనమెంచి మేలనన్
    ఘనముగ పెండ్లి జేసి దగ కాన్కలు సారెల నిచ్చి బంపినన్
    తన హితమున్ దలంచు తలిదండ్రుల దమ్ములతో సహానుబం
    ధనమును వీడి పోగలదె తన్వి ముదంబున భర్త యింటికిన్

    రిప్లయితొలగించండి
  36. అనువుగయాస్తికోసమని,ఆశలతేరునునెక్కియుండగా
    పనుపున కుండమార్పిడికి,బందువులందరు సమ్మతించగా
    తనదగు మానప్రాణములు,ధన్యతనివ్వగనెంచుకున్న బం
    ధనమునెవీడిపోగలదె తన్విముదంబున భర్తయింటికిన్
    +++++++++++++++++++++++
    రావెల పురుషోత్తమరావు

    రిప్లయితొలగించండి

  37. తండ్రి పెండ్లి చేయ తాళికట్టినపతి
    వెంట పుట్టినిల్లు వీడ మనసు
    రాక తలచె మదిని రాగము పెంచు బం
    ధనము వలదటంచు జనునె తన్వి

    రిప్లయితొలగించండి