4, ఫిబ్రవరి 2026, బుధవారం

సమస్య - 5372

5-2-2026 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఎవ్వఁ డెవఁ డెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవ్వఁ డెవఁడొ”
(లేదా...)
“ఎవఁ డెవఁ డెవ్వఁ డెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవం డెవఁ డెవ్వఁ డెవ్వఁడో”

17 కామెంట్‌లు:

  1. ప్రహ్లాదునితో హిరణ్యకశిపుడు:

    తేటగీతి
    నొవ్వ పలుమార్లు దండించ నోట పలుక
    మానవేమిర ప్రహ్లాద మాధవు నుతి!
    సర్వమయుఁడంటె? చూపించు స్తంభమందు
    నెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవ్వఁ డెవఁడొ?

    చంపకమాల
    అవధుల దాటె నీ నడత! యా హరి నామజపంబు వీడవే?
    యవగణ మన్న మానకయె యందువె? సర్వమయుండటంచు! మా
    ధవుడను నీదు దేవునిట స్తంభమునందున జూపు చూతు తా
    నెవఁ డెవఁ డెవ్వఁ డెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవం డెవఁ డెవ్వఁ డెవ్వఁడో?

    రిప్లయితొలగించండి
  2. ఎవ్వ డెవ్వడనుచు దన కెరుకజేయ
    మని యొక సమస్య నీయగ ననుగుణముగ
    పూరణ సలుపుటందున బ్రోచుటకయి
    యెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవ్వఁ డెవఁడొ” !

    రిప్లయితొలగించండి

  3. ఆగ్రహమ్మున నటజేరి యనఘుడైన
    భార్గవుండడిగె నట సభాసదులను
    విరిచె నెవ్వడట యిచట హరుని చాప
    మెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవ్వఁ డెవఁడొ.


    కవిదల యందు నర్జునుడు గాండివమున్ ధరి యించి నిల్చినన్
    పవతుడెవండు నిల్చునిక పార్థునెదుర్కొను వీరుడెవ్వడీ
    కువలయమందు తెల్పుమని కోరితి నోయి సుయోధనా యెవం
    డెవఁ డెవఁ డెవ్వఁ డెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవం డెవఁ డెవ్వఁ డెవ్వడో.

    రిప్లయితొలగించండి
  4. కవులరుగుదెంచిరి సభకు కావ్యగాన
    సుధనొలుకఁజేయ నెంచుచు శ్రోత చెవుల
    వివరము తెలియకున్నది వేదికపయి
    నెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవ్వఁ డెవఁడొ

    కవులరుదెంచినారటకు కావ్యసుధారసమందజేయగా
    యువకులు వృద్ధులున్ గవన యోధులనేకులు గుంపుగూడినన్
    వివరము తెల్పగోరకుము వేదిక పైగల వారిఁ జూపి వా
    డెవఁ డెవఁ డెవ్వఁ డెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవం డెవఁ డెవ్వఁ డెవ్వడో

    రిప్లయితొలగించండి
  5. ఎవడు విశాల భావముల
    నిక్కువజేసి ప్రశస్తి నొందునో
    యెవడు ప్రశాంత జీవనము
    నేర్పడ జేయుచు కీర్తినొందునో
    యెవడు సమాజమందున స
    హేతుక ధర్మవిపంచి మీటునో
    ఎవఁ డెవఁ డెవ్వఁ డెవ్వఁ డెవఁ
    డెవ్వఁ డెవం డెవఁ డెవ్వఁ డెవ్వడో?!

    రిప్లయితొలగించండి
  6. చవులనొసంగు కృష్ణుడు ప్రశాంతుడు పుణ్యుడు లోకరక్షకుం
    డవనిని గావగా నడతదాల్చినయట్టి మహాత్ముడీతడే
    భువనములెల్ల నేలెడి విభుండని నమ్మిన భక్తులెంచగన్
    ఎవడెవడెవ్వ డెవ్వడెవడెవ్వ డెవండెవడెవ్వ డెవ్వడో

    రిప్లయితొలగించండి
  7. తే॥ ఘనతర కవితా పటిమను ఖ్యాతి వడసి
    పేరుఁ గాంచిన ప్రవరుఁడు పేదరికపు
    బాధ సడలక మనుచుండ వగపుఁ బాపు
    నెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవ్వఁ డెవఁడొ

    చం॥ కవితలఁ బద్య మాలికల గాథలఁ జక్కగ వ్రాయు చుండినన్
    నవ తర భావ దీపికలు నచ్చెడు రీతిని విజ్ఞతా ధృతిన్
    బ్రవరుఁడు విత్త లేమినిల బాధలఁ గుందఁగఁ బ్రోచు నెవ్వఁడో
    ఎవఁ డెవఁ డెవ్వఁ డెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవం డెవఁ డెవ్వఁ డెవ్వఁడో

    ప్రవరుడు శ్రేష్ఠుడు
    (ఈ కాలపు రచయితలకు ఆర్థిక లోటు అరుదే యైనా!)

    రిప్లయితొలగించండి
  8. తే.గీ:మోది యభిమాని కాంగ్రెసు వాది తోడ
    బలికె నీ రీతి మోదీ ని వద్దనంగ
    నెవడు ఘటికుడౌ నేతయో యెరుక బరచు
    మెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవ్వఁ డెవఁడొ”

    రిప్లయితొలగించండి
  9. చం:ఎవనికి బుట్టె నంట జగ? మెవ్వని యందున నుండు లీనం మై
    ఎవనిన డిందు నట్టి పరమేశ్వరు డెవ్వడు? మూలకారణం
    బెవడొ? యనాది మధ్యలయు డెవ్వడొ? వాని గాంచినా
    డెవఁ? డెవఁ డెవ్వఁ డెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవం డెవఁ డెవ్వఁ డెవ్వఁడో?
    (పోతన గారి పద్యానికి పేరడీ.ఒక నాస్తికుదు దేవుణ్ని ఉనికిని ప్రశ్నిస్తూ ఇలా అన్నాడు.)

    రిప్లయితొలగించండి
  10. నారు పోసియు దానికి నీరు పోసి
    రక్ష సేయుచు నుండె డి దక్షు డ గుచు
    నన్ని చోటుల వెలుగుచు నలరు నాత
    డెవ్వ డెవ డెవ్వ డెవ డెవ్వ డెవ్వ డెవడొ?

    రిప్లయితొలగించండి
  11. సందియం బది లేదయ్య యిందు సుంత
    చెప్పు చుంటిని వినవయ్య తప్ప కతఁడె
    వాఁడె వాఁడె వాఁడే వాఁడె వాఁడె వాఁడె
    యెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవ్వఁ డెవఁడొ


    నృవరుల యందు నెన్నగను నిండు మనమ్మునఁ గాంచి చెప్పుమా
    కవివరుఁ డార్య సమ్మతుఁడు కారణ జన్ముఁడు వర్తకుండు వి
    ప్రవరుఁడు దాత హాలికుఁడు పామరుఁ డర్థ విదుండు పండితుం
    డెవఁ డెవఁ డెవ్వఁ డెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవం డెవఁ డెవ్వఁ డెవ్వఁడో

    రిప్లయితొలగించండి
  12. ఎవఁడు జగమ్ములన్నిటికి నేలిక? యెవ్వఁడు సృష్టిచేయు? తా
    నెవఁడు చరాచరమ్ములకు హేలగ రక్షణగూర్చుచుం డతం
    డెవఁడు లయంబొనర్చు తుదకెవ్వఁడు లోకములెల్ల వానిలో
    నెవఁ డెవఁ డెవ్వఁ డెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవం డెవఁ డెవ్వఁ డెవ్వడో!

    రిప్లయితొలగించండి
  13. జగములను సృష్టి యెవ్వండు జరుపుచుండు
    స్థితియు లయముల గూర్చెడునతడెవండు
    ఎవ్వఁ డెవఁ డెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవ్వఁ డెవఁడొ
    మ్రొక్కెద మదినతఁడె నాకు దిక్కటంచు

    రిప్లయితొలగించండి
  14. సమస్య : “ఎవ్వఁ డెవఁ డెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవ్వఁ డెవఁడొ”

    తే. మువ్వల రవళియందెవ్వ, డెవ్వడుండు
    గువ్వ కూకిరవమ్మున, గుండియ లయ
    నెవ్వడు, ప్రణవ నాదమై యెవ్వడలరు,
    పువ్వుల సురభినందెవ్వ, డెవ్వడాడు
    నవ్వులై పసిమోమున నాట్యములను,
    పవ్వళించిన దెవ్వడో పాలకడలి
    నెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవ్వఁ డెవఁడొ
    యట్టి పరమాత్మ నరితి నేనంజలింతు

    భావం:
    మువ్వల సవ్వడిలో ఉన్నది ఎవరో? గువ్వల కూతలలో గుండె లయగా వినిపించేది ఎవరో? ఓంకార నాదమై (ప్రణవ నాదమై) ప్రకాశించేది ఎవరో? పువ్వుల పరిమళంలో నిండి ఉన్నది ఎవరో? పసిపాపల చిరునవ్వులలో నాట్యం చేసేది ఎవరో? పాలకడలిపై పవళించినది ఎవరో? ఆ "ఎవ్వడో.. ఎవ్వడో.. ఎవ్వడో" అయిన అట్టి పరమాత్మకు నేను భక్తితో అంజలి ఘటిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  15. పువు పువులో సుగంధమిడి పొల్పుగ రంగులనద్దు నెవ్వఁడో
    కువకువలందు కుల్కునిడి కోకిల గొంతుక గూర్చు నెవ్వఁడో
    నవనవలాడు జవ్వని ననర్ఘ లతాకృతి దీర్చు నెవ్వఁడో
    యెవఁ డెవఁ డెవ్వఁ డెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవం డెవఁ డెవ్వఁ డెవ్వఁడో

    రిప్లయితొలగించండి
  16. ఎవఁడు జగంబులన్ని సృజియించు నెవండు లయించు లీలగా
    నెవఁడు సమస్తకారకు డనేకము నేకము నొప్పు నీశ్వరుం
    డెవఁడు చరాచరంబుల నతీంద్రియుడై వెలుగొందుచుండు వా
    డెవఁ డెవఁ డెవ్వఁ డెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవం డెవఁ డెవ్వఁ డెవ్వఁడో

    రిప్లయితొలగించండి

  17. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    హితుని జన్మదిన మనుచు నేగుదెంచ
    వచ్చి రెందరో తెలియని వారు నాకు
    నడిగితి పరిచయము చేయమనుచు హితుని
    నెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవఁ డెవ్వఁ డెవ్వఁ డెవడొ?

    రిప్లయితొలగించండి