13, ఫిబ్రవరి 2026, శుక్రవారం

సమస్య - 5381

14-2-2026 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కుల మతమ్ముల భేదముల్ గూర్మిఁ బెంచు”
(లేదా...)
“కుల మత వర్గ భేదములె కూరిమిఁ బెంచును భారతావనిన్”

11 కామెంట్‌లు:

  1. తేటగీతి
    తెల్లవారిని దరిమియు దిట్టలనఁగ
    స్వపరిపాలనా తంత్రము భరతభూమి
    రీతిగన్ సాగుతను, లేవులేవనంగ
    కుల మతమ్ముల భేదముల్, గూర్మిఁ బెంచు

    చంపకమాల
    బలయుతులైన మ్లేచ్ఛులకు బానిసలై మన కుండ దేశ భ
    క్తులగుచు భిన్న రీతులను గూర్చిన పోరున పార ద్రోలియున్
    వెలసిన రాజ్యతంత్రమును విజ్ఞతనల్లుచు లేవులేవనన్
    కుల మత వర్గ భేదములె, కూరిమిఁ బెంచును భారతావనిన్!

    రిప్లయితొలగించండి

  2. అక్కరకు రానివైన కులాంతరముల
    విడిచి యేకోదరులవోలె పేర్మితోడ
    మెలగవలయు జనులికను, తొలగినంత
    కుల మతమ్ముల భేదముల్, గూర్మిఁ బెంచు.


    పలువిధ సాంప్రదాయములు భాషల గల్గిన నాదు దేశమున్
    కులమత భేదమెంచుచును కుచ్చితులై చరియించు వారితో
    పలువురు చెప్పినట్టి హితవాక్యములేమన నంతరించినన్
    గుల మత వర్గ భేదములె, కూరిమిఁ బెంచును భారతావనిన్

    రిప్లయితొలగించండి
  3. దేశ యభివృద్ధి నంతను దిగ్గుబరచు
    కుల మతమ్ముల భేదముల్ ; గూర్మిఁ బెంచు
    జనుల శక్తి , దానివలన స్ఫాతి బడయు
    కలసి మెలసి యుండినపుడె కలుగు సుఖము

    రిప్లయితొలగించండి
  4. తెలివి హెచ్చిన నాయకుల్ తెచ్చినారు
    కుల మతమ్ముల వర్గాల కుటిలనీతి
    సొంత వర్గాన చెలిమికి చింతలేక
    కుల మతమ్ముల భేదముల్ గూర్మిఁ బెంచు

    తెలివిడి హెచ్చినాయకులు తెచ్చిరి చిల్లి సమాజమందునన్
    బలువురు చిక్కిరా వలకు పట్టముగట్టగ మూర్ఖనేతకున్
    దలచిన రీతినిన్ ఫలము దక్కగ కూర్చిన బృందమేర్పడున్
    కుల మత వర్గ భేదములె కూరిమిఁ బెంచును భారతావనిన్

    రిప్లయితొలగించండి
  5. (అభిలషణీయం)

    తే॥ కుల మతమ్ముల భేదముల్ గూర్మిఁ బెంచు
    దేశ భక్తి విడక శ్రమఁ దీరుగనిడి
    స్వంత ధర్మముఁ బాటించి పంత మడఁచి
    పరమత సహనముఁ గనుచు వరలు కతన

    చం॥ కుల మత వర్గ భేదములె కూరిమిఁ బెంచును భారతావనిన్
    దలఁపుల దేశభక్తిఁ గని తత్పరులౌచును రాష్ట్రవృద్ధికై
    యలుపు నెరుంగ కుండ నిజ హార్దము వీడక సాముఁ జేయుచున్
    జలనము స్వంత ధర్మమున సమ్మతితోఁ బర ధర్మ మొప్పినన్

    రాష్ట్ర దేశ సాము శ్రమ

    రిప్లయితొలగించండి
  6. అరయ పరమాత్మ యొక్కడే యవని యంత
    భేదభావాలు మనికి విరోధ మెపుడు
    విమలమౌ యాత్మ యందున వీడి చనగ
    కుల మతమ్ముల భేదముల్, కూర్మిఁ బెంచు!

    రిప్లయితొలగించండి
  7. చెలగుచునుండె నీ భరత సీమను
    మానవులందు నేటికిన్
    కలహములాత్మ హత్యలను కక్షలు
    హింసలకెల్ల హేతు వీ
    కుల మత వర్గ భేదములె, కూరిమి
    బెంచును భారతావనిన్
    చెలిమి సమాన భావనలె, జీవన
    యాత్రకు ముఖ్య సూత్రముల్

    రిప్లయితొలగించండి
  8. సమస్య : “కుల మతమ్ముల భేదముల్ గూర్మిఁ బెంచు”

    గీ. నీకులమని నాకులమని ఆకులపడ
    నేల‌, యీ కులమన్నది కలహ కార
    ణమ్మరయగను, పెమ్మెము నమ్మి‌,‌ విడగ
    *కుల మతమ్ముల భేదముల్ గూర్మిఁ బెంచు*

    రిప్లయితొలగించండి
  9. సర్వ మతముల సారమ్ము సంగ్రహించి
    మంచి పెంచగన్ యత్నించు మనుజు లగుచు
    మాన వత్వము గల్గియు మహిని మరువ
    కుల మత మ్ముల భేద ముల్ కూర్మి బెంచు

    రిప్లయితొలగించండి
  10. కులమతమ్ముల భేదముల్ సెలఁగి నంత
    నంతరించు మనశ్శాంతి సంతతమ్ము
    నిజము నడరి వక్కాణింప నిత్య వీత
    కుల మతమ్ముల భేదముల్ గూర్మిఁ బెంచు


    మెలఁగిరి మిత్ర భావమున మిన్నగ నెల్లరు పూర్వ మక్కటా
    కలియుగ మందు వార కధికమ్ముగ నొండొరు లందు ద్వేషముం
    దలఁపఁగ నేకతా కుల మతమ్ముల మధ్య నిరంతరమ్మునుం,
    గుల మత వర్గ భేదములె, కూరిమిఁ బెంచును భారతావనిన్

    రిప్లయితొలగించండి

  11. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ఐకమత్యముఁ జనులలో నణచివేయు
    కులమతమ్ముల భేదముల్; గూర్మిఁ బెంచు
    కులము ముఖ్యము కాదని గుణమునెంచి
    సఖ్యతగ నుండి మనుజులు సమత పంచ.

    రిప్లయితొలగించండి