3, జులై 2026, శుక్రవారం

సమస్య - 5517

4-7-2026 (శనివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చాలు పూజలనెను శంకరుండు”
(లేదా...)
“చాలిఁకఁ బూజలంచుఁ గడు జాలిగ వేడెను శంకరుం డటన్”

13 కామెంట్‌లు:

  1. గాసినొందకుండ కైపదముల నిడు
    శంకరాభరణము శస్తి నొంద ,
    శంకర గురువులకు సన్మానమిడబోవ
    చాలు పూజలనెను శంకరుండు

    రిప్లయితొలగించండి
  2. ఆటవెలది
    మూఢ భక్తితోడ ముక్కంటి నర్చించి
    కంట రక్తమొలక కంటినిడుచు
    నాపగ నిడ మరొక యక్షిఁ గన్నప్పతో
    చాలు పూజలనెను శంకరుండు

    ఉత్పలమాల
    మూలము శంకరుండనుచు పూనుచుఁ బూజలు మూఢ భక్తితోన్
    లీలగ గాంచి రక్తమును నేత్రమునందు నమర్చనొక్కటిన్
    కోలను దా స్వనేత్రమును గోల్పడి రెండవదెంచ కన్ననిన్
    జాలిఁకఁ బూజలంచుఁ గడు జాలిగ వేడెను శంకరుం డటన్

    రిప్లయితొలగించండి
  3. ఆ॥వె
    తాను తనది యనెడి తగులు నొందని పూజ
    మిడిసిపాటులేని మృష్ట పూజ
    సర్వమప్పగించు సంసేవలే మేటి
    చాలు పూజలనెను శంకరుండు!!


    (మృష్ట: స్వచ్ఛము
    మేటి చాలు: మేటి వరుస)

    రిప్లయితొలగించండి

  4. *(శివుడు మారు రూపములో పార్వతి తో పలికిన మాటలు గా)*

    పరుల జేరుచు ముక్కంటి పలికె నిటుల
    యేల యీ జప తపములు వ్యాల ధారి
    నీకు పతిగా తగడు గాదె నీలవేణి
    చాలు పూజలనెను శంకరుండు.


    వ్యాలమె భూషణమ్ముగ గవాంపతి వాహనమైన వాడు హా
    హాలము దాల్చినట్టి యసమాక్షుని భర్తగ పొందగోరి నీ
    వెల తపించు చుంటివి మహేశుడు నీ సరి తూగడంటి నే
    చాలిఁకఁ బూజలంచుఁ గడు జాలిగ వేడెను శంకరుం డటన్.

    రిప్లయితొలగించండి
  5. తపమొనర్చు హరుని తానుపూజించుచు
    సంతసించుచుండె శైలపుత్రి
    మదనశరము తాకి మనసుచలింపగా
    చాలు పూజలనెను శంకరుండు

    శాలిని దేహమున్ విడువ శంకరుడే తపమాచరించగా
    శైలజ సల్పసాగెనట చక్కని సేవలు పాదపూజలున్
    వాలుగడాలు కంటకము భర్గ్యుని సోకగ శైలపుత్రినే
    చాలిఁకఁ బూజలంచుఁ గడు జాలిగ వేడెను శంకరుం డటన్

    [ వాలుగడాలు = మన్మథుడు; కంటకము = బాణము ]

    రిప్లయితొలగించండి
  6. అర్చనములతోడ నారాటపెట్టకు
    పగటిఱేడు మలిగె పశ్చిమమున
    రేయి గడచిపోయె రేరాజు నిదురించె
    చాలు పూజలనెను శంకరుండు

    రిప్లయితొలగించండి
  7. ఏల మనంబునందునొక యించుకయేనియు భక్తి లేకనీ
    లీల నొనర్ప పూజలను రేయిఁబవల్ కడు భేషజమ్ముగా
    చాలు నొకింతసేపయిన శ్రాంతి నొసంగుము మూర్ఖ మానవా
    చాలిఁకఁ బూజలంచుఁ గడు జాలిగ వేడెను శంకరుం డటన్

    రిప్లయితొలగించండి
  8. భక్తి భావ మునను భవుని పూజ లు సల్ప
    మెఛ్చి నట్లు మదికి స్వచ్చ ముగను
    వరము లిత్తు లెమ్ము వాంఛ ను దెలుపుము
    చాలు పూజ లనెను శంక రుండు

    రిప్లయితొలగించండి
  9. ఆ.వె:"అజ్ఞు నైన నాకు నద్వైత మింతయు
    జిక్క" దనుచు నేను జెప్పు కొనగ
    వినెను కామ కోటి పీఠాథిపతి, "నీకు
    చాలు పూజ"లనెను శంకరుండు
    (కంచి కామ కోటి పీఠాథి యైన శంకరాచార్యుల తో "అద్వైతం నాకు చిక్కటం లేదు అంటే నీ స్థాయికి పూజలు సరైనవే. అవి చాలు" అన్నారు. )


    రిప్లయితొలగించండి
  10. ఆ॥ భక్తి యల్పమొంద వస్తు వాహన ధన
    సంపదలనడుగఁగ నింపుఁ గనుచు
    నార్భటమ్ము విరియ నపహాస్య మిదియని
    చాలు పూజలనెను శంకరుండు

    (కొంతమంది పూజలలో హంగు ఆర్భాటమే కాని భక్తి యుండదు, దానిని దృష్టిలో పెట్టుకొని అండి)

    ఉ॥ హేలగ కాలకూటమని యెంచక మ్రింగఁగ నీశుఁడావిధిన్
    మేలగు క్షేమమెంచి సతి మేటిగఁ బూజల యందు మగ్నమై
    తాలుచ గొప్పగా విషము దాఁచుచుఁ గంఠము నందు వెంటనే
    చాలిఁకఁ బూజలంచుఁ గడు జాలిగ వేడెను శంకరుండటన్

    (విషము మ్రింగి కంఠములో దాచుటలో కలిగిన అలసట వలన నెమ్మదిగా పార్వతితో ఇక పూజలు మానమని చెప్పినాడని అండి. అప్పుడు మరి పూజలు మాని భర్తను గమనించుకోవాలి కదండి)

    రిప్లయితొలగించండి
  11. డెందమునఁ గపటమునకు సందు నీని
    స్వచ్ఛ మైనట్టి సద్భక్తి సమ్మతమ్ము
    మేలి ముదము నొసఁగు నాకుఁ జాలు నయ్య
    చాలు పూజ లనెను శంకరుండు వినవె

    [చాలు = వరుస]


    మూలము పూర్వ కర్మ తతి భోజన వేళ యతిక్రమింపఁగా
    వాలిన నీరసమ్మున నపారపు టాఁకలి కాగ లేక పోఁ
    గాలము దాపురింప నరకాంతుఁ డొకండు త్రినేత్ర నాముఁడే
    చాలిఁకఁ బూజలంచుఁ గడు జాలిగ వేడెను శంకరుం డటన్

    రిప్లయితొలగించండి
  12. ఉ:వేలకు వేలు సొమ్ములను బెట్టుక యాత్రలు చేయ మధ్య లో
    కాలము మారి దేహమును క్రమ్మగ దగ్గును,నొళ్లు నొప్పులున్
    మేలగు నేవొ పూజలని మిక్కిలి శ్రీమతి కోర జాలు లే
    చాలిఁకఁ బూజలంచుఁ గడు జాలిగ వేడెను శంకరుం డటన్”
    (కంది శంకరయ్య గారి యాత్రా సమస్యల గూర్చి. )

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    బిల్వ దళము తోడ విధిగ పూజలు చేసి
    కంటికి రుధిరమ్ము కారుచుండ
    కన్ను పెరికి తాను తిన్నడివ్వగ బోవ
    చాలు పూజ లనెను శంకరుండు.

    రిప్లయితొలగించండి