8, జులై 2026, బుధవారం

సమస్య - 5522

9-7-2026 (గురువారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కాముఁడు పార్వతిని భార్యగాఁ గైకొనియెన్”
(లేదా...)
“కాముఁడు పార్వతీసతినిఁ గైకొనియెన్ దన ధర్మపత్నిగన్”

15 కామెంట్‌లు:

  1. కందం
    భామనపర్ణను ద్ర్యక్షుఁడు
    ప్రేమగఁ గొని సుతునొసంగ ప్రియమన సురలున్
    సేమమసురు వధయని స
    త్కాముఁడు పార్వతిని భార్యగాఁ గైకొనియెన్

    ఉత్పలమాల
    భామనపర్ణఁ గానక తపమ్మొనరించెడు నాదిశంకరున్,
    గాముని బూన్చి దేవతలుఁ గౌరిని జేకొని పుత్రునిమ్మనన్
    సేమమొసంగు తారకుని జీరిన యంచును నొప్పె శూలి స
    త్కాముఁడు పార్వతీసతినిఁ గైకొనియెన్ దన ధర్మపత్నిగన్

    రిప్లయితొలగించండి

  2. సోముని దలపై దాల్చుచు
    కామల లోన జరియించు గరళ గళుండా
    కామారి యైన యా ని
    ష్కాముఁడు పార్వతిని భార్యగాఁ గైకొనియెన్.


    పామది భూషణమ్ముగను భస్మమె లేపన మౌచు నిత్యమున్
    కామల లోజరించు గళకమ్మున క్షేళము జూట మందునన్
    సోముని పాణి యందున త్రిశూలము దాల్చిన యస్థి మాలి ని
    ష్కాముఁడు పార్వతీసతినిఁ గైకొనియెన్ దన ధర్మపత్నిగన్.

    రిప్లయితొలగించండి
  3. సోముని తపమును జెరుపెను
    కాముఁడు ; పార్వతిని భార్యగాఁ గైకొనియెన్
    కాముని దహనము సలుపుచు ,
    యేమాత్రము తన యగవున కెరియుట లేకన్

    రిప్లయితొలగించండి
  4. నీమముతోడ నచలజ త్రి
    ధాముని సేవలొనరింప తలిరువిలుతుడే
    పూముల్కిని గొట్టగ ని
    ష్కాముఁడు పార్వతిని భార్యగాఁ గైకొనియెన్

    నీమము తోడ శైలసుత నిత్యము సేవలు సల్పుచుండగా
    కామునిఁ బంపిరా సురలు కాగల కార్యము నిర్వహింపగా
    కాముని పుష్పఘాతమునఁ గంపితుడైన త్రిలోచనుండు, ని
    ష్కాముఁడు, పార్వతీసతినిఁ గైకొనియెన్ దన ధర్మపత్నిగన్

    రిప్లయితొలగించండి
  5. కం॥
    కాముడు గనువెచ్చఁగమరి
    బామున రతికుందువొంద బాఢపు కరుణన్
    కామునిలిపిన హరుడు, ని
    ష్కాముఁడు,పార్వతిని భార్యగాఁ గైకొనియెన్!

    రిప్లయితొలగించండి
  6. కం:ప్రేమ రుచి జూపి నంతట
    కాముఁడు, పార్వతిని భార్యగాఁ గైకొనియెన్
    గాముని దగ్ధము జేసె ని
    దేమి వరుస ఫాలనేత్రు నే మన వలయున్?
    (సిరివెన్నెల సీతా రామ శాస్త్రి పాట లో అడిగిన ప్రశ్న. )

    రిప్లయితొలగించండి
  7. ఉ:ఆ మునివృత్తి నున్న శివు నందున బ్రేమ రగుల్చ జక్కగా
    కాముఁడు ,పార్వతీసతినిఁ గైకొనియెన్ దన ధర్మపత్నిగన్”
    నీమము వీడి శంకరుడు,నీతి యదేమియొ! పెండ్లి పెద్ద యౌ
    కాముని సంహరించె దన కంటి మహాగ్నుల తోడ రుద్రుడై.

    రిప్లయితొలగించండి
  8. ఉ॥ ప్రేమము మీర హైమవతి పెండిలి యాడఁగఁ గోరి వేడఁగన్
    భామకు సమ్మతిన్ దెలిపి భద్రతఁ బొందఁగ వేల్పులెల్లరున్
    క్షేమము మీర విశ్వమును శ్రేయముఁ గాంచఁగ శంకరుండు ని
    ష్కాముఁడు పార్వతీ సతిని గైకొనియెన్ దన ధర్మపత్నిగన్

    (తారకాసురుడు చావాలంటే మరి శంకరుని పుత్రుడు కావాలి కదండి. అది వేల్పులకు రక్ష విశ్వహితము, కుమారసంభవములో పార్వతి చెలియ ద్వారా కోరిన తరువాత పెండ్లి చేసుకుంటాడు కదండి)

    రిప్లయితొలగించండి
  9. ఆ మరునిన్ గెలిపింపఁగ
    వామాక్షిని నీశ్వరుండు, ఫలిత నిజ మహా
    కాముఁడు దగ్ధం బైనను
    గాముఁడు, పార్వతిని భార్యగాఁ గైకొనియెన్


    లేమ తపః ఫలం బది గరీయ మనన్యము నాగభూషణుం
    డేమఱ కుండఁ గోరఁగ నగేంద్రుఁ డొసంగిన స్వీయ సమ్మతిన్
    భీమ రుషా ప్రచోదిత సు భీకర ఫాల విలోచన జ్వల
    త్కాముఁడు పార్వతీ సతినిఁ గైకొనియెం దన ధర్మపత్నిగన్

    రిప్లయితొలగించండి
  10. క్రమాలాంకారంలో --
    తామసు డె వ్వ డు మడిసె ను?
    నీమము వీడియు శివుండు నిశ్చ లము గ దా
    నే మొ నరించె ను గదరా!
    కాముడు :: పార్వతిని భార్య గా గైకొని యెన్

    రిప్లయితొలగించండి

  11. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    సోముడు తపమున నుండగ
    భామను కలుపంగ జూచి భర్గుని తోడన్
    సోముని ప్రేరణ చేయగ
    కాముడు;పార్వతిని భార్యగాఁ గైకొనియెన్.

    నిన్నటి పూరణము...మొదటి పాదం సవరణతో....

    నక్తంచరుని తపము గని
    భక్తుడు భస్మాసరునకు వరమీయ భవున్
    యుక్తిగ శివు వెంట పడెను
    భక్తునిచే భంగపడెను భర్గుడుఁ గాశిన్.

    రిప్లయితొలగించండి