30, నవంబర్ 2024, శనివారం

సమస్య - 4958

1-12-2024 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వారమునకు మూడు వచ్చె భానుని దినముల్”
(లేదా...)
“వారములోన వచ్చె రవివారము మిత్రమ మూడుమార్లుగన్”

17 కామెంట్‌లు:

  1. కారణమదివర్షంబే
    చేరెనురెండునుశలవులు చిత్రంబేగా
    తీరెను కోరిక మనకిక
    వారమునకు మూడువచ్చెభానుని దిినముల్

    రిప్లయితొలగించండి
  2. కందం
    నేరిచితె సెలవనగ రవి
    వారమటులనుండు ననుచు పరవశమొందన్
    తీరుము సంక్రాంతి కటులె
    వారమునకు మూడు వచ్చె భానుని దినముల్!

    ఉత్పలమాల
    నేరిచితే! విరామమన నీదగు దృష్టిని నాదివారమన్
    దీరుగ నెంచుటల్, వినుమ! దెల్పెద పొంగటి పండుగన్ననే
    దీరగవచ్చు నిష్క్రియల తీయగ మెక్కుచు మూడు సార్లు నా
    వారములోన వచ్చె రవివారము మిత్రమ మూడుమార్లుగన్

    రిప్లయితొలగించండి
  3. వారము‌న రవిపయిన కై
    వారమునకు మూడు వచ్చె భానుని దినముల్
    నేరముగద యటుల సలుప ,
    ఈరకపు పొగడ్తలు వలదెవ్వరి కైనన్

    రిప్లయితొలగించండి

  4. ఊరికి పోయెద ననుచు ప
    సారును మూసి సెలవిచ్చె సాలకరుల కు
    ద్ధారకుడు మూడునాళ్ళదొ
    వారమునకు మూడు వచ్చె భానుని దినముల్.


    కోరిన నేమిరా సెలవు కూడదటంచు తిరస్కరించె డు
    ద్ధారకు డాలికోరగ సదాగతి కోసము కాశికేగ నా
    వారిని మూడుఘస్రములు వైచె ముదమ్మది నాకు గాంచగా
    వారములోన వచ్చె రవివారము మిత్రమ మూడుమార్లుగన్.

    రిప్లయితొలగించండి
  5. కోరిన యాత్రల కొరకై
    వారికి లభియించె విరతి పక్షపు దినముల్
    తీరుగ గణించి చూడగ
    వారమునకు మూడు వచ్చె భానుని దినముల్

    వారలుపక్రమించె రవివారము నాడొక యాత్ర పైన న
    వ్వారికి లభ్యమయ్యెనట పక్షము రోజులు పర్యటించగా
    వారి విరామమందు రవివారములెన్నని లెక్క చూడగా
    వారములోన వచ్చె రవివారము మిత్రమ మూడుమార్లుగన్

    [వారము = సమయము]

    రిప్లయితొలగించండి
  6. కం:కైవారము రాజా రా
    వే విధి సవ్యముగ జేయ డిరువది నాళ్లే
    తా వెడలెను పనికిన్ కై
    వారమునకు మూడు వచ్చె భానుని దినముల్”
    (కైవారం అనే ఇంటి పేరు ఉంది.కైవారం రాజా రావు ఇరవై రోజులే ఉద్యోగం చేసాడు.వాడి ఉద్యోగం లో మూడు ఆది వారాలే వచ్చాయి.)

    రిప్లయితొలగించండి
  7. కం॥ జోరుగ విరియఁగఁ బనులును
    భారము నొత్తిడి పెరుఁగఁగ బ్రదుకున వరమై
    నేరుగ మూడు విడుపులన
    వారమునకు మూడు వచ్చె భానుని దినముల్

    ఉ॥ భారము హెచ్చి యొత్తిడిని వారము వారముఁ గష్టమొందఁగన్
    నేరుగ మూడు వాశ్రములు నెమ్మదిఁ గాంచ విరామమైనచో
    హోరుగ సంబరమ్ములకు యోగ్యతఁ బొందఁగఁ దెల్పిరెల్లరున్
    వారములోన వచ్చె రవివారము మిత్రమ మూడుమార్లుగన్

    వాశ్రము దినము నిఘంటువు సహాయమండి

    రిప్లయితొలగించండి
  8. ఉ:వారికి వీరికిన్ పనులు వచ్చుట నూర్లకు పోగ సాధువౌ
    నీ రవికిన్ దగుల్కొనియె నిందరి వంతులు కర్మ మూడుటన్
    తీరిక లేక వీని కొక తిప్పలు వచ్చెను కార్య శాలలో
    వారములోన వచ్చె రవివారము మిత్రమ మూడుమార్లుగన్
    (వారము అంటే వంతు అనేది అర్థం. ఇతరులు సెలవుల వలన రవి కి వారం లో మూడు సార్లు వంతు వచ్చింది.)

    రిప్లయితొలగించండి
  9. తీరం దాటెడు తుఫాను
    తో రపు మబ్బులను గ్రమ్మి దుర్ది న ము లయె న్
    కార ణ మది యై కలి గెను
    వారమునకు మూడు వ చ్చె భానుని దినముల్

    రిప్లయితొలగించండి
  10. తారా పథ మంట ముదము
    ధారాళముగ వెనువెంటఁ దనరి చరింపం
    గోరక యే యాతని పరి
    వారమునకు మూడు వచ్చె భానుని దినముల్


    భారము మిక్కుటం బయిన వారక వచ్చెను రాత్రి గోపనం
    బారయ భాగ్య హీనునకు నక్కట దుర్విధి నెన్న శక్యమే
    యేరికి రాని భంగి మనుజేంద్రుని యానతి నబ్బరమ్ముగన్
    వారము లోన వచ్చె రవి వారము మిత్రమ మూడు మార్లుగన్

    [రవి వారము = రవి తడవ]

    రిప్లయితొలగించండి

  11. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    వారమున సెలవొకటె రవి
    వారము;మూడగు దినములు వచ్చెను
    సెలవుల్
    కారణమేమైనను నా
    వారమునకు మూడు వచ్చె, భానుని
    దినముల్.

    రిప్లయితొలగించండి
  12. తీరుగ పండుగ సెలవులు
    వారమునకుమూడువచ్చె,భానుని దినముల్
    నేరుగ తాకని యట్టుల
    తీరికగా గడుప వీలు దేహికి కలిగెన్

    రిప్లయితొలగించండి
  13. కం. వారములేడింటను రవి
    వారమునాడే లభించు వ్యవధానము యె
    వ్వారలనిరి తమతోనిటు
    వారమునకు మూడు వచ్చె భానుని దినముల్?

    ఉ. వారమునందు నుండుగద వాశ్రములేడు గణించి చూడగన్
    వారమునందు వచ్చు రవి వారమదొక్క దినంబుకాదొకో
    వారక నీవిటుల్ పలుకవచ్చునె వెంగలివోలె నెవ్విధిన్
    వారములోన వచ్చె రవివారము మిత్రమ మూడుమార్లుగన్?

    రిప్లయితొలగించండి