7, జనవరి 2022, శుక్రవారం

సమస్య - 3954

 7-1-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సుదతీ నీ ముఖమునందు సూర్యుం డాడెన్”
(లేదా...)
“సుదతీ నీ ముఖమందు నాడెను గదా సూర్యుం డమోఘద్యుతిన్”

25 కామెంట్‌లు:

  1. వదనాంభోజమునందునుగ్రత కరంబందున్ కలంబంబుతో
    కదనంబందున నిచ్చ కన్నుల యహంకారంబు నుత్కర్షమై
    చెదరన్ వైరి మనంపుధీమసమువాజిన్ గూర్చు చున్నావహో!
    సుదతీ నీముఖమందు నాడెను గదా సూర్యుం డమోఘద్యుతిన్

    రిప్లయితొలగించండి
  2. వదనమునందావేశము
    కదనమునకు కాలుదువ్వు కాఠిన్యంబున్
    పదఁపడి నీ శౌర్యముఁగన
    సుదతీ నీ ముఖమునందు సూర్యుండాడెన్

    రిప్లయితొలగించండి
  3. శ్రీకృష్ణపరమాత్మ సత్యభామతో....

    కందం
    ముదమారఁ జిందు వెన్నెల
    వదనంబది చందమామ పగిదిని సత్యా!
    కదనమునఁ గూల్చ నరకుని
    సుదతీ! నీ ముఖమునందు సూర్యుం డాడెన్!

    మత్తేభవిక్రీడితము
    ముదమారన్ జిగి వెన్నెలల్ గురిసెడున్ బూర్ణంపు జాబిల్లిగన్
    వదనంబెంతగ ముద్దుగొల్పు సఖియా! వర్ణింప సాధ్యమ్మొకో?
    యదియే యా నరకున్ వధించు ననిలో నంగారమున్ జిందుచున్
    సుదతీ! నీ ముఖమందు నాడెను గదా సూర్యుం డమోఘద్యుతిన్!

    రిప్లయితొలగించండి
  4. బెదరని శౌర్యము గల్గియు
    పదుగురు మెచ్చె డి కర ణిని పటుతర శక్తిన్
    కడనంబున జూ పెద వో
    సుదతీ ! నీ ముఖము నందు సూ ర్యుo డాడెన్
    సత్యను ప్రశంశి స్తూ కృష్ణు ని మాటలు ---

    రిప్లయితొలగించండి
  5. మత్తేభము:
    ముదితల్ వీధికి వచ్చినంత వెనుకన్ మూకల్ శివాలెత్తుచున్
    కదిలే బస్సుల వెంబడించి రభసన్ గావించు రౌడీ లకున్
    చెదలన్ దుల్పిన రీతి లాఠి ఝళిపించే నాడ సింగమ్ము వౌ
    “సుదతీ! నీ ముఖమందు నాడెను గదా సూర్యుం డమోఘద్యుతిన్”
    --కటకం వేంకటరామశర్మ.

    రిప్లయితొలగించండి
  6. పదిలమగు కేశపాశము
    ముదిరిన శైవాలమనియు ముద్దును గొలిపే
    వదనము కమలంబనుకొని
    సుదతీ!నీ ముఖమునందు సూర్యుండాడెన్.

    ఇది లావణ్య సరోవరంబు,పులినంబేయౌ
    నితంబంబు,గొ
    ప్పదియౌ కొప్పగు శైవలంబుఁగన నాహా!బాహువుల్
    తూడులౌ
    వదనంబే జలజంబునౌననుచు తాన్ వాంఛించి
    క్రొందేనెలన్
    “సుదతీ!నీముఖమందు నాడెను గదా!సూర్యుండమోఘద్యుతిన్।

    రిప్లయితొలగించండి
  7. క్రొవ్విడి వెంకట రాజారావు, ఉడ్బర్రీ, అమెరికా:

    మదమెక్కిన శూర్పణఖను
    పదునుగ గను సీత తోడ పతి రాముడనెన్
    ఉదుటెక్కిన కోపముతో
    సుదతీ! నీ ముఖము నందు సూర్యుండాడెన్.

    రిప్లయితొలగించండి
  8. కె.వి.యస్. లక్ష్మి, ఉడ్బర్రీ, అమెరికా:

    వదనం బంబర మటులన్
    అదమిన సింధూర కాంతి నలరుచు నుండన్
    ఉదయపు అరుణిమ సొబగున
    సుదతీ! నీ ముఖమునందు సూర్యుండాడెన్.

    రిప్లయితొలగించండి
  9. ముదమారన్ వనసీమలో తిరుగుచున్ పూబోడి, శీఘ్రమ్ము నా
    మదినే దోచితివీవు నీవిడిన సమ్మానమ్మునిల్చుండు నా
    హృదయమ్మందున సంతతమ్ము నల శోభించంగ నీబొట్టు వో
    సుదతీ నీ ముఖమందు నాడెను గదా సూర్యుం డమోఘద్యుతిన్

    రిప్లయితొలగించండి
  10. ముదమున వచించు చుండగ
    కదలాడెడి నీదుమోము గాంచిన వేళన్
    నుదుటన యెఱ్ఱని కుంకుమ ,
    సుదతీ నీ ముఖమునందు సూర్యుం డాడెన్

    రిప్లయితొలగించండి
  11. క్రొవ్విడి వెంకట రాజారావు,ఉడ్బర్రీ, అమెరికా:

    మదమున్ గూడిన యంతరంగమున కామాధిక్యమౌ మాటలన్
    వదరుంబోతువలెన్ వచించెడిదియౌ పౌలస్త్యు కూతున్ గనన్
    పదునయ్యెన్ దృశ సీతకిప్పుడనుచున్ ప్రాజ్ఞుండు రాముండనెన్
    సుదతీ! నీ ముఖమందు నాడెను గదా సూర్యుం డమోఘద్యుతిన్.

    రిప్లయితొలగించండి
  12. ఉదయపు సూర్యుని వేడికి
    వదనము వేకంది పోయి వాడగ ముఖమున్
    వదినది చూచి పలికెనిటు
    సుదతీ నీముఖమునందు సూర్యుండాడెన్

    రిప్లయితొలగించండి
  13. కం:వదనము చంద్రుని బోలుట
    ముదితల యెడ సాజ మౌను ,మోదరహిత వై
    వదనము మాడ్చెద వేలన్?
    సుదతీ!నీ ముఖము నందు సూర్యుం డాడెన్

    రిప్లయితొలగించండి
  14. సదమల చిత్తా! కిన్కను
    వదనం బరుణంబుఁ దాల్ప భయ మొదవంగన్
    బెదరుచు నుండిరి యెల్లరు
    సుదతీ నీ ముఖము నందు సూర్యుం డాడెన్


    చదలన్వెల్గెడు సూర్య బింబము సహస్రద్యుత్తునే మ్రింగఁగా
    విది తాఖండ జలౌఘ భాసిత మహావృత్తంబ! సన్మంగళ
    ప్రద! నిత్యోచిత నిర్మలోదక నదీ రత్నంబ! గోదావరీ!
    సుదతీ నీ ముఖ మందు నాడెను గదా సూర్యుం డమోఘద్యుతిన్

    రిప్లయితొలగించండి
  15. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  16. మత్తేభవిక్రీడితము
    కదనోత్సాహ మనోరథంబు హృది నాక్రాంతించ సాత్రాజితిన్
    బెదిరింపుల్ సడి జేయకన్ మహిసుతున్ భీతావహున్ జేయుచున్
    ముదితామర్షముచే శిలీముఖములన్ ముంచేయ, కృష్ణుండనెన్
    సుదతీ నీ ముఖమందు నాడెను గదా సూర్యుండమోఘద్యుతిన్.
    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటర్.

    రిప్లయితొలగించండి
  17. ఉదయంబందలి సూర్యకాంతులవి యచ్చోటన్ సరాగంబుతో
    వదనంబందున గందగామిగుల యాఫాలంబు ద్యోతించగా
    వదినౌ భారతి పల్కెనిట్లుగను నోవయ్యారి భామామణీ!
    సుదతీ నీముఖమందు నాడెనుగదా సూర్యుండమోఘద్యుతిన్

    రిప్లయితొలగించండి

  18. వదనము సుందర మైనను
    పొదవెను హుంకృతిని ౙాల బుగులు కొనంగన్
    కదనోత్సాహం బందున
    సుదతీ! నీ ముఖమునందు సూర్యుం డాడెన్!

    రిప్లయితొలగించండి
  19. మ:వదన మ్మందున నవ్వు జూచి కవి తా వర్ణించె భార్యామణిన్
    సుదతీ!నీ ముఖచంద్రబింబము సదా చూడంగ నే గోరెదన్
    వదనమ్మందు చిరాకు జూప నతడే వర్ణించె హాస్యమ్ముతో
    *సుదతీ!నీముఖమందు నాడెనుగదాసూర్యుం డమోఘద్యుతిన్*
    (కించిత్ భేద సామ్యం)

    రిప్లయితొలగించండి
  20. వదనంబభ్రపథంబనంగ నట నబ్దంబుల్ గనన్ ముంగురుల్
    కుదురౌ నాసిక చంపకంబు చిగురాకుల్ స్నిగ్ధ బింబోష్ఠముల్
    సుదతీ నీ ముఖమందు నాడెను గదా సూర్యుం డమోఘద్యుతిన్
    నుదుటన్ కుంకుమ చుక్కగా వెలుగ గన్నుల్ విచ్చెనబ్జంబులై

    రిప్లయితొలగించండి