15, ఆగస్టు 2023, మంగళవారం

సమస్య - 4504

16-8-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ప్రవచనకర్తలు నటింత్రు భక్తవరులుగన్”
(లేదా...)
“ప్రవచనకర్త లెల్లరును భక్తులుగా నటియించువారలే”
(మొన్న శ్రీకాకుళం శతావధానంలో బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి నేనిచ్చిన సమస్య)

13 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. కవిపండితులై కొందరు
    వివరింతురు గ్రంధములను వినయము తోడన్
    అవి యెరుక లేని కొందరు
    ప్రవచనకర్తలు నటింత్రు భక్తవరులుగన్

    రిప్లయితొలగించండి
  3. అవనిని భూరి ద్రవిణమున్
    శ్రవమును పొందదలచెడు దురాశగలిగి భా
    గవతకథలు చెప్పునట్టి కాపురుషుండ్రా
    ప్రవచనకర్తలు నటింత్రు భక్తవరులుగన్.



    ద్రవిణము నివ్వకున్న సభ దాపున కైనను బోనివారలీ
    యవనిని మేటిగా యశము నార్థిక పుష్ఠిని బొందగోరి భా
    గవతపు శ్లోక పద్యముల గద్యములన్ వచి యించు నట్టి యా
    ప్రవచనకర్త లెల్లరును భక్తులుగా నటియించువారలే.

    రిప్లయితొలగించండి
  4. వివరింతు. పురాణ ములను
    ప్రవిమల వ్యాఖ్యాన సహిత ప్రాముఖ్య ములన్
    సువిధ పు రీతి నని కపట
    ప్రవచ న కర్తలు నటింత్రు భక్త వరులు గన్

    రిప్లయితొలగించండి
  5. నవముగ జనులకు విష్ణుని
    యవతారమువృష్ణి లీలలన్నియు జెప్పన్
    అవసరమయిన సమయముల
    ప్రవచనకర్తలు నటింత్రు భక్తవరులుగన్

    రిప్లయితొలగించండి
  6. కందం
    ఎవరెంత విన్న దాని న
    నవరతమవసరమనంగ నడుచు కొనఁ దగున్
    భువిఁ బెక్కురు, వినఁ జెప్పఁగఁ
    బ్రవచనకర్తలు, నటింత్రు భక్తవరులుగన్!

    చంపకమాల
    ఎవరెవరెంత విన్నఁ దగ నెంచుచు మంచినినాచరింపగన్
    స్తవనము లొందరే నడత సద్గమణంబున సాగిపోవుచున్
    భువనమునందు సాత్వికుల ముందర వంచకులుండి, జెప్పఁగన్
    బ్రవచన కర్త, లెల్లరును భక్తులుగా నటియించు వారలే!

    రిప్లయితొలగించండి
  7. చం.

    ప్రవరునికందమెక్కడిది? ప్రాముడు, పామరులన్వవేక్షయే
    కవనములల్లసాని కవి కష్టముతోడ రచించెడిన్, స్మృతుల్
    *ప్రవచనకర్త లెల్లరును భక్తులుగా నటియించువారలే*
    భువనమునందు మూర్ఖులను బూతులు, నాస్తిక వాదముల్, వెతల్.

    రిప్లయితొలగించండి
  8. భవభయనాశనమ్మునకు, భక్తి ప్రపత్తులు పాదుగొల్పగన్
    వివిధములైన గ్రంథముల వేమరు నధ్యయనమ్ము సేయునా
    ప్రవిమల సాధువర్తనులు పావనమూర్తులుగాదె! యెవ్విధిన్
    ప్రవచనకర్త లెల్లరును భక్తులుగా నటియించువారలే?

    రిప్లయితొలగించండి
  9. ప్రవచనకర్తల పలుకులు
    కవియించవలెనన భక్తి కనిపించవలెన్
    వివిధములగు మార్గంబుల
    ప్రవచనకర్తలు నటింత్రు భక్తవరులుగన్

    ప్రవచనకర్తలే మిగుల భక్తిని చూపక బోధచేసినన్
    జెవులకుచేరునా యనుచు చెప్పెడి మాటలు నెమ్మిగూర్చగా
    నవసరమైన చందమున హాయిగ భక్తిని చూపువారలే
    ప్రవచనకర్త లెల్లరును భక్తులుగా నటియించువారలే

    రిప్లయితొలగించండి
  10. భవభయముల హరియించఁగ
    శ్రవణము సలుపంగ దగును ప్రవచనముల నా
    ప్రవరుల నిట్లనదగునా
    ప్రవచనకర్తలు నటింత్రు భక్తవరులుగన్?

    రిప్లయితొలగించండి
  11. కం॥ వివరణఁ జేతురు మార్గము
    భవమున బాధలు తొలగఁగ భక్తినిఁ బెంచన్
    భువిలో ననఁగను దగునా
    ప్రవచన కర్తలు నటింత్రు భక్తవరులుగన్

    చం॥ భవమున భక్తి భావమును వర్ధిలఁ జేయుచు మానవాళికిన్
    వివరణ తోడ బోధనలు విజ్ఞతఁ బెంచఁగఁ జేయు చుండు నా
    ప్రవచన కర్త లెల్లరును భక్తి ప్రపత్తులు నమ్మ కున్నచో
    ప్రవచన కర్త లెల్లరును భక్తులుగా నటియించు వారలే

    బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి బెంగుళూరు శతావధానములో (జులై 28-30) నేను పృచ్ఛకుడుగా వెళ్ళానండి.

    రిప్లయితొలగించండి
  12. అవని తలంబునందుగల యాగడ
    కాండ్రుల సక్కదిద్దియున్
    సవినయ మార్గమందునను సాగగ
    వారికి బోధజేతురీ
    ప్రవచన కర్త లెల్లరును , భక్తులుగా
    నటియించు భక్తులే
    యవగుణ మూఢులై మిగుల
    యజ్ఞతతో జెడిపోదురిద్ధరన్

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    అవసర మేమిటి?యెందుకు...
    ప్రవచన కర్తలు నటింత్రు భక్తవరులుగన్?
    ఎవరో స్వార్ధము కొఱకై
    అవనిఁ ప్రచారమొనరించె నక్కసు తోడన్.

    రిప్లయితొలగించండి