11, అక్టోబర్ 2024, శుక్రవారం

సమస్య - 4909

12-10-2024 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“స్వస్తి భర్తకుం బలుకుట సాధ్వికొప్పు”

(లేదా...)

“సరి యననొప్పు భర్తకును స్వస్తి వచించుట సాధ్వి కియ్యెడన్”

(ఆశావాది ప్రకాశరావు గారు పూరించిన సమస్య)

14 కామెంట్‌లు:

  1. శ్రీతనికెళ్ల భరణి గారు దర్శకత్వము వహించిన మిథునం చిత్రం నేపథ్యంలో...


    తేటగీతి
    సకలము సమకూర్చ సతిగ సాగు బ్రతుకు
    చిన్నకష్టమైన భరింపఁ జేత గాక
    తనువు చాలింప సతికోరుకొనిన విధము
    స్వస్తి భర్తకుం బలుకుట సాధ్వికొప్పు!

    చంపకమాల
    నిరతము సర్వమున్ సతిగ నీరజ లోచన కూర్చ భర్తకున్
    దొరలును జీవనమ్ము తనె దూరమునైన భరింప లేడనన్
    మరణము సంభవింప సతి మాధవుఁ గోరినయట్లు ముందుగన్
    సరి యననొప్పు భర్తకును స్వస్తి వచించుట సాధ్వి కియ్యెడన్!

    రిప్లయితొలగించండి

  2. కృష్ణ సోదరిన్ బెండ్లాడి క్రీడి రాగ
    దంపతులను దీవించగ ద్రౌపది యట
    బాధ మరచుచు చూపించి ప్రశ్రయమును
    స్వస్తి భర్తకుం బలుకుట సాధ్వికొప్పు.


    తరుణి సుభద్రకోసమని తాపసి వేషము నందు ద్వారకా
    పురమున కేగుదెంచి వ్రజ మోహను సోదరి బెండ్లియాడి వా
    రిరువురు చెంతజేరుతరి యింతియయోనిజ ప్రశ్రయమ్మునన్
    సరి యననొప్పు భర్తకును స్వస్తి వచించుట సాధ్వి కియ్యెడన్.

    రిప్లయితొలగించండి
  3. తే॥ అడుగడుగునఁ దోడుగనుండి యనవరతము
    బ్రదుకు పయనమున మురిసి పరఁగుచుండ
    స్వస్తి భర్తకుం బలుకుట సాధ్వికొప్పు
    భర్త పడయ పదోన్నతి బహు ముదముగ

    చం॥ మరువక బాధ్యలన్నిటను మానిని తోడుగ నుండి సర్వదా
    వరలుచు మోదమందఁగను భావము రావము నేకమై యటుల్
    సరి యననొప్పు భర్తకును స్వస్తివచించుట సాధ్వి కియ్యెడన్
    బరిపరి సంతసంబుగను భర్త పదోన్నతిఁ బొంద వేడ్కతో

    స్వస్తి శుభము స్వస్తివాచకము అభినందన నిఘంటువు సహాయమండి.

    రిప్లయితొలగించండి
  4. గేస్తురాలికెపుడు దన గృహినిబట్టి
    పస్తుల దొరయించుట పరిపాటి , కాని
    మస్తుగ నగలనిడగనె మరుదినమున
    స్వస్తి భర్తకుంబలుకుట సాధ్వికొప్పు

    రిప్లయితొలగించండి
  5. సమర మాసన్నమైనచో సంభ్రమమున
    వీర తిలకము దిద్దుచు హారతిచ్చి
    యుద్ధ రంగము చేరగ సిద్ధ పఱచి
    స్వస్తి భర్తకుం బలుకుట సాధ్వికొప్పు

    పరిణతి నొందిభార్య తన భర్తకు రక్తపు తిల్కమద్దుచున్
    స్వరమున ధైర్యముట్టిపడ భండన మందున నుండబోరు నీ
    సరి యననొప్పు భర్తకును స్వస్తి వచించుట సాధ్వి కియ్యెడన్
    బరువడియే గదా కొసరి భర్తను పోరుకుఁ బంపుచుండగా

    [స్వస్తి = శుభము; కొసరి = కోరి]

    రిప్లయితొలగించండి
  6. అభము శుభములు దెలియని యబల నొసగి
    మనువు నొనరించి పంపగా మగువ కపుడు
    మగని నైజము నెరిగియు మండి పడుచు
    స్వస్తి భర్టకుం బలుకుట సాద్వి కొప్పు

    రిప్లయితొలగించండి
  7. భర్తమాయనెఱుంగనివాఁడు తనదు
    భార్యనెడబాసి క్షణమైన బ్రతుకలేడు
    తాను కనుమూసి మరణించు తరుణమందు
    స్వస్తి భర్తకుం బలుకుట సాధ్వికొప్పు

    రిప్లయితొలగించండి
  8. ఎరుఁగడు లౌక్యమెప్పుడత డేమరుపాటుననుండు, నిచ్చలున్
    తరుణియె తోడుగానిలచి తద్దయు గాచుచునుండు నంతటన్
    పురుషునినొంటిగా విడచిపోవు పరిస్థితి దాపురించగన్
    సరి యననొప్పు భర్తకును స్వస్తి వచించుట సాధ్వి కియ్యెడన్

    రిప్లయితొలగించండి
  9. తే.గీ:ఎచటి కేగుచుండిన తానె యెదురు వచ్చి
    స్వస్తి భర్తకుం బలుకుట, సాధ్వికొప్పు
    నిండు నట్లు భర్తయు పూల చెండు తెచ్చు
    ముచ్చటలు వారి దాంపత్యమున వెలుంగు.
    (స్వస్తి పలకట మంటే కొందరు విడిచి పెట్టటం అనే అర్థం తెచ్చారు కానీ స్వస్తి పలకటం అంటే శుభం కోరటం.ఆమెకి కొప్పు నిండా పూలు తెస్తాడు)

    రిప్లయితొలగించండి
  10. చం:"సరి యొక రుందురే రుచుల జక్కగ దెచ్చుట యందు నీ!"కనన్
    "సరిపడె నేయి,కిస్మిసును,చక్కెర,కమ్మని జీడిపప్పు తో
    సరి యగు వేపు వచ్చి,యిక చాలనిపించదు నీదు రవ్వ కే
    సరి" యన నొప్పు భర్తకును స్వస్తి వచించుట సాధ్వి కియ్యెడన్”
    (భర్త తన రవ్వ కేసరిని మెచ్చుకున్నప్పుడు భార్య అతనికి శుభం కలగా లని కోరుకోవాలి.)

    రిప్లయితొలగించండి
  11. సుస్థిర ప్రజ్ఞ మరలి రా శుభముగ నిజ
    గృహమునకు హర్ష మడర వీక్షించి తత్క్ష
    ణమ్ము నెదురేగి యొసఁగి పాద్యమ్ముఁ బ్రీతి
    స్వస్తి భర్తకుం బలుకుట సాధ్వి కొప్పు

    [స్వస్తి = స్వాగతము]


    అరయ మొకింత సంశయము నందుఁ దలంచుచు డెంద మందు న
    క్షరు నరవిందలోచను రుజా పరితప్తుని నార్తి తోడుతం
    గర మనురక్తి సేవలను గాంత యొనర్చుచుఁ గోల్కొనంగ వే
    సరి యన నొప్పు భర్తకును స్వస్తి వచించుట సాధ్వి కియ్యెడన్

    రిప్లయితొలగించండి
  12. డా. బల్లూరి ఉమాదేవి
    మానవత్వము తోడను మనుజులకిల
    ప్రతిఫలమ్మును కోరక ప్రతి నిమిషము
    సాయపడెడుమనసుగల సహృదయునకు
    *“స్వస్తి భర్తకుం బలుకుట సాధ్వికొప్పు”*

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ఇంటి విషయము లేవి పట్టించు కొనక
    వ్యసన పరుడై తిరుగ వేరు వనిత తోడ
    లేదు సుఖమింక తనకని లేశమైన
    స్వస్తి భర్తకుం బలుకుట సాధ్వికొప్పు.

    రిప్లయితొలగించండి