13, అక్టోబర్ 2016, గురువారం

చమత్కార పద్యాలు – 216/22


త్రింశదర్థ పద్యరత్నము పోకూరి కాశీపతి

ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.

22వ అర్థము ఆంజనేయ స్మరణ 
                                                                          
భూరి జఠర గురుఁడు = పెద్ద కడుపు గల భీమున కన్నయైనవాఁడును (ఇరువురు వాయుపుత్రు లైనందున),
నీరజాంబక భూతి = శివ సంభూతుఁ డైనవాఁడును.
మహిత కరుఁడు = ఘనతరమైన కరములు గలవాఁడును, (గిరులను తరులను పెరుకు భుజబలము గల్గినందున),
అహీన మణి కలాపుఁడు = గొప్పతనమునే భూషణములుగా గలవాఁడును,
అలఘు సద్గణేశుఁడు = అధికతరమగు సాధుగణమునకు (హనుమదుపాసకులకు) ఏలిక యైనవాఁడును,
అగ్ర గోపుఁడు = ముఖ్య వాక్కుల కధీశుఁడైనవాఁడును (సూర్యునివద్ద అభ్యసించిన వ్యాకరణవేత్త),
మహామర్త్యసింహుఁడు = మిక్కిలి దేవతా శ్రేష్ఠుడైనవాఁడును (అగు ఆంజనేయుఁడు),
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!

2 కామెంట్‌లు:


  1. పాపా లె న్నిని జేసిన
    పాపుల దరి జేర్చకుండ పాలయ హనుమా
    పాపాల జోలు పో నిక
    పాపంబుల మీద నొట్టు పవన కుమారా !

    రిప్లయితొలగించండి