28, అక్టోబర్ 2016, శుక్రవారం

వేంకటేశ్వర శతకము - 7



వేంకటేశ్వర శతకము
(ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు)
 (౭)
నగముల నేడు నొక్క త్రుటి నర్తన లీలగ నెక్క వచ్చునే
జగములఁ గల్గు వేదనలు సన్నుతి సేయగఁ దీర కుండునే
విగతము లన్ని పాపములు వేడిన నిశ్చల భక్తి నెమ్మదిన్
నగవులు చిందు నీముఖమె నాకగు దిక్కిల వేంకటేశ్వరా!                      56.

సంతస మంద నేరవు యశస్కర వైభవ పూజ నాదులం
బంతము లన్ని వీడి కడు భక్తినిఁ బత్రము తోయమో తమిన్
సుంతయు నిచ్చి నంత పరిశుద్ధ మనంబున సంతసింతువే      
వింతలు నీ మహాత్మ్యము లవేద్యము లిద్ధర వేంకటేశ్వరా!                       57.

సంపద కాలవాలమగు సాగర నందన నీ యురమ్మునన్
సొంపున నుండ కుక్షి ఘన శుంభ దజాండము నిండి యుండగం
బెంపున నప్పు నీయగఁ గుబేరుని వైభవ మెంత? వింతయే!
యింపిఁడి వడ్డి కాసులన నేమని చెప్పుదు! వేంకటేశ్వరా!                      58.
[ఇంపిఁడి = ఇష్టము లేక]

ఆపద నుత్తరించుమని యార్తిని మ్రొక్కుల నిత్తు మందురే
కోపము కల్గు నేమొ యని కుందుదు రెల్లరు తీర్చ కుండినం
బాప మెరుంగ నేరరు కృపారస చిత్తున కేల మ్రొక్కులున్
నీ పద యుగ్మమింక మది నిల్పిన చాలదె వేంకటేశ్వరా!                        59.

సుందర మైన రూపమది చూచిన నిత్యము తన్వి తీరునే
విందులు సేయు కీర్తనలు వీనుల కెప్పుడు మోహనమ్ముగన్
డెందము నందు విగ్రహము ఠీవిగ నిల్చు నిరంతరమ్ము నే
మందుము నిత్య నూతన మహాద్భుత లీలల వేంకటేశ్వరా!                     60.

బాల్యము నందు నేరకను బ్రాయము నందున విద్యలందు మాం
గల్యపు మోహ మందు నిఁకఁ గాపురపుం బటు బాధ లందునన్
శల్యము లౌను గాయములు సాగగ నీవిధి వారలింక కై
వల్యము గోరి నింగొలువ వచ్చెద రెన్నడు వేంకటేశ్వరా!             61.

చిత్ర విచిత్ర నామముల సేవలు సల్పుదు రెల్ల వేళలన్
గోత్ర సమేత నామములఁ గొల్తురు నిత్యము పారవశ్యతం
బాత్రము వేద ధర్మ పరిపాలన కర్మకు వేంకటాద్రి స
ద్గోత్రము నిత్య మంగళ వికుంఠము ధాత్రిని వేంకటేశ్వరా!                     62.

లంచమ యంచు నెంచక విలాసముగా వచియింత్రు మ్రొక్కులే
యంచును జెంత జేరి మది నార్తిని మ్రొక్కిన దేవ దేవునిం
గాంచరె సర్వ దుఃఖముల ఖండన సందియ మేల నేరికిన్
వంచన లేల చిత్తమున భక్తియ చాలదె వేంకటేశ్వరా!                           63.

కానుక లేమి యిచ్చెనట కానల శంఖణు డొందె రాజ్యమున్
మానుగ కుంభ కారుడల మాడల నిచ్చెనె భీము డెన్నడున్
దేనికి తింటి వా చెఱకు దీటగు సొమ్ములు బాబ యిచ్చెనే
కానము నేడు సన్మతులఁ గాంచము వింతల వేంకటేశ్వరా!                    64.

కరుణయె తప్ప నన్యమును గానము దీన జనమ్ము లందునన్
వరముల నిచ్చి కాచెదవు భక్తుల నింపుగ వేడి నంతనే
తరణము నామ కీర్తనము తామరసాక్ష భవాబ్ధి కిద్ధరన్
మరువను నీదు పూజలను మానస మందున వేంకటేశ్వరా!                  65.

4 కామెంట్‌లు:

  1. సప్త గిరులను దాటుచు సంయమునన
    నిన్ను జూడగ రాగోర చిన్మయుండ !
    మార్గ మధ్యము నందున మంగళమగు
    నీదు రూపము గన్ప డె నిజము గాను
    సార్ధ కంబయ్యె నిజమునా జన్మ యికను
    నట్లె గావుము నాభాతృ హర్ష మొదవ

    రిప్లయితొలగించండి
  2. "వేద ధర్మ పరిపాలన కర్మకు వేంకటాద్రి సద్గోత్రము".... చక్కగా చెప్పారు కామేశ్వరరావు‌ గారూ..... నమస్సులు.

    రిప్లయితొలగించండి
  3. "వేద ధర్మ పరిపాలన కర్మకు వేంకటాద్రి సద్గోత్రము".... చక్కగా చెప్పారు కామేశ్వరరావు‌ గారూ..... నమస్సులు.

    రిప్లయితొలగించండి