21, అక్టోబర్ 2016, శుక్రవారం

చమత్కార పద్యాలు – 216/30


త్రింశదర్థ పద్యరత్నము పోకూరి కాశీపతి

ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.

30వ అర్థము వీరబ్రహ్మ స్మరణ    
                                                                          
భూరి జఠర = బ్రహ్మ యను పేరుగల,
గురుఁడు = దేశికుఁడైనవాఁడును,
నీరజాంబక భూతి = విష్ణువు యొక్క పుట్టువు గలవాఁడును (లేక) ఈశ్వరాంశ సంభూతుఁడును,
మహిత కరుఁడు = అతిశయము గలవాఁడును,
అహీన మణి కలాపుఁడు = గొప్ప మణిభూషలు గలవాఁడును,
అలఘు సద్గణేశుఁడు = ఘనతరమైన సాధుగణాధీశ్వరుఁ డైన వాఁడును,
అగ్ర గోపుఁడు = గోపాలకాగ్రణి యైనవాఁడును (గరిమరెడ్డి అచ్చమ్మ యింట ననుట) లేక ముందు వాక్కుల కధీశుఁడైనవాఁడును (అనగా నికముందు జరుగబోవు వాక్యములు గల స్వరచిత కాలజ్ఞానమున కనుట),
మహామర్త్యసింహుఁడు = మిక్కిలి మానవ శ్రేష్ఠుడైనవాఁడును (అగు వీరబ్రహ్మేంద్రుఁడు),
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక! 

* త్రింశదర్థ పద్యరత్నము సంపూర్ణం *


3 కామెంట్‌లు:

  1. గణపతి శివ బ్రహ్మ విష్ణ్వింద్రాగ్ని యమ నిరృతి వరుణ, వాయు కుబేరాష్టదిక్పాలక నవగ్రహ సూర్య చంద్ర సముద్ర మేఘ హిమవన్నగాదిశేష గరుడ గజేంద్రాంజనేయ నందీశ్వర వీరభద్ర స్కంద మన్మథ నారద దత్తాత్రేయ విశ్వకర్మ వీరబ్రహ్మ భూరి సద్గుణ కీర్త నాలఘు మణి కలాప సన్ని భామర్త్య వచ నాకలన బంధ దామ నివహ గుంఫన పద్య రత్న రచనా ధురంధరునకు భక్తి ప్రపత్తి సంయుత నమస్కారములు.

    బహుశ తను నుడివిన సాప్తపదేయపు ( సప్త విశేషణములు కూడినది) టాటవెలదిలో దశత్రయార్థము లుండునని కవిభక్త శిఖామణికే తెలియక పోవచ్చును!
    విశేషముగ నవగ్రహాష్ట దిక్పాల కాన్వయ మూహతీతము!!

    ప్రతి పదార్థ సహిత త్రింశదర్థ పద్యరత్నము నవిరళముగా సమర్పించిన పూజనీయులు శంకరయ్య గారికి శతసహస్రాధిక వందనములు.

    రిప్లయితొలగించండి
  2. ఈశ్వ రాంశ సంభూతుడు నశ్వరుండు
    వీర బ్రహ్మేంద్ర పేరున వెలయు నతడు
    జరుగ బోవుసంఘటనల గురిచి పొత్త
    మయ్యది రచన జేసిన నామహుండు
    కాచు నెప్పుడు మనలను గరుణ తోడ

    రిప్లయితొలగించండి