13, జూన్ 2013, గురువారం

సమస్యాపూరణం – 1081 (తుని లోపల లోకమెల్ల)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
తుని లోపల లోకమెల్ల తూఁగుచునుండున్.
("అవధాన విద్య" గ్రంథం నుండి)

14 కామెంట్‌లు:

  1. మధుర కందము:
    మునివందితు దేవబృంద పూజితు పద్మా
    క్షుని సంసృతి బంధహారి సుందరు విశ్వే
    శుని భక్తుల రక్ష యౌచు శోభిలు సుస్వాం
    తుని లోపల లోకమెల్ల తూగుచునుండున్

    రిప్లయితొలగించండి
  2. గనునెవ్వడీ జగములను
    గని పోషించునె వడీ జగతిని లయను చే
    యునెవడు వాని గనిన విన
    తుని లోపల లోకమెల్ల తూగుచునుండున్

    రిప్లయితొలగించండి
  3. అనయము వీ డక భగవం
    తుని లోపల లోక మెల్ల తూగుచు నుండున్
    ఇనుడిచ్చు మనకు నిరతము
    పనుపున యా దేవదేవు పగటిని వెలుగున్

    రిప్లయితొలగించండి
  4. ఘననీలపు మేఘచ్ఛా
    యనుఁ గలిగినయట్టి వానియధిపతి యనుచు
    న్ననయము ప్రభువు రమాకాం
    తుని లోపల లోకమెల్ల తూఁగుచునుండున్.

    రిప్లయితొలగించండి
  5. మునిసత్తములెఱుగుదురిది.
    సునిశితమగు బుద్ధి తోడ చూచిన కననౌన్.
    మనఁజేసెడి యా భగవం
    తుని లోపల లోకమెల్ల తూఁగుచునుండున్.

    రిప్లయితొలగించండి
  6. ధనమున్న లేకయున్నను,
    మనమునఁ గరుణాంతరంగ మండనుఁడై,
    యనయము దానమ్మిడు దాం
    తుని లోపల లోకమెల్లఁ దూఁగుచునుండున్. ౧

    మనమునను నిగ్రహమ్మును,
    ధనమందున నాశ లేమి, దౌష్ట్య రహితుఁడై,
    కను దైవమెదను, నిల శాం
    తుని లోపల లోకమెల్లఁ దూఁగుచునుండున్. ౨

    ధనమందె దైవముండును,
    ధనముండిన సకల వస్తు తతియుం గలుగున్,
    గనఁగా నిలలో ధనవం
    తుని లోపల లోకమెల్లఁ దూఁగుచునుండున్. ౩

    రిప్లయితొలగించండి
  7. పండిత నేమాని వారూ,
    "మధుర"మైన పూరణ చేసి ఆనందింపజేసారు. అభినందనలు.
    *
    శీనా శ్రీనివాస్ గారూ,
    మీ ప్రయత్నం ప్రశంసింప దగినది.
    కానీ భావమే సందిగ్ధంగా ఉంది.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    "అట్టివాని నధిపతి" అనండి. అక్కడ యడాగమం రాదు.
    *
    చింతా రామ కృష్ణా రావు గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ మూడు పూరణలూ దేనికదే బాగున్నవి. అభినందనలు.
    మొదటి పూరణ రెండవ పాదంలో చివర గణదోషం ఉంది... "మండనుఁ డతఁడై" అంటే సరిపోతుందనుకుంటాను...

    రిప్లయితొలగించండి
  8. తూగు అంటే నిదురించు అనే అర్ధం లో పూరించినాను. అంటే భగవంతుని జూచిన వానికి బాహ్య ప్రపంచ సంబందము ఉండదు మరియు లోకము అనగా బాహ్య ప్రపంచము అతనిలో నిదురించును మరియు భగవంతుని మాత్రమె గనును అని నా ఉద్దేశ్యము .

    రిప్లయితొలగించండి
  9. వన మందున మును లెందరొ
    మన మందున భక్తి నింపి మౌనము గానే
    ఘనమైన దీక్ష బూని భగవం
    తుని లోపల లోక మెల్ల తూగుచు నుండున్ !
    ==========================
    కనివిని యెరుగని రీతిగ
    నినుడే కోపించి జనుల నెండను మాడ్చన్
    తనుతాప ముపశమింప హిమవం
    తుని లోపల లోకమెల్ల తూగుచు నుండున్ !

    రిప్లయితొలగించండి
  10. శ్రీ కంది శంకరయ్యగారికి నమస్కారములు. తమరు నా మొదటి పూరణలో దొరలిన దోషమును తెలిపినందులకు కృతజ్ఞుఁడను. టైపాటు వలన నా దోషము జరిగినది. ఆ పాదమును నేను "మనమునఁ గరుణాంతరంగ మండన ఘనుఁడై" యనియే వ్రాసుకొన్నను, "...మండనుఁడై" యని పడినది. నేను సరిగా చూచుకొనలేదు. తమరు సూచించిన సవరణ బాగున్నది. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  11. శ్రీనివాస్ గారూ,
    తూగు శబ్ద ప్రయోగంలో సందేహం లేదు.
    'కనిన విన - తునిలోపల'... 'కనిన వినతుని లోపల' ఈ రెండింట ఏ పదవిభాగాన్ని తీసుకోవాలి. "వినతుడు" అంటే వినమ్రుడు, వంగినవాడు అనే అర్థాలున్నాయి కదా..
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    రెండు పద్యాల్లోనూ మూడవపాదాల్లో గణదోషం...
    మొదటిది.. `ఘన దీక్ష బూన భగవం'.... అనీ, రెండవది... `తనుతాప ముడుగ హిమవం' .... అని నా సవరణలు...

    రిప్లయితొలగించండి
  12. కంది శంకరయ్య గారికి ,
    అనేక నమస్కారములు తెలియచేసుకుంటూ వినతుని అంటే వినమ్రుని అనే అర్ధము తోనే వ్రాయటమైనదని సవినయముగా
    తెలియచేసుకుంటున్నాను. యిక ముందు మరింత స్పష్టమైన పూరణలను పంపించెదను . భగవతి కృప చేత పెద్దవారైన మీ ఆశీర్వాదముల బలము చేత మరింత కవిత్వ పటుత్వము నాకు కలుగగలదని భావిస్తూ సద్విమర్శ కి కృతఙ్ఞతలు తెలియ చేసుకుంటున్నాను .
    భవదీయుడు , శ్రీనివాస్ (శీనా ).

    రిప్లయితొలగించండి
  13. అనగనగా జనతాలో
    తిని మెండుగ రైలు తిండి తిప్పలు పడుచున్
    అనకాపల్లిని తూగగ
    తుని లోపల లోకమెల్ల తూఁగుచునుండున్

    (1) తూగు = నిద్రించు
    (2) తూగు = ఊగు

    రిప్లయితొలగించండి