20, జూన్ 2013, గురువారం

సమస్యాపూరణం – 1088 (నమ్మినవారి నెల్లరను)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
నమ్మినవారి నెల్లరను నాశ మొనర్చుటె నీతి యిద్ధరన్.

14 కామెంట్‌లు:

  1. భస్మాసుర వర వృత్తాంతము...

    ఇమ్ముగఁ జేసియుం దపము; నీశుని నిమ్మనె బుగ్గిసేసి, మో
    దమ్మును గూర్చెడిన్ వరము; దానికి నీశుఁడు నట్లె యీయఁగా;
    నమ్మఁగ దాని నా ప్రమథ నాథుని పైనఁ బరీక్షఁ గోరెఁ బో!
    నమ్మిన వారి నెల్లరను నాశ మొనర్చుటె నీతి యిద్ధరన్.

    రిప్లయితొలగించండి
  2. నమ్మిన దానవుండు బలి నాశన మొందెను విష్ణుమూర్తిచే
    నమ్మిన భార్య కైక వలనన్ గద పంక్తిరథుండు నాశిలెన్
    నమ్మిన యట్టి కౌరవుల నాశము గోరెను మేనమామయే
    నమ్మిన వారి నెల్లరను నాశ మొనర్చుటె నీతి యిద్ధరన్

    రిప్లయితొలగించండి
  3. తమ్ములఁ గూడి రాముడిట ధర్మముఁ దప్పక పేరు గాంచు దే
    శమ్మిది, నేటి కాలమున చచ్చెను న్యాయమవేమి బుద్ధులో?
    రమ్మని బిల్చి మోసము దలంచుచు వర్తిలుటెల్ల నీతియే?
    నమ్మినవారి నెల్లరను నాశ మొనర్చుటె నీతి యిద్ధరన్.

    రిప్లయితొలగించండి
  4. నమ్మిన విప్రు నొక్కడిని నంజుకొనెన్ గద ! వ్యాఘ్ర మొక్కటిన్
    నమ్మిన గుర్వు నొక్కనికి నష్టము గూర్చెను శిష్యు డొక్కడున్
    నమ్మిన వారి పట్ల యిల నమ్మకద్రోహము పాడి యేమొ !? హా !
    నమ్మిన వారి నెల్లను నాశ మొనర్చుట నీతి యిద్ధరన్

    రిప్లయితొలగించండి
  5. గుండు మధుసూదన్ గారూ,
    ఈరోజు ప్రథమ తాంబూలం మీకే. సంతోషం.
    భస్మాసుర వృత్తాంతంతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    మూడవ పాదం ప్రారంభంలో "నమ్మఁగ" తరువాత సెమికోలన్ (;) ఉండాలనుకుంటాను. లేదా అక్కడ "నమ్మక" అని ఉన్నా సరిపోతుంది కదా!
    *
    పండిత నేమాని వారూ,
    నమ్మి చెడినవారి గురించిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    పంచతంత్ర కథలైన పులి-బాటసారి, ఆశాఢభూతి కథలను ప్రస్తావిస్తూ చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    "నమ్మిన గుర్వు నొక్కనికి" అన్నదానిని "నమ్మిన యొజ్జ నొక్కనికి" అందాం.

    రిప్లయితొలగించండి
  6. ఇమ్మహి రాజకీయమున నెవ్వరు మిత్రులు లేరు శత్రువుల్
    సొమ్ముకు, గద్దెకాశ పడి చూడరు నేతలు మంచి చెడ్డలన్
    కుమ్ముదు రడ్డు చెప్పినను గూరిమి, బంధము వీడి నిర్దయన్
    నమ్మిన వారి నెల్లరను నాశమొనర్చుటె నీతి యిద్దరిన్ .

    రిప్లయితొలగించండి
  7. కమ్మని ప్రేమకై మగువ కాదన జాలక కన్న వారలన్
    వమ్ముగ జేసి మాయలకు వంచితయై యిలు వీడి వచ్చినన్
    సొమ్ములు మూట గట్టుకొని సుందర కాంతను వేశ్య వీథిలో
    నమ్మినవారి నెల్లరను నాశ మొనర్చుటె నీతి యిద్ధరన్!!

    రిప్లయితొలగించండి
  8. నమ్మిన భర్తయే సతిని నంగడి బొమ్మగ నమ్మి వేయగా
    నెమ్మిని తీపి మాటలను నేరుగ బల్కుచు ధార్మి కం బటన్
    నమ్మక మన్నదే దిలను నాతియె రాతిగ నగ్ని దూకినన్
    నమ్మిన వారినెల్లరను నాశ మొనర్చుట నీతి యిద్దరిన్ !

    రిప్లయితొలగించండి
  9. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    ఈరోజు ఉదయమే అన్నాను... "మీ ఆలోచనలు, పూరించే విధానం వైవిధ్యంగా ఉంటా"యని! అన్నట్టే ఈ పూరణకూడా వైవిధ్యంగా ఉండి అలరిస్తున్నది. అభినందనలు. (కాకుంటే 'అఖండయతి' అవుతున్నది.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. గుండు మధుసూదన్ గారూ,
    మీరు ఫోన్ ద్వారా తెలియజేసిన వివరణతో ఏకీభవిస్తున్నాను. మీ పద్యంలో ఏ సవరణా అక్కరలేదు. తొందరపడి నందుకు మన్నించండి.

    రిప్లయితొలగించండి
  11. కమ్మని మాటలాడుచును కార్యము తీరగ మాట దప్పు వా
    రిమ్మహి లోన తా ముగల రెందరు, వీరిని నమ్మ నెంతు రే
    నమ్ము,కసాయినే కడకు, నమ్మదు లోకము గొర్రె వోలె, తా
    నమ్మినవారి నెల్లరను మోసమొనర్చుటె నీతి యిద్దరన్

    రిప్లయితొలగించండి
  12. తిమ్మరుసంత ధీ మతియె తిప్పల పాలయె నమ్మి రాయలున్
    నమ్మిన పృథ్వి రాజునకు నమ్మక ద్రోహము చేసె మిత్రుడే
    నమ్మక ద్రోహమే బరగు న్యాయము గా ధరణిన్ గణించగా
    నమ్మిన వారి నెల్లరను నాశ మోనర్చుటె నీతి యిద్దరన్

    ఆర్యా ! యింతకు మునుపు పంపిన పూరణ లో ఆఖరి పాదము నందు యతి స్థానములో "నాశ " బదులుగా "మోస " అని పొరపాటున వ్రాయట మైనది. మన్నించి సవరణ స్వీకరించగలరు.

    రిప్లయితొలగించండి
  13. శ్రీనివాస్ గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. రమ్మును విక్రయించుచును రాబడి నొందుచు మాలయన్నవోల్
    కమ్మగ పారిపోవుచును కన్నుల గానక లండనందునన్
    సుమ్ముగ దాగి యప్పులను సుంతయు తీర్చక ప్రీతి వాక్కులన్
    నమ్మినవారి నెల్లరను నాశ మొనర్చుటె నీతి యిద్ధరన్

    రిప్లయితొలగించండి