11, ఏప్రిల్ 2025, శుక్రవారం

సమస్య - 5090

12-4-2025 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పోరు వీడి క్రీడి మునిగ మారె”

(లేదా...)

“పోరొనరింపలేక తపముం బొనరించఁగ నేఁగెఁ గ్రీడియే”

15 కామెంట్‌లు:

  1. నేడె దేవభాష నేర్చిన బుద్ధుడు
    వ్యాస ముని వరుండు వ్రాయగ గని
    ప్రతిగ గూర్చినట్టి భారతమందున
    పోరు వీడి క్రీడి మునిగ మారె

    రిప్లయితొలగించండి
  2. కురుక్షేత్ర సంగ్రామానికి ముందు కౌరవపక్షమున నున్న భీష్మ ద్రోణులను తదితరుల జూచిన అర్జునుడి భావన..........

    వారలు నాకు పూజ్యులు ధృవంబు మేలొనగూర్చు వార ల
    వ్వారలు నాకు మిత్రులు రవంతయు ద్రోహము చేయబూన ర
    య్యారె రణంబు సేయదగునా ! యని చింతిత మానసుండునై
    పోరొనరింపలేక తపముం బొనరించఁగ నేఁగెఁ గ్రీడియే

    రిప్లయితొలగించండి
  3. కౌరవ పాండవేయులకు గయ్యము
    జర్గెడు యుద్ధ భూమిలో
    జేరిన తాతదండ్రులెడ స్నేహము
    వీడని మానసంబుతో
    భారము మోయలేననుచు బల్కచు
    మిక్కిలి చింతజెందుచున్
    పోరొనరించలేక తపముంబొన
    రించగ నేగె క్రీడియే


    రిప్లయితొలగించండి
  4. వారలు బంధుమిత్ర పరివారము దేశికులాప్తులెల్లరున్
    పోరున ఢీకొనన్ మనసు పోవదు జ్ఞాతుల సంగరమ్మునన్
    వారక వారినే పగిది బాణచయమ్మున కూల్తునంచు తా
    పోరొనరింపలేక తపముం బొనరించఁగ నేఁగెఁ గ్రీడియే

    రిప్లయితొలగించండి
  5. మరులు కలిగె తనకు మగువ సుభద్ర పై
    వేగ మామె చూడ వెడల దలచి
    మారు వేష మూ న మదిలోన యోచించి
    పోరు వీడి క్రీడి మునిగ మారె

    రిప్లయితొలగించండి
  6. “పోరొనరింపలేక తపముం బొనరించఁగ నేఁగెఁ గ్రీడియే”

    మీరగ నీమమంతటను మేలుగ దల్చుచు వీడి నస్త్రముల్
    పోరొనరింపలేక తపముం బొనరించఁగ నేఁగెఁ గ్రీడియే”
    దోరుగ పైనమయ్యెనట దూరముగాను పురంబు వీడుచున్
    చేరె యతీశ్వరుండిగను చేకొనె నాగటిజోదు సోదరిన్

    రిప్లయితొలగించండి

  7. మనసు దోచి నట్టి మగువ సుభద్రతో
    తనదు పెండ్లి సేయ తాటి పడగ
    వాడె యడ్డమనుచు ప్రముఖుడాతనితోడ
    పోరు వీడి క్రీడి మునిగ మారె


    నారిసుభద్ర నివ్వనని నాగటి జోడు వచించు నంచు కం
    సారియె తెల్పినంత వరుసైన పడంతిని వీడలేక నా
    గౌరవ నీయుడైన యలకాపరి సోదరు డైన సీరితో
    పోరొనరింపలేక తపముం బొనరించఁగ నేఁగెఁ గ్రీడియే.

    రిప్లయితొలగించండి
  8. ధీరగుణాఢ్యమారసమతేజయశోపరిశోభితుండు దు
    ర్వార మహాస్త్రమున్ గొన కిరాతుని గెల్చిన మేటి ద్వారకన్
    జేరి యశోద నందనుని చెల్లి సుభద్ర మనంబు గెల్వగన్
    పోరొనరింపలేక తపముం బొనరించఁగ నేగె గ్రీడియే

    శశిభూషణ సిద్ధాంతి, నంద్యాల. 12-04-2025

    రిప్లయితొలగించండి
  9. సవ్యసాచి కొసరె దివ్యాస్త్ర సంపదల్
    తాను శివుని కొరకు తపము సల్పి
    పాశుపతము పొందు పంతమున్ బూనుచు
    పోరు వీడి క్రీడి మునిగ మారె

    దారుణ మైనయుద్ధమును తాము జయించుట కష్ట సాధ్యమే
    తీరగు శస్త్రసంపదలు తృప్తిగ పొందక యున్న యుద్ధమే
    భారమటంచు నెంచి మరి పాశుపతాస్త్రము లేని వేళలో
    పోరొనరింపలేక తపముం బొనరించఁగ నేఁగెఁ గ్రీడియే

    రిప్లయితొలగించండి
  10. ఆటవెలది
    పంకజాక్షుఁడెంచి పార్థునకు సుభద్రఁ
    బూనికనెరుగంగ బోధఁ జేసి
    మరులు గొలిపినంత విరితూపులతోడ
    పోరు వీడి, క్రీడి మునిగ మారె!

    ఉత్పలమాల
    నీరజలోచనుండు తన నేరుపుఁ జూపి సుభద్ర నర్జునిన్
    గూరిమిఁ జేయనొక్కటిగఁ గూరుచ వ్యూహము సూత్రధారియై
    మారుని పుష్పబాణముల మార్కొన జాలక వెన్నుజూపుచున్
    పోరొనరింపలేక తపముం బొనరించఁగ నేఁగెఁ గ్రీడియే!

    రిప్లయితొలగించండి
  11. సమస్య:
    పోరొనరింపలేక తపముం బొనరించఁగ నేఁగెఁ గ్రీడియే!

    ఉత్పలమాల:

    మారుని తండ్రి యెంచె మది మాతుల సూనుని ప్రేమ పండగా
    కోరిక దెల్సి, చెల్లి గన గోపన మార్గమిదంచు దెల్పగా
    వీర గుణంబులం వదలి వేచిన ప్రేయసి సంగమంబుకై
    పోరొనరింపలేక తపముం బొనరించఁగ నేఁగెఁ గ్రీడియే!

    రిప్లయితొలగించండి
  12. ఆ॥ మేటి వనిత యగు ప్రమీల యశ్వముఁ బట్ట
    నాడువారితోడ ననిని సలుప
    కూడ దనుచుఁ దలచి కూరిమినిఁ బడయ
    బోరు వీడి క్రీడి మునిగ మారె

    ఉ॥ కోరిన స్త్రీ సుభద్రకని కూరిమి తగ్గని మార్గమెంచుచున్
    దీరగు సూత్ర మెన్నఁగను దెల్పఁగ వెన్నుఁడు బంధు ప్రీతినిన్
    మీరక కార్య సాధకుఁడు మేటిగ నొప్పెడు వేషధారియై
    పోరొనరింపలేక తపముం బొనరించఁగ నేఁగెఁ గ్రీడియే

    పెనుకొండ రామబ్రహ్మం ప్లజెంటన్

    రిప్లయితొలగించండి
  13. జీవనంపుఁ బోరు సేయుచుండ నడవి
    లోన స్వీయ సోదరులు సెలంగి
    పడయ నెంచి దివ్య పాశుపతాస్త్రమ్ము
    పోరు వీడి క్రీడి మునిగ మారె


    కోరను రక్త సిక్త మగు కూటిని నంచు వచించి కృష్ణుతో
    దారుణ రీతి యుద్ధమునఁ దాతల నొజ్జల బంధు కోటినిం
    గూరిమి వీడి చంపు టది క్రూర తరం బని యెంచి యూహలోఁ
    బో రొనరింప లేక తపముం బొనరింపఁగ నేఁగెఁ గ్రీడియే 23

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    సమరభూమి కేగి సారథి హరితోడ
    బంధు జనుల గాంచి పాప భీతి
    కలిగి చేయలేను కదనమింక యనుచు
    పోరు వీడి క్రీడి మునిగ మారె.

    రిప్లయితొలగించండి
  15. తీర్థయాత్రకనుచుతీరుగాసాగుచు
    కంస హరుని భగిని కరమ పట్ట
    వలయు ననుచు మదిని వాంఛించుచువడిగ
    పోరు వీడి క్రీడి మునిగ మారె

    రిప్లయితొలగించండి