17, ఏప్రిల్ 2025, గురువారం

సమస్య - 5096

18-4-2025 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“చౌర్యద్యూతములు నరుని సజ్జనుఁ జేయున్”

(లేదా...)

“చౌర్యద్యూతపరాంగనేచ్ఛలు నరున్ సత్పూరుషుం జేయురా”

16 కామెంట్‌లు:

  1. కందం
    కార్యోత్సాహి చదువ నని
    వార్యమ్ముగ భాగవతము భారతము దగున్
    తూర్యములుగ వినిపించెడు
    చౌర్యద్యూతములు నరుని సజ్జనుఁ జేయున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శార్దూలవిక్రీడితము
      ఆర్యా! సత్యము వ్యాస వాల్మికుల కావ్యమ్ముల్ పురోగామికిన్
      గార్యోత్సాహికి మార్గదర్శకముగన్ జ్ఞానాంబుధిన్ దేల్చెడున్
      తూర్యమ్మౌచును రామ, కృష్ణుల గుణాల్ దోడ్పాటుగన్ నీతులై
      చౌర్యద్యూతపరాంగనేచ్ఛలు నరున్ సత్పూరుషుం జేయురా!

      తొలగించండి
  2. కం||
    కార్యముకు చెరుపు జేయును
    చౌర్యద్యూతములు ; నరుని సజ్జనుఁ జేయున్
    ఆర్యుల మాటలను వినుచు
    శౌర్యముతో జీవనమును సాగించినచో

    రిప్లయితొలగించండి
  3. కం॥ క్రౌర్యము పలుకఁగ నిటులను
    చౌర్యద్వూతములు నరుని సజ్జనుఁ జేయున్
    ధైర్యముఁ జూపుచుఁ దెల్పుమ
    శౌర్యము సహృదయము నలువు సజ్జనుఁ జేయున్

    శా॥ చౌర్యద్యూత పరాంగనేచ్ఛలు నరున్ సత్పూరుషుం జేయురా
    క్రౌర్యమ్మీవిధి పల్కఁగన్ జనులు సంస్కారమ్ముఁ గోల్పోదురే
    ధైర్యంబుంచుచు దుష్ట కార్యముల సంధానించెడిన్ నీచులన్
    శార్యమ్మొప్పఁగఁ ద్రుంచు వారు సుజనుల్ సద్వర్తనా శ్రేష్ఠులున్

    నలువు ప్రేమ నిఘంటువు సహాయమండి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మరొక పూరణ అండి
      కాలచక్ర మహిమ వలన నేటి స్థితి

      శా॥ క్రౌర్యమ్మిప్పుడు కాలచక్రమహిమన్ రాజిల్ల నామోదమై
      ధౌర్యంబొంది జనుల్ యధేచ్ఛగనటుల్ త్యక్తమ్ముఁ గావించఁగన్
      బర్యాప్తమ్మని సద్గుణమ్ములనిలన్ వర్ధిల్ల దుష్కర్మలున్
      జౌర్యద్యూతపరాంగనేచ్ఛలు నరున్ సత్పూరుషుం జేయురా

      తొలగించండి
  4. ఆర్యా తమరెట్లందురు
    చౌర్యద్యూతములు నరుని సజ్జనుఁ జేయున్
    చౌర్యము దుష్కర్మమగును
    ధైర్యముగా ద్యూతమాడ తట్టములెదురౌ

    రిప్లయితొలగించండి
  5. “చౌర్యద్యూతపరాంగనేచ్ఛలు నరున్ సత్పూరుషుం జేయురా"
    ఆర్యా మీరిటులెట్టురందురు వినన్ హాస్యాస్పదం బయ్యెడిన్
    చౌర్యద్యూతములన్న నయ్యవి సదా సత్కార్యముల్ గావుగా
    మర్యాదన్ ఠవణించునే పరసతిన్ మండాడగా నెన్నడున్

    రిప్లయితొలగించండి

  6. కార్యము లవెన్ని చేసిన
    ధైర్యము విడకుండ సత్య ధర్మాచరణం
    బార్యా వదలక, తలవక
    చౌర్యద్యూతములు, నరుని సజ్జనుఁ జేయున్.


    ధైర్యంబెంతయొ నిన్ను గాంచిన సదా ధ్యానింతురే నీ నామమున్
    మర్యాదస్థుడవంచు నెంచి నిను సమ్మానించు నవ్వారితో
    నార్యా నీవిటులేల పల్కెదవసత్యమ్ముల్ వచింపెవ్విధిన్
    జౌర్యద్యూతపరాంగనేచ్ఛలు నరున్ సత్పూరుషుం జేయురా

    రిప్లయితొలగించండి
  7. ఆర్యా! విడువంబడినన్
    జౌర్యద్యూతములు నరుని సజ్జనుఁ జేయున్
    భార్యాబిడ్డలఁ విడుతురు
    కార్యోన్ముఖులైన మోక్ష కాముకులిలలో

    ఆర్యావర్తములోని నమ్మికలతో నాశ్చర్త్యమే కల్గు నై
    శ్వర్యంబున్ వలదంచు వీడుదురిలన్ సాధింపగా మోక్షమున్
    భార్యాబిడ్డలనే త్యజింతురుగదా బైరాగులై వీడగా
    చౌర్యద్యూతపరాంగనేచ్ఛలు నరున్ సత్పూరుషుం జేయురా

    రిప్లయితొలగించండి
  8. ఆర్యులు వ్య స న ము లందురు
    చౌ ర్య ద్యూ తము లు :: నరుని సజ్జను జేయు న్
    చౌర్య ద్యూ తముల ను మానియు
    తూర్యమె మెలగంగ గలుగు తోషము భువి లో

    రిప్లయితొలగించండి
  9. కం:ఆర్యోక్తములౌ గాధల
    శౌర్యము,ధర్మముల మనకు సంతసమౌ,నా
    శ్చర్యపు పాఠములై అట
    చౌర్యద్యూతములు నరుని సజ్జనుఁ జేయున్”
    (భారతభాగవతాలలో శౌర్యం,ధర్మం మనకి సంతోషాన్నిస్తాయి.ఆశ్చర్య మేమంటే దానిలో జూదం కూడా ఏదో పాఠాన్ని బోధిస్తుంది.)

    రిప్లయితొలగించండి
  10. దుర్యోగంబనివార్యమౌట నికమా దుర్వర్తనోద్వృత్తమౌ
    చౌర్యద్యూతపరాంగనేచ్ఛలు; నరున్ సత్పూరుషుం జేయురా
    పర్యాప్తాన్విత చిత్తవృత్తి సతతంబాధ్యాత్మికానంద మా
    ధుర్యాస్వాదన మగ్నులై మనుట నిర్దుష్టంబవశ్యంబునౌ

    రిప్లయితొలగించండి
  11. ఆర్యా, పరోపకారము,
    మర్యాద తొలకెడు మాట, మంచితనము స
    త్కార్యములు గాక యదెటుల
    చౌర్యద్యూతములు నరుని సజ్జనుఁ జేయున్?

    రిప్లయితొలగించండి
  12. మర్యాదాపురుషోత్తముండు రఘురామాఖ్యేతిహాసంబు మా
    త్సర్యోద్రిక్తమయంబు భారత మహాసంగ్రామ సాహిత్యముల్
    కార్యాకార్య విచక్షణన్ దెలుపు వ్యాఖ్యానంబులన్ వర్జ్యమౌ
    చౌర్యద్యూతపరాంగనేచ్ఛలు నరున్ సత్పూరుషుం జేయురా
    (శ్రీ ధనికొండ రవిప్రసాద్ గారి పూరణాంశ ప్రేరణతో)

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ఆర్యులు వీడుట మంచిది
    చౌర్యద్యూతములు; నరుని సజ్జనుఁ జేయున్
    కార్యాలోచనతో స
    త్కార్యమ్ముల నన్ని సలుప కష్టముతోడన్.

    రిప్లయితొలగించండి
  14. మర్యాదగ విడిచినచో
    చౌర్యద్యూతములు నరుని సజ్జను చేయున్
    కార్యోత్సాహము పెంచుచు
    శౌర్యము సమకూర్చు ననుట సత్యము సుమ్మీ.

    రిప్లయితొలగించండి