28, ఏప్రిల్ 2025, సోమవారం

సమస్య - 5107

29-4-2025 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“దుష్టుఁడై దుష్కృతముఁ జేయ దొరకు పునెము”

(లేదా...)

“దుష్కృత మాచరించు ఘనదుష్టున కబ్బు నితాంతపుణ్యముల్”

(మొన్నటి పట్వర్ధన్ గారి శతావధానంలో క్రొవ్విడి వెంకట రాజరావు గారి సమస్య)

14 కామెంట్‌లు:

  1. తేటగీతి
    తోడి మనుజుని జంపుట దుష్కృతమ్ము
    తీవ్రవాదులు పెట్రేగ దేశమందు
    ప్రభుత మోదాన సైనికుఁడభయమొంది
    దుష్టుఁడై దుష్కృతముఁ జేయ దొరకు పునెము!

    ఉత్పలమాల
    ముష్కరులాయుధమ్ములను ముచ్చటకెంచి యమాయకప్రజన్
    నిష్కపటాత్ములన్ వధకు నీచ ప్రవృత్తులనెంచినంతటన్
    నిష్కృతి జేయగన్ ప్రభుత నిష్ఠము దెల్పఁగ సైనికాళికిన్
    దుష్కృత మాచరించు ఘనదుష్టున కబ్బు నితాంతపుణ్యముల్

    రిప్లయితొలగించండి
  2. సముచితమయిన కార్యము సలుపుటకయి
    మాన్యుడయిన ప్రహ్లాదుని మాదిరిగనె
    నాయన తెలిపినట్లుగ నడుపకుండి
    దుష్టుఁడై దుష్కృతముఁ జేయ దొరకు పునెము

    రిప్లయితొలగించండి

  3. పదుగురకుపకారమ్మది వాసిగాను
    చేయు వారలకు లభించు స్థిరమటంచు
    తెలుపు వాడవు నీవిట్లు పలుకుటేల
    దుష్టుఁడై దుష్కృతముఁ జేయ దొరకు పునెము?



    నిష్కృతి లేని పాపముల నిత్యము సల్పెడి వారికిన్ భువిన్
    ముష్కరులైనవారికిని మోక్షమదేవిధి యందు నందువో
    శుష్కపు మాటలాడ విన చోద్యమె గల్గెను పండితోత్తమా
    దుష్కృత మాచరించు ఘనదుష్టున కబ్బు నితాంతపుణ్యముల్?

    రిప్లయితొలగించండి
  4. తే॥ ముష్కరులఁ జేయు సూత్రము భువిని వలసె
    నిపుడిటుల నసహాయుల కెపుడుఁ గీడు
    సేయ నీతి నియమములఁ జెరిపి యదియె
    దుష్టుఁడై దుష్కృతముఁ జేయ దొరకు పునెము

    ఉ॥ దుష్కృత మాచరించు ఘనదుష్టున కబ్బు నితాంత పుణ్యముల్
    శుష్కపు పల్కులాడి యిటు క్షుద్రులఁ గాంచుచుఁ బ్రోత్సహించ నా
    విష్కరణమ్ముఁ జేయఁ గడు భీతినిఁ గొల్పెడు హీన కృత్యముల్
    నిష్కృతి నెంచ దుష్టులను నీతినిఁ బాసిన వారిఁ ద్రుంచుటే

    (విష్ణువు కూడ వివిధ అవతారములలో చేసినదే నండి)

    రిప్లయితొలగించండి
  5. మంచి పెంచెడు కార్యాల మనసుపెట్టి
    పూర్తి గావించిన పిదప పుణ్యమబ్బు
    చెడుతలంపులు విడనాడి చెప్పుమెటుల
    దుష్టుఁడై దుష్కృతముఁ జేయ దొరకు పునెము?

    నిష్కప టంబుగా పనులు నిత్యమొనర్చిన పుణ్యమబ్బునా?
    పుష్కల పుణ్యకార్యములు పూర్తియొనర్చిన పుణ్యమబ్బునా?
    శుష్కపు యోచనల్ తమకు శోభనొసంగునె? తెల్పు మెవ్విధిన్
    దుష్కృత మాచరించు ఘనదుష్టున కబ్బు నితాంతపుణ్యముల్?

    రిప్లయితొలగించండి
  6. మంచి వాడయి చేసిన మంచి పనికి
    పొందు దు రె వరైనను గద పుణ్య మనగ
    భావ మందు చెడు తలపు వాని కె టుల
    దుష్టు డై దుష్కృ తము జేయ దొరకు పునె ము

    రిప్లయితొలగించండి
  7. కనుల ముందు జరుగు చుండఁ గనవె యాప
    వె నినదింపవె వలదని కని పనులను
    గనము విన మిట్టి మాటను మనము వినుమ
    దుష్టుఁడై దుష్కృతముఁ జేయ దొరకు పునెము


    దుష్కర మైన సత్యమును దుఃఖము లందినఁ దప్పకుండ నా
    విష్కృత మెవ్విధమ్మున నభీతి నొనర్పఁగ దప్ప దేరికిన్
    నిష్కృత మిద్ధరా తటిని నేరము దుష్ట చరిత్ర కోటికిన్
    దుష్కృత మాచరించు ఘన దుష్టున కబ్బు నితాంత పుణ్యముల్

    [దక్కును + ఇతాంత = దక్కు నితాంత; ఇతము = గతి; ఇతాంత పుణ్యముల్ = గతిని ననఁగా జన్మ మార్గమున నంత మైన పుణ్యములు]

    రిప్లయితొలగించండి
  8. నిష్కృతిలేని పాతకము నెట్టన దక్కును నిశ్చయమ్ముగా
    దుష్కృత మాచరించు ఘనదుష్టున, కబ్బు నితాంతపుణ్యముల్
    నిష్కపటాత్ముడై వెలుఁగు నిర్మలచిత్తునకెల్ల వేళలన్
    దుష్కృతముల్ శుభమ్ములిటు దూకొనుచుండును మానవాళికిన్

    రిప్లయితొలగించండి
  9. పాపపంకిలమున జొచ్చి భంగపడును
    దుష్టుఁడై దుష్కృతముఁ జేయ, దొరకు పునెము
    శిష్ట మార్గానుగామియై చెలఁగినపుఁడు
    పాపపుణ్యముల్ దక్కునీ పగిది మనకు

    రిప్లయితొలగించండి

  10. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    లంకలో బెట్ట సీతను రావణుండు
    రాముడు కపులతోడను లంక చేరి
    రణమొనర్చగ భ్రాత లక్ష్మణుడు కూడి
    రామచంద్రుని చేతిలో ప్రాణములను
    విడిచి మోక్షముఁ బొందెను కడకు రాజు
    దుష్టుడై దుష్కృతముఁజేయ దొరకు పునెము.

    రిప్లయితొలగించండి
  11. చేరును నరకమును తాను శీఘ్రగతిన
    కానిపనులనుచేసిన కట్టకడకు*
    “దుష్టుఁడై దుష్కృతముఁ జేయ, దొరకు పునెము”*
    మంచిపనులనుచేసిన మహినినెపుడ
    నిష్కృతిలేనితప్పులను నేరుపుతోడను చేసితప్తుడై
    నిష్కృతిగోరుచున్సతము నేరము చేయక నెమ్మనంబునన్
    ముష్కరబుద్ధివీడుచనుమోహనరూపునిగొల్చినంతనే
    *“దుష్కృత మాచరించు ఘనదుష్టున కబ్బు నితాంతపుణ్యముల్”*


    రిప్లయితొలగించండి
  12. రిప్లయిలు
    1. “దుష్టుఁడై దుష్కృతముఁ జేయ దొరకు పునెము”

      నిదుర హారములెరుగక నియతి తోడ
      శత్రు సైనిక దాడిని శౌర్యముగను
      ధైర్య వంతుడై ఢీకొని దాడి జేసి
      “దుష్టుఁడై దుష్కృతముఁ జేయ దొరకు పునెము”

      సురేష్ కుమార్ రామోజు

      తొలగించండి