17, ఏప్రిల్ 2026, శుక్రవారం

సమస్య - 5442

18-4-2026 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“అన్ననుఁ బతిగఁ గొని యతివ మురిసె”

(లేదా...)

“అన్నను భర్తగాఁ గొనియె నన్నులమిన్న గడున్ ముదంబునన్”

15 కామెంట్‌లు:

  1. ఆటవెలది
    వెన్నుని కడకంపి విప్రవర్యుఁ దనదు
    మానసమ్ము దెలిపి మనువుఁ గోరి
    పంకజాక్షునంది వైదర్భి, యన్న కా
    దన్ననుఁ బతిగఁ గొని యతివ మురిసె

    ఉత్పలమాల
    వెన్నుని భక్తితోఁ గొలిచి విప్రునినంపియు దెల్పగన్ మదిన్
    మన్నన తోడ కాన్కలిడి మానినినందగ వత్తునంచనెన్
    దిన్నఁగఁ దేరునన్ గొనఁగఁ దీరగ రుక్మిణి సాగె, యన్న కా
    దన్నను భర్తగాఁ గొనియె నన్నులమిన్న గడున్ ముదంబునన్!

    రిప్లయితొలగించండి
  2. పరిపరి విధములుగ భావించి చూడగ ,
    దండ్రి మాట వినక దప్ప దనుచు ,
    గడన రహితుడయ్యు కామనుడనుచు సా
    యన్ననుఁ బతిగఁ గొని యతివ మురిసె

    రిప్లయితొలగించండి
  3. శివుని ధనువు విరిచి సీతను వరియింప
    సభయు మె చ్చె నతని సాహసమును
    సీత ముదము నంది జీవి తే శుని గ రా
    మన్న ను పతిగగొని యతివ మురిసె

    రిప్లయితొలగించండి

  4. *(సుభద్ర తో అర్జునుడు పలికిన మాటలు గా...)*

    అధముడు శిశు పాలు డంచు దలచి తాను
    మురళి ధరుని బిలువ, ముదిత పిలుపు
    నాలకించి వచ్చె నహిరిపువైన మీ
    యన్ననుఁ బతిగఁ గొని యతివ మురిసె.


    అన్నయె నిర్ణయించిన దురాత్ముని కాదని పెండ్లి యాడగా
    వెన్నుని రమ్మటంచు నొక విప్రుని కృష్ణుని చెంత కంపి యా
    చెన్నుని పింఛధారి యదు శ్రేష్ఠడు దేవకి నందనుండు మీ
    యన్నను భర్తగాఁ గొనియె నన్నులమిన్న గడున్ ముదంబునన్.

    రిప్లయితొలగించండి
  5. శివ ధనుస్సు విరిచె శ్రీరామ చంద్రుడే
    పరవశాన జనులు ప్రస్తుతింప
    వరుని కంఠ సీమఁ వరమాల వైచి రా
    మన్ననుఁ బతిగఁ గొని యతివ మురిసె

    కన్నుల ముందునిల్చి కరకంఠుని ధర్మము నెక్కుపెట్టగా
    మిన్నుల ముట్టె కేకిసలు మేలగు రీతిని రామచంద్రుడే
    మన్నన లందినంత వరమాలను వైచినదై మహీజ రా
    మన్నను భర్తగాఁ గొనియె నన్నులమిన్న గడున్ ముదంబునన్

    రిప్లయితొలగించండి
  6. కన్నులందు విరిసె వెన్నెల సీతకు
    విరువ రామమూర్తి హరుని విల్లు
    జానకి మదిలోన సమ్మోదమొందె రా
    మన్ననుఁ బతిగఁ గొని యతివ మురిసె

    క్రన్నన మౌని యాజ్ఞఁగొని రాఘవుఁ డెక్కిడ శైవచాపమున్
    వెన్నడి వ్రయ్యలయ్యెనది వేడ్కగ నెల్లరు జూచుచుండగా
    కన్నులలోన వెన్నెలలు కల్కి మహీజకు చెంగలించ రా
    మన్నను భర్తగాఁ గొనియె నన్నులమిన్న గడున్ ముదంబునన్

    రిప్లయితొలగించండి
  7. ఉ॥ మిన్నగఁ బంట భూములును మిక్కిలి హెచ్చుగ సంపదాదులున్
    గొన్ని పరిశ్రమల్ గలిగి కోరిన రూపున నొప్పుచుండఁగన్
    మన్నన సేసి ప్రేమఁ గని మాన్యుఁడటంచు వరించి తాను సు
    బ్బన్నను భర్తగాఁ గొనియె నన్నుల మిన్న గడున్ ముదంబుగన్

    సుబ్బన్న సుబ్రహ్మణ్యంకు ముద్దుపేరండి. నేటి అమ్మాయిల ఆశలు ప్రతిబింబించేందుకు ప్రయత్నించానండి

    రిప్లయితొలగించండి
  8. కన్నుకు రెప్పయుంబలెను కాచుచు నుండెడు వాడు మిక్కిలిన్
    సున్నిత మైన మానసము సుందర రూపము కల్గి నట్టి వెం
    కన్నను భర్తగాగొనియె నన్నుల మిన్న కడున్ ముదంబునన్
    పిన్నతనంబునుండి తన ప్రేమను జూపుచు వానిపైననున్

    రిప్లయితొలగించండి
  9. -

    రాధ స్నేహితి తన రారంగ నద్దాని
    అన్ననుఁ బతిగఁ గొని యతివ మురిసె

    రిప్లయితొలగించండి
  10. పన్నుగ నాసభాస్థలిని భవ్య పరాక్రమ
    యోద్ధలందరున్
    క్రన్నన చూచుండగను గార్ముక
    మెత్తెను రామచంద్రడున్
    చెన్నగు సీత తోషమున చెల్వము
    గా జని హారమేసి రా
    మన్నను భర్తగా గొనియె యన్నుల
    మిన్న గడున్ ముదంబునన్.

    రిప్లయితొలగించండి
  11. కన్నది శౌర్య వంతు నొక కానన మందు హిడింబ యిచ్చతో
    క్రన్నన చిక్క మానసము కాంతునిగా గ్రహియించు కోర్కెతో
    చెన్నగు రూపు కుంతికడ చేరి, వరమ్ము లభింప బ్రీతి భీ
    మన్నను భర్తగాఁ గొనియె నన్నులమిన్న గడున్ ముదంబునన్

    రిప్లయితొలగించండి
  12. చూచు వార లెల్లఁ జూడ ముచ్చ టయిన
    జంట యంచుఁ బొగడఁ జంద్ర వదన
    మన మలరఁగఁ దనదు చిననాఁటి చెలికత్తె
    యన్ననుఁ బతిగఁ గొని యతివ మురిసె


    మిన్నగఁ దన్ను జూచు నను మేటి తలంపు సెలంగ నాత్మలోఁ
    గ్రన్నన నుద్యమించి చెలికాని వరించి వరింపఁ జేసి తా
    మన్ననఁ జిన్న నాఁటి యభిమానినిఁ జింతిల కుండ నెవ్వ రే
    మన్నను భర్తగాఁ గొనియె నన్నులమిన్న గడున్ ముదంబునన్

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    చదువు గలిగి,చూడ చక్కని వాడును
    మానవత్వమున్న మనుజు డతడు
    వదల లేక నతని వలపును హితురాలి
    యన్నను బతిగఁ గొని యతివ మురిసె.

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    కన్నుల ముందె శంకరుని కార్ముక మెత్తగ
    రామచంద్రుడున్
    మిన్నగ సంతసించితిరి మేటి సభాసదులెల్ల
    రున్ భళా!
    కన్నుల కాంతులున్ మెరయ కల్కి
    మహీజయు దండ వైచి రా
    మన్నను భర్తగాఁ గొనియె నన్నులమిన్న గడున్
    ముదంబునన్.

    రిప్లయితొలగించండి