18, ఏప్రిల్ 2026, శనివారం

సమస్య - 5443

19-4-2026 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“గాడిదలు గానమొనరించెఁ గమ్రముగను”

(లేదా...)

“ఘనముగ గాడిదల్ మధురగాన మొనర్చె సభాంతరమ్మునన్”

14 కామెంట్‌లు:

  1. అడవినందలి జంతువులన్ని కూడి
    సదము నేర్పాటు జేసిన సమయమందు
    నధిపు డయినట్టీ సింహము నామతించ
    గాడిదలు గానమొనరించెఁ గమ్రముగను

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    గాత్రమభ్యాసమెంచెడు మిత్రతతిని
    'గాడిద'లనుచు నూరిలోఁ గలతపెట్టఁ
    జెలఁగి నైపుణ్యమొంది కచేరి లోన
    'గాడిద'లు గానమొనరించెఁ గమ్రముగను

    చంపకమాల
    అనయము మిత్రబృందమది యాశయమున్నెరవేరనెంచి వా
    రనువగు చోట గానముల హ్లాదమునొంద 'ఖరంబు' లంచు నూ
    రిని పరిహాస మాడ కడు రీతిగ నైపుణిఁబొంది మెచ్చగన్
    ఘనముగ 'గాడిదల్' మధురగాన మొనర్చె సభాంతరమ్మునన్

    రిప్లయితొలగించండి

  3. నేత లవినీతి పరులైన భీతి లేక
    సత్య వంతుల మని ప్రవ చనములిడగ
    గాంచి పలికెనో చతురుడు కాంత తోడ
    గాడిదలు గానమొనరించెఁ గమ్రముగను.


    జనమును ముంచి భూరిగ ప్రజా ధనమున్ కబళించి నేతలే
    జనులకు మేలు సేతుమని చక్కని పాలన నిత్తు మంచు తా
    మనృతము లెన్నొచెప్ప విని యచ్చటనే గల పండితుండనెన్
    ఘనముగ గాడిదల్ మధురగాన మొనర్చె సభాంతరమ్మునన్.

    రిప్లయితొలగించండి
  4. మంచి పాటలఁ బాడగ నెంచినట్టి
    యోగ్యు లచట పాటనడుమ నోండ్రపెట్ట
    ప్రేక్షకులు విని తెలిపిరి ప్రియముగాను
    గాడిదలు గానమొనరించెఁ గమ్రముగను

    మనసుకు నచ్చుపాటలని మంచివి పాడుచు బృంద గాయకుల్
    ఘనతర మైన రీతినట గాడిద పోలికఁ గూయ ప్రేక్షకుల్
    కనుగొని వక్కణించిరట గాడిద లైరిట యోగ్య గాయకుల్
    ఘనముగ గాడిదల్ మధురగాన మొనర్చె సభాంతరమ్మునన్

    [పదహారేళ్ళ వయసు సినిమా లో.....'కట్టుకతలు చెప్పి నేను కవ్విస్తే
    నవ్విస్తే' అనే పాట పాడుటకు గాడిదలా ఓండ్ర పెట్ట వలసి యుంటుంది.]

    రిప్లయితొలగించండి
  5. అభ్య సింప గ వచ్చిన నర్భ కుల ను
    గాడిద లనుచు దూషించె గాయ కుండు
    సాధన ము జేసి నిపుణులై సభల యందు
    గాడిదలు గాన మొన రించె గమ్ర ముగను

    రిప్లయితొలగించండి
  6. జంగలమ్మున మృగరాజు జన్మదినము
    సకల జంతుజాలమచట సభను దీరె
    నక్క లూళలు వేయుచు నాట్యమాడ
    గాడిదలు గానమొనరించెఁ గమ్రముగను

    రిప్లయితొలగించండి
  7. జన్మ దినము సింహమునకు జరుప దలచి
    కానలో మృగాలన్నియు కలుసుకొనగ
    నక్కలూళలు వేయగ చక్కగాను
    గాడిదలు గానమొనరించె గమ్రముగను

    రిప్లయితొలగించండి


  8. తే॥ వాడి యధిక శబ్దములిచ్చు వాద్యములను
    గాన సరళి మ్రోగ నటుల గట్టిగాను
    బలికి రెల్లరు భీతిల్లి వ్యంగ్యమొప్ప
    గాడిదలు గానమొనరించెఁ గమ్రముగను

    చం॥ ధనధన కర్ణభేరి యటు ధ్వంసము నొందెడి రీతి డప్పులన్
    వినఁగను మూర్ఛపోవు విధి వింతగ మద్దెల డోలు వాడుచున్
    జనఁగను వాద్యబృందములు సర్వులుఁ బల్కిరి వ్యంగ్యమొప్పఁగన్
    ఘనముగ గాడిదల్ మధుర గానమొనర్చె సభాంతరమ్మునన్

    రిప్లయితొలగించండి
  9. తే.గీ:పూర్వ మట దగ్గరగ నుండె పులులు తిరుగు,
    నడవి నేడంతరించె, నయ్యది నశింప
    గాడిదలె మెచ్చు తమ దగు గాన గతుల
    గాడిదలు గానమొనరించెఁ గమ్రముగను”
    (ప్రక్కన పులులు తిరిగే అడవి ఉంటే గ్రామం లో జంతువులకి శాంతి ఉండదు. అది నశించే సరికి గాడిదలు సంతోషం తో గానం చేసాయి. ఆ గానం కమ్రం గా ఉంటుందా? అంటే ఆ జాతి
    మెచ్చుకొనేటట్టే పాడాయి. )

    రిప్లయితొలగించండి
  10. చం:ఉనికిన లేనివౌ నతిశయోక్తుల బల్కు కవీంద్రు డిట్లనెన్
    "మునుల తపో వనమ్ములను మోదముతోడుత లేళ్లు,సింగముల్
    ఘన మగు నెయ్యముల్ బడసె, గాన కళన్ ప్రభు వెంతొ మెచ్చగా
    ఘనముగ గాడిదల్ మధురగాన మొనర్చె సభాంతరమ్మునన్”
    ( కవుల అతిశయోక్తులు ఇలా ఉంటాయి.)

    రిప్లయితొలగించండి
  11. వనమున కేశి జన్మదిన వైభవముంగన సంజ వేళలో
    పనులను మాని వచ్చినవి పండుగ చేయఁగ జంతుజాలముల్
    కనులకు విందుగూర్చుచు మృగంబులు నృత్యము లాడుచుండగా
    ఘనముగ గాడిదల్ మధురగాన మొనర్చె సభాంతరమ్మునన్

    రిప్లయితొలగించండి
  12. -
    ఓండ్ర యన నేమియొ తెలుప నొక్క గురువు
    గారు పిల్లలును బజారు గరిడి జేర
    గాడిదలు గానమొనరించెఁ గమ్రముగను
    చూచి సంతస మొంది కిసుక్కు నగిరి


    రిప్లయితొలగించండి
  13. ప్రేమ డింభక దంభక నాముల నిల
    డి ద లు గఁ బిలుతు రెల్లరు ముదము మీఱ
    గాన సభ లోన జంట లక్కరము లనువు
    గా డి ద లు గాన మొనరించెఁ గమ్రముగను


    వనజ దళాక్షి యొక్క పరి పాడిన పాటను బాడకుండఁగాఁ
    దనరఁగ వాద్య రావములు తద్ద ముదమ్మున గాన కోకిలే
    తొనఁకు సెలంగ మేనుల సుదూరము పాఱఁ బయోధి భంగ లం
    ఘనముగ గాడిదల్, మధుర గాన మొనర్చె సభాంతరమ్మునన్

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    మోయుచుండి బరువులను మూపుపై ర
    జకులకు ప్రతి దినమ్మును సాయపడును
    గాడిదలు; గానమొనరించెఁ గమ్రముగను
    దేవళంబున భక్తులు దీక్ష తోడ.

    రిప్లయితొలగించండి