30, ఏప్రిల్ 2026, గురువారం

సమస్య - 5455

1-5-2026 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“తప్పునుఁ దప్పే యనంగఁ దప్పగును గదా”

(లేదా...)

“తప్పునుఁ దప్పుగా నెఱిఁగి తప్పని పల్కుట తప్పెయౌఁ గదా”

(అక్కెర కరుణాసాగర్ గారికి ధన్యవాదాలతో...)

17 కామెంట్‌లు:

  1. ఇప్పటి కాలము నందున
    దప్పగ నేర్వదగుదైన దారిని యెంచన్
    గొప్ప పదవి గల జనుల
    తప్పునుఁ దప్పే యనంగఁ దప్పగును గదా

    రిప్లయితొలగించండి
  2. కందం
    ముప్పు ఘటిల్లు పదవినిన్
    గొప్పగ కూర్చున్న వారి కుటిలమునెంచన్
    దిప్పలు పరోక్ష దాడులఁ
    దప్పునుఁ దప్పే యనంగఁ దప్పగును గదా

    ఉత్పలమాల
    ముప్పు ఘటిల్లెడున్ పదవి పోందిన నేతల తప్పులెంచినన్
    గొప్ప వ్యవస్థలున్ దరుమ కూలబడంగను దప్పదెప్పుడున్
    దిప్పల జిక్కుచున్ నడత తీరును మార్చక కార దిక్కగున్
    దప్పునుఁ దప్పుగా నెఱిఁగి తప్పని పల్కుట తప్పెయౌఁ గదా!

    రిప్లయితొలగించండి

  3. ఎప్పుడు మౌనము వీడకు
    ముప్పది చెప్పెదను వినుము, మూర్ఖుండిలలో
    చెప్పినదె యొప్పు వారికి
    తప్పునుఁ దప్పే యనంగఁ దప్పగును గదా.


    చెప్పెద నాలకింపుమది క్షేమము గోరి వచింతు నియ్యదిన్
    ముప్పును దెచ్చు నంటి కడు మూర్ఖుల తో వ్యవ హారమందు, నీ
    కెప్పుడు వాగ్వివాదమది యింపును గూర్చగలేదు వారితో
    తప్పునుఁ దప్పుగా నెఱిఁగి తప్పని పల్కుట తప్పెయౌఁ గదా.

    రిప్లయితొలగించండి
  4. ముప్పు ఘటిల్లు తప్పకను మూర్ఖులు దుష్టులు గద్దె నెక్కినన్
    ఎప్పటి కప్పుడున్ ధనము నెంతయొ వారలు దోచి దాచినన్
    చిప్పయు చేతికిచ్చినను చెప్పగ వద్దుగ వారిచేష్టలన్
    తప్పును దప్పుగా నెఱిగి తప్పని పల్కుట తప్పెయౌ గదా

    రిప్లయితొలగించండి
  5. తప్పగు సీతను దెచ్చుట
    తప్పక విడనాడకున్నఁ దప్పౌననుచున్
    జెప్పెను విభీషణుండే
    తప్పునుఁ దప్పే యనంగఁ దప్పగును గదా

    తప్పగు సీతనిచ్చటకు ధర్మము నెంచక తెచ్చియుంచుటే
    తప్పగు శత్రు శక్తిని వితర్కము సేయక సాగిపోవుటే
    విప్పితి డెందమున్ గుజను వీడమటంచు విభీషణుండనెన్
    దప్పునుఁ దప్పుగా నెఱిఁగి తప్పని పల్కుట తప్పెయౌఁ గదా

    రిప్లయితొలగించండి
  6. డిజిటల్ భువన విజయం -
    పాప్ కార్న్ పొయెట్రీ
    ( పేలాల లవంగ శతకం )

    https://youtu.be/IS1PTEx3B6s?si=t-mQwDUBuN30pFho



    రిప్లయితొలగించండి
  7. -

    శ్యామలీయం గారి జిలేబి‌ శతకం

    ఆడియో పాడ్కాస్ట్

    https://varudhini.blogspot.com/2026/04/blog-post_29.html


    రిప్లయితొలగించండి
  8. కుప్పలుగా ధనముండిన
    నొప్పులగును తప్పులైన నుర్వీస్థలిలో
    చెప్పెదనొక సూక్తి వినుము
    తప్పునుఁ దప్పే యనంగఁ దప్పగును గదా

    రిప్లయితొలగించండి
  9. ఎప్పుడు సంపదల్ గలుగు నెప్పుడు విశ్రుతమొందు సంఘమం
    దప్పుడు వాని చేయుపనులన్నియు గొప్పగ జూతురెల్లరున్
    తప్పులు కానరావు ప్రథితమ్మగు నే పనియైన నెన్నఁడున్
    తప్పునుఁ దప్పుగా నెఱిఁగి తప్పని పల్కుట తప్పెయౌఁ గదా

    రిప్లయితొలగించండి
  10. కం: అ ప్పండితు డవధానము
    తప్పుల తో జేసె గాని, తగునే సభలో
    జెప్పుట, నూర్వురు వినగా
    తప్పునుఁ దప్పే యనంగఁ దప్పగును గదా!
    (అవధాని ఏవో కొన్ని తప్పులు చేసాడయ్యా!మీరు మాత్రం సభలో చెప్పేస్తారా?చాటున చెప్పాలి కానీ!అలా చెప్పేస్తే ఆయన తో అవధానం ఎలా చేయించారు? అని మననే అంటారు. )

    రిప్లయితొలగించండి
  11. ఉ:తప్పులు నాయకాళియె స్వతంత్రపు నాళ్ల నొనర్చినారు లే !,
    యొప్పక వారె గొప్ప యని, యొక్కటి దోషము జూప నీ సభన్
    జెప్పుల తోడ గొట్టెదరు, చేరిరి మూర్ళపు భక్తు లీ సభన్
    తప్పునుఁ దప్పుగా నెఱిఁగి తప్పని పల్కుట తప్పెయౌఁ గదా!”
    (పూర్వం నాయకులు కొన్ని తప్పులు చేసారు కానీ వాటిలో ఒకటి చెప్పినా ఈ భక్తులు చెప్పుల తో కొట్టేటట్టున్నారు. ఇక్కడ చెప్పటం తప్పే. )

    రిప్లయితొలగించండి
  12. గొప్పలు జెప్పుక దిరిగుచు
    మెప్పులు పొందంగ జూచి మేటిగ మసలే
    తప్పుడు వారల కెప్పుడు
    తప్పును తప్పనంగ దప్పగును గదా!

    రిప్లయితొలగించండి
  13. సమస్య : "తప్పునుఁ దప్పే యనంగఁ దప్పగును గదా"

    ఒప్పుల కుప్పవు నీవని
    యెప్పుడు భామల పొగడఁగనిల భద్రమ్మౌ
    చప్పున నోర్మూసుకొనక
    తప్పునుఁ దప్పే యనంగఁ దప్పగును గదా

    రిప్లయితొలగించండి
  14. ఎప్పుడు నెవ్వ రయినఁ దన
    తప్పు నెఱుంగక యెడందఁ దలపోయక తా
    నొప్పుగఁ దలంచి వింతగఁ
    దప్పునుఁ దప్పే యనంగఁ దప్పగును గదా

    [తప్పే = తప్పా, కాదని]


    మెప్పు వహింతు రెల్లరును మిన్నగ మౌనము నూని సుంతయుం
    జప్పుడు సేయకుండ నృప సత్తము నింపుగ నాలకించినన్
    గొప్ప సదస్సు నందు నృప కుంజరుఁ డాడిన మాట లందు నే
    తప్పునుఁ దప్పుగా నెఱిఁగి తప్పని పల్కుట తప్పెయౌఁ గదా

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ఒప్పుకొనెద రెవరైనను
    తప్పునుఁ దప్పే యనంగఁ; దప్పగును గదా
    తప్పును చెప్పిన నొప్పని,
    తప్పని చెప్పకు మెపుడు నితరులకు నొప్పున్.

    రిప్లయితొలగించండి
  16. కం॥ చెప్పుదు వేదము వినఁదగు
    దెప్పకు దోషములఁ గనఁగ దేవేరి యటుల్
    గొప్పలు పలికినఁ దెలిసినఁ
    దప్పునుఁ దప్పే యనంగఁ దప్పగును గదా

    ఉ॥ చెప్పుదు నేర్చుకో సఖుఁడ శ్రేయము నొందఁగఁ బత్ని పల్కఁగన్
    దెప్పుచు దోషమెంచకుమ తెల్సిన, జీవిత మందునెప్పుడున్
    ముప్పును గాంచఁ బోవు తగు మోదము దక్కును వేద మిద్దియే
    తప్పనుఁ దప్పుగా నెఱుఁగి తప్పని పల్కుట తప్పెయౌ గదా!

    రిప్లయితొలగించండి
  17. గొప్పమనస్సటంచునొక కోమలి హస్తము నందుకొంటివే
    చెప్పుచు నుంటి విప్పుడతి చేయుచు నుండె నటంచు, మిత్రమా!
    యొప్పుగ నెంచు భార్యనుడి నొద్దికతో, లలిఁ గోరుకున్నచో
    తప్పును దప్పుగా నెఱిగి తప్పని పల్కుట తప్పెయౌఁగదా

    రిప్లయితొలగించండి