23, ఏప్రిల్ 2026, గురువారం

సమస్య - 5448

24-4-2026 (శుక్రవారం) 
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దానముం జేయఁ డెన్నఁడు దాత యయ్యె”
(లేదా...)
“దానముఁ జేయఁ డెన్నఁడును దాతగఁ గీర్తి గడించె లుబ్ధుఁడే”

13 కామెంట్‌లు:

  1. ఉర్వినందు నిండుగ కీర్తి నొంద , గుప్త
    దానముం జేయఁ డెన్నఁడు , దాత యయ్యె
    తిండినిడి భుక్తినెరుగని దీనులకయి ,
    యశమునొంద కోరుకొనుట యంకమగునె

    రిప్లయితొలగించండి

  2. పేద వారల గుర్తించి పేర్మి తోడ
    ధనము దాన మొసంగుటె ధర్మ మంచు
    వ్యసన పరులు కోరిన నేమి యయ్య పాత్ర
    దానముం జేయఁ డెన్నఁడు దాత యయ్యె.

    బోనము లేని పేదలకు భోజన మందగ జేయ నేమిరా
    మౌనమువీడనట్టి గుణ మాన్యుడు దాత నటంచు తా నిలన్
    దీనుల కెల్ల వేళలను దిక్కుగ నిల్తునటంచు శుష్క వా
    గ్దానముఁ జేయఁ డెన్నఁడును దాతగఁ గీర్తి గడించె లుబ్ధుఁడే

    రిప్లయితొలగించండి
  3. దాన ధర్మము లొనరించి వాని తాత
    తరగని యశము నార్జించె ధరణిపైన
    పలు విధముల దానమ్ములఁ బరపు రక్త
    దానముం జేయఁ డెన్నఁడు దాత యయ్యె

    వాని పితామహుండు గనవచ్చును గాదె ప్రశంసనీయుడై
    తానెలకొల్పె గోష్ఠములఁ దద్దయుఁ బేర్మిని గాచె గోవులన్
    దానము లెన్ని చేసినను దక్షతతోడ మెలంగువాడు గో
    దానముఁ జేయఁ డెన్నఁడును దాతగఁ గీర్తి గడించె లుబ్ధుఁడే

    రిప్లయితొలగించండి
  4. Claude పూరణ :

    విత్తమిచ్చుట గాదయా వేఁడువారి
    చిత్తమందలి వేదన చెప్పకుండ
    మెత్తని మాటలే చెప్పి మేలు చేయు
    దానముం జేయఁ డెన్నఁడు దాత యయ్యె॥

    రిప్లయితొలగించండి
  5. ఉ॥ కానల యందు చిక్కుకొని కాంచక దారులఁ గొందరావిధిన్
    దీనతఁ గాంచి యాఁకలికి దిక్కును దోఁచక నుండ రోయుచున్
    మానక వారి జాడఁ గని మన్ననఁ బొందఁగఁ బ్రాణ దాతయై
    దానముఁ జేయఁ డెన్నఁడును దాతగఁ గీర్తి గడించె లుబ్ధుఁడే

    రోయు వెదకు
    (ఈమధ్య చిక్కమగుళూరు అడవులలో జరిగిన సంఘటన ఆధారంగా నండి, 4-5 రోజుల తరువాత ఆమెను కనుక్కున్నారు)

    రిప్లయితొలగించండి
  6. పేదసాదల పాలిటి పెన్నిధివలె
    కష్టముల నాదుకొను నెప్డు కరుణ జూపి
    ధనముఁగలిగియున్నను గాని తా నపాత్ర
    దానముం జేయఁ డెన్నఁడు దాత యయ్యె

    రిప్లయితొలగించండి
  7. తానొక ధర్మదాత సుపథమ్మును వీడక సంచరించుచున్
    దీనజనాళి రక్షణమె దీక్షగ బూను దయామయుండునై
    దానమొసంగు, నన్యుల కుదారత జూపఁడపాత్రమైనచో
    దానముఁ జేయఁ డెన్నఁడును దాతగఁ గీర్తి గడించె లుబ్ధుఁడే

    రిప్లయితొలగించండి
  8. తేటగీతి
    డేగ తరుమ కపోతము బేగివచ్చి
    శరణన నభయ మిడి 'శిబి చక్రవర్తి'
    తానె డేగ పాలైన కతనఁ, 'గొరతగ
    దానముం జేయఁ డెన్నఁడు' !'దాత యయ్యె' !

    ఉత్పలమాల

    దీన కపోతమున్ దయను దీరిచి డేగకు తానె మాంసమై
    మానుగ నిలిచినవాడు శిబి మర్మము దానగుణంబె! యెప్పుడున్
    దా నభయమ్ము నిచ్చి బలిదానము నైనను చాలనట్లుగన్
    దానముఁ జేయఁ డెన్నఁడును దాతగఁ గీర్తి గడించె! లుబ్ధుఁడే?

    రిప్లయితొలగించండి
  9. ప్రాణము కన్నమిన్నగను భావన జేయుచు పేదవారినన్
    దానము జేయు డబ్బులను దగ్గర దీయుచు వారినెప్పు భూ
    దానము జేయకుండినను దాతగ గీర్తి గడించె లుబ్ధుడే
    దీనిని పట్టుకొల్పుదురె ధృత్వరి యందున నెవ్వరేనియున్

    రిప్లయితొలగించండి
  10. శంకరాభరణం గ్రూపు వారు ఇచ్చిన సమస్యలకు నా పూరణలు

    సహృదయమ్ము తో పరులకు సాయపడుచు
    కోరకమదిలో నైనను గొప్పదనము
    పనికిరాని చిన్నచితక వస్తువులను
    *“దానముం జేయఁ డెన్నఁడు, దాత యయ్యె”*


    హీనగుణుండుతానయిన హేయపు వర్తనచేతరోయుచున్
    మానము కూల్చునంచరసి మాటలుహెచ్చుగనాడకెల్లరున్
    మౌనముపూనియుండ ప్రజ మానసమందున లెక్కచేయడే
    *“దానముఁ జేయఁ డెన్నఁడును దాతగఁ గీర్తి గడించె లుబ్ధుఁడే”*
    డా బల్లూరి ఉమాదేవి

    రిప్లయితొలగించండి
  11. ఆరితేఱెను భూదాన మందు మిగుల
    సుప్రసిద్ధ కనక దాన శోభితుండు
    కాని యక్కజముగ నొక్క కన్య నైన
    దానముం జేయఁ డెన్నఁడు దాత యయ్యె


    దానము సేయఁ గశ్యపుఁడు ధారుణిఁ గొంటయె కాని నేరమే
    దానము నందుఁ గర్ణుఁ డల తద్ద ప్రసిద్ధి వహించె నింపుగా
    వానికిఁ దాత యౌట ముని వర్యుఁడు ధాత యభీష్ట మయ్యెనే
    దానముఁ జేయఁ డెన్నఁడును దాతగఁ గీర్తి గడించె లుబ్ధుఁడే

    [ఎన్నఁడును+తాతగ=ఎన్నఁడును దాతగ]
    ఒక వింత: కశ్యపునకు నర్జునుఁడు మనుమఁడు, ధర్మరాజు మునిమనుమఁడు!

    రిప్లయితొలగించండి
  12. పేద సాదల యెడల తా పెన్ని ధి గను
    సర్వ వేళల వారికి సాయ పడుచు
    పాటు పడుచుండు కాని యపా త్ర మైన
    దాన ముం జేయ డెన్నడు దాత యయ్యె

    రిప్లయితొలగించండి