13, ఆగస్టు 2016, శనివారం

పద్మావతీ శ్రీనివాసము - 28




పద్మావతీ శ్రీనివాసము (ద్విపద కావ్యము)
రచన : పోచిరాజు కామేశ్వర రావు
సప్తమాశ్వాసము (21-40)

బ్రహ్మ పురస్కృత వాస వాదులును
బ్రాహ్మణోత్తములు నప్సరస లెల్లరును                              21  

సనక సనందాది సంయ మీంద్రులును
మునులు వశిష్టాది పుణ్య పురుషులు                             22

నారద సంయుత నాకర్షులెల్ల
పౌరులు భక్తులు భాగవతులును                                    23

తరలగఁ దన వెంట దామోదరుండు
గరుడ వాహనమునఁ గమలతో జనెను                            24  

పాడగ గంధర్వ పతు లెల్ల రచట
నాడగ చక్కగ నప్సర లెల్ల                                             25

మ్రోగంగ భేరీలు మోద మలరగ
సాగగ తాపస స్వస్తి వాచ్యములు                                   26  

వకుళాది సఖు లుండ వర రథమందు
సకలము గదల విష్వక్సేన గణము                                27

నారాయణ పురము నారాయణుండు
గౌరవమ్ముగఁ జేరె కళ్యాణమునకు                                28  

వరుని రాకఁ గని యప్పార్థివుం డంత
కరిరాజు వీపునఁ గాంత నెక్కించి                                   29

పురవీధులఁ జని గోపురపు ద్వారమున
వరునుని వధువును బన్నుగ నిలిపె                            30

తన కంఠమాలను దామోదరుండు
ననురాగమున వేసె నతివ కంఠమున                           31  

పద్మావతియు నంత వర దామముఁ గొని
పద్మాక్షు మెడలోనఁ భాసిలఁ జేసె                                32

ముమ్మారు లివ్విధి ముద్దు లొలుకగ
నిమ్ముగ వేసిరి యిద్ధ చరితులు                                  33

వాహనమ్ములు దిగి వరుడును వధువు
గేహమ్ముఁ జొచ్చిరి కేల్పట్టు కొనగ                               34

కమలాసనాది నాకౌకసు లెల్ల
రమణీయ కళ్యాణ రాజవేదికకు                                  35

సపరివారము సంతసమ్మునఁ జేర
నపురూపమై తోచె నా మండపమ్ము                           36  

సాంకురార్పణము స్వయంభవు డంత
నంకిత మతి వివాహము జరిపించె                             37

మాంగళ్య ధారణ మహిమం దనరెను
మంగళ వాద్య సంరంభముల్ చెలగ                           38

ధవళమై మెరయు ముత్యాలు గైకొంచు
జవముగ సేసలు సల్ల నొండొరుల                              39

నీరజాక్షు తలను నీలము లాయె
వారిజాక్షి తలను బద్మ రాగములు                           40

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి