11, ఆగస్టు 2016, గురువారం

మొన్న మియాపూరు సన్మానంలో నేను చదివిన పద్యాలు...


శ్రీకృష్ణ దేవరాయా!
శ్రీకృష్ణదేవరాయా!
ప్రాకట కర్ణాట రాజ్య రమణీ రమణా!
నీ కావ్య సుధనుఁ గ్రోలఁగ
మా కందును మధురమైన మాకందములే.


ఆయత బాహువిక్రమ సమార్జిత వంశ పరంపరాగత
శ్రీయుత రాజ్యవైభవ మశేషముఁ జెందియు ధర్మరక్షణో
పాయ విదుండవైన నరపాలశిఖామణి! నీ ప్రజాళికిన్
న్యాయము దప్పకుండగ ఘనంబగు పాలన మందఁజేసితే.

వచియింతున్ భవదీయ విక్రమ కళా భాస్వద్యశోభూషిత
ప్రచురోదంతములన్; సమస్త ఘన కర్ణాటాంధ్ర సామ్రాజ్య స
ద్రచనా కార్య నిరంతరాత్త నిపుణత్వమ్మున్ విభూషింతు; భా
వ చయాంచత్ సుమనోజ్ఞ దివ్య కవితాప్రౌఢిన్ బ్రశంసించెదన్.

నీ యన్గుం బ్రజ కెల్ల మోదమును సంధింపంగఁ బాలించితే
యా యన్యాయపు శత్రుమూఁకల రణంబం దోడఁగాఁ జేసితే
వ్రాయం బొందితి వాంధ్రభాషను కవీంద్రస్థానమున్ విష్ణుచి
త్తీయంబున్ నినుఁ బోలు రాజు కలఁడే దేశమ్మునన్ జూడఁగన్.

ఒక చేతన్ గరవాల మూని రిపురాడుద్వృత్తి ఖండించితే
యొక చేతన్ ఘన ఘంట మూని రసకావ్యోత్పత్తినిన్ జేసితే
వికసించెన్ ముఖ మష్టదిగ్గజ కవుల్ ప్రీతిన్ నినుం జేరి కా
వ్య కళాగేహము లష్టదిక్కుల యశోవ్యాప్తిన్ గనం జేయఁగన్.

రచన - కంది శంకరయ్య, వరంగల్

10 వ్యాఖ్యలు:

 1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ఆణి ముత్యాల వంటి పద్యరత్నములతో అష్టదిగ్గజకవి పోషకుడు నాముక్తమాల్యద ప్రబంధ రచనా దురంధరుడు సార్వభౌముడు నైన శ్రీ కృష్ణ దేవరాయల నలంకృతులను చేసారు. మీలోని కవితా మాధుర్యాని నేడు మేము చూడ కలిగాము. ధన్యులమయ్యాము. మీకు నా హృదయపూర్వక నమః పూర్వకాభినందనలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. సార్వభౌమునిగూరిచిశంకరార్య!
  చదివినటువంటిపద్యాలసరళిజూడ
  తిక్కనార్యుడుతలపించెెనొక్కసారి
  నీదుకవితావిధానమునిజముసుమ్ము

  ప్రత్యుత్తరంతొలగించు
 3. చిక్కని పద్యముల రచించి, ప్రవచించి గురువర్యులు సభికులకు వీనుల విందు కలిగించారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. నమస్కారములు
  గురువులకు అభినందన మందారములు

  ప్రత్యుత్తరంతొలగించు
 5. గురువుగారూ నమస్సులు అభినందనలు

  ప్రత్యుత్తరంతొలగించు
 6. గురువు గారికి అభినందన పూర్వక వందనములు. మీ పద్యాలు అలనాటి అష్ట దిగ్గజ కవి యొకరు కృష్ణదేవరాయల వారిని గూర్చి చెప్పిన పద్యాల స్థాయిలో వుండి రంజింప జేస్తున్నాయి.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. రాయల వారి గురించి ఎంత చక్కని పద్యీాలు వ్రాసారు గురువుగారు...చాలా బాగున్నాయి..అభినందనవందనములు

  ప్రత్యుత్తరంతొలగించు
 8. ఆర్యా రిపురాట్ వృందాళి ఖండించితే కదా భావం.టాబ్ చిత్రాలలో ఇది భాగంగజరిగిన పని అనుకుంటాను

  ప్రత్యుత్తరంతొలగించు
 9. చక్కని పద్యములతో సభనలరించిన మాస్టర్ గారికి అభినందనలు.

  ప్రత్యుత్తరంతొలగించు