11, ఆగస్టు 2016, గురువారం

పద్మావతీ శ్రీనివాసము - 26




పద్మావతీ శ్రీనివాసము (ద్విపద కావ్యము)
రచన : పోచిరాజు కామేశ్వర రావు

షష్ఠాశ్వాసము (41-61)

అల నొసగె జనకుం డనుమతి నాకు
నలినాక్ష కరుణించి నను స్వీకరించు                                                41

నా పల్క కీరమ్ము నగరాజ విభుడు
భూపుత్రి విన్నపము వివరమ్ముగను                                             42

ముదితాంత రంగుడై మురిపెమ్ము లొలుక
సదమల చిత్తకు సమ్మతిఁ దెలిపె                                                   43

అమరుల గూడి నే నరుదెంతునయ్య
కమలాక్షిఁ బెండ్లాడ కమనీయముగను                                          44

శుకరాజ వచియింపు చోద్యమ్ము మీర
నకళంక మీసఖి యానంద మొంద                                              45

దామంబు నిమ్ము పద్మావతికి నభి
రామమై యొప్పదె రాజ నందనకు                                              46

దామంబు నాదేవ దత్తంబు తోడ
భామను జేరంగ బయనించెఁ జిలుక                                            47

చేరి సఖిని తులసీ మాల నిచ్చి
కీరమ్ము తెల్పెఁ జక్రి నుడువు లెల్ల                                             48

మృగనాభి గంధపు మేలైన మాల
సిగపైన ధరియించెఁ జిన్నారి పద్మ                                             49

సంతోష ముప్పొంగ సముచిత రీతి
కాంతులు వెదజల్లు కనకాంకములను                                      50

ధరియించి శ్రీకాంతు దర్శనమునకు
విరియంగ నగుమోము వీక్షించు చుండె                                    51

క్షితిపతి సద్భక్తి శీతాంశు జూచి
నుతియించి కోరె ననువగు భక్ష్యముల                                     52

రస సంయుతమ్మలు రమ్య భోజ్యములు
ను సుగంధ యుతములును చతుర్విధములు                         53  

నైవేద్య యోగ్యము నారాయణునకు
దేవ నర ముని సంతృప్త కరములు                                         54

సమకూర్చె సకలమ్ము సంభారములను
కమనీయముగ నంతఁ గలువల ఱేడు                                    55

పెండ్లి పనుల నెల్ల వేగఁ గావించి
కండ్లు మెరయు నలంకరణఁ జేయించి                                    56

మంత్రి సంయుత సభా మంటప మందు
మంత్ర రాగంపు సంరంభ ముప్పొంగ                                      57

వాద్య ఘోషమ్ములు వ్యాపింప దిశల
హృద్యంపు నృత్యమ్ము లేపార సభల                                     58

రాజ కుమారి నలంకృతఁ జేసి
రాజపత్నియు రాజు రాజస మొప్ప                                    59

మాననీయులు మోద మానసంబునను
శ్రీనివాసునకై నిరీక్షించు చుండ్రి                                         60


కరుణాంతరంగ సకల లోకనాథ                         
సురగణ సన్నుత సుందరాకార                                          61

ఇది విబుధజన వినత కౌశిక సగోత్రోద్భవ పోచిరాజాన్వయ సత్యసుందరీపేర్రాజదంపతీ సుత
వేంకట రామ లక్ష్మీ సతీ సేవిత కామేశ్వర రావు నామధేయ ప్రణీతంబైన
పద్మావతీ శ్రీనివాసమున  షష్ట్యాశ్వాసము.

1 కామెంట్‌:

  1. పద్యము వ్రాయగోరు ఘన పండితు కైనను గష్టమే సుమా
    పద్యమునందు సంది యతి ప్రాసగణాది సమాస కూర్పులున్
    పద్యము లోన వ్యాకరణ భాషయు భావ మెఱుంగకున్నచో
    పద్యము కాలకూటవిషభాండము గాదె కవిత్వవేదికిన్"

    రిప్లయితొలగించండి