3, ఆగస్టు 2016, బుధవారం

పద్మావతీ శ్రీనివాసము - 18




పద్మావతీ శ్రీనివాసము (ద్విపద కావ్యము)
రచన : పోచిరాజు కామేశ్వర రావు
పంచమాశ్వాసము (1-20)

శ్రీరామా కారుణ్యా
కారా కళ్యాణ కారకా కృష్ణా దే
వారాధ్యా దైత్యారీ
క్షీరాంభోధ్యాత్మజేశ శ్రీవత్సాంకా                          1
                                               
ధరణీశు డస్వస్థ తనయను గాంచి
కరము చింతించి యాకాశ రాజు మది                     2

దైవజ్ఞుఁ బిలిపించి తనయ జాతకము
నా విప్రునకుఁ జూపి యడిగె తత్ఫలము                  3                                

సద్బ్రాహ్మణుడు బృహస్పతి సదృశుండు
సద్బ్రహ్మ విజ్ఞాన సంపన్న ఘనుడు                      4

గ్రహము లన్నియు శుభకర గతి నుండె
మహిమాన్వితముగ సంశయము శూన్యమ్ము       5                

నీదు తనయ యందు నిరుప మానముగ
కాదేని నిత్యపు గ్రహ ఫల మెంచ                          6

కొంచెము విభ్రాంత గోచరము గన
నెంచ ప్రశ్న సమయ మించుక నిపుడు                 7

చాయను లగ్నము సరిజూడ లగ్న
నాయకుడు శశి లగ్నమ్మున నుండె                     8

గురువు కేంద్రమ్మున కూర్చుండె దినపు
పురుగు నిద్రను రాజ్యమున  ప్రశ్నపక్షి                 9

ఫలితము గణియించ పార్థివ వినుము
చెలువంపు స్వస్థత చేకురు నయ్య                      10

పురుషోత్తము నొకని ముగ్ధ మోహనుని
నరవింద నిభముఖి యవ్వనా గతుని                  11

కాంచి మోహావేశ కలితాత్మ యాయె
కాంచన వర్ణాభ కన్యకుఁ గల్గు                              12

పురుషోత్తముని యోగము పుడమి నిజము
వరకన్య నొక  తినిఁ బంపునాతండు                      13

శుభమగు మీకు నా సుదతి నుడువుల
కభిమతముగ సాగ గారవ మొప్ప                      14

తనరి యగస్థ్యార్చిత శివ లింగమును
ఘనముగ నభిషేక కలితుఁ జేయంగ                    15

తనయకు కళ్యాణదాయకం బగును
పనుపు విప్రవరులఁ బార్థివేంద్ర యని                   16

దైవజ్ఞుడు వలుక ధరణి నాథుండు
శైవ కార్యము సల్ప సద్బ్రాహ్మణులను                  17

నియమించి మము పిల్చి నెలఁతుక లార
రయమున నేగి మీరలు వస్తు తతిని                    18

సమకూర్చి రండన సత్వర మాల
యమున కేగిన వార మతివ మేమెల్ల                   19

మానినీ నీ యాగమన కారణమ్ము
నీ నామ మెయ్యది నెలవది యేది                       20

2 కామెంట్‌లు:

  1. ఒకరి కొకరునె దురుగాను నుండి పలుకు
    కొనుచు నున్నట్లు దోచెను కువలయమున
    నీదు కావ్యము సోదర ! నిజముగాను
    నిట్టి యద్భుత రచన నీ కెట్లు గలిగె !

    రిప్లయితొలగించండి