12, ఆగస్టు 2012, ఆదివారం

పద్య రచన - 79

 కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

26 కామెంట్‌లు:

  1. అమ్మనుజ నాథు డప్పుడు
    అమ్మహిళా మణినె యమ్మెనప్పును దీర్చన్
    అమ్మో! సత్యము నిలుపుట
    కిమ్మహిలో కష్ట తరమె, యిది సత్యమ్మే!

    రిప్లయితొలగించండి
  2. చంద్రమతీ వినుమ హరి
    శ్చంద్రుడు నిన్నమ్ము చుండె సత్యము కొరకై
    చంద్రుని కాంతులు వీడిన
    చంద్రుని నేనైతి సుతుని సరి చే కొనుమా!

    రిప్లయితొలగించండి
  3. అయ్యా శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ! అభినందనలు. మీ పద్యము చాల బాగున్నది. కొన్ని చోట్ల సంధి చేయకుండా విడుచుట కనిపించుచున్నది. అందుచేత చిన్న సవరణ పద్యమునకు ఇలా సూచించు చున్నాను:

    అమ్మనుజనాథు డయ్యెడ
    నమ్మహిళామణినె యమ్మె నప్పును దీర్చన్
    అమ్మో సత్యము నిలుపుట
    కిమ్మహిలో కష్టతరమె యిది సత్యమ్మే
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  4. అయ్యా శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ! అభినందనలు.

    మీ 2వ పద్యమును హరిశ్చంద్రుడే చెప్పుచున్నటుల నున్నది. అప్పుడు "హరిశ్చంద్రుడు" తనను తాను హరిశ్చంద్రుడు అని చెప్పుకొంటాడా? కాస్త వివరించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  5. శ్రీ నేమాని వారికి నమస్కారములు.
    మొదటి పద్య సవరణకు ధన్య వాదములు.
    రెండవ పద్యము హరిశ్చంద్రుడు అన్నట్లే నా భావం.

    రిప్లయితొలగించండి
  6. కటకటా కలలో నైన కల్లలాడ
    నెరుగని సహధర్మచరిత నిట్లు నిలిపి
    నట్ట నడివీధిలో నమ్మనెట్టు లయ్యె
    నీకు సత్యహరిశ్చంద్ర! నీదు గుండె
    కటిక పాషాణ మాకాదు కఠిన వజ్ర
    మాయె “కాలోహి దురతి క్రమ:” యనునది
    తప్పదని చెప్పె జానకి యెప్పుడోను!

    రిప్లయితొలగించండి
  7. సత్య సంధుడు నాహరిశ్ఛం ద్రుడకట
    కొడుకు కర్మకు సొమ్ములు కొఱత యయ్యి
    యాలినమ్మెను కటకటా యాయవస్థ
    ఎవరి కుండకూడదవని నెచట నైన.

    రిప్లయితొలగించండి
  8. ఆర్యా చంద్రశేఖర్ గారూ! హరిశ్చంద్రుని తరువాత కదా జానకి కాలం.....

    రిప్లయితొలగించండి
  9. ఆతడెవ్వరు? సమస్తావనీచక్ర శా
    సకుడైన శ్రీహరిశ్చంద్రుడేన?
    ఆమె యెవ్వరు? వాని యర్ధాంగి సాధ్వీల
    లామయై నట్టి చంద్రమతియేన?
    ఆ యర్భకుండెవ్వ? డా దంపతుల బిడ్డ
    డగు గుణాఢ్యుడు లోహితాస్యుడేన?
    ఆ చిత్రమేమిటో? ఆ చక్రవర్తియే
    యప్పు దీర్చగలేక యాస్తిలేక
    సాధ్వినే విక్రయించెనే? సంతలోన
    వస్తువని రీతి దైవమా! వాస్తవమ్మె?
    సత్యసంధుడై యతడగచాటులొందె
    నాతని యశమ్ము శాశ్వతమ్మై చెలంగె

    ఔర! యిది గాధినందనుం డాడినట్టి
    చిత్రమగు నాటకము, పరీక్షించె నటుల
    నా హరిశ్చంద్రు శీలమ్ము నంతమందు
    సత్యమే జయించెను కదా! సాధు సాధు

    రిప్లయితొలగించండి
  10. శ్రీ నేమాని పండితుల వారి సీస పద్యం కడు చక్కగానున్నది. నిజమే ఆ చిత్రం వర్ణించాలంటే అంత పద్యము కావాలికదా!

    రిప్లయితొలగించండి
  11. శ్రీ గోలి శాస్త్రి గారూ, ధన్యవాదాలు. ఆ విషయం నిర్ధారణగా నాకు తెలియదు. అదేనిజమే అయితే నాపూరణ చివరి పాదాలు ఇలా చదువుకోవచ్చు.
    మాయె “కాలోహి దురతి క్రమ:” యనునది
    తప్పదనిరి గదా పెద్ద లెప్పుడోను!

    రిప్లయితొలగించండి
  12. మాపురమందు భవ్యమగు మందిరమొక్కటి చూచిరావలెన్
    గోపురమందు పావురము గూటిని కట్టిన తీరు నచ్చటన్
    చూపరులెల్ల ముచ్చటగ చూచుచు నుందురు తప్పకుండగాన్.
    జ్ఞాపకమందున నిల్చెనది చక్కని పల్లెకు తాను గుర్తుగాన్.

    గురువు గారు,
    నిన్నటి పద్యరచన శీర్షికకు ఈరోజు వ్రాశాను. ఈరోజుది మళ్ళీ వ్రాస్తాను

    రిప్లయితొలగించండి
  13. .మాటను తప్పకుండ తన మాన్యత గొప్పగ నిల్పుకున్నచో
    నోటమి నొప్ప జాలక సమున్నత స్థానము నందుకున్నచో
    దీటుగ నిల్చియుండి యిక దీవన లన్నియు పొందియున్నచో
    కాటికి రాజుగా నిలుచు కర్మను బూనిన ధీరుడొక్కడే!!

    రిప్లయితొలగించండి
  14. కాలము దైవ రూపమగు కాల గతిన్నెదిరింప నేరికిన్
    జాలదు బండిగా నగును చయ్యన నోడ నిమేష మందునన్
    వేలము వేసి యమ్మె కడు వేదన నొందుచు ధర్మపత్ని దా
    నేలిన నేలనే హత విధీ సుతు డేడ్వగ రాజు మాటకై.

    రిప్లయితొలగించండి
  15. అయ్యా మిస్సన్న గారూ!
    మీ పద్యము బాగున్నది. అందులోని ఈ క్రింది పదములను ఏ సంధి చేసేరో తెలియుటలేదు:

    కాలగతిన్ + ఎదిరింప = ?
    నా ఉద్దేశములో అది కాలగతినెదిరింప అవుతుంది. కాలగతిన్నెదిరింప అవదు. పరిశీలించండి. ఎవరో తప్పు చేసేరని మీరు కూడా ఆ తప్పునే పట్టుకో కూడదు కదా. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  16. సతి సుతుల నమ్మెనడి వీధి జాలి లేక
    కాటి కాపరి జేసెను కటము నందు
    సుతుని శవమును కాల్చగ సుంక మడిగె
    ధర్మ పధమున నడచిన ధర్మ ప్రభువు !

    రిప్లయితొలగించండి
  17. కరిమొఱ విన్నతోడ రమకైనను జెప్పక భక్తు గావ, దా
    పరుగిడి వచ్చెనా గరుడ వాహనుడంతట చక్రమంపెనే
    సరగున జంపి యా మొసలి శాపము బాపుచు హస్తినంతటన్
    సరగున జంపి యా మొసలి శాపము బాపుచు హస్తినంతటన్

    గురువు గారు, మొన్నటి విషయానికి, నిన్నటి విషయానికి ఈరోజే పూరణలు చేశాను. ల్ప ప్రాసతో మొన్నటి కందము మర్చిపోయి, మళ్ళీ ఈరోజు చేశాను. మన్నించి మూడు పద్యములను పరిశీలించగలరని మనవి.

    రిప్లయితొలగించండి
  18. అమ్మా! లక్ష్మీదేవి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము (కరిమొర) 4వ పాదము సమముగా టైపు కాలేదు. పరిశీలించి సవరించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  19. అయ్యా,
    అనేక ధన్యవాదములు. మరపు ఎక్కువయింది. మన్నించండి.

    కరిమొఱ విన్నతోడ రమకైనను జెప్పక భక్తు గావ, దా
    పరుగిడి వచ్చెనా గరుడ వాహనుడంతట చక్రమంపెనే
    సరగున జంపి యా మొసలి శాపము బాపుచు హస్తినంతటన్
    సిరిపతి కాచె; నే నతుల జేయుచు నిత్యము దల్తునాతనిన్.

    రిప్లయితొలగించండి
  20. గుండు మధుసూదన గారి పద్యములు.....

    ఇంద్ర సత్సభా ప్రకటిత హేతు బలిమి
    గాధి నందనుఁ డే రాజు గతిని మార్చె?
    నా హరిశ్చంద్రుఁ డిడుముల నైన వలచి,
    సత్యవా క్పాలనమ్మును సడల నీఁక.

    ఋణమునుఁ దీర్పఁగ నిజసతి
    గుణమతి యా చంద్రమతినిఁ గోరియు నమ్మన్ ;
    బ్రణతు లిడి, సుత సహిత విత
    రణకై బలియయ్యె సాధ్వి, రమణుని యానన్!

    సుతుఁడు లోహితుండు సుగుణవంతుఁ డెదలో
    హితుఁడు, జనకు నాజ్ఞ నేమరకను,
    జనని ననుసరించె, జనలోక వంద్యుండు,
    భావి యౌవ రాజ్య భారకుండు!

    రిప్లయితొలగించండి
  21. నేమాని పండితార్యా ధన్యవాదములు.
    ఏదో వ్యాకరణ సూత్రాన్ని తప్పుగా అర్థం చేసుకొన్నానను కొంటున్నాను.
    "కాలగతిన్ యెదిరింప" గా సవరించు కొంటున్నాను.

    రిప్లయితొలగించండి
  22. అయ్యా! మిస్సన్న గారూ!
    మీ సవరణ కూడా సక్రమముగా లేదు. ద్రుతము తరువాత యడాగమమును ఏలాగున చేస్తారు? అందుచేత వేరొక మార్గము = కాలమునే యెదిరింప అని సవరించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  23. అయ్యా! శ్రీ గుండు మధుసూదన్ గారి 3 పద్యములు బాగున్నవి. 3వ పద్యము (సుతుడు లోహితుడు) అని మొదలిడు పద్యములో 2వ పాదములో "ఏమరకను" కి బదులుగా "ఏమరకయె" అనాలి అనుకొనుచున్నాను. ఏమరక అనేది వ్యతిరేక అర్థకము కావున దాని చివర న్ (ద్రుతము) రాదు అని నా భావము. పరిశీలించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  24. హరిశ్చంద్ర చక్రవర్తి :

    01)
    ___________________________________

    చింతల పాలయెన్, తుదకు - చేసిన బాసను దీర్చు కోసమై
    వింత యిదే గదా ! పరమ - వేదన జెందుచు శోక మూర్తియై
    కాంతను కాలకౌశికున - కా యెడ నమ్మెను చక్రవర్తి యే !
    ఎంతటి వారికైన దర - మే, విధి వ్రాలును దాటగా నిలన్ ?
    ___________________________________

    రిప్లయితొలగించండి
  25. నిన్నటి పద్యరచనకి వచ్చిన స్పందనలను విశ్లేషించుచున్నాను:
    సత్య హరిశ్చంద్ర నాటకము కళ్ళకి కట్టినట్టుగా నున్నది ఈ పద్యములన్నిటినీ చదువుచుండగా. సాధు సాధు.
    అందరికీ అభినందనలు.
    1. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు అతి వేగముగా 2 పద్యములలో చక్కగ స్పందించినారు. పద్యములు చాల బాగుగ నున్నవి.

    2. శ్రీ చంద్రశేఖర్ గారు నా సీసపద్యము గురించి మెచ్చుకొన్నారు. సంతోషము. ఆలాగుననే వారి పద్యము కూడ కటకటా అని మొదలిడి చక్కగ నడచినది. బాగున్నది.

    3. శ్రీ సుబ్బారావు గారి పద్యము బాగున్నది. వారి పద్యములో 4వ పాదమును మార్చితే బాగుంటుంది. ఇలా మార్చుదాము:
    "ఏరికేనియు రాకూడదెన్నడేని" .

    4. శ్రీమతి లక్ష్మీదేవి గారి పద్యములను ఎప్పటి కప్పుడు చూచుచున్నాను. ఈనాటి 3 పద్యములను కూడా చూచేను. చాల బాగుగ నున్నవి. ధార బాగుగ మెరుగయినది. అభినందనలు.

    5. శ్రీ మిస్సన్న గారి పద్యము అభినందనీయముగా నున్నది.

    6. శ్రీమతి రాజేశ్వరి గారి పద్యము చాలా బాగున్నది.

    7. శ్రీ గుండు మధుసూదన్ గారు 3 పద్యములను 3 పాత్రల గూర్చి చక్కగా వ్రాసేరు. చాలా బాగుగనున్నవి.

    8. శ్రీ వసంత కిశోర్ గారి పద్యము చాల బాగుగనున్నది. ఎంతటి వారికైన దరమే విధి వ్రాలును దాటగా నిలన్ - చాల మంచి భావగర్భితమైన పాదము.

    అందరికీ పేరుపేరునా మళ్ళీ మళ్ళీ అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి