23, ఆగస్టు 2012, గురువారం

పద్య రచన - 90


కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

26 కామెంట్‌లు:

  1. మురళీ గాన సుధా ప్రసారములతో ముల్లోకముల్ భక్తి త
    త్పరతన్ శాంతిసుఖాల నొప్పు గద గోపాలా! జగత్పాలకా!
    పరమానందరస స్వరూప విభవా! బ్రహ్మాండ భాండోదరా!
    పరమాత్మా! పరమార్థ యోగ వరదా! పాలింపుమా నన్ ప్రభూ!

    రిప్లయితొలగించండి
  2. కన్నయ్యను చూడాలంటే జ్ఞాన నేత్రాలు కావాలి.చర్మ చక్షువులు చాలవు.

    మన్నును నాకిన నోటనె
    వెన్నుడు జుపించె మిన్ను విశ్వము నంతన్
    అన్నియు తానే యైనను
    కన్నులకే కనబడడట కన్నయ్యకు జే!

    రిప్లయితొలగించండి
  3. గోవును కాచుచున్ భువికి గొప్పగ సూచన జేసి,ప్రాణులన్
    గోవులె పుణ్యమూర్తులని గోవుల పాలన వీడకుండగా
    నీవె యుదారతన్ నరులు నేర్వగ జేయుచు నిల్చియుండగా,
    దేవ! నమస్కరించి నిను దిక్కుగ నమ్ముచు పూజ సేయనో!

    రిప్లయితొలగించండి
  4. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారి జ్ఞాన దృష్టి, శ్రీమతి లక్ష్మీ దేవి గారి గోపాల భక్తి ప్రశంసనీయములు. అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  5. అయ్యా, ధన్యవాదములు
    మీరు మురళీ గానముతో ప్రారంభించిన పద్యము నిజముగా కర్ణములందు సుధలను కురిపించింది.

    రిప్లయితొలగించండి
  6. పండిత నేమాని వారూ,
    లక్ష్మీదేవి గారు ప్రశంసించినట్లు మీ పద్యం కవితాసుధామాధ్యుర్యాన్ని చవిచూపుతున్నది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    ‘కన్నయ్యను చూడాలంటే జ్ఞాన నేత్రాలు కావాలి.చర్మ చక్షువులు చాలవు.’ అన్న మీ మాటతో నేను విద్యార్థిగా ఉన్నపుడు వ్రాసిన ‘వరద శతకం’లోని క్రింది పద్యం గుర్తుకు వచ్చింది.
    ఓదేవ! మాంసచక్షువు
    నీ దివ్యాకారముఁ గననేరదు, కరుణా
    త్మా! దివ్యదృష్టి నొసఁగుము
    మోదంబున నిన్నుఁ గాంతు మురహర! వరదా!
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  7. పుట్టి నాడవు చెరసాల పుణ్య భూమి
    బెరిగి నాడవు గోకుల పెద్ద లె దు ట
    చంపి నాడవు కం సాది శత్రువులను
    నిన్ను పొగడంగ జాలను వెన్న ప్రియుడ !

    రిప్లయితొలగించండి
  8. అయ్యా! శ్రీ శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
    మన బ్లాగులో క్రమముగా దశ అవతారములను యిస్తున్నారు. అయితే బలరామ శ్రీకృష్ణ అవతారములు రెండిటినీ ప్రస్తావించేరు. మంచిదే. కొందరి సిద్ధాంతములో శ్రీకృష్ణుడు స్వయముగా భగవంతుడే యనియు బలరాముడే అవతారమును ధరించిన వాడనియు చెప్పుదురు. మరి రేపటి బుద్ధ అవతారములో పౌరాణిక బుద్ధుని (త్రిపురాసురుల భార్యల మాయా గురువు) ప్రస్తావన వస్తుంది అనుకొనుచున్నాను. గౌతమ బుద్ధుని గురించి కూడా ప్రస్తావించ దలచినచో దానిని ఎల్లుండికి యీయవచ్చును. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. ప్రాపా పాండునరేంద్రనందనులకున్! రాధాప్రియా! మాధవా!
    కాపా ద్రౌపదికిన్ సభాంతరమునన్! కంసాంతకా! కేశవా!
    చూపా పార్థునకున్ రణాoగణమునన్! శోకాపహా ! శ్రీహరీ!
    గోపాలా! మురళీధరా !మురరిపూ! గోపీమనోనాయకా!

    రిప్లయితొలగించండి
  10. పాలను ద్రావు బాల్యమున పాలనిడన్ చనుదెంచు పూతనన్
    లీలగ సంహరించితివి లెక్కకు మిక్కిలి రక్కసాళినిన్
    కాలుని చెంతకంపితివి కంసుని ద్రుంచిన బాలకుండవై
    యాలను గోప గోపికల నాదర మొప్పగ నేలవే హరీ!

    రిప్లయితొలగించండి
  11. గుండు మధుసూదన్ గారి వ్యాఖ్య....

    పండిత నేమానివారు మొదలుకొని యందఱి పద్యము లలరించుచున్నవి. ముఖ్యముగా నేమాని వారి పద్యములు మఱియు మిస్సన్న గారి పద్యము బ్లాగునకే వన్నె తెచ్చునట్లున్నవి. అభినందనలు మఱియు ధన్యవాదములు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. బృందావన సీమలలో
    నందాత్మజు డదె కనుండు నవ్వుచు నధర
    మ్మందున మోపెను మురళిని
    విందుం జేయంగ జగతి వీనుల కింపై.

    రిప్లయితొలగించండి
  13. పాండవ పక్షపాతివయి భండన మందున శత్రుమూకలన్
    చెండగ నాయుధమ్ము దరిజేరగ నీయక పార్థ సారధీ!
    దండము చేత దాల్చి విహితమ్మగు ధర్మము నాచరింప నా
    ఖండలు నందనున్ పనిపి కాటికి పంపవె కౌరవేయులన్.

    రిప్లయితొలగించండి
  14. ధర్మ సంస్థాప నార్థమై ధరణి నీవు
    ప్రతి యుగమ్మున ప్రభవించి పరమ పురుష
    దుష్టులను బట్టి రక్షించి శిష్ట కోటి
    నేలు కొనుచుందు వందురు నీకు నతులు.

    రిప్లయితొలగించండి
  15. మధుసూదన్ గారూ ధన్యవాదములు.
    నేమాని పండితులు హస్తి. నేను మశకము.
    మీ పద్యాలు బ్లాగుకు తరచూ వన్నె తెస్తూ అలరిస్తున్నాయి.
    గోలివారి, గురువుగారి జ్ఞానచక్షు పరిశీలన ముదావహం.
    లక్ష్మీ దేవిగారు, సుబ్బారావు గారు ఎవరికి వారే దిట్టలు.

    రిప్లయితొలగించండి
  16. సరస కళానిధాన! విలసద్ధృదయాంబుజ! రుక్మిణీ మనో
    హర! భవదీయ రూప విభవాంచిత దర్శన భాగ్యవంతులై
    పరగుచు శంకరాభరణ భవ్య కవి ప్రకరంబు వ్రాసిరా
    దరమున పద్యరత్నములు తన్మయమందుచు నిన్ స్తుతించుచున్

    రిప్లయితొలగించండి
  17. పిల్లన గ్రోవిని నూదుచు
    యుల్లము రంజింప జేయు నువిదల కింపౌ !
    గొల్లల యిండ్లను జొరబడి
    అల్లరివై చోద్య మిడగ నాత తాయివి నీవౌ ! [ ఆతతాయి ]

    రిప్లయితొలగించండి
  18. సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    ‘పెద్దలెదుట, వెన్నప్రియుడ’లకు బదులు ‘పెద్దలందు, వెన్నదొంగ’ అంటే బాగుంటుందని నా సలహా.
    *
    నేమాని వారూ,
    ధన్యవాదాలు.
    దశావతారాల చర్చ నాలుగైదు రోజుల క్రితం నాకూ గుండు మధుసూదన్ గారి మధ్య చాలాసేపు జరిగింది.
    బుద్ధావతారాన్ని అంగీరించని వాళ్ళు దశావతారాలలో బలరామ, కృష్ణులను చేర్చడం ఉంది. కృష్ణుడిని పేర్కొనకుండా బలరాముని, బుద్ధుణ్ణి చేర్చి చెప్పిన వారూ ఉన్నారు. బలరాముని పేర్కొనకుండా కృష్ణ బుద్ధావతారాలను పేర్కొన్న వారూ ఉన్నారు. (మా గురుదేవులు శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యుల ‘అవతార ధార’ ఖండకృతిలో బలరామ ప్రసక్తి లేదు).
    గతంలో నేను దశావతారస్తుతి పద్యాలను ‘చమత్కార పద్యాలు’ శీర్షికలో ప్రకటించాను. అవి రచించినది ఎలకూచి బాలసరస్వతి అని కొందరు, రామకృష్ణ కవి అని కొందరూ పేర్కొన్నారు. అందులో బలరామ, కృష్ణ, బుద్ధావతారాలతో పదకొండు అవతారాల స్తుతి ఉన్నది.
    నేను రేపు బుద్ధుని చిత్రాన్ని, ఎల్లుండి కల్కి చిత్రాన్ని ప్రకటిస్తున్నాను.
    *
    మిస్సన్న గారూ,
    కృష్ణుడి చిత్రం మీలో భావావేశాన్ని కలిగించినట్లుంది. ఒకదాని వెంట ఒకటిగా ఆరు ఆణిముత్యాల వంటి పద్యాలను అందించారు. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    భగవత్కృప, మీవంటి హితైషుల సహకారం ‘శంకరాభరణం’ నిరాటకంగా కొనసాగడానికి ఆలంబన లవుతున్నాయి. ధన్యవాదాలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ ప్రయత్నం ప్రశంసనీయం. అభినందనలు.
    కొన్ని లోపాలున్నాయి. వీలైతే రేపు ఉదయం సవరిస్తాను.

    రిప్లయితొలగించండి
  19. నెమలి పింఛంబది యమలిన శృంగార గురుతని దెలుపంగఁగొప్పుఁజేర్చె
    నేనను యహమును లోనను వీడగఁ మురళినిఁవాయించ మోముఁ జేర్చె
    గుణమది కౌస్తుభ మణివలె వెలిగినహృదయభాగమ్మునముదముఁజేర్చె
    సాధుస్వభావమ్ముగోధనమ్మనిదెల్ప పావని గోవునుఁ బ్రక్కఁజేర్చె

    విమలుల నిరహంకారుల వెంటఁజేర్చి
    సాధు,గుణమణు లైనను సఖ్యుడగుచుఁ
    గెలువఁలోకానఁజక్కటి గీతఁబలుక
    సకల సందేశ రూపుని సన్నుతింతు.

    రిప్లయితొలగించండి
  20. ఈ రోజు శ్రీ మిస్సన్న గారి భావావేశము, శ్రీ సహదేవుడు గారి సద్గుణవికాసము, మిగిలిన వారందరి పద్యములు చాలా బాగుగా నుండి బ్లాగునకు మంచి వన్నె తెచ్చేయి. అందరికీ అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  21. శ్రీ నేమాని వారికి ధన్యవాదములు.
    శంకరార్యా ! నా పద్యం వలన మీ వరద శతకమును రుచి చూపినందులకు ధన్యవాదములు. .చాలా బాగుంది.
    మిస్సన్న గారూ! ధన్యవాదములు. మీరు చాలా రోజుల తరువాత విజృంభించారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి


  22. నందకిశోరుడా,నవనీతచోరుడా,
    చిలిపిచేష్టలు చేయు చిన్నవాడ
    ఆశ్రితపోషకా,అసురసంశోషణా,
    మానినీమన్మథా,మదనగోప,
    రాజ్యాంగ నిష్ణాత,రాక్షససమ్హార,
    రణరంగధీర,విరాట్స్వరూప ,
    దీనసమ్రక్షకా ,దివ్యతేజోరూప,
    ధర్మసంస్థాపనాదర్శమూర్తి,
    అతినిగూఢ గీతాయోగ మవనిజనుల
    కెల్ల యమృతోపదేశమ్ము నెలమినిచ్చి
    విశ్వగురు పీఠ మెక్కిన విష్ణురూప ,
    ఇన్నిభంగుల వర్తించు నిన్ను గొలుతు.

    నీ తెలికన్నులందు,నవనీలకనీనికలందు, మెత్తనౌ
    లేతగులాబి పూబెదవి లీలగ దోచెడి మందహాస మే
    దో తెలియంగరాని మధురోహల రేపి తపింపజేయు మా
    చేతము లుల్లసిల్లు తులసీవనమాలి సరోజ వీక్షణా .

    రిప్లయితొలగించండి
  23. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    కృష్ణావతారము :


    01)
    _______________________________

    గోవులను గాచి రక్షించె - గోకులంబు !
    క్రూర రాక్షసానీకంబు - కుళ్ళగించె !
    కృష్ణ గాపాడె, కురుసభన్ - కీడుపడగ !
    కూర్చె గీతను పార్థుడు - క్రుంగినపుడు !
    కృష్ణు బ్రార్థింప రారండి !- కృపను జూపు !

    _______________________________

    రిప్లయితొలగించండి
  24. సహదేవుడు గారూ,
    ఈనాటి మీపద్యం చిత్రానికి తగినట్లు మనోహరంగా ఉంది. అభినందనలు.
    ‘నేనన్న యహమును’ అందాం. ‘మోము జేర్చె’ను ‘మోవి జేర్చె’ అంటే బాగుంటుందని నా సూచన.
    *
    కమనీయం గారూ,
    మీ పద్యాలు మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.
    మీరు లేఖినిని ఉపయోగిసున్నట్లు ఉంది.
    అనుస్వారానికి shift,M నొక్కండి.
    samhaara - సమ్హార , samraxakaa - సమ్రక్షకా;
    saMhaara - సంహార, saMraxakaa - సంరక్షకా.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. గురువుగారికీ నేమాని పండితులకూ గోలివారికీ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  26. గురు వర్యులకు వందన శతమ్ము,
    ధన్యవాదములు.తమరి సూచనలు కడుంగడు సమర్థనీయం.
    తమరి సూచనల పాటిస్తూ నా పద్య సవరణ:



    నెమలి పింఛంబది యమలిన శృంగార గురుతని దెలుపంగఁగొప్పుఁజేర్చె
    నేనన్నయహమును లోనను వీడగఁ మురళినిఁవాయించ మోవి( జేర్చె
    గుణమది కౌస్తుభ మణివలె వెలిగినహృదయభాగమ్మునముదముఁజేర్చె
    సాధుస్వభావమ్ముగోధనమ్మనిదెల్ప పావని గోవునుఁ బ్రక్కఁజేర్చె

    విమలుల నిరహంకారుల వెంటఁజేర్చి
    సాధు,గుణమణు లైనను సఖ్యుడగుచుఁ
    గెలువఁలోకానఁజక్కటి గీతఁబలుక
    సకల సందేశ రూపుని సన్నుతింతు.

    రిప్లయితొలగించండి