19, ఆగస్టు 2012, ఆదివారం

పద్య రచన - 86


కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17 కామెంట్‌లు:


  1. పొట్టి వాడ య్య నాతడు గట్టి వాడు
    నాక్ర మించెను నింగిని నవని గూడ
    నడుగు మూడులు శిరమున నాని పెట్టి
    లీల లుండును నట్లనె నీ ల విభుని .

    రిప్లయితొలగించండి
  2. అమరేంద్రుని జయించి యసురాధిపతి బలి
    యెల్ల లోకమ్ముల నేలుచుండ
    శక్రు దైన్యము బాపు సద్భావ మలరగ
    వటురూపమును దాల్చి బలిని జేరి
    అడిగి మూడడుగుల యవని నాపిమ్మట
    నొక పాదమున భూమి నొకట నింగి
    యాక్రమించి హరి త్రివిక్రముండై తన
    మూడవ పాదమున్ మోపుచు బలి
    తలను వానిని బంపి పాతాళమునకు
    స్వర్గమును వెండి యొసగె వాసవునకట్టి
    పరమ యాచకునకు జేసి వందనములు
    భక్తితో వాని విభవమ్ము బ్రస్తుతింతు

    రిప్లయితొలగించండి
  3. తల్లి కోరిక దీర్చ తమ్ముడై యింద్రుకు
    ముల్లోకములఁ గొల్చు ముద్దులొలుకు
    బాలుడీతండొకో! భగవంతుడౌ గాని.
    కాలుంచి తలమీద కరుణ జూప,
    బలి భాగ్యమును జూచి భాగవతుడయిన
    ప్రహ్లాదుడెంతయు పరవశించె.
    నింతింత వాడయ్యి ఎదిగెనే వామను
    డనుచు పోతన బల్కె నద్భుతముగ.

    నందగాడును, మఱి యాజాను బాహుండు
    చిన్ని బాలుడయ్యె శ్రీహరియును.
    గొడుగు బట్టు చిట్టి కొమరుని తల్లికి
    వందనములు, కోటి వందనములు.

    రిప్లయితొలగించండి
  4. అమ్మా! లక్ష్మీ దేవి గారూ!
    శుభాశీస్సులు.
    మీ పద్యములో "ఇంద్రుకు" అనే ప్రయోగము బాగులేదు. ఆ పదములను ఇలా మార్చుదాము:

    "అమ్మ కోరిక దీర్చ నమరేంద్రు ననుజుడై"

    రిప్లయితొలగించండి
  5. మీరు చెప్పిన సవరణ బాగున్నది.
    ధన్యవాదములు.
    నాకు తోచినది
    అదితి వరముగోర నాతడుపేంద్రుండై

    రిప్లయితొలగించండి
  6. మూడడుగుల చోటు నడిగి
    మూడగ బలి త్రొక్కె కొలిచి ముజ్జగములనే
    మూడడుగుల బాపనయ్య
    వీడిడుముల బాపునయ్య వీనికి జేజే !

    రిప్లయితొలగించండి
  7. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ!
    శుభాశీస్సులు. మీ పద్యము 3వ పాదములో: "మూడడుగుల బాపనయ్య" 3వ గణము జగణము ఉండకూడదు కదా. కాస్త సవరించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. గుండు మధుసూదన్ గారి పద్యము....

    మత్తేభము(పంచపాది):
    సురలోకాధిపు నింద్రు గెల్చి, యతనిన్ శూన్య స్వరాట్పీఠునిన్
    బరువెత్తించిన రాక్షసేంద్రుని బలిన్ బ్రహ్లాద పౌత్రున్ వెసన్
    హరి కోరెన్ దగ వామనాఖ్య వటుఁడై త్ర్యంఘ్రి స్థలమ్మీయఁగన్;
    వర మీయంగఁ ద్రివిక్రముండయి బలిన్ బాదమ్మునం ద్రొక్కియున్
    గరుణించెన్ సుతలాధిపాలునిగఁ; దత్కంజాక్షు నేఁ గొల్చెదన్!

    రిప్లయితొలగించండి
  9. అయ్యా,
    మన్నించండి. మీరు చెప్పిన సవరణే బాగున్నది నా పద్యమునకు. నా సవరణలో ఆతడు వస్తే అదే మాట పూర్తయ్యేలోపే ఈతడు అని వస్తున్నది. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  10. శ్రీ నేమాని వారికి నమస్కారములు. నా పూరణ సవరణ తో...

    మూడడుగుల చోటు నడిగి
    మూడగ బలి త్రొక్కె కొలిచి ముజ్జగములనే
    మూడడుగుల వామనుడే
    వాడిడుముల బాపువాడు వానికి జేజే !

    రిప్లయితొలగించండి
  11. సుబ్బారావు గారూ,
    మంచి భావంతో పద్యాన్ని వ్రాసారు. అభినందనలు.
    కొన్ని లోపాలున్నాయి. "అయ్య + ఆతడు = అయ్య యాతడు, వాడు + ఆక్రమించెను = వాడాక్రమించెను", అడుగు మూడులు - అడుగులు మూడు, నీల విభుని - నీలా విభుని.....
    నా సవరణలతో మీ పద్యం....
    పొట్టి వాడయ్యు నాతడు గట్టి వాడె
    యాక్రమించెను నింగిని నవని గూడ
    మూడవ యడుగు శిరముపై మోపినట్టి
    లీల లుండును మనల పాలించువాడు.
    *
    పండిత నేమాని వారూ,
    త్రివిక్రముడైన వామనుని స్తుతించిన మీ పద్యం ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    ‘ఉపేంద్రుని’ గురించిన మీ పద్యం అద్భుతంగా ఉంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    మూడవపాదాన్ని "మూడడుగుల వడు గాతడు" అని మారుద్దాం.
    మీ మార్పు తరువాత చూసాను.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    వామనావతారము :

    01)
    _______________________________

    బలిని పాతాళ లోకమ్ము - పంపి,పిదప
    వజ్రపాణిని స్వర్గాధి - పతిగ నిలుప
    వడుగు రూపము దాల్చిన - వామనునకు
    వందనమ్ముల నిడరారె ! - వచ్చ దీర్చు!
    _______________________________
    వచ్చ = ఇచ్ఛ

    రిప్లయితొలగించండి
  13. వసంత కిశోర్ గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. శ్రీమదాది దేవ నీవు, సిరులు భువిని నింపగా,
    భూమి భారమైన బలిని భువిని మట్టు బెట్టగా,
    వామనావతారముగను, వసుధనవతరించి, మా
    క్షేమములను జూసినావు, క్షీర శయన! రాఘవా!

    మూడడుగుల ఒజ్జవీవు ముజ్జగముల కధిపుడా! (కధిప! ఏ)
    జాడ నెరుగని ప్రపంచ జనుల నార్తి బాపగా
    మూడడుగుల నేలనడిగి, ముష్కరులను దుంచగా
    నేడు వామనునిగ నీవు నిలిచినావు రాఘవా !

    రిప్లయితొలగించండి
  15. వామన్ కుమార్ గారూ,
    మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    రెండవ పద్యం రెండవ పాదంలో గణదోషం. ‘ఎరుగని ప్రపంచ’ అన్నపుడు ‘ని’ లఘువే. ‘ఎరుగనట్టి భువన జనుల’ అందాం.

    రిప్లయితొలగించండి