21, ఆగస్టు 2012, మంగళవారం

విన్నపము - ౭

విన్నపము
శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు.

ఆర్థితార్థ ప్రదాన దీక్షైక దక్ష!
యెపుడు ప్రవహిల్లనిమ్ము నా కీతలంపె,
సారెసారెకుఁ గన్బ్రామి పారిపోకు,
నీకొరకె యెల్ల కల్మియు నిలువనిమ్ము,
నాకు నీసేవ మరపు రానీకు మెపుడు,
పెన్నిధివి స్వామి! యీ నిరుపేద కిపుడు
దొరికితివి వీడలే నిఁక తరుమఁబోకు,
పెక్కు మోసఁపు వేసాల నక్కి నక్కి
పలు తెరంగుల నుచ్చులు, వలలు పన్ని
నన్ను వేటాడ వేచియున్నారు వారు,
పగతు లార్గుర కప్పగింపకుము తండ్రి!
యిపుడు నేఁ దప్పిపోతినా యింక నీకుఁ
గరగతం బౌట మఱియెన్ని కల్పములకొ?
చేతులారఁగ దూరము చేసికొనకు
దీన సంత్రాణ శీల! నీవాని నీవ
యేల పోగొట్టుకొందు విదెట్టి లీల?
నీ నిరుపమాన సుగుణ జాలాన లాగి
యొకపరిగ నన్ను బంధించి యుంచుకొనుము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి