13, ఆగస్టు 2012, సోమవారం

సమస్యాపూరణం - 791 (నాకు నీకు మాకు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
నాకు నీకు మాకు మీకు మనకు!

29 కామెంట్‌లు:

  1. సర్వనామములను షష్ట్యంతములఁ గూర్చి
    వాక్య మొకటి యడిగెఁ బంతులయ్య
    ఛాత్రుఁ డొకఁడు సెప్పె “శాంతిసౌఖ్యము లగు
    నాకు నీకు మాకు మీకు మనకు!”

    రిప్లయితొలగించండి
  2. నాకు దేవుడనిన నారాయణుండేను
    నీకు యేసు ప్రభువు నిజము, మీకు
    అల్ల, జూడ దైవ మందర కొక్కడే
    నాకు నీకు మాకు మీకు మనకు.

    రిప్లయితొలగించండి
  3. సరిసరి యిక వినుము, జగడమేలొకొ యింక
    నాకు నీకు; (మాకు, నీకు) - మనకు
    యగుననుచునిపుడిక నర్థమయినదని
    యొప్పుకొందు నేను నూరకుందు.

    రిప్లయితొలగించండి
  4. నాకు నీకు మాకు మీకు మనకునను
    భేదభావములను విడువ దగును
    తలచు చుండవలెను తగు విశ్వసౌభాగ్య
    కరములైన మంచి కార్యములను

    రిప్లయితొలగించండి
  5. శ్రీ శంకరయ్య గారూ "షష్ఠ్యంతములు" అని వర్గయుక్ టకారముండాలి అనుకొంటాను. షష్ఠి అంటే ఆరు, షష్టి అంటే అరువది కదా. వివరించండి.

    రిప్లయితొలగించండి
  6. ముఖ్యమంత్రి కాగోరి కుల,మత,ప్రాంతీయ భేదాలు సృష్టంచ వద్దని పార్టీలో తీర్మానము:
    అర్హులైన వారు అధికులున్నారయ్య
    ముఖ్యమంత్రి గాగ మ్రొక్కువారు
    ప్రతిభ, పాటవములు పట్టిచూతములెండు
    నాకు నీకు మాకు మీకుమనక

    రిప్లయితొలగించండి


  7. నాకు నీకు మాకు మీకు మనకు నేది
    లేదు జగము నందు వేద నొకటె
    మిగులు దాని దాటమేలుకొనుము నీవు
    ధ్యాన మొకటె దిక్కు మౌని వోలె.

    రిప్లయితొలగించండి
  8. శ్రీ సరస్వత్యై నమః:
    మిత్రులారా! అందరికీ అభినందనలు.
    ఈనాటి షష్ఠ్యంతమయమైన సమస్యకు పూరణలు వేగముగానే వచ్చేయి. భావ వైవిధ్యముతో అలరారుచున్నవి.

    1. శ్రీ శంకరయ్య గారు అధ్యాపక వృత్తికి సంబంధించిన రీతిలో పూరించేరు. తొలి తాంబూలము వారిదే. బాగున్నది.

    2. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు పేర్లెన్నయినా దేవుడొక్కడే అనే సత్యమును చెప్పేరు. మంచి భావము. బాగున్నది.

    3. శ్రీమతి లక్ష్మీదేవి గారు పంపిణీ సవ్యముగానే జరిగినదని భావిస్తూ ఊరుకొన్నారు. భావము వైవిధ్యముగా నున్నది.

    4. శ్రీ సహదేవుడు గారు త్వరలో ముఖ్య మంత్రి కావొచ్చు - పద్యము బాగున్నది.

    5. శ్రీ సుబ్బారావు గారు ధ్యానమొక్కటే దిక్కు అనే వేదాంత ధోరణిలో నున్నారు. మంచి పద్యము.

    అందరికీ అభినందనలు. స్వస్తి.


    రిప్లయితొలగించండి
  9. గుండు మధుసూదన్ గారి పూరణ.....

    వెంగళప్ప కొకట వెండియుఁ బైఁడియు
    ధనము ఘనముగాను దారసిలఁగ
    'నెవరి కివి?' యటన్న నిట్లు గొణిగె,
    "నాకు..నీకు..మాకు..మీకు..మనకు!"

    రిప్లయితొలగించండి
  10. సీత నొప్పు జెప్పి శ్రీ రామ మూర్తిని
    శరణు వేడుమయ్య సరగున జని
    రాఘవుండు ప్రభువు రావణా జగతిని
    నాకు నీకు మాకు మీకు మనకు.

    రిప్లయితొలగించండి
  11. రెండవపాదంలో యతి సరిపోయిందా లేదా సందేహానివృత్తి చేయగలరు.
    తేటగీతి:
    నాడు జరిగె పరిణయము నాకు నీకు
    మాకు మీకు మనకగు సంబంధికులును
    సంతసించె నేటికివర కెంత గాను
    కలసి యుండుటే కళ్యాణ కార్యముగద

    రిప్లయితొలగించండి
  12. నీకు నాకు పెండ్లి నేవిధి లిఖితమో
    వలపు వలను వీడి వాదులాడ వలదు
    కలసి మెలసి యున్న కలుగు సుఖము
    నాకు నీకు మాకు మీకు మనకు

    రిప్లయితొలగించండి
  13. నాది నాది యనక నారాయణుని పైన
    కొంత యైన మదిని చింత లేక
    స్వార్ధ బుద్ధి వీడ సౌఖ్యమ్ము కలుగును
    నాకు నీకు మాకు మీకు మనకు

    రిప్లయితొలగించండి
  14. అయ్యా! శ్రీ చంద్రశేఖర్ గారూ!
    మీ పద్యములో 2వ పాదములో యతి లక్షణముగా సరిపోయినది. పద్యము బాగున్నది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. శ్రీ సరస్వత్యై నమః:
    మిత్రులారా!
    మరికొన్ని పూరణలను తిలకించుదాము.
    1. శ్రీ మధుసూదన్ గరు: ఒక వెంగళప్పకి గొప్ప సంపదను లభింప జేసేరు. చాల బాగున్నది.

    2. శ్రీ మిస్సన్న గారు రావణునికి హితబోధ చేయించేరు. క్రొత్త భావము - బాగున్నది.

    3. శ్రీ చంద్రశేఖర్ గారు: నిజమే - "కలిసి యుండుటే కళ్యాణ కార్యము కద" - బాగున్నది ఈ భావము.

    4. శ్రీమతి రాజేశ్వరి గారు: ఒక పద్యములో భక్తి భావమును ప్రబోధించేరు. 2వ పద్యములో లక్షణ దోషములు ఉన్నవి. ఆ పద్యమును ఇలా మార్చి వ్రాస్తున్నాను:

    నీకు నాకు పెండ్లి నిర్ణయ మెన్నడో
    వాదులాడ వలదు వలపు వీడి
    కలిసి మెలిసి యున్న కలుగును సుఖములు
    నాకు నీకు మాకు మీకు మనకు
    బాగున్నవి పద్యములు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  16. గురువులకు ప్రణామములు
    ఏదో లోపం అనిపించింది కానీ గుర్తించ లేక పోయాను . సవరణకు ధన్య వాదములు .

    రిప్లయితొలగించండి
  17. గురువుగారికి నమస్సులు.
    నన్నిలా వదిలేయండి.ఏదో ఈ బ్లాగులో రోజుకొక్క సమస్యతో నెగ్గు కొస్తున్నా!ఆ పదవిలో రోజూ ఎన్ని సమస్యలో?సుఖపడేలా దీవించండి.ధన్యవాదములు.స్వస్తి.

    రిప్లయితొలగించండి


  18. అక్రమార్జనమున నైశ్వర్య రాశుల
    దోచుకొందుమంచు దొరకిపోయి
    శిక్షబొంది కడకు జెరసాల గతిపట్టె
    నాకు నీకు మాకు మీకు మనకు.

    రిప్లయితొలగించండి
  19. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    ____________________________

    రాము డైన గాని - కామారి యైనను
    కృష్ణు డైన గాని - క్రీస్తు యైన
    దేవు డనగ నొకడె - దిగులు దీర్చెడి వాడు
    నాకు నీకు మాకు - మీకు మనకు !
    ____________________________

    రిప్లయితొలగించండి
  20. 02)
    ____________________________

    హిందు వైన గాని - యిస్లాము యగు గాని
    సిక్కు, జైన, బౌద్ధ - జీవనమున
    మంచి నేర్పు నదియె - మతమన బడవలె
    నాకు నీకు మాకు - మీకు మనకు !
    ____________________________

    రిప్లయితొలగించండి
  21. 03)
    ____________________________

    కష్ట కాలమందు - కరములు జోడించి
    పదము పట్టి బిలువ - భక్తి తోడ;
    బాధ దీర్చు వాడె - భగవంతు డనబడు
    నాకు నీకు మాకు - మీకు మనకు !
    ____________________________

    రిప్లయితొలగించండి
  22. 04)
    ____________________________

    పౌరు లంద రెపుడు - పరమత సహనము
    గలిగి యున్న యెడల - గౌరవంబు !
    జాతు లెన్ని యున్న - జన్మభూమి యొకటె
    నాకు నీకు మాకు - మీకు మనకు !
    ____________________________

    రిప్లయితొలగించండి
  23. 05)
    ____________________________

    బద్దకమును వదలి - బాగుగా కష్టించి
    పనుల జేయు వార్కి - బాగు కలుగు !
    కష్ట పడిన ఫలము - గలుగక మానునా ?
    నాకు నీకు మాకు - మీకు మనకు !
    ____________________________

    రిప్లయితొలగించండి
  24. డా. కమనీయం గారు చక్కగా వివరించేరు అక్రమార్జనల వలన అందరికీ వచ్చే అగచాట్లు. చాల బాగున్నది. అభినందనలు.

    శ్రీ వసంత కిశోర్ గారు ఐదు విధాలుగ పూరించేరు. ఎక్కువగా భక్తి, మతము, ప్రవర్తనలను గురించే. ఏ సమస్యనైనా చక్కగా మలచడములో అయనకు ఆయనే సాటి. పేరు ఏదైన దేవుడొక్కడే, జీవితములో మంచిని నేర్పేదే మతము, ఆపదలలో ఆదుకొనేవాడే భవంతుడు, ఇలా ఎన్నెన్నో మంచి మంచి భావములను వెలువరించారు. ప్రశస్తమైన పూరణలు. అభినందనలు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  25. 06)
    ____________________________

    పక్క వారి నెపుడు - బాధింప బూనకు
    బాగు సేయ కున్న - బాగు బాగు !
    బాధ్యతలను మరువ - బాధలు తప్పవు
    నాకు నీకు మాకు - మీకు మనకు !
    ____________________________

    రిప్లయితొలగించండి
  26. లక్ష్మీ నరసింహం గారి పూరణ.....

    మూడు రంగులీను ముచ్చటౌ జాతీయ
    జెండ నిండియుండె గుండెనిండ
    భరతభూమి పుణ్యభాగ్యమై నిలిచెరా
    నాకు నీకు మాకు - మీకు మనకు !

    రిప్లయితొలగించండి
  27. శ్రీ లక్ష్మీ నరసింహం గారి పూరణలో దేశభక్తి వెల్లి విరియుచున్నది. బాగున్నది. అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  28. కవిమిత్రులకు నమస్కృతులు.
    వైవిధ్యమైన భావాలతో, ఉత్సాహంగా మనోజ్ఞమైన పూరణలు, పద్యాలు అందిస్తున్న పద్యకవితాభిమానులందరికీ ధన్యవాదాలు. ఈనాటి సమస్యను సమర్థంగా పూరించిన
    గోలి హనుమచ్చాస్త్రి గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    పండిత నేమాని వారికి,
    సహదేవుడు గారికి,
    సుబ్బారావు గారికి,
    గుండు మధుసూదన్ గారికి,
    మిస్సన్న గారికి,
    చంద్రశేఖర్ గారికి,
    రాజేశ్వరి అక్కయ్య గారికి,
    కమనీయం గారికి,
    వసంత కిశోర్ గారికి,
    లక్ష్మీ నరసింహం గారికి,
    అభినందనలు, ధన్యవాదములు.
    *
    పండిత నేమాని వారికి సభక్తి నమస్సుమాంజలి.
    నా మనవిని మన్నించి శ్రమ అని భావించకుండా వాత్సల్యంతో కవిమిత్రుల పూరణలను, పద్యాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగు సూచనలిస్తూ నాకు మహోపకారం చేస్తున్నారు. మీ సహృదయతకు సర్వదా కృతజ్ఞుడను. మరొక రెండు రోజులు ఈ సహకారాన్ని కొనసాగించ వలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి