16, ఆగస్టు 2012, గురువారం

సమస్యాపూరణం - 794 (కమఠమునం జొచ్చి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
కమఠమునం జొచ్చి మేలుఁ గనె పథికుఁ డటన్.

23 కామెంట్‌లు:

  1. తమరంటిరిగా స్వామీ
    కమఠంపునివృత్తిమోక్ష కరమని మరి చూ
    డుమని యట మట్టి బొమ్మౌ
    కమఠమునం జొచ్చి మేలుఁ గనె పథికుఁ డటన్.

    రిప్లయితొలగించండి
  2. విముఖుండయ్యెను సంసా
    రమునకు; సన్యాసము గొన రయమున జని, యా
    శ్రమమును వెదకె, నలుపెఱగ
    క; మఠమునం జొచ్చి మేలుఁ గనె పథికుఁ డటన్.

    రిప్లయితొలగించండి

  3. సమ తుల్యము పాటించక
    మమకారము లేక యుండి మనుగడ సాగన్
    విముఖత కలిగిన ను తొణ క
    క, మఠమునం జొచ్చిమేలు గనెపధికు డటన్.

    రిప్లయితొలగించండి
  4. గుండు మధుసూదన్ గారి పూరణ....

    కమలాక్ష నిభుఁడునౌ గౌ
    తమబుద్ధుని యాశ్రయించి, 'దమ్మపదము'నన్
    విమలుండుఁ గాఁ దలంచి, యిఁ
    క, మఠమునం జొచ్చి, మేలుఁ గనె పథికుఁ డటన్!

    రిప్లయితొలగించండి
  5. సములై, నిర్మలులై, ని
    త్యము సాధన జేయుచుండు నాత్మజ్ఞుల కా
    శ్రమమగు సాధు జనానీ
    క మఠమునన్ జొచ్చి మేలు గనె పథికుడటన్

    రిప్లయితొలగించండి
  6. గుండు మధుసూదన్ గారి పూరణ...(కొంత మార్పుతో)

    విమలాత్ముఁడౌ జినున్ గౌ
    తమ బుద్ధుని యాశ్రయించి, ధర్మ పథమునన్;
    శ్రమణక వృత్తిఁ గొనెడి వే
    డ్క, మఠమునం జొచ్చి, మేలుఁ గనెఁ బథికుఁ డటన్!

    రిప్లయితొలగించండి
  7. ఒక వర్షపు రాతిరి యూ
    రికిఁ బోవుచు ముందు కేఁగలేకను తలదా
    చుకొనఁగ యిరవు వెదకియు నొ
    క మఠమునం జొచ్చి మేలుఁ గనె పథికుఁ డటన్.

    రిప్లయితొలగించండి
  8. చంద్రశేఖర్ గారూ,
    కమఠపు బొమ్మతో మీరు చేసిన పూరణ బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    అలుపెరుగక చేసిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    తొణకక మఠప్రవేశం చేయించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    సాధు జనానీక మఠమా? ఎంత చక్కని ఊహ! ఉత్తమమైన పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. గురువుగారు,
    ధన్యవాదాలండి.
    మీరు చేసిన పూరణ సరిగ్గా పథికునికి సరిపోయింది. బాగుంది.
    తలదాచుకొనగ నిరవు అవుతుందేమో అని సందేహం.

    రిప్లయితొలగించండి
  10. లక్ష్మీదేవి గారూ,
    ధన్యవాదాలు.
    నిజమే.. పొరపాటే!

    రిప్లయితొలగించండి
  11. పెద్దలందరికీ ప్రణామం!

    శ్రీ గురువుల అంతఃకరణపవిత్రతతో అలరారుతున్న పూరణతోపాటు - మున్ముందుగా - "అలపెఱుగక-మఠమున" అని తక్కిన పూరణ లన్నింటికి మార్గదర్శకమైన లక్ష్మీదేవి గారి అందమైన విఱుపు ఆహ్లాదకరంగా ఉన్నది.

    శ్రీ శంకరయ్య గారి ధారాశుద్ధి ప్రశంసనీయంగా ఉన్నది.

    ఒక వర్షపు రాతిరి నూ
    రికిఁ బోవుచు ముందు కేఁగలేకయుఁ దలదాఁ
    చుకొనఁగ నిరవు వెదకియు నొ
    క మఠమునం జొచ్చి మేలుఁ గనె పథికుఁ డటన్.

    లేదా,

    ఒక వర్షపు రాతిరి నూ
    రికిఁ బోవుచు, ముందు కేఁగలేమినిఁ దలదాఁ
    చుకొనఁగ నిరవు వెదకుచు నొ
    క మఠమునం జొచ్చి మేలుఁ గనె పథికుఁ డటన్.

    అని చదువుకొన్నాను.

    ఈ రోజు శ్రీ గుండు మధుసూదన్ గారి రెండవ పూరణ (విమలాత్ముఁడౌ జినున్) విస్మయాపర పర్యాయమైన హాయిని కూర్చుతూ మనోహరంగా ఉన్నదని అభినందించటానికి ఈ లేఖను వ్రాస్తున్నాను. "బుద్ధుని నాశ్రయించి" అన్న చిన్ని మార్పుతో పద్యం ప్రాబంధికంగా ఉన్నది!

    ప్రతిరోజూ ఇన్నిన్ని రూపాల రసజ్ఞులకు హృదయతర్పణం కావిస్తున్న శ్రీ శంకరయ్య గారికి అభివాదాలు.

    అందరికీ అభినందనలతో,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  12. ఏల్చూరి మురళీధరరావు గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. సుమసుకుమారత్వమెపుడు
    శ్రమయనుభారమ్ముమోయఁజాలదనుచున్
    గమనించి మానసికముగ
    కమఠమునంజొచ్చిమేలుఁగనెపథికుఁడటన్!

    రిప్లయితొలగించండి
  14. ఒక పార్కు లో ఏనుగు, తాబేలు రూపంలో నిర్మించిన కట్టడముల లోపల తిరిగి చూచాడని నా భావం.

    శ్రమనే తెలియక తిరిగెను
    "కమనీయం" పార్కు నందు గల యేనుగు లా
    యమరిన కట్టడమును మరి
    కమఠమునం జొచ్చి మేలుఁ గనె పథికుఁ డటన్.

    రిప్లయితొలగించండి


  15. శ్రమణుకుడౌ బౌద్ధు డొకడు ,
    అమలచరిత్రుండు దూరయాత్రకు వెడలన్
    శ్రమ దీరగ గనుగొన్న యొ
    క మఠమునన్ జొచ్చి మేలు గనె పథికుడటన్.

    రిప్లయితొలగించండి
  16. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _______________________________

    కమలాలయ గుడి ద్వారము
    కమఠపు యాకార మందు - కట్టిన నగరిన్
    కమలాక్షిని సేవింపగ
    కమఠమునం జొచ్చి మేలుఁ - గనె పథికుఁ డటన్ !
    _______________________________
    నగరు = గుడి

    రిప్లయితొలగించండి

  17. అమరావతి బోవలెనని
    సుమనస్కుడు పయన మాయె సూర్యోదయమున్ !
    తిమిరమున బోవ జాలని
    క , మఠమునం జొచ్చి మేలుఁ గనె పధికుఁ డటన్ !
    ------------------------------------------------------
    విమాత బారి నుండియు
    విమల మణి యైన ప్రియ సఖి విముక్తి కొఱకై !
    తమకమున నేరు దాటలే
    క , మఠము నం జొచ్చి మేలుఁ గనె పధికుఁ డటన్ !


    రిప్లయితొలగించండి
  18. 01అ)
    _______________________________

    కమలాలయ గుడి వాకిలి
    కమఠపు యాకార మందు - కట్టిన నగరిన్
    కమలాక్షిని సేవింపగ
    కమఠమునం జొచ్చి మేలుఁ - గనె పథికుఁ డటన్ !
    _______________________________
    నగరు = గుడి
    వాకిలి = ద్వారము

    రిప్లయితొలగించండి
  19. శ్రీమతి రాజేశ్వరి గారికి శుభాశీస్సులు. మీ పద్యములను సవరించి ఈ క్రింది విధముగా వ్రాయుచున్నాను:

    అమరావతి కేగుట కొక
    సుమనస్కుడు పయనమాయె శుభసమయమునన్
    తిమిరము క్రమ్మగ చనలే
    క మఠమునం జొచ్చి మేలుగనె పథికుడటన్

    రమణికి విమాతృ దాస్యపు
    విముక్తి గల్పింప నొకడు వెడలుచు నచటన్
    శ్రమతో నది దాటగ లే
    క మఠమునం జొచ్చి మేలుగనె పథికుడటన్

    రిప్లయితొలగించండి
  20. తిమిరపు చింతల బస్తిని
    కుములుచు తనవెంట కన్నె గునగున నడవన్
    కమనీయమ్ముగ గాంచ నొ
    క మఠమునం జొచ్చి మేలుఁ గనె పథికుఁ డటన్

    రిప్లయితొలగించండి