26, జులై 2008, శనివారం

చమత్కార పద్యాలు - 1

తెనాలి రామకృష్ణుని పద్యం
నరసింహ కృష్ణరాయని
కర మరుదగు కీర్తి వెలయు కరిభి ద్గిరిభి
త్కరి కరిభి ద్గిరిగిరిభి
త్కరిభిద్గిరి భిత్తురంగ కమనీయంబై

నరసింహ = నరసింహ రాయల కుమారుడైన
కృష్ణరాయని = శ్రీ కృష్ణ దేవరాయల
కరము = మిక్కిలి
అరుదగు = విశేషమైన
కీర్తి = యశస్సు
కరి = గజాసురుని
భిత్ = ఓడించిన శివునిలాగా తెల్లనిదై,
గిరిభిత్ = పర్వతాలను ఓడించిన ఇంద్రుని
కరి = ఏనుగైన ఐరావతంలాగా తెల్లనిదై ,
కరిభిత్ = గజాసురుని ఓడించిన శివుని
గిరి = నివాస పర్వతమైన కైలాసంలాగా తెల్లనిదై,
గిరిభిత్=పర్వతాలను ఖండించిన వజ్రాయుధంలాగా తెల్లనిదై,
కరిభిత్=గజాసురుని ఓడించిన శివుని యొక్క
తురంగ=వాహనమైన నందీశ్వరునిలాగా తెల్లనిదై,
గిరిభిత్=పర్వతాలను ఓడించిన ఇంద్రుని యొక్క
తురంగ=వాహనమైన ఉచ్చైశ్రవం అనే గుర్రంలాగా తెల్లనిదై ,
ఒప్పె = విలసిల్లింది .

12 కామెంట్‌లు:

  1. బాగుందండి.
    బ్లాగు లోకానికి సుస్వాగతం.
    ఈ పద్యం పూర్వము విన్నాను కానీ అర్థం తెలియదు.
    వివిరించనందకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  2. శంకరయ్య గారూ,
    ఆ పద్యం మొదటి సారి గా నేను తురుపుముక్క బ్లాగులోనే చూశానండీ, తప్పొప్పులు చెప్పలేను.
    భవదీయుడు
    ఊకదంపుడు

    రిప్లయితొలగించండి
  3. రాకేశ్వర రావు గారికి, వూకదంపుడు గారికి, మురళీమోహన్ గారికి ధన్యవాదాలు. వీలైనంత తొందరగా నా బ్లాగులో కొత్త పోస్టులు పెడతాను.

    రిప్లయితొలగించండి
  4. శంకరయ్య గారూ !
    మీకు శ్రీ వికృతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో...

    - శిరాకదంబం

    రిప్లయితొలగించండి
  5. కంది శంకరయ్య గారూ!

    అద్వితీయ శ్లోకాలూ, పద్యాలూ
    మీ బ్లాగు లతకు విర బూయాలని మా ఆకాంక్ష.
    నా బ్ల్గ్లో మీ కామెంటుకు కృతజ్ఞతలు.
    ఆ సినిమాలోని మీకు ఇష్టమైన తక్కిన రెండు పాటలేమిటి???

    రిప్లయితొలగించండి
  6. సముద్ర మధనం లో ఉచ్చైశ్రవం రాక్షసులకి ఇచ్చారని భాగవతంలో విన్నాను. మళ్ళీ ఇంద్రుడికి ఇచ్చారా తర్వాత, తెలుపగలరు.

    రిప్లయితొలగించండి
  7. మనోహర్ గారూ,
    నాకు తెలిసినంత వరకు సముద్ర మథనంలో పుట్టిన ఉచ్చైశ్రవం, ఐరావతం, కల్పవృక్షం మొదలైన వాటిని ఇంద్రుడే తీసుకున్నాడు. వీటిలో ఏదీ రాక్షసులకు ఇవ్వలేదు. ఆ సమయంలో పుట్టిన లక్ష్మిని కూడా ఇంద్రుడు కోరుకుంటే విష్ణువు అలిగాడట! అందరూ ఇంద్రుణ్ణి బుజ్జగించి లక్ష్మిని విష్ణువుకు ఇచ్చారట.

    రిప్లయితొలగించండి
  8. Please give some poems regularly with 'prati pada arthamu'. In school I learnt some poems and the meanings of words in that way. There's nobody to teach that way after schooling.

    రిప్లయితొలగించండి
  9. మాధురి గారూ,
    ప్రత్యేకమైన పద్యాలను ఏర్చి వాటిని వ్యాఖ్యానాలతో బ్లాగులో పెట్టే ప్రయత్నాన్ని త్వరలోనే చేస్తాను.

    రిప్లయితొలగించండి
  10. ధన్యవాదాలు శంకరయ్య గారు!
    కరిభిత్ గురించి గూగుల్ లో వెతుకుతూ మీ బ్లాగులోకి వచ్చాను.
    చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  11. చివర... ఒప్పె యనిగాక,
    వెలయు = విలసిల్లుగాక! అని యుంచఁగలరు.

    రిప్లయితొలగించండి
  12. దీనికి పేరడీగా ఒక చాటు కూడా ఉంది:
    కం||
    వరబారు వెంకనార్యుని
    ధరనిండిన కీర్తి వెలసె ధరజిత్ పురజిత్
    ధర ధరజిత్ పుర పురజిత్
    ధరజిత్ పురజిత్ తురంగ ధావళ్యంబై!

    ధరజిత్ = కొండను గెలిచిన వజ్రంలా, పురజిత్ ధర = పురాలను గెలచిన శివుని కొండ కైలాసంలా, ధరజిత్ పుర = ఇంద్రుని పురంలా, పురజిత్ = పురములను జయించిన శివునిలా, ధరజిత్ పురజిత్ తురంగ = ఇంద్రుడి మరియు శివుని వాహనాలైన ఉచ్చైశ్రవ, నందులలాగా తెల్లగా మెరియు చున్నది.

    రిప్లయితొలగించండి