నా పాటలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నా పాటలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, సెప్టెంబర్ 2013, సోమవారం

ఏకవింశతి పత్ర పూజ (పాట)



ఏకవింశతి పత్ర పూజ (పాట)

ఏకదంతా! నీ కిదే మా - ఏకవింశతి పత్రపూజ

కరుణతో మా కొసగవయ్యా - కలిమి బలిమిని విఘ్నరాజా        || ఏకదంతా ||



సుముఖ! వీతభయా! సదయ! నీ - కిదియె మాచీపత్రము

ఓ గణాధిప! శాశ్వతా! నీ - కిదియె బృహతీపత్రము

శ్రీ ఉమాసుత! గజస్తుత్యా! - బిల్వపత్ర మ్మిదియె నీకు

హే గజానన! అవ్యయా! నీ - కిదియె దూర్వాయుగ్మము

హరతనూభవ! గణపతీ! దు-త్తూరపత్ర మ్మిదియె నీకు

మౌనినుత! లంబోదరా! నీ - కిదియె బదరీపత్రము

హే గుహాగ్రజ! గ్రహపతి! అపా-మార్గపత్ర మ్మిదియె నీకు

భక్తవాంఛిత దాయకాయ వి-నాయకాయ నమో నమః          || ఏకదంతా ||



శ్రీపతీ! గజకర్ణకా! నీ - కిదియె తులసీపత్రము

ఏకదంత! దయాయుతా! గతి! - చూతపత్ర మ్మిదియె నీకు

వికట! ఇంద్రశ్రీప్రదా! కర-వీరపత్ర మ్మిదియె నీకు

భిన్నదంతా! దాంత! విష్ణు-క్రాంతపత్ర మ్మిదియె నీకు

వటు! ద్విజప్రియా! నిరంజన! - దాడిమీపత్రమ్ము నీకు

కామీ! సర్వేశ్వరా! దేవ-దారుపత్ర మ్మిదియె నీకు

ఫాలచంద్ర! సమాహితా! నీ - కిదియె మరువకపత్రము

భక్తవాంఛిత దాయకాయ వి-నాయకాయ నమో నమః          || ఏకదంతా ||



హేరంబా! హే చతుర! సింధు-వారపత్ర మ్మిదియె నీకు

శూర్పకర్ణ! అకల్మషా! నీ - కిదియె జాజీపత్రము

హే సురాగ్రజ! పాపహర! ఇదె - గండకీపత్రమ్ము నీకు

అధ్యక్ష! ఇభవక్త్ర! శుద్ధా! - శమీపత్ర మ్మిదియె నీకు

హే వినాయక! శక్తియుత! అ-శ్వత్థపత్ర మ్మిదియె నీకు

దేవ! సురసేవిత! కృతీ! నీ - కిదియె అర్జునపత్రము

కపిల! కలికల్మష వినాశక! - అర్కపత్ర మ్మిదియె నీకు

భక్తవాంఛిత దాయకాయ వి-నాయకాయ నమో నమః       || ఏకదంతా ||


(దాదాపు పదేళ్ళ క్రితం మా వీధిలో గణేశమండపం వాళ్ళ కోరికపై వ్రాసి ఇచ్చిన పాట)




30, డిసెంబర్ 2011, శుక్రవారం

నా పాటలు - (సాయి పాట)

                           ఓంసాయి శ్రీసాయి

ఓంసాయి శ్రీసాయి జయసాయి అనండి
ఓంకారరూపుడైన సాయి మహిమ కనండి              
|| ఓంసాయి ||

ప్రేమతోడ సాయినాథు పేరు తలచినంతనే
పెన్నిధియై కొర్కెలు నెరవేర్చు మాట నిజమండి
సాయిబాబ లీలలను సన్నుతించు వారలు
సర్వబంధనాలు తొలగి ముక్తి గనుట నిజమండి     
|| ఓంసాయి ||

విశ్వాసంతోడ సాయి నాశ్రయించువారికి
శాశ్వతసుఖశాంతు లిచ్చు సదయుడనీ నమ్మండి
షిరిడీపతి చరణకమల శరణాగతులైన వారి
మరణభయం పోగొట్టే మాన్యుడనీ నమ్మండి           || ఓంసాయి ||

మహిమాన్వితుడైన సాయి మహిత కథాశ్రవణమే
మానరాని రోగాలను మాన్పుననుట నిజమండి
సమత మమత బోధించిన సాయిగురుని సూక్తులే
భ్రమలను తొలగించునట్టి బాటలనీ నమ్మండి             || ఓంసాయి ||

21, డిసెంబర్ 2011, బుధవారం

నా పాటలు - అయ్యప్ప పాట

                            అయ్యప్ప దేవుడు


దేవుడంటె దేవుడు - అయ్యప్ప దేవుడు
దీక్షగొన్న స్వాములకు తిరుగులేని దేవుడు          || దేవుడంటె ||


శంకరహరి పుత్రుడు - శశిభాస్కర నేత్రుడు
సుబ్రహ్మణ్య గణపతులకు సోదరుడగు దేవుడు
భూతసంఘ నాథుడు - పూర్ణపుష్కలేశుడు
పందళరాజ్యాధినేత భవ్యదత్తపుత్రుడు                   || దేవుడంటె ||

శబరిగిరి నివాసుడు - సదమల దరహాసుడు
శరణు కోరువారి నెల్ల కరుణించే దేవుడు
మహిమలున్న దేవుడు - మణికంఠ నాముడు
ఆర్తులైన భక్తులను ఆదుకొనే దేవుడు                   || దేవుడంటె ||

పంచగిరి విహారుడు - పానవట్ట బంధుడు
వావరుని మన్నించిన పదునెట్టాంబడి విభుడు
విల్లాలి వీరుడు - మహిషి ప్రాణహారుడు
శుభము లిచ్చి కాపాడే జ్యోతిస్వరూపుడు              || దేవుడంటె ||

13, డిసెంబర్ 2011, మంగళవారం

నా పాటలు - (అయ్యప్ప పాట)

                          అయ్యప్ప మందిరం



పద్దెనిమిది మెట్లపైన స్వర్ణమందిరం - మనల
పాలించే మణికంఠుని భవ్యమందిరం          || పద్దెనిమిది ||


పాపాలను తొలగించే పావనరూపం
కష్టాలను కడతేర్చే కరుణారూపం
మోక్షమార్గమును చూపే మోహనరూపం
అయ్యప్పగ వెలసినట్టి దివ్యమందిరం       || పద్దెనిమిది
||

చిన్ముద్రాంచితహస్తుడు శివునిపుత్రుడు
చిరునవ్వుల వెదజల్లు ప్రసన్నవదనుడు
పానవట్టబంధుడు కిరీటధారుడై
అవతరించి నెలకొన్న పుణ్యమందిరం       || పద్దెనిమిది ||


మహితమైన మాలవేసి మండలకాలం
వ్రతదీక్షాబద్ధులైన స్వాములందరు
ఇరుముడి తలకెత్తి స్వామి శరణుఘోషతో
తరలివచ్చి దర్శించే దైవమందిరం          || పద్దెనిమిది ||


కన్నె కత్తి గంట గద గురుస్వాములు
తరతమభేదాలు మరచి పరమభక్తితో
సేవించిన వారికి సుఖసంపదలిచ్చి
ధన్యత చేకూర్చునట్టి మాన్యమందిరం    || పద్దెనిమిది ||

8, డిసెంబర్ 2011, గురువారం

నా పాటలు - (సాయి పాట)

                       దేవుడు - గురువు - రాజు


ఎక్కడైనా గాని ఎప్పుడైనా గాని
అక్కరకు వస్తాడు మన సాయి
వేయి నామాల రూపాల మనసాయి
నామరూపాల కందని మన సాయి              || ఎక్కడైనా ||


ఏ దేవు డీజగములకు సృష్టికర్త
ఏ దేవు డీజగము లెల్ల కాపాడు
ఏ దేవు డత్యంత మహిమాన్వితుండు
ఆ సాయి దేవుడే శరణమ్ము మనకు         
|| ఎక్కడైనా ||

ఏ గురువు అజ్ఞాన తిమిరిసంహారి
ఏ గురువు జ్ఞానప్రకాశ భాస్కరుడు
ఏ గురువు సర్వజన సన్మార్గదర్శి
ఆ సాయి సద్గురువె శరణమ్ము మనకు    
|| ఎక్కడైనా ||

ఏ రాజు మన హృదయసామ్రాజ్య నేత
ఏ రాజు దుష్టగుణ శాత్రవ విజేత
ఏ రాజు సుఖశాంతి సంపదల దాత
ఆ సాయి మహరాజె శరణమ్ము మనము 
|| ఎక్కడైనా ||

7, డిసెంబర్ 2011, బుధవారం

నా పాటలు - (సాయి పాట)

                                      శంకర సాయిబాబాలు

శంకర సాయీబాబా లిద్దరు
భస్మధారులే - నిర్వికారులే
భిక్షాపాత్ర ధరించియు కరుణా
భిక్షవేసెదరు భక్తజనులకు                   || శంకర ||


వేయినామములవాడు శంకరుడు
ఏకనామధరు డయ్యెను సాయి
శంకరు డేమొ దిగంబరనాముడు
సాయినాథు డవధూతనాముడు          || శంకర ||


దురహంకారవినాశి శంకరుడు
సంశయవినాశి సాయినాథుడు
పురాణపురుషుడు శంకరు డైతే
పుణ్యపురుషుడు మన సాయి             || శంకర ||


ఫాలలోచనుడు శంకరు డైతే
పాపమోచనుడు సాయినాథుడు
శంకరు డేమో రుద్రరూపుడు
సాయినాథుడు శాంతరూపుడు            || శంకర ||


దక్షగర్వభంజకుడు శంకరుడు
దాసగర్వభంజకు డీ సాయి
శిరమున గంగ ధరించెను శివుడు
పదములు గంగాయమునలు సాయికి || శంకర ||


వృషభవాహనుడు శంకరు డైతే
అశ్వవాహనుడు మన సాయి
శివునిది శైలనివాసం అయితే
సాయినాథునిది శివాసనం                 || శంకర ||

5, డిసెంబర్ 2011, సోమవారం

నా పాటలు - (అయ్యప్ప పాట)

                              మంజుమాత 

అల్లో నేరెడుల్లో - అల్లో నేరెడుల్లో || అల్లో ||
అయ్యయ్యొ ఆ తల్లి అల్లాడిపోయింది - అల్లో నేరెడుల్లో 
|| అల్లో ||

మహిషి శాపం తీరిపోయి - మంజుమాతై ముందు నిలిచి
పెండ్లాడమని కోరె అయ్యప్పస్వామిని - అల్లో నేరెడుల్లో
కన్నెస్వామి రాని ఏడు - కట్టుకుంటానన్న మాట
ఎన్నేండ్లు గడచినా తీరనే లేదు - అల్లో నేరెడుల్లో    
|| అల్లో ||

ఏనుగెక్కి ఊరేగీ - ఎన్నెన్నొ ఆశలతోడ
కన్నులలో దీపాలు వెలిగించుకొని వచ్చె - అల్లో నేరెడుల్లో
ఏటి కేడు పెరుగుతున్న - కన్నెస్వాములు గుచ్చుతున్న
శరంగుత్తి బాణాలు గుండెల్లొ దూరాయి - అల్లో నేరెడుల్లో  
|| అల్లో ||

అయ్యప్పపైనున్న ఆశ - అడియాస కాకూడదంటూ
అలుపూ సొలుపూ లేక ఆత్రంగ వస్తుంది - అల్లో నేరెడుల్లో
కోపాన్ని చూపించకుండా - కన్నెస్వాముల దీవించి
మాలికాపురత్తమ్మ మరలిపోతుంది - అల్లో నేరెడుల్లో  
|| అల్లో ||

4, డిసెంబర్ 2011, ఆదివారం

నా పాటలు - అయ్యప్ప కథాగానం - 2/5

                   అయ్యప్ప కథాగానం - 2/5

(పల్లవి -
శ్రీకరం శుభకరం అయ్యప్పచరితం
        మధురం మనోహరం ఆనందభరితం || శ్రీకరం|| )


"శబరిగిరిపై నొక్క ఉన్నతస్థానాన
        పరశురాముడు పరబ్రహ్మకై నిష్ఠతో
        ఘనమైన ఒక ప్రతిష్ఠను చేసి ఉంచాడు || ఘనమైన ||
నేను వేసిన బాణము - పడినట్టి
        చోటనే నాకు గుడిని - నిర్మించు
పద్దెనిమిది మెట్లతో - ఆ స్వర్ణ
        మందిరంలో వెలసెద - దివ్యంగ


పట్టబంధం అభయ చిన్ముద్రహస్తాల
        యోగముద్రను వెలసి ఏడాది కొకసారి
        మకరసంక్రమణాన జ్యోతిగా కనిపింతు || మకర ||
ఆనాడు నా నగలను - నీ వంశ
        వారసులె భూషింతురు - ఎల్లపుడు
నా దీక్ష పాటించెడి - నియమాలు
        వివరింతు నీకిప్పుడు - నా తండ్రి! || శ్రీకరం ||


నల్లబట్టలు కట్టి, ముద్రమాలను వేసి,
        మండలకాలమ్ము వ్రతదీక్షలో ఉండి
        ఇరుప్రొద్దు చన్నీటి స్నానాలు చేయాలి || ఇరుప్రొద్దు ||
బ్రహ్మచారిగ ఉండియు - నేలపై
        శయనించి ఏకభుక్తం - చేయాలి
త్రికరణంబుల శుద్ధితో - సాత్విక
        జీవనమ్మును గడుపుతూ - మెలగాలి


ఇరుప్రొద్దు పూజలతో దీక్ష పూర్తిగ చేసి
        గురుస్వామి కట్టిన ఇరుముడిని తలదాల్చి
        వావరుని దర్శించి వనయాత్ర చేయాలి || వావరుని ||
పంబలో స్నానమాడి - గణపతిని
        పూజించి శబరిపీఠం - చూడాలి
నీలిమలపైన ఉన్న - శరంగుత్తి
        దాటియు సన్నిధానం - చేరాలి || శ్రీకరం ||


తలపైన ఇరుముడితో అష్టాదశ దివ్య
        సోపానముల నెక్కి నన్ను దర్శించాలి
        పొర్లుదండాలతో పూజలే చేయాలి || పొర్లు ||
ముద్రటెంకాయలోని - నెయ్యితో
        చేయాలి అభిషేకము - భక్తితో
మాలికాపురత్తమ్మను - దర్శించి
        ఆ తల్లి దీవెనలను - పొందాలి"


అని చెప్పి అయ్యప్ప విల్లెక్కుపెట్టాడు
        ఈశాన్యదిశవైపు బాణమే వేశాడు
        ఆ దిక్కుకే పోయి మాయమైపోయాడు || ఆ దిక్కు ||
బాణమ్ము పడ్డచోట - ఆ రాజు
        స్వర్ణమందిర మొక్కటి - కట్టించె
లోకకళ్యాణార్థమై - అందులో
        సుస్థిరమ్ముగ వెలసెను - అయ్యప్ప || శ్రీకరం ||


విల్లాలివీరుడై వీరమణికంఠుడై
        అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన
        అయ్యప్ప చరితమ్ము ఆద్యంత మధురమ్ము || అయ్యప్ప ||
ఈ కథను శ్రద్ధతోడ - విన్నట్టి
        భక్తులను కరుణించును - అయ్యప్ప
ఆయురారోగ్యాలను - ధర్మార్థ
        కామమోక్షా లిచ్చియు - కాపాడు

ఇరుముడిప్రియ శరణు! భువనేశ్వరా శరణు!
        భక్తవత్సల శరణు! లోకరక్షక శరణు!
        దివ్య పదునెట్టాంబడిక్కధిపతీ శరణు || దివ్య ||
భక్తచిత్తాధివాసా - శరణమ్ము!
        శత్ర్రుసంహారమూర్తీ - శరణమ్ము!
ఎరుమేలి ధర్మశాస్తా - శరణమ్ము!
        సర్వమంగళదాయకా - శరణమ్ము || శ్రీకరం ||


మంగళం అయ్యప్ప! మణికంఠ మంగళం!
        మంగళం అన్నదానప్రభూ మంగళం!
        మంగళం హరిశంకరాత్మజా మంగళం! || మంగళం ||
మంగళం భూతనాథా - మంగళం!
        మంగళం శబరివాసా - మంగళం!
మంగళం ధర్మశాస్తా - మంగళం!
        మంగళం శుభమంగళం - మంగళం!


                             అయ్యప్ప కథాగానం సంపూర్ణం

క్రింది లింకుల ద్వారా పాటను వినవచ్చు.

మొదటి భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32991161

రెండవ భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32992715

3, డిసెంబర్ 2011, శనివారం

నా పాటలు - అయ్యప్ప కథాగానం - 2/4

                   అయ్యప్ప కథాగానం - 2/4
(పల్లవి -
శ్రీకరం శుభకరం అయ్యప్పచరితం
        మధురం మనోహరం ఆనందభరితం || శ్రీకరం ||)


పంతాలు పలుకుచు తనముందు నిలుచున్న
        బాలు డా హరిహరుల పుత్రుడే అని నమ్మి
        తన ప్రాణరక్షణకు అతని నెదిరించింది || తన ప్రాణ ||
ఇరువదిన్నొక రోజులు - ఇద్దరు
        యుద్ధమే చేసినారు - తీవ్రంగ
మణికంఠు డా మహిషిని - పైకెత్తి
        గిరగిరా త్రిప్పి వేసె - భూమిపై


మహిషి శరీరమ్ము భూమిపై పడగానె
        దివినుండి దిగివచ్చి ఆ మహిషి తనువుపై
        అయ్యప్ప ఆనందతాండవం చేశాడు || అయ్యప్ప ||
అతని పాదాలు తాకి - మహిషికి
        పోయె దురహంకారము - ప్రాణాలు
శాపమ్ము తొలగిపోయి - దివ్యంగ
        కనిపించె లీలావతి - ఆచోట || శ్రీకరం ||


తన నుద్ధరించింది దత్తుడని గుర్తించి
        పెళ్ళాడమని కోరి పాదాలు పట్టింది
        ఆమాట అయ్యప్ప మన్నించనే లేదు || ఆమాట ||
బ్రహ్మచర్యం చేయుచు - నే నింక
        సాధించు పనులున్నవి - అన్నాడు
ఎంతకాలమ్మైనను - నీ కొరకు
        ఎదురుచూస్తా నందిలే - లీలమ్మ


"ఏటేట నా కడకు వచ్చు భక్తులలోన
        తొలిసారిగా మాల ధరియించి దీక్షగొను       
        కన్నెస్వాములు వారు నాకు ప్రతిరూపాలు || కన్నె ||
ఆ కన్నెస్వాము లెవరూ - రానట్టి
        ఆ యేట జరిగేనులే - మనపెళ్ళి
మాలికాపురత్తమ్మవై - అందాక
        మంజుమాతగ పూజలు - అందుకో || శ్రీకరం ||


మణికంఠు స్పర్షతో మహిషి శరీరమ్ము
        కొండయై ఈనాడు ఆళుదామే డయ్యె
        ఆమె కన్నీరేమొ ఆళుదానది అయ్యె || ఆమె ||
మహిషిని చంపినట్టి - స్వామిని
        మ్రొక్కి కీర్తించినారు - దేవతలు
వారు చేసిన స్తోత్రమే - ఈనాడు
        శరణుఘోషగ మిగిలెను - భక్తులకు


దేవతలతోడ మణికంఠు డిట్లన్నాడు
        "నా తల్లి తలనొప్పి తగ్గించుటకుగాను
        పులిపాలకై నేను అడవికే వచ్చాను" || పులి ||
ఆమాట విని ఇంద్రుడు - దేవతలు
        పులిరూపు దాల్చినారు - అప్పుడే
పులియైన ఇంద్రు నెక్కి - అయ్యప్ప
        పందళరాజ్యమ్మునే - చేరాడు || శ్రీకరం ||

పులివాహనుం డైన అయ్యప్పనే చూసి
        రాజుతో పాటు ప్రజలంత అబ్బురపడిరి
        తనతప్పు నొప్పుకొని మన్నించమనె రాణి || తనతప్పు ||
నిజరూపముల దాల్చియు - దేవతలు
        అయ్యప్ప జన్మకథను - చెప్పారు
హరిహరుల పుత్రుడైన - దేవుడే
        తనకు కొడుకని మురిసెను - ఆరాజు


"అవతార బాధ్యతలు తీరాయి నన్నింక
        సెలవిచ్చి ప్రేమతో దీవించి పంపండి"
        అని స్వామి కోరగా ఆ తండ్రి విలపించె || అని స్వామి ||
"పూర్వజన్మము నందున - ఇచ్చిన
        వరము దీర్చితి నిప్పుడు - కొడుకునై"
అని చెప్పి తననగలను - తొలగించి
దాచమంటూ తండ్రికి - ఇచ్చాడు || శ్రీకరం ||


క్రింది లింకుల ద్వారా పాటను వినవచ్చు.
మొదటి భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32991161

రెండవ భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32992715

2, డిసెంబర్ 2011, శుక్రవారం

నా పాటలు - అయ్యప్ప కథాగానం - 2/3

                అయ్యప్ప కథాగానం - 2/3

(పల్లవి -
శ్రీకరం శుభకరం అయ్యప్పచరితం
        మధురం మనోహరం ఆనందభరితం || శ్రీకరం ||)


"నామీది ప్రేమతో శంకించుచున్నావు
        అల్పునిగ భావించి వెనుకాడుతున్నావు
        నా శక్తి ఎంతటిదొ త్వరలోనె తెలిసేను || నా శక్తి ||
నీ దీవెనల బలముతో - పులిపాలు
        సాధించి వస్తానులే - ఓ తండ్రి!
ఈశ్వరుడె తోడు నీడై - నన్నింక
        నడిపించు" నని చెప్పెను - అయ్యప్ప


దైవమ్ముపై రాజు భారమే వేశాడు
        వనయాత్ర కోసమై ఏర్పాట్లు చేశాడు
        సంచినే తెప్పించి ఇరుముడిని కట్టాడు || సంచినే ||
ఒక్క భాగంనందున - నెయి నింపి
        నారికేళం కట్టెను - పూజకై
మరియొక్క భాగమందు - తిండికై
        బెల్ల మటుకులు నింపెను - ఆరాజు || శ్రీకరం ||


తండ్రి అనుమతి పొంది ఇరుముడిని తల కెత్తి
        ఒంటరిగ పయనించి అడవికే చేరాడు
        రాళ్ళల్లొ ముళ్ళల్లొ నడక సాగించాడు || రాళ్ళల్లొ ||
ఉన్నాడు ఆ అడవిలో - వావరుడు
        బందిపోటై దోపిడీ - చేస్తాడు
చూశాడు అయ్యప్పను - బాలునిగ
        భావించి దోచాలని - చూశాడు


అయ్యప్ప అంతట తన శక్తి యుక్తులతో
        వావరు న్నెదిరించి మట్టి కరిపించాడు
        అది చూసి ఆ దొంగ ఆశ్చర్యపడ్డాడు || అది చూసి ||
కా డితడు సామాన్యుడు - తప్పక
        దైవాంశసంభూతుడే - అని నమ్మె
పద మంటి శరణు కోరె - ఇకనుండి
        దుష్టమార్గం విడుతును - అన్నాడు || శ్రీకరం ||


శరణన్న వావరుని మిత్రునిగ చేపట్టి
        "నను నీవు కలిసిన ఈ చోటు ఇకమీద
        ఎరుమేలి పేరుతో ప్రఖ్యాతి చెందేను || ఎరుమేలి ||
ఇకనుండి నా భక్తులు - అడవిలో
        ఈ దారినే వత్తురు - నా కొరకు
వారిని కాపాడుతు - క్షేమంగ
        నా కడకు చేర్చాలిరా - అన్నాడు


అయ్యప్ప తనపైన చూపించు ప్రేమకు
        పులకించి వావరుడు గంతులే వేశాడు
        అతనితో అయ్యప్ప నాట్యమే చేశాడు || అతనితో ||
అది చూసి సంతసించి - వావరుని
        అనుచరులు ఆటవికులు - ఆడారు
ఆనాటి ఆ ముచ్చటే - ఈనాడు
        పేటతుళ్ళై మనలను - మురిపించు || శ్రీకరం ||


అక్కడికి ఎనిమిది ఆమడల దూరాన
        పంపానదీ తీర మందున్న కొండపై
        తపము చేస్తున్నట్టి శబరి వద్దకు పోయె || తపము ||
తన దివ్యహస్తాలతో - తాకాడు
        మోక్ష మిచ్చెను శబరికి - అయ్యప్ప
ఆ కొండ నాటునుండి - శబరిగిరి
        అను పేర ప్రఖ్యాతిని - పొందింది


దేవతలు వచ్చారు స్తోత్రాలు చేసారు
        "స్వామి! నీ అవతార మర్మమ్ము తెలుసుకో
        మహిషి సంహారమ్ము గావింప రావయ్య" || మహిషి ||
అని చెప్పి ప్రార్థింపగా - అయ్యప్ప
        స్వర్గమే చేరినాడు - వారితో
తనతోడ పోరాటమే - చేయగా
        రమ్మంటు పిలిచినాడు - మహిషిని || శ్రీకరం ||


క్రింది లింకుల ద్వారా పాటను వినవచ్చు.
మొదటి భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32991161

రెండవ భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32992715

1, డిసెంబర్ 2011, గురువారం

నా పాటలు - అయ్యప్ప కథాగానం - 2/2

                    అయ్యప్ప కథాగానం - 2/2

(పల్లవి -
శ్రీకరం శుభకరం అయ్యప్పచరితం
        మధురం మనోహరం ఆనందభరితం || శ్రీకరం ||) 


ఆ నిర్ణయమ్మును తన మంత్రికే చెప్పి
        వేగంగ ఏర్పాట్లు చేయ మనె నా రాజు
        ఆ దుష్టమంత్రికి అది నచ్చనే లేదు || ఆ దుష్ట ||
కులగోత్రములు తెలియని - అయ్యప్ప
        రాజగుట కొప్పుకొనడు - ఆ మంత్రి
ఎట్లైన మణికంఠుని - తప్పించ
        వలెనంటు యోచించెను - మార్గాలు


దేశదేశాల మాంత్రికులనే రప్పించి
        ఆ మంత్రి మంత్రప్రయోగాలు చేయించె
        అయ్యయ్యొ అయ్యప్ప రోగాల పాలయ్యె || అయ్యయ్యొ ||
రాజు ప్రార్థించగానే - ధన్వంత్రి
        రూపాన వెచ్చేసెను - శంకరుడు
మణికంఠు రోగాలను - పోగొట్టి
        వజ్రకాయుని చేసియు - కాపాడె || శ్రీకరం ||


మరియొక్కసారి అయ్యప్పను ఆ మంత్రి
        తన ఇంట విందుకై తీసికొని వెళ్ళాడు
        కాలకూటం కలిపి భోజనం పెట్టాడు || కాలకూటం ||
ఆ విషయ మంత తెలిసి - భోజనం
        నిశ్చింతగా చేసెను - అయ్యప్ప
దైవాంశసంభూతుడు - గరళాన్ని
        జీర్ణించుకొని యుండెను - సుఖముగా


పట్టు వదలని మంత్రి రాణితో అన్నాడు
        "నీ సొంతబిడ్డడే వారసుండై ఉండ
        ఎవ్వడో అయ్యప్ప రా జగుట న్యాయమా? || ఎవ్వడో ||
నీ వెట్లు సహియింతువు - పరబిడ్డ
        నీ బిడ్డనే చంపును - ఒకనాడు
ఇకనైన మేలుకోవే - వానిని
        తొలగించు మార్గమేదో - చూడవే || శ్రీకరం ||


అయ్యప్పపై నున్న ప్రేమతో ఆ రాణి
        ఎటు తేల్చుకోలేక తటపటాయించింది
        మంత్రి మాటలలోని మర్మ మాలోచెంచె || మంత్రి ||

కన్నట్టి ప్రేమముందు - పెంచిన
        ప్రేమయే ఓడిపోయె - చివరికి
ఏమి కర్తవ్య మంటు - మంత్రినే
        అడిగించి గోప్యమ్ముగా - ఆ రాణి


"ఓ రాణి! నీ విపుడు తలనొప్పి వచ్చెనని
        విపరీత మైనట్టి బాధనే నటియించు
        పులిపాలె మందు అని వైద్యులతొ చెప్పింతు || పులి ||
పులిపాలు తెత్తునంటు - అయ్యప్ప
        ఘోరాటవులలోనికే - పోతాడు
అక్కడే మరణించును - మనపీడ
        తొలగి మన రాజరాజే - రాజగును || శ్రీకరం ||


ఆ మాట పాటించి ఆ రాణి వెంటనే
        తలనొప్పితో బాధ నటియించసాగింది
        ఏ మందులకు కూడ లొంగదా తలనొప్పు || ఏ మందు ||
మంత్రి ఇచ్చిన లంచము - అందుకొని
        రాజవైద్యులు చెప్పిరి - చివరికి
అప్పుడే ఈనినట్టి - పులిపాలు
        తలనొప్పి తగ్గించును - అన్నారు


తన తల్లి బాధను తప్పించగా తలచి
        "నేనె అడవికి పోయి పులిపాలు తెస్తాను
        పంపించు" మని తండ్రి నడిగాడు అయ్యప్ప || పంపించు ||
రాజశేఖరు డంతట - వద్దని
        వారించబోయినాడు - కొడుకును
యోధు లెందరినైనను - పంపించి
        పులిపాలు తెప్పింతును - అన్నాడు || శ్రీకరం ||


క్రింది లింకుల ద్వారా పాటను వినవచ్చు.
మొదటి భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32991161

రెండవ భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32992715

30, నవంబర్ 2011, బుధవారం

నా పాటలు - శరణం శ్రీ సుబ్రహ్మణ్యం!

శరణం శ్రీ సుబ్రహ్మణ్యం!
(ఈరోజు సుబ్రహ్మణ్యషష్ఠి. ఈ సందర్భంగా నే నెప్పుడో వ్రాసిన పాట)

శరణు శరణు శరణం మురుగా!
        శరణం శ్రీ బాలమురుగా!
వరమిచ్చే దైవం నీవని - మేము
        చేరినాము స్వామీ నీదరి         
|| శరణు ||

పళనిమలై మందిరమందు
        వెలసిన ఓ కుమార స్వామీ!
శరవణభవ! సుబ్రహ్మణ్యం!
        శరణం నీ దివ్యచరణం
నీ నామగానం మధురము - మాకు
        నీ పాదసేవే శుభకరం         
|| శరణు ||

నెమలి నెక్కి తిరిగే స్వామివి
        వల్లీ దేవసేనా పతివి
తారకుని చంపిన దేవా!
        దయ చూపి కావగ రావా
పాలాభిషేకం చేయగా - నీకు
        తెచ్చినాము పాలకావడీ    
|| శరణు ||

ఉమామహేశ్వర సుతుడవు నీవు
        గణపతి అయ్యప్పల కన్నవు
వీరబాహు మిత్రుడి వంట
        ఆరుకొండల కధిపతి వంట
నమ్మినాము నిన్నే షణ్ముఖా! - మురుగా!
        మమ్ము బ్రోవ రావా వేగమే 
|| శరణు ||

నా పాటలు - అయ్యప్ప కథాగానం - 2/1

                  అయ్యప్ప కథాగానం - 2/1

(పల్లవి -
శ్రీకరం శుభకరం అయ్యప్పచరితం
        మధురం మనోహరం ఆనందభరితం || శ్రీకరం ||)


అంతలో అక్కడికి తన శిష్యగణముతో
        మునులలో శ్రేష్ఠుం డగస్త్యుడే వచ్చాడు
        రాజు చేతులలోని పసిబాలునే చూసె || రాజు ||
దైవకార్యం తీర్చగా - పుట్టిన
        హరిహరుల తనయుడంటు - గుర్తించె
రాజును దీవించియు - మునిరాజు
        అతనితో పలికినాడు - ఏరీతి


"ఓ రాజ! సంతానమే లేక బాధపడు
        నీకు ఈ పసికందు దైవప్రసాదంబు
        కొడుకుగా భావించి పెంచుకో నీవింక || కొడుకుగా ||
మెడలోన హారమ్ముతో - దొరికాడు
        మణికంఠు డను పేరుతో - పిలుచుకో
సామాన్యు డనుకోకుమా - పన్నెండు
        వత్సరాలకు తెలియును - ఇత డెవరొ || శ్రీకరం ||


ఆనంద ముప్పొంగ ఆ రాజశేఖరుడు
        మణికంఠు నెత్తుకొని నగరికే వచ్చాడు
        తనయు డంటూ చెప్పి తన రాణి కిచ్చాడు || తనయు ||
ముగ్ధమోహన రూపము - వీక్షించి
        పరవశత్వం చెందెను - ఆ రాణి
రాణివాసం నందున - రాజ్యాన
        సంబరాలే చేసిరి - అందరు


మణికంఠు రాకతో పందళ రాజ్యమ్ము
        సకల సంపదలతో తులదూగ సాగింది
        ప్రజ లెల్ల సుఖముగా జీవింపసాగారు || ప్రజ ||
ఇంతలో గర్భవతియై - ఆ రాణి
        పండంటి ఒక కొడుకును - ప్రసవించె
రాజదంపతు లప్పుడు - వానికి
        రాజరాజను పేరును - పెట్టారు || శ్రీకరం ||


రాజు మణికంఠుణ్ణి ‘అయ్య’ అని పిలిచాడు
        రాణి కడు ప్రేమతో ‘అప్ప’ అని పిలిచింది
        అయ్య అప్పలు కలిసి అయ్యప్పగా మారె || అయ్య ||
ఆ పేరె స్థిరపడ్డది - లోకాన
        అందరికి ఆప్తుడయ్యె - అయ్యప్ప
శుక్లపక్షపు చంద్రుడై - దినదినం
        వర్ధిల్లె మణికంఠుడు - అప్పుడు


గురుకులంలో చేరి గురుసేవలే చేసి
        సకల శాస్త్రమ్ములూ యుద్ధవిద్యల నన్ని
        నేర్చినా డయ్యప్ప ఏకసంథాగ్రాహి || నేర్చి || 

చదువు చెప్పిన గురువుతో - తా నేమి
        దక్షిణగ ఇవ్వవలెనో - అడిగాడు
అయ్యప్ప మహిమ తెలిసి - ఆ గురువు
        అతనితో అలికినాడు - ఈ రీతి || శ్రీకరం ||


"నాయనా! మణికంఠ! నా ఒక్క పుత్రుడు
        మూగవాడూ గ్రుడ్డివాడుగా జన్మించె
        లోపాలు సరిదిద్ది జ్ఞానిగా చేయు" మనె || లోపాలు ||
అయ్యప్ప తాకగానే - బాలునకు
        వచ్చె మాటలు చూపును - చిత్రంగ
గురు వెంతొ సంతసించి - దీవించి
        పంపినా డయ్యప్పను - పందళకు


తన తమ్ముడైనట్టి రాజరాజే రాజ్య
        వారసుండని యెంచి పందళరాజుకు
        భృత్యభావంతోడ సేవలే చేసాడు || భృత్య ||
ఈ రీతి మణికంఠుడు - పన్నెండు
        వత్సరమ్ములు గడపెను - ఆచోట
రాజశేఖరు డతనికి - పట్టాభి
        షేకమే చేయాలని - భావించె || శ్రీకరం ||


క్రింది లింకుల ద్వారా పాటను వినవచ్చు.
మొదటి భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32991161

రెండవ భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32992715

29, నవంబర్ 2011, మంగళవారం

నా పాటలు - అయ్యప్ప కథాగానం - 1/5

                   అయ్యప్ప కథాగానం - 1/5

(పల్లవి -
శ్రీకరం శుభకరం అయ్యప్పచరితం
        మధురం మనోహరం ఆనందభరితం || శ్రీకరం ||)


తన భక్తురాలైన కన్నికను రక్షింప
        శివుడు పంపించంగ శ్రీధర్మశాస్తా
        తన మిత్రుడు కరుప్పస్వామితో వచ్చె || తన ||
తంత్రవిద్యలతోడను - ఆ రాజు
        నోడించి రక్షించెను - కన్నికను
అతని రూపం చూసిన - పుష్కళ
        వరియించి పెళ్ళాడెను - శాస్తాను


మలయాళ రాజైన పింజకన్ ఒకసారి
        భూత భేతాళాల చేతిలో చిక్కాడు
        తనను కాపాడంగ శాస్తాను ప్రార్థించె || తనను ||
భూతనాథుని చూసిన - భూతాలు
        దాసోహ మని చేరెను - శరణమ్ము
తన కుమార్తెను పూర్ణను - పింజకన్
        ధర్మశాస్తా కిచ్చెను - భార్యగా || శ్రీకరం ||


తన కూతురైన పుష్కలదేవి ఉండగా
        మరల పూర్ణను పెళ్ళిచేసికొన్నాడని
        కోపించినాడు ఆ నేపాళరా జపుడు || కోపించి ||
మనిషిగా భూమిపైన - శాస్తాను
        బ్రహ్మచారిగ ఉండగా - శపియించె
అది దైవలీలగానే - భావించి
        శిరసా వహించేనులే - ఆ శాస్తా


శ్రీ పూర్ణ పుష్కళాంబా సమేతుండైన
        భూతనాథుని పిల్చి శివుడిట్లు చెప్పాడు
        "నాయనా! విను మొక్క దేవరహస్యమ్ము || నాయనా ||
మహిషికి మోక్షమిచ్చి - జనులను
        కాపాడు కర్తవ్యమే - నీ కుంది
పందళరా జింటను - పన్నెండు
        వత్సరమ్ములు గడుపగా - పోవాలి" || శ్రీకరం ||


మలయాళ దేశాన పందళ రాజ్యాన
        రాజశేఖరుడనే రాజొక్క డున్నాడు
        ప్రజల బిడ్డల రీతి పాలించుచున్నాడు || ప్రజల ||
సంతానమే లేకనూ - ఆ రాజు
        సంతాపమే పొందియు - దుఃఖించె
తాను చేసిన పూజలు - వ్రతములు
        వ్యర్థమైపోయె నంటూ - భావించె


ఆ రాజు ఒకరోజు వేటాడగా దలచి
        మంత్రి పరివారమ్ముతో అడవి నున్నట్టి
        పంపానదీతీర ప్రాంతమ్ము చేరాడు || పంపా ||
స్వేచ్ఛగా సంచరిస్తూ - అడవిలో
        ఎన్నెన్నొ జంతువులను - వేటాడె
మధ్యాహ్నకాలానికి - ఆ రాజు
        అలసి సొలసి చేరెను - ఒక నీడ || శ్రీకరం ||


కునుకు తీస్తున్నట్టి ఆ రాజు చెవి సోకె
        మృదుమధుర గానమై పసివాని ఏడుపు
        "ఈ ఘోరవనిలోన రోదనం ఎక్కడిది?" || ఈ ఘోర ||
 అని లేచి రా జప్పుడు - ఏడుపు
        వినబడ్డ దిక్కుకేగె - వేగంగ
అటు పోయి వీక్షించెను - చిత్రంగ
        పసివాణ్ణి పాముపడగ - నీడలో


"ఎవ్వడీ పసివాడు? ఎందు కిట నున్నాడు?
        పాము పడగను పట్టె బహుగొప్ప జాతకుడు
        వదలిపోరాని ముద్దులమూటరా ఇతడు || వదలి ||
కులగోత్రములు తెలియక - నా వెంట
        ఏరీతి కొనిపోదును - ఇతనిని
ఎవరైన కనిపించరా" - అనుకొని
        అన్ని దిక్కులు వెదికెను - ఆ రాజు || శ్రీకరం ||


                                                       మొదటి భాగం సమాప్తం

క్రింది లింకుల ద్వారా పాటను వినవచ్చు.
మొదటి భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32991161

రెండవ భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32992715





28, నవంబర్ 2011, సోమవారం

నా పాటలు - అయ్యప్ప కథాగానం - 1/4

                    అయ్యప్ప కథాగానం - 1/4

(పల్లవి -
శ్రీకరం శుభకరం అయ్యప్పచరితం
        మధురం మనోహరం ఆనందభరితం || శ్రీకరం ||)


మెరుపుతీగను బోలు మేని హొయలును చూపి
        రతిని మించిన సుందరాంగియై కనిపించి
        భస్మాసురుని దృష్టి తనవైపు తిప్పింది || భస్మా ||
ఆమె పొందును కోరుతూ - రాక్షసుడు
        ప్రాధేయపడె నంతట - మోహాన
"నాకు దీటుగ నాట్యమే - చేయరా
        సొంతమౌతా" నందిలే - మోహిని


దేవతలు యక్ష గంధర్వ కిన్నరు లంత
        అతివిస్మయంతోడ వీక్షించుచుండగా
        తాధిమ్మి తకధిమ్మి నాట్యమే చేసారు || తాధిమ్మి ||
వివిధభంగిమ లొప్పగా - తనచేయి
        తలపైన పెట్టుకొనెను - మోహిని
ఆమెనే అనుకరిస్తూ - తనచేయి
        తలపైన పెట్టుకొనెనే - రాక్షసుడు || శ్రీకరం ||


వరము మరచి చేయి తలపైన పెట్టుకొని
        భగభగా భగ్గుమని మంటలే లేవగా
        భస్మాసురుడు కాలి భస్మమై పోయాడు || భస్మా ||
విపరీత బుద్ధితోడ - రాక్షసుడు
        తనకు తానై చచ్చెనే - దుష్టుడై
మోహినీవేషమ్ముతో - విష్ణువు
        శంకరుని కాపాడెను - యుక్తితో


మోహినీ రూపలావణ్యాలు తిలకించి
        మోహాలు రేపు కనుసైగతో పులకించి
        మరుని చంపిన హరుడు మరులు గొన్నాడు || మరుని ||
కామదేవుని బాణము - తగులగా
        మోహినిని మోహించెను - శంకరుడు
విష్ణువే ప్రకృతి కాగా - శివుడేమొ
        పురుషుడై పొందినారు - సుఖములను || శ్రీకరం ||


మోహినీరూపుడగు శ్రీమహావిష్ణునకు
        లయకారకుండైన ఆ పరమశివునకు
        అతిసుందరుండైన బాలుడే కలిగాడు || అతి ||
మహిషిని సంహరించే - హరిహరుల
        కొడుకు జన్మించె ననిరి - దేవతలు
దివినుండి పూలవాన - కురిపించి
        సంబరాలే చేసిరి - అందరు


ఉత్తరాయణ పుణ్యకాలాన ఉత్తరా
        నక్షత్ర పంచమీ శనివారమందున
        వృశ్చికలగ్నాన జన్మించె నా శిశువు || వృశ్చిక ||
విష్ణు వొక మణిహారము - బహుమతిగ
        శిశువు మెడలో  వేసెను - ప్రేమతో
ధర్మాన్ని శాసించగా - జన్మించె
        ధర్మశాస్తా అందుము - అనె బ్రహ్మ || శ్రీకరం ||


ఆ ధర్మశాస్తా తనతండ్రి శివునితో
        కైలాసమే పోయి అక్కడే పెరిగాడు
        గణపతి సుబ్రహ్మణ్యుల తమ్ముడై ఎదిగె || గణపతి ||
భూతాలు ప్రేతాలకు - అతనిని
        అధిపతిగ చేసినాడు - శంకరుడు
భూతనాథుం డనుచునూ - దేవతలు
        కీర్తించి సేవించిరి - అప్పుడు


మంతతంత్రాది విద్యావిశారదు డైన
        నేపాళదేశ రాజైన పళింజ్ఞన్ కు
        పుష్కళాదేవి అను కూతురే ఉన్నాది || పుష్కళా ||
మరణమ్ము లేకుండగా - కాళికి
        కన్నెలను బలి ఇచ్చును - ఆ రాజు
శంకరుని భక్తురాలు - కన్నికను
        బలి ఇవ్వబోయినాడు - ఒకసారి || శ్రీకరం ||


క్రింది లింకుల ద్వారా పాటను వినవచ్చు.
మొదటి భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32991161

రెండవ భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32992715

27, నవంబర్ 2011, ఆదివారం

నా పాటలు - అయ్యప్ప కథాగానం - 1/3

                    అయ్యప్ప కథాగానం - 1/3

(పల్లవి -
శ్రీకరం శుభకరం అయ్యప్పచరితం
        మధురం మనోహరం ఆనందభరితం || శ్రీకరం ||)


మహిషి బాధలు విన్న శ్రీమహావిష్ణుండు
        శంకరుని బ్రహ్మను దగ్గరకు పిలిచాడు
        వారి అంశలతోడ మహిష మొక్కటి పుట్టె || వారి ||
దత్తాత్రేయుని అంశతో - మహిషమ్ము
        పుట్టి తన కర్తవ్యము - అడిగింది
స్వర్గాన్ని ఏలుతున్న - మహిషిని
        చేర్చు భూలోకానికి - అన్నారు

అతి సుందరంబైన ఆ మహిష మప్పుడు
        పరుగు పరుగున స్వర్గలోకమే చేరింది
        కోరికలు చెలరేగ రంకెలే వేసింది || కోరికలు ||
మహిషాన్ని చూడగానే - మహిషికి
        కామవాంఛలు పుట్టెను - మనసులో
తన పొందుకై వచ్చిన - మహిషిని
        భూలోకమే చేర్చెను - మహిషమ్ము || శ్రీకరం || 


బహుకాల మిద్దరు భూలోకమందున
        స్వేచ్ఛావిహారమ్ము చేసి సుఖపడ్డారు
        మదనసామ్రాజ్యాన్ని పాలించినారు || మదన ||
రాక్షసులు వివరించగా - వాస్తవం
        తెలిసికొని విదిలించెను - మహిషాన్ని
మహిషరూపును వీడెను - దత్తుండు
        ఆ త్రిమూరుల కలిసెను - లీనమై

ఇంద్రలోకం నుండి తనను తప్పించిన
        దేవతల మోసాన్ని తెలిసికొన్నది మహిషి
        ఆగ్రహావేశాలతో ఊగిపోయింది || ఆగ్రహా ||
దేవలోకం చేరెను - ఇంద్రున్ని
        తన్ని తరిమి వేసెను - దివినుండి
మునులను దేవతలను - మానవుల
        ముప్పుతిప్పలు పెట్టెను - దయలేక || శ్రీకరం || 


ఏకాంత స్థలమందు దాగినా డింద్రుండు
        ఒకనాడు నారదుడు అక్కడికి చేరాడు
        ఇంద్రాది దిక్పతుల పూజలే కొన్నాడు || ఇంద్రాది ||
"ఇంకెంత కాలానికీ - మా బాధ
        తీరునో చెప్ప" మనిరి - నారదుని
"కలిసివచ్చే కాలము - ముందుంది
        అందాక ఆగు" మనెను - దేవముని

భస్మాసురుం డనే రాక్షసుడు ఉన్నాడు
        పరమేశ్వరుని గూర్చి తపమెంతొ చేశాడు
        మెచ్చి వచ్చిన శివుడు "కోరు వర" మన్నాడు || మెచ్చి ||
తన చేతి నెవరి తలపై - ఉంచినా
        భస్మమై పోవు వరము - అడిగాడు
శంకరుడు మన్నించియు - వరమిచ్చి
        కైలాసమే వెళ్ళగా - చూచాడు || శ్రీకరం ||


తనకంత సులభంగ వర మిచ్చి నందుకు
        అనుమానమే వచ్చె భస్మాసురున కపుడు
        వరము శక్తిని పరీక్షించగా దలచాడు || వరము ||
శంకరుని తలపిననే - చెయిబెట్ట
       మునుముందుకే వచ్చెను - రాక్షసుడు
ప్రాణరక్షణ కోసమై - భయముతో
        వెనువెనుకగా పోయెను - శంకరుడు

ఆగు మాగు మంటు రాక్షసుడు వెంటాడ
        వద్దు వద్దని శివుడు పారిపోసాగాడు
        తలదాచుకొనునట్టి స్థానమే వెదికాడు || తలదాచు ||
విష్ణు విది చూసినాడు - శంకరుని
        కాపాడ దలచినాడి - ఆ క్షణమె
సౌందర్యరాశి యైన - మోహినిగ
        కనిపించె మురిపించెను - రాక్షసుని || శ్రీకరం || 



క్రింది లింకుల ద్వారా పాటను వినవచ్చు.మొదటి భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32991161

రెండవ భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32992715

26, నవంబర్ 2011, శనివారం

నా పాటలు - అయ్యప్ప కథాగానం - 1/2

                     అయ్యప్ప కథాగానం - 1/2

(పల్లవి -
శ్రీకరం శుభకరం అయ్యప్పచరితం
మధురం మనోహరం ఆనందభరితం
|| శ్రీకరం ||)

దత్తుడా తర్వాత దేహాన్ని వదిలేసి
        ఆ త్రిమూర్తులలోన ఐక్యమ్ము చెందాడు
        లీలావతి కూడ తనువు చాలించింది || లీలావతి ||
ఆమె మరుజన్మలోన - కరంభునికి
        కూతురై జన్మించెను - మహిషిగా
ఆమె పెదతండ్రి యైన - రంభునికి
        మహిషాసురుడు పుట్టెను - అన్నగా.

స్త్రీ చేతిలో తప్ప మరియెవరి చేతను
        మరణమ్ము లేకుండ బ్రహ్మచే వరమంది
        మహిషాసురుడు లోకకంటకుం డైనాడు || మహిషాసురుడు ||
దేవతలు ప్రార్థించగా - పరాశక్తి
        దుర్గగా అవతరించె - ఆ క్షణమె
లోకాల కాపాడగా - యుద్ధాన
        మహిషాసురుని చంపెను - ఆ తల్లి || శ్రీకరం ||

 
తన అన్న మహిషుని మరణవార్తను విన్న
        మహిహి దుఃఖముతోడ కుమిలిపోయింది
        దేవతలపై ఎంతొ పగ పెంచుకున్నది || దేవతలపై ||
"వరబలం ఉన్నప్పుడే - దేవతల
        నోడింతు" వని చెప్పెను - శుక్రుడు
గురువు చెప్పిన మేరకు - ఆ మహిషి
        తీవ్రతపమే చేసెను - వనమందు

అతిఘోర మైనట్టి ఆ మహిషి తపమునకు
        పదునాల్గు భువనాలు తల్లడిల్లెను నాడు
        ఆ తపోజ్వాలల్లొ అల్లాడిపోయాయి ||
ఆ తపో ||
బ్రహ్మదేవుం డప్పుడు - పొడసూపి
        "వరమేమి కావా" లనీ - అడిగాడు
"మరణమే లేకుండగా - నా కొక్క
        వర మివ్వ" మని కోరెను - ఆ మహిషి || శ్రీకరం ||


"పుట్టిన ప్రతిజీవి గిట్టుట సహజమ్ము
        మరణమ్ము లేకుండ వర మివ్వలే నమ్మ!
        అది తప్ప ఏదైన కోరింది ఇస్తాను" || అది తప్ప ||
అని బ్రహ్మ బదు లివ్వగా - ఆ మహిషి
        ఆలోచనే చేసెను - తీవ్రంగ
తన కోర్కె తీరునట్లు _ యుక్తితో
        వింతైన ఒక వరమునే - కోరింది

"హరి శంకరుల వల్ల జన్మించు పుత్రుండు
        పన్నెండు వర్షాలు ఒక మానవుని ఇంట
        సామాన్యమనిషిగా దాస్యమ్ము చేయాలి || సామాన్య ||
అటువంటి వాడు తప్ప _ ఇంకొకరు
        చంపకుండగ ఇవ్వవే - వరమును"
నాల్గు మోముల వేలుపు - తథాస్తని
        కరుణతో వరమిచ్చెను - మహిషికి || శ్రీకరం ||

 
బ్రహ్మ వరమును పొంది గర్వించి తన రోమ
        మూలాలలో వేల మహిషులను పుట్టించి
        తన సేనతో మహిషి స్వర్గమే చేరింది || తన సేనతో ||
ఆమెను ఎదిరించక - ఇంద్రుడే
        పారిపోయెను వేగమే - భయముతో
దేవలోకా న్నంతయూ - రక్కసులు
        కల్లోలమే చేసిరి - అప్పుడు

ఇంద్రసింహాసనం ఆక్రమించిన మహిషి
        సురపానమత్తయై ముల్లోకములలోని
        దేవతల మానవుల మునుల బాధించింది || దేవతల ||
మహిషి బాధల నోర్వక - దేవతలు
        బ్రహ్మకే మొరపెట్టిరి - కాపాడ
శంకరుడు వెంట రాగా - ఆ బ్రహ్మ
        వైకుంఠమే చేరెను - అందరితో || శ్రీకరం ||

 క్రింది లింకుల ద్వారా పాటను వినవచ్చు.
మొదటి భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32991161

రెండవ భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32992715

25, నవంబర్ 2011, శుక్రవారం

నా పాటలు - అయ్యప్ప కథాగానం - 1/1

                   అయ్యప్ప కథాగానం - 1/1
           నేను వ్రాసిన ‘అయ్యప్ప కథాగానం’ రెండు భాగాల ఆడియో లింకులను ఇంతకు ముందే ఇచ్చాను. ఈ పాట సాహిత్యాన్ని కూడా బ్లాగులో ప్రకటించమని కొందరు మిత్రులు కోరారు. పాట పెద్దది కనుక భాగాలుగా బ్లాగులో ప్రకటిస్తున్నాను. దయచేసి ఇందులో ఛందోవ్యాకరణాల దోషాలను పట్టించుకోవద్దని మనవి.

శ్రీకరం శుభకరం అయ్యప్పచరితం
        మధురం మనోహరం ఆనందభరితం
|| శ్రీకరం ||

ధర్మశాస్తా భూతనాథుండు హరిహరుల
        పుత్రుడై జన్మించి మణికంఠుడను పేర
        పందళరాజుకు వనమందు దొరికాడు
|| పందళ ||
పన్నెండవ యేటనే - మహిషిని
        మర్దించి కాపాడెను - లోకాల,
శబరికొండను వెలసిన - అయ్యప్ప
        కథ వింటె లభియించును - పుణ్యాలు
|| శ్రీకరం ||

అత్రి అనసూయలు అన్యోన్యదంపతులు
        బ్రహ్మశివకేశవులు కొడుకులై పుట్టగా
        వరము పొందాలని పూజలే చేసారు
|| వరము ||
వారి పూజలు మెచ్చిరి - దేవుళ్ళు
        కనిపించి వరమిచ్చిరి - అత్రికి,
ఆ త్రిమూర్తుల అంశలే - ఒక్కటై
        పొందె దత్తాత్రేయుడు - జన్మను.


ముగ్గురు మూర్తుల అంశలే దత్తుడై
        జన్మించెనని వారి భార్యలకు తెలిసింది
        తమవంతు కర్తవ్యమును చేయదలచారు
|| తమ ||
ముగ్గురమ్మల అంశలే - ఒక్కటై
        వెలిసింది యోగమాయ - లోకాన
లీలావతి పేరుతో - గాలవుని
        కూతురై జన్మించియు - వర్ధిల్లె
|| శ్రీకరం ||

దత్తలీలావతులు తగిన జంటగ ఎంచి
        ఆ అత్ర్రి గాలవులు అతివైభవముతోడ
        కళ్యాణమే చేసి సంతోషపడ్డారు
|| కళ్యాణ ||
అన్యోన్యదాంపత్యమే - వారిది
        ఆదర్శసంసారమై - కొనసాగె,
ఎల్లలే లేకుండగా - ఇద్దరు
        సంసారసుఖ మందిరి - తృప్తిగా


ఒకనాడు దత్తుండు లీలావతిని పిలిచి
        సంసారసుఖమంత అనుభవించితి మింక
        వానప్రస్థం పోవు కోరికే మిగిలింది
|| వాన ||
సంసారులకు తప్పక - కావాలి
        భార్య అంగీకారము - నయముగ,
అనుమతించి పంపవే - అర్ధాంగి
        తపము చేయగ పోదునే - అన్నాడు
|| శ్రీకరం ||

ఆ మాట మన్నించలేని లీలావతి
        నా కామవాంఛలు తీరనేలేదయ్య
        నిను వీడి క్షణమైన నేనుండలేను
|| నిను ||
పట్టమహిషిని విడుచుట - నీకెట్లు
        భావ్యమని తోచెనయ్యా - నా నాథ!
నీ పట్టమహిషి నేనై - నిన్నెట్లు
        విడుతునని అనుకొంటివి - అని పల్కె 


ఎంత చెప్పిన గాని వినని భార్యను చూసి
        "పట్టమహిషిని నీకు మహిషినని అంటావు
        మహిషి రూపముతోడ జన్మించవే నీవు"
|| మహిషి ||
అని శాపమే ఇవ్వగా - కోపించి
        ప్రతిశాపమే ఇచ్చెను - ఆ దేవి
"మహిషరూపము దాల్చియు - నీ వపుడు
        నా కోరెలే తీర్తువు" అని పలికె
|| శ్రీకరం ||

క్రింది లింకుల ద్వారా పాటను వినవచ్చు.
మొదటి భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32991161

రెండవ భాగం ....
http://www.esnips.com/displayimage.php?pid=32992715

24, నవంబర్ 2011, గురువారం

నా పాటలు - అయ్యప్ప కథాగానం - 2

అయ్యప్ప కథాగానం -2
నేను వ్రాసిన ‘అయ్యప్ప కథాగానం’ మొదటిభాగం లింకును మొన్న ఇచ్చాను. 
ఇప్పుడు రెండవభాగం లింకు ఇస్తున్నాను. ఇదే చివరిది కూడా.
వీలైతే రేపటినుండి ఈ పాట సాహిత్యాన్ని కొన్ని భాగాలుగా బ్లాగులో ప్రకటిస్తాను.
క్రింది లింకు ద్వారా పాటను విని తమ స్పందనలను తెలియజేయవలసిందిగా మిత్రులకు మనవి.
http://www.esnips.com/displayimage.php?pid=32992715

22, నవంబర్ 2011, మంగళవారం

నా పాటలు - అయ్యప్ప కథాగానం

                       అయ్యప్ప కథాగానం -1
నేను వ్రాసిన ‘అయ్యప్ప కథాగానం’ చాలా పెద్దది.   
"శ్రీకరం శుభకరం అయ్యప్ప చరితం,
మధురం మనోహరం ఆనందభరితం" 

అనే పల్లవితో, 80 చరణాలతో ఉన్న దీనిని బ్లాగులో ఒకే పోస్టుగా పెట్టాలంటే ఇబ్బందే. అందువల్ల కేవలం పాట ఆడియో లింకు ఇస్తున్నాను. ఈరోజు మొదటి భాగం ఇస్తున్నాను. రెండు మూడు రోజుల్లో రెండవ భాగాన్ని ఇస్తాను. మిత్రు లెవరైనా కోరితే ఎనిమిది చరణాల కొక పోస్ట్ చొప్పున వరుసగా పదిరోజులు ఇస్తాను. దీనిని పి. డి. ఎఫ్. ఫార్మేట్ లో ఇబుక్ గా పెట్టాలంటే అందుకు తగిన సాంకేతిక పరిజ్ఞానం నాకు లేదు. ఇందుకు మిత్రుల సలహాలను ఆహ్వానిస్తున్నాను.
దీనిని క్రింది లింకు ద్వారా విని మీ స్పందన తెలియజేయండి.

 http://www.esnips.com/displayimage.php?pid=32991161