శ్రీకృష్ణ
స్తుతి
పాదపము
శ్రీమధురాధిప! శ్రీధర! కృష్ణా!
శ్రీమురళీధర! చిన్మయ! కృష్ణా!
ప్రేమ రసాకర! శ్రీకర! కృష్ణా!
కామిత దాయక! కల్పక! కృష్ణా!
జ్ఞాన ధనాఢ్య! జగద్గురు! కృష్ణా!
దీనజనావన! ధీనిధి! కృష్ణా!
మౌనిజన స్తుత! మాధవ! కృష్ణా!
శ్రీనయనోత్సవ! చిద్ఘన! కృష్ణా!
నందకులాఖిల నాయక! కృష్ణా!
సుందర రూప సుశోభిత!కృష్ణా!
విందగు నీ శుభవీక్షణ! కృష్ణా!
వందనమో శ్రితవత్సల! కృష్ణా!
వారిరుహాసన వందిత! కృష్ణా!
వారిజ లోచన! భాగ్యద! కృష్ణా!
భూరి గుణోజ్జ్వల భూషణ! కృష్ణా!
వీరవరేణ్య! త్రివిక్రమ! కృష్ణా!
పావన నామ! శుభప్రద! కృష్ణా!
దేవనుతా! కులదీపక! కృష్ణా!
రావె జగత్త్రయ రంజన! కృష్ణా!
ప్రోవవె మమ్ము ప్రభూ! హరి! కృష్ణా!
శ్రేయోభిలాషులందరికి
శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలతో
నేమాని
రామజోగి సన్యాసి రావు