31, జనవరి 2011, సోమవారం

సమస్యా పూరణం - 213 (విద్య నేర్చినవాఁడె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
విద్య నేర్చినవాఁడె పో వింతపశువు.
ఈ సమస్యను సూచించిన వసంత్ కిశోర్ గారికి ధన్యవాదాలు.

30, జనవరి 2011, ఆదివారం

సమస్యా పూరణం - 212 (తలలు వంచి గగన)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
తలలు వంచి గగనతలముఁ గనుఁడు.
ఈ సమస్యను సూచించిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు.

29, జనవరి 2011, శనివారం

వారాంతపు సమస్యా పూరణం - (బారులు లేనిచో కవులు)

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ......
బారులు లేనిచో కవులు బావురు మందురు లోకమందునన్.
ఈ సమస్యను పంపించిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు.

సమస్యా పూరణం - 211 (దద్దమ్మల కీ జగత్తు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
దద్దమ్మల కీ జగత్తు దండుగ కాదా?
ఈ సమస్యను సూచించిన కోడీహళ్ళి మురళీమోహన్ గారికి ధన్యవాదాలు.

28, జనవరి 2011, శుక్రవారం

సమస్యా పూరణం - 210 (చెడుగుడు నాట్యమ్ము కొఱకు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
చెడుగుడు నాట్యమ్ము కొఱకు చీనాంబరముల్.
శ్రీ అబ్బూరి రామకృష్ణారావు గారి చాటువు నుండి ఈ పద్యపాదాన్ని సమస్యగా ఇవ్వమని సూచించిన రాజేశ్వరి నేదునూరి గారికి ధన్యవాదాలు.
కవి మిత్రులకు మనవి .....
సమస్యలను పంపండి. మీరు స్వయంగా తయారు చేసినవీ, విన్నవీ, చదివినవీ, అవధానాలు , పత్రికలూ, ఆకాశవాణి తదితర మాధ్యమాల ద్వారా మీకు తెలిసిన సమస్యలను నాకు మెయిల్ చెయ్యండి. ధన్యవాదాలతో ప్రకటిస్తాను. నేను ఒక్కణ్ణి ఎన్నని సృష్టించను? ఇది మీ బ్లాగు. మీ భాగస్వామ్యం ఉండాలి. పంపిస్తారు కదా?

27, జనవరి 2011, గురువారం

సమస్యా పూరణం - 209 (కొడుకునకున్ వేనవేలు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
కొడుకునకున్ వేనవేలు కూఁతున కొకటే!

ప్రహేళిక - 42 సమాధానం.

పేరు చెప్పండి.
సీ.
మృగలాంఛనుండుగ మింటనుండు నెవండు?
ఘనసార మను పేరు గలది యేది?
పుట్టలపైఁ జూడఁ బుట్టెడి గొడు గేది?
పాపడికై తల్లి పాడు నేది?
యవనీతనూజుఁడౌ హరివైరి యెవ్వఁడు?
పక్షులు చరియించు పథ మదేది?
రసము లూరించు భారతదేశ ఫలమేది?
యచ్చువేసెడి కార్య మనఁగ నేది?
తే.గీ.
యన్నిటికిఁ జూడ నాల్గేసి యక్షరమ్ము
లందు మొదటి యక్షరముల నరసి చూడ
కాకతీయ సామ్రాజ్యపు ఘనతఁ గన్న
ముఖ్యపట్టణమై వెల్గు పుర మదేది?
వివరణ -
మృగలాంఛనుడుగా మింట నుండు వాడు - ఏణాంకుడు.
ఘనసార మను పేరు గలది - కర్పూరము.
పుట్టలపై పుట్టెడి గొడుగు - శిలీంధ్రము.
పాపడికై తల్లి పాడునది - లాలిపాట.
అవనీతనూజుడగు హరి వైరి - నరకుడు.
పక్షులు చరియించు పథము - గగనము.
రసము లూరించు భారతదేశ ఫలము - రసాలము.
అచ్చువేసెడి కార్య మనగా - ముద్రణము.
ఏణాంకుడు - కర్పూరము - శిలీంధ్రము - లాలిపాట - నరకుడు - గగనము - రసాలము - ముద్రణము.
పై పదల మొదటి అక్షరాలను చదివితే తెలిసే కాకతీయుల రాజధాని ...
ఏకశిలానగరము.
వివరణతో సరియైన సమాధానాలు పంపిన వారు ...
గన్నవరపు నరసింహ మూర్తి గారు,
కోడీహళ్ళి మురళీ మోహన్ గారు,
మంత్రిప్రగడ బలసుబ్రహ్మణ్యం గారు.

అందరికీ అభినందనలు.

26, జనవరి 2011, బుధవారం

సమస్యా పూరణం - 208 (గాడిదలకుఁ దెలియు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
గాడిదలకుఁ దెలియు కుసుమ గంధపు విలువల్.

ప్రహేళిక - 42

పేరు చెప్పండి.
సీ.
మృగలాంఛనుండుగ మింటనుండు నెవండు?
ఘనసార మను పేరు గలది యేది?
పుట్టలపైఁ జూడఁ బుట్టెడి గొడు గేది?
పాపడికై తల్లి పాడు నేది?
యవనీతనూజుఁడౌ హరివైరి యెవ్వఁడు?
పక్షులు చరియించు పథ మదేది?
రసము లూరించు భారతదేశ ఫలమేది?
యచ్చువేసెడి కార్య మనఁగ నేది?
తే.గీ.
యన్నిటికిఁ జూడ నాల్గేసి యక్షరమ్ము
లందు మొదటి యక్షరముల నరసి చూడ
కాకతీయ సామ్రాజ్యపు ఘనతఁ గన్న
ముఖ్యపట్టణమై వెల్గు పుర మదేది?
కేవలం సమాధానాన్ని చెప్పకుండా, ఆ సమాధానం ఎలా వచ్చిందో వివరించండి.
షరా మామూలే ... మీ సమాధాన వ్యాఖ్యను బ్లాగులో పెట్టకుండా, నాకు మెయిల్ చెయ్యండి.
shankarkandi@gmail.com

25, జనవరి 2011, మంగళవారం

సమస్యా పూరణం - 207 (తల లైదు కరంబు లారు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
తల లైదు కరంబు లారు తను వది యొకటే!

24, జనవరి 2011, సోమవారం

వారాంతపు సమస్యా పూరణం - (ఉత్పలమాల యందు)

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ......
ఉత్పలమాల యందు యతి 
యొప్పును నాల్గవ యక్షరమ్ముతో.
ఈ సమస్యను పంపించిన  
రామమోహన్ అందవోలు గారికి 
ధన్యవాదాలు

సమస్యా పూరణం - 206 (మత్తెక్కిన భద్రగజము)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
మత్తెక్కిన భద్రగజము మాంసముఁ దినియెన్.
ఈ సమస్యను పంపించిన రామమోహన్ అందవోలు గారికి ధన్యవాదాలు.

23, జనవరి 2011, ఆదివారం

సమస్యా పూరణం - 205 (సాఫ్టువేరు మగని)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
సాఫ్టువేరు మగని జాడఁ గనరె!

22, జనవరి 2011, శనివారం

సమస్యా పూరణం - 204 (రవి కెందుకు నీకు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
రవి కెందుకు నీకు తరుణి రాతిరి వేళన్.

20, జనవరి 2011, గురువారం

సమస్యా పూరణం - 203 (అన్నా యని రాము)

కవి మిత్రులారా,

ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......

అన్నా యని రాముఁ బిలిచె నవనిజ భక్తిన్.

19, జనవరి 2011, బుధవారం

సమస్యా పూరణం - 202 (భీష్ముఁడు శిఖండిని)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
భీష్ముఁడు శిఖండిని వరించి పెండ్లియాడె.

18, జనవరి 2011, మంగళవారం

సమస్యా పూరణం - 201 (కస్తురి తిలకమ్ము)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
కస్తురి తిలకమ్ము గరళ మయ్యె.

17, జనవరి 2011, సోమవారం

ప్రహేళిక - 41 సమాధానం

ఈ కూరగాయ ఏది?
తే.గీ.
వాయసము, స్వప్నము, తిమిరవైరి, వార
ణాసి, సన్యాసి యనెడి రెండక్షరముల
పదముల ప్రథమాక్షరములఁ బట్టి చూడఁ
దెలియు కూరగాయను దెల్పఁ గలరె మీరు?

వివరణ -
వాయసము - కాకి
స్వప్నము - కల
తిమిరవైరి - రవి
వారణాసి - కాశి
సన్యాసి - యతి
పై పదాల మొదటి అక్షరాలను చదివితే
సమాధానం - కాకరకాయ.
సమాధానాలు పంపినవారు -
కోడీహళ్ళి మురళీ మోహన్ గారు,
జి. మైథిలీ రాం గారు,
అందవోలు విధ్యాసాగర్ గారు,
మిస్సన్న గారు,
మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారు,
గన్నవరపు నరసింహ మూర్తి గారు,
మంద పీతాంబర్ గారు.
అందరికీ అభినందనలు.

సమస్యా పూరణం - 200 (కొంగ కైదు కాళ్ళు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
కొంగ కైదు కాళ్ళు కోడికి వలె.

16, జనవరి 2011, ఆదివారం

వారాంతపు సమస్యా పూరణం - (టీవీ లుండెను)

కవి మిత్రులారా,
ఈ వారాంతానికి పూరించ వలసిన సమస్య ఇది ......
టీవీ లుండెను చూచి మెచ్చ మునివాటిన్ బూర్వకాలమ్మునన్.
(ఆకాశవాణి వారి సౌజన్యంతో ... దీనిని సూచించిన మిస్సన్న గారికి ధన్యవాదాలు)

సమస్యా పూరణం - 199 (భామకు చీరేల)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
భామకు చీరేలనయ్య పదుగురు చూడన్.

ప్రహేళిక - 41

ఈ కూరగాయ ఏది?
తే.గీ.
వాయసము, స్వప్నము, తిమిరవైరి, వార
ణాసి, సన్యాసి యనెడి రెండక్షరముల
పదముల ప్రథమాక్షరములఁ బట్టి చూడఁ
దెలియు కూరగాయను దెల్పఁ గలరె మీరు?

ఆ కూరగాయ పేరేమిటో చెప్పండి.

ప్రహేళిక - 40 సమాధానం

ఈ పండుగ ఏది?
తే.గీ.
సిరుల తల్లి, మండూకము, శృంగజంబు,
కామదూతి, శౌర్యము, క్రియాకారము లవి
త్ర్యక్షర పదంబు, లందు మధ్యాక్షరములఁ
జూడఁ దెలిసెడి పండుగ జాడఁ గనుఁడు.

సమాధానం -
సిరుల తల్లి - కమల
మండూకము - భేకము
శృంగజము - శరము
కామదూతి - వాసంతి
శౌర్యము - విక్రాంతి
క్రియాకారము - ప్రతిన/ప్రతిజ్ఞ
పై పదాల నడిమి అక్షరాలను చదివితే ...
ఆ పండుగ - మకర సంక్రాంతి.
సమాధానాలు పంపినవారు ....
గన్నవరపు నరసింహ మూర్తి గారు,
మంత్రిప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారు,
మైథిలీ రాం గారు,
కోడీహళ్ళి మురళీ మోహన్ గారు,
రహ్మానుద్దిన్ షేక్ గారు,
వసంత్ కిశోర్ గారు.
అందరికీ అభినందనలు.

15, జనవరి 2011, శనివారం

సమస్యా పూరణం - 198 (పండుగ దినమందు)

కవి మిత్రులారా,
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు!
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
పండుగ దినమందు పాత మగఁడె!

ప్రహేళిక - 40

`శంకరాభరణం` బ్లాగు మిత్రులకు, అభిమానులకు, ఆంధ్ర భాషాభిమానులకు
మకర సంక్రమణ పర్వదిన శుభాకాంక్షలు.
ఈ పండుగ ఏది?
తే.గీ.
సిరుల తల్లి, మండూకము, శృంగజంబు,
కామదూతి, శౌర్యము, క్రియాకారము లవి
త్ర్యక్షర పదంబు, లందు మధ్యాక్షరములఁ
జూడఁ దెలిసెడి పండుగ జాడఁ గనుఁడు.

స్లిప్పులు -
సిరుల తల్లి - లక్ష్మికి గల పువ్వు వంటి పేరు
శృంగజము - బాణం
కామదూతి - పాతతరం సినీనటి పేరు. మంచి మనసులు చిత్రంలో అక్కినేని చెల్లెలు.
శౌర్యము - విక్రమం, అంతిమం పదాలలో మొదటి రెండక్షరాల కలయిక
క్రియాకారము - శపథం
ఇప్పుడు చెప్పండి ఆ పండుగ ఏదో?
షరా మామూలే -
దయచేసి సమాధానాలను క్రింది చిరునామాకు మెయిల్ చెయ్యండి.
shankarkandi@gmail.com

14, జనవరి 2011, శుక్రవారం

ప్రహేళిక - 39

ఈ దేవు డెవరు?
కం.
కీరము, శిఖి, తురక నమ
స్కారము, నాలుక, రవి, చడకము - త్ర్యక్షరముల్
జేరి ద్వితీయాక్షరముల
నారసి గనఁ దెలియు దైవ మతఁ డెవఁ డయ్యా?

(చడకము = అశనికి పర్యాయ పదం)
ఆ దేవుఁడు ఎవరో చెప్పండి.
ముఖ్య గమనిక -
దయచేసి మీ సమాధానాలను నాకు మెయిల్ చెయ్యండి. వ్యాఖ్యగా పెడితే మిగిలిన వారికి ఉత్సాహం లేకుండా పోతున్నది. మాడరేషన్ పెడితే సమస్యాపూరణలో పరస్పర చర్చలకు అవకాశం లేకుండా పోతున్నది. కనుక మీ సమాధానాన్ని, వ్యాఖ్యను, సందేహాన్ని క్రింది అడ్రసుకు మెయిల్ చెయ్యండి.
shankarkandi@gmail.com

సమస్యా పూరణం - 197 (బ్రహ్మచారికి నెనమండ్రు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
బ్రహ్మచారికి నెనమండ్రు భార్య లౌర!

13, జనవరి 2011, గురువారం

ప్రహేళిక - 38

ఎవరీ మాతృమూర్తి?
తే.గీ.
వారధియు, నిశాపుష్పము, బంక, వంద,
కుటజములు త్ర్యక్షర పదము లట! ద్వితీయ
వర్ణములఁ జూడఁగా మన భరతమాత
కెనయగు మరొక్క మాత - తా నెవరొ గనుఁడు.

మనందరికీ మాతృమూర్తి అయిన ఈమె ఎవరు?

సమస్యా పూరణం - 196 (వచ్చె సంక్రాంతి లక్ష్మి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
వచ్చె సంక్రాంతి లక్ష్మి యే మిచ్చు మనకు?

12, జనవరి 2011, బుధవారం

ప్రహేళిక - 37

ఈ కావ్యం పేరేమిటి?
సీ.
తార పేరున నున్న వారపత్రిక యేది?
వ్యాధితోఁ బీడింపఁబడు నెవండు?
ఓటమికి గురైన నీటు జ్ఞానం బేది?
ఆరవ తిథిని యే మని పిలుతురు?
యంత్రంబునకుఁ గల యన్య నామం బేది?
పలుకుకు పర్యాయపద మ దేది?
పల్లె లందుండు సూపరు బజా రది యేది?
భార్యను భరియించువాఁ డెవండు?
తే.గీ.
దీపమును వెలిగింతురు దేనితోడ?
ఏది సాధింప మునులు తపింతు రెపుడు?
ద్వ్యక్షర పదంబు లన్నియు ప్రథమ వర్ణ
ములు దెపిపెడి ప్రముఖ కావ్యమును గనుండు.
రెండు పేర్లున్న ఆ ప్రముఖ కావ్యం ఏమిటో తెలిసికొని ఒక పేరు చెప్పండి.

సమస్యా పూరణం - 195 (స్వర్ణ సింహాసనమ్మున)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
స్వర్ణ సింహాసనమ్మున శ్వాన మమరె.

11, జనవరి 2011, మంగళవారం

సమస్యా పూరణం - 194 ( చీమ తుమ్మెను )

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
చీమ తుమ్మెను బెదరెను సింహగణము.

9, జనవరి 2011, ఆదివారం

సమస్యా పూరణం - 193 ( వినాయకా! నిన్ను )

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
వినాయకా! నిన్నుఁ గొలువ విఘ్నము లెసఁగెన్.

8, జనవరి 2011, శనివారం

సమస్యా పూరణం - 192 (పాలే సజ్జనుల నెల్ల)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
పాలే సజ్జనుల నెల్లఁ బతితులఁ జేయున్.

ప్రహేళిక - 36

ఇది ఏ వాహనం?
తే.గీ.
శివుఁడు, మగని తమ్ముఁడు, చచ్చిన తనువును,
పత్రపాలి, జిత్తులమారి, వదన మనఁగ
త్ర్యక్షరపదమ్ము లందలి యాది వర్ణ
ములు దెలుపు వాహనముఁ జెప్పఁ గలరె మీరు?

(పత్రపాలి అంటే కత్తిరించే ఒక సాధనం)
ఆ వాహన మేమిటో చెప్పండి.

ప్రహేళిక - 35 సమాధానం

పేరు చెప్పండి
చ.
"సరసిజనేత్ర! నీ మగని చక్కని పేరది యేదొ చెప్పుమా"
"అరయఁగ నీవు న న్నడుగు నాతని పే రిదె చిత్తగింపుమా
కరియును, వారిరాశి, హరుకార్ముకమున్, శర, మద్దమున్, శుకం
బరుదుగ వ్రాయఁగా నడిమి యక్షరముల్ గణుతింపఁ బే రగున్.

(చాటుపద్య రత్నాకరము)
సమాధానం -
కరి = సారంగం
వారిరాశి = సాగరం
హరుకార్ముకము = పినాకం
శరము = సాయకం
అద్దము = ముకురం
శుకము = చిలుక
సారంగం, సాగరం, పినాకం, సాయకం, ముకురం, చిలుక
పై పదాల నడిమి అక్షరాలను చదివితే సమాధానం తెలుస్తుంది.
ఆమె మగని పేరు - రంగనాయకులు.
సరియైన సమాధానం చెప్పింది జ్యోతి గారొక్కరే.
కొంచెం అటు ఇటుగా చెప్పినవారు వసంత్ కిశోర్ గారు, గన్నవరపు నరసింహ మూర్తి గారు, నేదునూరి రాజేశ్వరి గారు.
మందాకిని గారూ మిమ్మల్ని మరిచిపోలేదండీ ...
అందరికీ అభినందనలు.

7, జనవరి 2011, శుక్రవారం

సమస్యా పూరణం - 191 (కలహంసల తప్పు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
కలహంసల తప్పు గాక కాకుల తప్పా?
దీనిని పంపించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

ప్రహేళిక - 35

పేరు చెప్పండి
చ.
"సరసిజనేత్ర! నీ మగని చక్కని పేరది యేదొ చెప్పుమా"
"అరయఁగ నీవు న న్నడుగు నాతని పే రిదె చిత్తగింపుమా
కరియును, వారిరాశి, హరుకార్ముకమున్, శర, మద్దమున్, శుకం
బరుదుగ వ్రాయఁగా నడిమి యక్షరముల్ గణుతింపఁ బే రగున్.

(చాటుపద్య రత్నాకరము)
గమనిక - సాధారణంగా కావ్యభాషలో పదాలు ముప్రత్యయంతో ఉంటాయి. కాకుంటే మ్ము, ంబులతో ఉంటాయి. ఉదాహరణకు కరి అంటే కుంజరము, కుంజరమ్ము, కుంజరంబు అని మూడు రూపాల్లో చెప్పవచ్చు.కుంజరం అనేది వ్యావహారిక రూపం. వాస్తవానికి ఇలాంటి చోట గ్రాంథిక పదమే చెప్పాలి. కాని ఇక్కడ మాత్రం `కుంజరము` అనే నాలుగక్షరాల గ్రాంథిక పదాన్ని కాకుండా `కుంజరం` అనే మూడక్షరాల వ్యవహార పదాన్నే తీసుకోవాలి. (నిజానికి ఈ పద్యంలో అది కుంజరం కాదు). చివరి పదం తప్ప మిగిలిన వన్నీ ఇలాంటివే.
ఇప్పుడు చెప్పండి
ఆమె మగని పే రేమిటి?

చమత్కార పద్యాలు - 51

బొగ్గవరపు పెద పాపరాజు
18వ శతాబ్దికి చెందిన ఈ కవిది గుంటూరు మండలంలోని బొగ్గవరం గ్రామం. బెజగం నరసయ్య అనే వ్యక్తిపై ఇతడు రాసిన పద్యం ఇది ......
సీ.
నీ చిఱునవ్వు వెన్నెల బెదరింపఁగా
మోము చందురు గేరు టేమి చెప్ప?
నీ కన్ను లంభో నివహంబు నగ బొమల్
కాము విండ్లను గేరు టేమి చెప్ప?
నీ వర్థిజన కల్పవృక్షంబు నాఁ జేతు
లా మ్రాని కొమ్మలం చేమి చెప్ప?
నీ నడల్ మదకరి కాన సేయఁ నూరు
లిభహస్త నిభములం చేమి చెప్ప?
తే.గీ.
చక్కఁదముల కుప్పగా సరవి నిన్ను
ధాత జనియింపఁగాఁ జేసె ధణిలోన
కలమగు భూసురాశీర్వచన వివర్ధి
తాన్వ నిధాన! కృతిగర్భితాభిధాన!
ఈ పద్యంలోనే "బెజగము నరసయ్య" అనే పేరు దాగి ఉంది.
(చాటుపద్య రత్నాకరము)

6, జనవరి 2011, గురువారం

కృతజ్ఞతా పూర్వక నమస్సుమాంజలి

మిత్రులకు, శ్రేయోభిలాషులకు,
కృతజ్ఞతా పూర్వక నమస్సుమాంజలి.
నా విన్నపాన్ని మన్నించి, నా సమస్యను తీర్చి, బ్లాగు నిరాటంకంగా కొనసాగడానికి తమ తమ పరిధులలో ఆర్థిక సహాయం చేసిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు "శంకరాభరణం" సినిమాలో శంకర శాస్త్రి చెప్పినట్లు "శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను".
ఈ సత్కార్యానికి పూనుకొని, బ్లాగు మిత్రులను ప్రోత్సహించి, కార్యభారాన్ని తమ భుజాల కెత్తుకొని నిర్వహించిన హరి గారికి, వలబోజు జ్యోతి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
స్పందించి, ఆర్థిక సహకారాన్ని అందించిన సహృదయులు ............
హరి గారు
వలబోజు జ్యోతి గారు
మంద పీతాంబర్ గారు
మిస్సన్న గారు
వసంత్ కిశోర్ గారు
గన్నవరపు నరసింహ మూర్తి గారు
నచికేత్ గారు
మంత్రి ప్రగడ వేంకట బాలసుబ్రహ్మణ్యం గారు
జిగురు సత్యనారాయణ గారు
మలక్ పేట్ రౌడీ గారు
మైత్రేయి గారు
డా. ఆచార్య ఫణీంద్ర గారు
డా. విష్ణు నందన్ గారు
సనత్ శ్రీపతి గారు
ఊకదంపుడు గారు
రవి గారు
భరద్వాజ్ గారు
నేదునూరి రాజేశ్వరి గారు
పేరు ప్రకటించడానికి ఇష్టపడని అజ్ఞాత దాత పంపింది 15000 రూ.లు.
మొత్తం మీద ఈ "మిష"తో నా అకౌంట్ లోకి చేరిన డబ్బు 32280 రూ.లు.
నా మినిమం అవసరానికి మాగ్జిమం రెట్టింపు!
దేనికొరకు వచ్చిన డబ్బును దానికొరకే వినియోగించాలి కనుక ఈరోజే అన్ని హంగులతో, మంచి కాన్ ఫిగరేషన్ తో సిస్టం (డెస్క్ టాప్) తీసికొని, మిగిలిన డబ్బుతో జ్యోతి గారి సూచన ప్రకారం ప్రింటర్, స్కానర్ తీసుకుంటున్నాను. అప్పటికీ మిగిలితే కొన్ని ఛందో వ్యాకరణ గ్రంథాలు తీసుకొంటాను.
రేపటి నుండి నా బ్లాగు సక్రమంగా కొనసాగుతుంది.
ధన్యవాదాలతో ....
మీ
కంది శంకరయ్య.

5, జనవరి 2011, బుధవారం

సమస్యా పూరణం - 190 (అమృతపానమ్ము)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
అమృతపానమ్ము మరణమ్ము నందఁ జేసె.

3, జనవరి 2011, సోమవారం

సమస్యా పూరణం - 189 (చెల్లి యని పతి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
చెల్లి యని మగఁడు పిలువఁగా చెలియ మురిసె.
మంద పీతాంబర్ గారి పూరణ చూసినప్పుడు తెలిసింది. "చెల్లి యని మగఁడు పిలువఁగా చెలియ మురిసె" అన్నప్పుదు గణదోషం దొర్లింది. దానిని ఇలా సవరించాను.
చెల్లి యని పతి పిలువఁగా చెలియ మురిసె.

2, జనవరి 2011, ఆదివారం

కవి మిత్రులకు మనవి ....

ఇంతకాలం ఇంట్లో కంప్యూటర్ ఉండడంతో బ్లాగు నిర్వహణ నిరాటంకంగా కొనసాగింది. ఈ రోజు మా అబ్బాయి సిస్టం ను హైదరాబాద్ తీసుకు వెళ్తున్నాడు. రేపటి నుండి "ఇంటర్ నెట్ కేఫ్"లే దిక్కు. అవి సాధారణంగా ఉదయం 10 గంటలకు తెరుస్తారు. వెళ్ళినప్పుడు సిస్టం ఖాళీగా దొరకక పోవచ్చు. దొరికినా నెట్ స్పీడు చాలా తక్కువగా ఉంటుంది.
పోని తక్కువ కాన్ ఫిగరేషన్ తో ఒక కొత్త సిస్టమో లేదా సెకండ్ హాండ్ దో కొందామంటే ప్రస్తుతానికి నా ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేదు.
ఏతా వాతా నా మనవి ఏమంటే ....
రేపటి నుండి నా పోస్టులు కాస్త ఆలస్యం కావచ్చు. ఒక్కొక రోజు ఉండక పోవచ్చు. మీ అందరి పూరణలను విడి విడిగా వ్యాఖ్యానిచడం వీలుకాక పోవచ్చు. మీ సందేహాలకు వెంట వెంటనే సమాధానాలు ఇవ్వలేక పోవచ్చు.
కాబట్టి మీరే మిగిలిన కవి మిత్రుల పూరణలను విశ్లేషిస్తూ, గుణదోష విచారణ చేస్తూ, వీలైతే సందేహాలకు సమాధానాలు ఇస్తూ ఉండండి.
వీలైనంత తొందరలో సిస్టం తీసుకొని బ్లాగును సక్రమంగా కొనసాగిస్తాను.
మీకు కలిగిస్తున్న ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాను.

సమస్యా పూరణం - 188 (దాని మానుప భువి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
దాని మానుప భువి నౌషధమ్ము గలదె?
దీనిని పంపించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

1, జనవరి 2011, శనివారం

ప్రహేళిక - 34 (సమాధానం)

అత డెవరు?
చం.
మనసిజు మామ మామ యభిమాన మడంచినవాని మామ నం
దనుని విరోధి నందనుని నందను సుందరి మేనమామఁ జం
పిన జగజెట్టి పట్టిఁ బొడిజేసిన శూరుని తండ్రిఁ గన్నుగాఁ
గొనిన సురాధినాథుని తనూభవు నాయువు మీకు నయ్యెడున్.

(చాటుపద్య రత్నాకరము)
పరిష్కారం ...............
1. మన్మథుని మామ - చంద్రుడు
2. అతని మామ - దక్షుడు
3. అతని గర్వం అణచినవాడు - శివుడు
4. అతని మామ - హిమవంతుడు
5. అతని కొడుకు - మైనాకుడు
6. అతని శత్రువు - ఇంద్రుడు
7. అతని కుమారుడు - అర్జునుడు
8. అతని పుత్రుడు - అభిమన్యుడు
9. అతని భార్య - ఉత్తర
10. ఆమె మేనమామ - కీచకుడు
11. అతనిని చంపిన వీరుడు - భీముడు
12. అతని కొడుకు - ఘటోత్కచుడు
13. అతనిని చంపిన శూరుడు - కర్ణుడు
14. అతని తండ్రి - సూర్యుడు
15. అతనిని కన్నుగా పొందిన దేవుడు - విష్ణువు
16. అతని కుమారుడు - బ్రహ్మ
ఆ బ్రహ్మదేవుని ఆయువు మీకు కలగాలని ఆశీస్సు.
సమాధానం పంపినవారు జి. మైథిలీ రాం గారొక్కరే. అదికూడా 100% సరియైన సమాధానం వారికి అభినందనలు.

సమస్యా పూరణం - 187 (నూతన సంవత్సరమున)

కవి మిత్రులారా,
అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ......
నూతన సంవత్సరమున నూటికి నూఱే.